చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!

27 Aug, 2022 14:36 IST|Sakshi
సాఫ్ట్‌ స్కిల్స్‌లో శిక్షణ పొందిన విద్యార్థినికి సర్టిఫికెట్‌ అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే కుటుంబాలకు – ‘ఇంగ్లిష్‌ మీడియం’ అందు బాటులోకి తీసుకురావాలని కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భిన్న అభిప్రాయాలకు, చర్చలకు దారి తీసింది. ఇప్పుడు ‘ఉచిత– పథకాల’ గురించి కోర్టుకు వెళ్లినట్టుగానే, అప్పట్లో ‘ఇంగ్లిష్‌– మీడియం’ విషయం కూడా కోర్టు వరకూ వెళ్ళింది. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన 30 ఏళ్ళ కాలంలో విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉండడం తెలిసిందే. మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లల విద్య నాణ్యత విషయంగా ప్రభుత్వం ఎటువంటి వైఖరిని అనుసరించాలి? ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ తర్వాత, ఒక ఉద్యోగి ఇండియాలో పనిచేసినా లేదా విదేశాల్లో పనిచేసినా పని నాణ్యతా ప్రమాణాల విషయంలో ఈ రోజున ఎటువంటి వ్యత్యాసం లేదు.

అటువంటప్పుడు చదువు పూర్తి చేసుకుని ‘జాబ్‌ మార్కెట్‌’లోకి వచ్చే యువతకు ప్రాథమిక విద్య స్థాయిలోనే ‘వర్క్‌ ప్లేస్‌’ సవాళ్లు ఎదుర్కొనే నైపుణ్యాలను బోధించడం ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. ‘ప్రొఫెషనల్‌ కోర్సు’లు పూర్తి చేసుకుని, ఉద్యోగాల్లో చేరుతున్న దశలో నైపుణ్యాల బోధన లేని కారణంగానే, మళ్ళీ వారికీ ‘స్కిల్‌ డెవలప్మెంట్‌’ కోర్సులు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం ఆ అవసరాన్ని గుర్తించి దాన్ని కనుక పట్టించుకోకపోతే, చదివిన డిగ్రీలతో పనిలేకుండా... జీవిక కోసం ‘మార్కెట్‌’లో చౌక ‘లేబర్‌’గా వీరు మారుతారు. దాంతో వీరి చదువుల కోసం ప్రభుత్వం చేసిన ‘వ్యయం’, తిరిగి వీరి సర్వీసుల ద్వారా జాతీయ స్థూల ఉత్పత్తికి అవుతున్న ‘జమ’ మధ్య వ్యత్యాసం తగ్గదు.

ఈ పరిస్థితిని అధిగమించడానికి, ప్రభుత్వ బడుల్లో చదివిన పిల్లలు స్థిరంగా– ‘జాబ్‌ మార్కెట్‌’లో నిలబడగలగడానికి– ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య స్థాయిలో ఇవ్వాల్సిన తర్భీదు ఎలా ఉండాలి? కొన్నేళ్లుగా ‘ఇంటర్నేషనల్‌ స్కూళ్లు’ ఉనికిలోకి వచ్చాయి. వాటి ‘కేంపస్‌’లు కూడా విశాలమైన స్థలం, భవనాలు, వసతులతో అలరారుతున్నాయి. అటువంటప్పుడు– అదే కాలంలో అదే ప్రాంతంలోని సమాజాల్లో ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు అందించే బోధనా ప్రమాణాలు ఎలా ఉండాలి? పబ్లిక్‌ స్కూళ్లలో ‘యజమాని’ ప్రభుత్వ స్కూళ్లలో ‘ఉద్యోగి’ తయారయ్యే ఇటువంటి వైరుధ్యం, వ్యత్యాసం ఇలా విద్యార్థికి ‘కిండర్‌ గార్డెన్‌’ దశలోనే మొదలవుతున్నప్పుడు, దీనిపై... సమీక్ష సంస్కరణల చర్యల అవసరం ఉందా లేదా? ఇంకా ఈ వ్యత్యాసం కొనసాగడానికి ప్రభుత్వం ‘చెక్‌’ పెట్టే చర్యలు కనుక చేపడితే, అందుకు మన పౌర సమాజ స్పందన ఎలా ఉండాలి?

ఉపాధి అంశం కంటే సున్నితమైనది మరొకటి ఉంది. అది– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలకు అందవలసిన ‘ఎమోషనల్‌ సపోర్ట్‌’. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒకప్పుడు మురికివాడలు అని మనం పిలిచిన పట్టణ శివారు కాలనీల్లోని పోలీస్‌ స్టేషన్లలో నమోదు అయ్యే ‘ఫ్యామిలీ కేసులు’ ఎటువంటివో చూస్తే, ఆ కుటుంబాల్లో పెరిగే పిల్లలకు బడిలో టీచర్ల నుంచి అందవలసిన సాంత్వన ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. విజయవాడ వంటి రైల్వే జంక్షన్‌ పరిధిలో వీధి బాలల కోసం పని చేస్తున్న– ఎన్జీఓలు చెప్పగలరు– పిల్లల పట్ల మనం చూపే నిర్లక్ష్యం ముగింపు ఎలా ఉంటుందో! (క్లిక్‌: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!)

పాఠశాల విద్యాశాఖలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల విషయంలో జరుగుతున్న వాద వివాదాలను... బయట నుంచి, దూరం నుంచి చూస్తున్న పౌరసమాజపు క్రియాశీలత అవసరమైన సమయమిది. ఈ పిలుపు ఒకరికి అనుకూలం, మరొకరికి ప్రతికూలం కాదు. ఇది మన కొత్త రాష్ట్రం కోసం. (క్లిక్‌: ఎలా చూసినా సంక్షేమ పథకాలు సమర్థనీయమే!)

- జాన్‌సన్‌ చోరగుడి 
సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు