Upper Middle Class: అసలు రంగు బయటపడేది అప్పుడే..

5 Dec, 2022 11:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విశ్లేషణ

గడచిన ముప్ఫై ఏళ్లలో కొత్తగా ఎగువ మధ్యతరగతిగా మారిన వర్గాలను, ఈ రోజు మీరు ఇంత భద్రంగా ఉండడానికి, ఇవీ కారణాలు అని చెప్పి వారిని ఒప్పించడం అంత తేలిక ఏమీ కాదు. కొన్నివేల రూపాయలతో కొన్న స్థలం నుంచి ఇప్పుడు నమ్మశక్యం కానంత ‘రిటర్న్స్‌’ వచ్చేట్టుగా మీ ఆస్తి విలువ పెరిగింది అంటే– అప్పట్లో దాన్ని కొనడం తప్ప, అదనంగా మీరు చేసింది ఏమీలేదు, అని వాళ్లనిప్పుడు ఒప్పించడం కష్టం. మీ పిల్లల జీతాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కూడా– ‘మార్కెట్‌ ఎకానమీ’ కారణం తప్ప, అందులో మన పనితనం ఏమీ లేదు. ఇవన్నీ సంపద పంపిణీ క్రమంలో, ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల మనకు అందిన ఫలాలు.

అయితే, ఇలా కొత్తగా ఎగువ మధ్యతరగతిగా ‘ప్రమోట్‌’ అయిన వారే చిత్రంగా ఇప్పుడు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలనూ, వాటిని అమలుచేస్తున్న ప్రభుత్వ ఉదార వైఖరినీ తప్పు పడుతున్నారు. ఇటువంటి ధోరణి మునుపు ఉందా అని వెనక్కి చూస్తే, 1970–80 దశకాల మధ్య కాలంలో అమలైన సంక్షేమం పట్ల ఈ తరహా విమర్శ దాదాపు లేదనే చెప్పాలి. కారణం– స్వాత్యంత్య్రం తర్వాత, కేంద్ర ప్రభుత్వ ‘సంక్షేమ విధానాల’ వల్ల కులాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా చితికి ఉన్న అన్ని వర్గాలు ఎంతోకొంత మేలుపొందాయి. కులీన వర్గాలుగా పేర్కొనే ఎగువ మధ్యతరగతి ఇప్పటిలా ప్రభుత్వ ఉదారవాద చర్యల్ని తప్పుపట్టేది కాదు. అప్పట్లో ఎక్కువమంది స్వాగతించిన – రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి నిర్ణయాలు అటువంటివే. 

అప్పట్లో భద్రతతో స్థిరపడి ఉన్న కులీన వర్గాలలోని విద్యాధికులు, దేశంలో జరుగుతున్న మార్పు ‘ప్రాసెస్‌’లో చురుకైన భాగస్వామ్య పాత్ర పోషించారు. వారు ఇక్కడ చదివి, విదేశాల్లో ఉన్నత విద్య తర్వాత ఇండియా తిరిగివచ్చి, దేశం చేస్తున్న ప్రగతి యజ్ఞంలో తమదైన పాత్ర పోషించారు. డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు (బయోకెమిస్ట్‌),  డాక్టర్‌ యలవర్తి నాయుడమ్మ (లెదర్‌ టెక్నాలజీ) అటువంటివారే. ఇటీవల  డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇంకా రెండేళ్ల పాటు చీఫ్‌ సైంటిస్ట్‌గా కొనసాగే అవకాశాన్ని ఈ నవంబర్‌ 30 నాటికి వదులుకుని, ఇండియాలో బాలల ఆరోగ్య రంగంలో చేయాల్సింది చాలా ఉందని వెనక్కి రావడం ఈ ధోరణికి కొనసాగింపే అవుతుంది.

ఇప్పుడైనా ఇది చర్చించాల్సిన అంశం ఎందుకైందంటే– ‘ఏరు దాటి మేము ‘ఎన్నారై’లు అయ్యాము కదా, మా వెనక వచ్చేవారి కోసం ఇంకా తెప్ప ఎందుకు ఉండాలి’ అని పేద కుటుంబాల కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాల పట్ల వారికున్న దుగ్ధను దాచుకోవడం లేదు. లేని వంకలు వెతికి మరీ ప్రభుత్వానికి మసిపూయడానికి వీరు చేస్తున్న ప్రయత్నంలో దాపరికం ఏమీలేదు. అది తెలుస్తున్నది.

ఈ క్రమంలో వాదన కోసం, వీరికి ఆక్షేపించడానికి మరేదీ కనిపించక కొందరు– ‘రోడ్లు సంగతి ఏమిటి?’ అంటున్నారు. కానీ మూడేళ్ళకు ముందు రోడ్ల పరిస్థితి ఏమిటి, ఈ మూడేళ్ళలో క్రమం తప్పకుండా కురుస్తున్న వానలు వల్ల గట్లకు నీళ్లు తన్నుతూ నిండుతున్న చెరువులు, వాగుల సంగతి వీరికి పట్టదు. అంతేనా ‘కరోనా’ కాలంలో అత్యవసర వైద్యసేవల కోసం చేసిన వ్యయం గురించి కానీ, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు పడిన గండి గురించి గానీ – ఎంతో సౌకర్యంగా వీరు తమ వాదనలో దాటవేస్తారు. 

నిజానికి వీరి సమస్య వేరు. అదేమో పైకి చెప్పుకోలేనిది. ఈ ప్రభుత్వం ప్రతి రంగాన్నీ క్రమబద్ధీకరించడంతో, మునుపటిలా వీరి ఆస్తుల విలువ పెరగడం లేదు. విషయం ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకప్పుడు బలుపుగా కనిపించిన వాపులన్నీ పొంగు తగ్గి నరాలు బయటపడి, అన్ని రంగాలు మళ్ళీ సాధారణ ఆరోగ్య స్థితికి చేరు తున్నాయి. ఈ మూడేళ్ళలో ఇక్కడ రిటైర్‌ అయిన చీఫ్‌ సెక్రటరీలు, డీజీపీ ఇప్పటికీ ఇక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం, ‘బ్యూరోక్రసీ’కి ఇక్కడున్న పని అనుకూల వాతావరణంగా చూడాల్సి ఉంటుంది.    

కానీ కొందరికి ఇవేమీ జరగకూడదు. జరుగుతున్నవి ఎలాగోలా మధ్యలో ఆగిపోవాలి. అయితే ఎలా? ప్రభుత్వంపై ఫిర్యాదు ఉన్నవర్గాలు ఇప్పుడు పెద్దగా లేవు. ఫిర్యాదు ఉన్న వారి సమస్యేమో – ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’లో చెప్పలేనిది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు క్లావ్‌ స్వాబ్‌ 2004 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘సమాజంలో ప్రతి ఒక్కరికీ వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంతమాత్రం భద్రత ఉండదు’ అనే హెచ్చరిక అయినా వీళ్ళకిప్పుడు అర్థం కావడం ఎంతైనా అవసరం. (క్లిక్ చేయండి: ‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?)


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు