అధికారులు ‘ఛాన్స్‌’ తీసుకోవడం లేదు!

6 Jun, 2022 14:50 IST|Sakshi

ఇటీవలి క్రిస్మస్‌ తర్వాత ఎదురైన అనుభవం ఇది. ఒంగోలు కలెక్టరేట్‌లో సీనియర్‌ అధికారిగా పని చేస్తున్న– ‘కజిన్‌’కు ఫోన్‌ చేసి ఎక్కడ? అని అడిగితే, మార్కాపురంలో రోడ్డు మీద ఉన్నట్టుగా చెప్పారు. రాత్రి ఎనిమిది అవుతుంటే, ఇప్పుడు అక్కడ ఏమి చేస్తున్నట్టు అనిపించి, అదే అడిగితే, ‘సీఎం ఆఫీస్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సార్‌ వస్తున్నారు, ఇక్కడ ‘వెయిట్‌’ చేస్తున్నాం’ అని అటునుంచి జవాబు. ఆయన ఏదైనా– ‘రివ్యూ మీటింగ్‌’ పెడితే, అది ఒంగోలు కలెక్టర్‌ ఆఫీస్‌లో ఉండాలి. కానీ రాత్రి ఎనిమిదప్పుడు, జిల్లా కేంద్రం ఒంగోలుకు 70 కి.మీ. దూరంలోని మార్కాపురంలో– సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అక్కడ ఏమి చేస్తున్నట్టు? అదే అడిగాను. ‘సార్‌ గ్రామ సచివాలయాలను తనిఖీ చేస్తున్నారు’ అని అటునుంచి జవాబు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లో భిన్నంగా ప్రభుత్వ పాలన సాగుతున్నది అనిపించింది!

సీఎం సమీక్షా సమావేశాల్లో, అధికారులు– ‘ఫీల్డ్‌’లో చూసి వచ్చి చెబుతున్నారా లేదా అనేది జగన్‌ పోల్చుకుంటున్నారు... అనేది 2022 నాటికి ఏపీలో కార్యదర్శులు, శాఖాధికారుల మనోగతం. దాంతో కలెక్టర్లు కూడా జిల్లా అధికా రుల నివేదికలను క్షేత్రస్థాయిలోని వాస్తవాలతో తాము స్వయంగా చూసి మరీ– ‘క్రాస్‌ చెక్‌’ చేసుకుంటున్నారు. ఉగాది నాడు కొత్త జిల్లాల ఆవిర్భావం సందర్భంగా– మంత్రులు, ప్రభుత్వ శాఖాధికారులు, కలెక్టర్లు పాల్గొన్న వీడియో కాన్ఫ రెన్స్‌లో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘సస్టెయిన్‌బుల్‌ డెవలప్మెంట్‌ గోల్స్‌’ (ఎస్‌డీజీ) సాధించే దిశలో– ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌’ (ఎస్‌ఓపీ) పాటించి తీరాల్సిందే అని కొత్తగా జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకున్న అధికారులకు స్పష్టం చేశారు. కేంద్రంలో– ‘నీతి ఆయోగ్‌’ దీన్ని మదింపు చేస్తుంది.

ఇలా బహిరంగంగా– ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌’ పాటించి తీరాలని ఒక సీఎం చెప్పడం చిన్న విషయం కాదు. అంత తేలిక అంతకంటే కాదు. పైగా– ‘కలెక్టర్లను జాగ్రత్తగా చూసుకోండి’ అని మంత్రులతో సీఎం చెప్పడం ఆసక్తికరమైన అంశం. అధికారులతో నిబంధనలకు లోబడి పని చేయండి అని చెబుతూ, మంత్రులతో అధికారులను జాగ్రత్తగా చూడండి, అంటే విషయం స్పష్టమే! వాళ్ళ మీద– ‘అవుటాఫ్‌ ది వే’ చేయమని మీరు ఒత్తిడి పెట్టొద్దు. వాళ్ళు నిబంధనలకు లోబడి పనిచేస్తే, రేపు రాజకీయంగా ప్రయోజనం పొందేది మనమే అనేది  జగన్‌ స్పష్టం చేసేశారు.  

పరిపాలన ఎంత– ‘ఆన్‌లైన్‌’ అంటున్నప్పటికీ, ‘టెక్నాలజీ’ అన్నిసార్లూ నిజమే చెప్పాలని లేదని, ఏపీ సీఎం జగన్‌కు మరీ ఇంత త్వరగా తెలియడం అధికారులకు కాస్త ఇబ్బందిగానే ఉంది. ముందు ఒక మాట, వెనుక మరొకటి లేని– ‘కటింగ్‌ ఎడ్జ్‌’ ధోరణి అంటున్నది దీన్నే. సీఎం ధోరణి, ఎంత సున్నితంగా ఉంది అనేది స్పష్టం అయ్యాక, సీనియర్‌ అధికారులు ఎవ్వరూ తమ స్థాయిలో– ‘ఛాన్స్‌’ తీసుకోవడం లేదు. ‘అన్నా’ అంటూనే, పనిలో అలసత్వం కనిపిస్తే మాత్రం మందలించే విషయంలో సీఎం వెనకాడడం లేదు. (క్లిక్‌: ప్రభుత్వ పనితీరుకు జన నీరాజనం!)

కాకినాడ జిల్లాలో ఒక ఎస్సై సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోతే, అదే వారంలో పోలీస్‌ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ అధికారులకు– ‘స్ట్రెస్‌ మేనేజ్మెంట్‌’పై మానసిక నిపుణులచే శిక్షణ తరగతులు ప్రారంభించినట్టు ప్రకటించారు. తిరుపతిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అంబులెన్స్‌ ఆపరేటర్ల దందా వార్త వెలువడ్డాక, స్థానిక పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుప్పం వద్ద– ఏపీ, కర్ణాటక, తమిళనాడు ‘ట్రై జంక్షన్‌’ సమీపంలో 20 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, మరణాల సమయంలో అంబులెన్స్‌ సర్వీసుల ఛార్జీలు అందుబాటులో ఉండేటట్టుగా కుప్పం పోలీస్‌ సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ టి. శ్రీధర్‌ ఇప్పటికే, అంబులెన్స్‌ ఆపరేటర్లతో– ‘కౌన్సిలింగ్‌ సెషన్లు’ నిర్వహిస్తున్నారు. గతంలో ఇటువంటి చొరవ సీఎం లేదా మంత్రుల ప్రకటనలతో ‘మీడియా’లో వార్తలుగా మొదలై, ఆ తర్వాత ఎప్పటికో వాటి ప్రారంభాల ఫొటోలు, వీడియో వార్తల తర్వాత గానీ అవి ఆచరణలోకి వచ్చేవి కావు.


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత 

మరిన్ని వార్తలు