సిబ్బంది లేనిదే నిర్వహణ ఎలా?

28 Oct, 2020 03:06 IST|Sakshi

సందర్భం

తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీళ్లందించాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు చేస్తోంది. కానీ ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన సిబ్బందిని నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ప్రాజెక్టులలో ఇంజ నీర్లను భర్తీ చేస్తున్నది గానీ, ప్రాజెక్టుల నిర్వహణలో కీలకమైన వ్యవస్థ వర్క్‌ ఛార్జ్‌డ్‌ సాంకేతిక ఉద్యోగులను, కార్మికులను భర్తీ చేయడం లేదు. ప్రాజెక్టులు, కాల్వల ద్వారా లక్షలాది ఎకరాలకు నీరందించే లస్కర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు నేడు నామమాత్రంగా మిగిలిపోయారు. ప్రాజెక్టులపై వర్క్‌ ఛార్జ్‌డ్‌ సిబ్బంది మెకానికల్‌ పనులను నిర్వహిస్తూ ప్రాజెక్టులను కాపాడేవారు. నట్లు, బోల్ట్, స్పానర్, స్టీరింగ్, విద్యుత్‌ సిబ్బంది ప్రాజెక్టులకు జవసత్వాలుగా పని చేస్తారు. వీరు మజ్దూర్, హెల్పర్, ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆపరేటర్, ఫోర్‌మెన్‌ పేర్లతో వివిధ కేటగిరిల్లో ప్రాజెక్టులపై పని చేస్తుంటారు. ఉదాహరణకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఐదు వేల మంది వర్క్‌ ఛార్జ్‌డ్‌ సిబ్బంది పని చేశారు. 

ప్రాజెక్టుల భారీ గేట్లు ఆపరేట్‌ చేయడం, వాటికి డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు, మాన్యువల్స్‌ ప్రకారం మరమ్మతులు నిర్వహించడం లాంటి పనులు సాంకేతిక సిబ్బంది చేయాల్సి ఉంటుంది. బ్రిటిష్‌ హయాంలో, ఆ తర్వాత పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలలో వర్క్‌ ఛార్జ్‌డ్‌ సిబ్బంది సాంకేతికపరమైన అనుభవం కలిగి స్కిల్డ్, సెమీ స్కిల్ట్‌ నిపుణులుగా నిర్వహణ, మరమ్మత్తుల పనులు నిర్వహించేవారు. అదే ఒరవడిని స్వాతంత్య్రానంతరం వివిధ ప్రభుత్వాలు కొనసాగిస్తూ వచ్చాయి. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2/94 యాక్ట్‌ తెచ్చింది. దీనివలన రెగ్యులరైజేషన్‌ నిలిచిపోయింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి 212 జీవో తెచ్చుకున్నారు. అది కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది. ఎన్‌ఎంఅర్‌లుగా, కంటింజెంట్‌గా పనిచేస్తున్న సిబ్బంది 20, 30 ఏళ్లు గడిచినా పర్మినెంట్‌ కాలేదు. గత 30 సంవత్సరాలుగా కొత్త రిక్రూట్మెంట్‌ లేకపోవడంతో అనుభవం కలిగిన సిబ్బంది క్రమంగా రిటైర్‌ అవుతున్నారు. వారి స్థానాలలో సిబ్బందిని మాత్రం భర్తీ చేయడం లేదు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిర్వహణ అనుభవం, అర్హత కలిగిన వాళ్లు లేకపోవడంవల్ల తరచుగా ప్రమాదాలు జరిగి నష్టం వాటిల్లుతోంది. 2009లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు గత వంద సంవత్సరాలలో కనీవినీ ఎరుగని వరద  వచ్చింది. ఆనాడు కొద్దిమందిగా ఉన్న అనుభవం కలిగిన సిబ్బంది ప్రాణాలకు తెగించి గేట్ల సమర్థవంత నిర్వహణ ఫలి తంగా ప్రాజెక్టులకు పెనుప్రమాదం తప్పింది. ప్రభుత్వం వర్క్‌ఛార్జ్‌డ్‌ సిబ్బందిని ప్రశంసించింది. ప్రాజెక్టులపై ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది నియామకాలను త్వరలో చేపడతామని శాసనసభలో నీటి పారుదల శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. కానీ నేటికీ అతీగతీ లేదు.

ఒక ప్రాజెక్టు పూర్తయితే దాని మీద ఎంత మంది సిబ్బంది ఉండాలి? ఏ కేటగిరిలు కావాలి? తగు విధంగా నివేదికలను అందజేయాలని ప్రభుత్వాలు వివిధ కమిటీలు వేశాయి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐజే.నాయుడు చైర్మన్‌గా మరో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ, అర్‌.కె.కొండల్‌రావు ఆధ్వర్యంలో ముగ్గురు ఇంజనీర్లతో కూడిన కమిటీ, ఆ తర్వాత ఎన్‌.సుబ్బరామిరెడ్డి కమిటీ... ఆయా కమిటీలు ప్రభుత్వాలకు నివేదికలను అందించడం జరిగింది. వివిధ సిఫార్సులను చీఫ్‌ ఇంజనీర్స్‌ బోర్డు కూడా ఆమోదించింది. కానీ ఆచరణలో ఎక్కడా ఆ సిఫార్సులు అమలు జరగలేదు. 

ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 170 ప్రాజెక్టుల వరకూ ఉండేవి. ప్రతి ప్రాజెక్టులో వర్క్‌ ఛార్జ్‌డ్‌ సిబ్బంది కీలకంగా ఉండేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2/94 యాక్ట్‌కు సవరణలు తీసుకొచ్చి సిబ్బంది భర్తీతో పాటు, ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తారని భావించారు. ఆనాడు ఇరిగేషన్‌ శాఖా మంత్రిగా ఉన్న హరీశ్‌రావు దృష్టికి కూడా ఈ విషయాన్ని సంఘాలు తీసుకువెళ్ళాయి. మాకోసం కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవటం కోసం సిబ్బంది అవసరమని చెప్పారు. అలాగే కేసీఆర్‌ అన్న మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ‘అధికారం చేపట్టగానే ముందుగా శ్రమదోపిడీకి మారుపేరైన ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్త్తం. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ మాటే వినబడదు. ప్రభుత్వ వ్యవస్థలలోని అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ జరిపి తీరుతాం’. అధికారంలోకొచ్చి ఆరేండ్లు గడిచిపోయింది. 2/94 యాక్ట్‌ సవరణ జరగలేదు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌ కాలేదు. ప్రభుత్వ ఖాళీల భర్తీ లేదు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన వాగ్దానాలను నిలుపుకోవాలి. 

-జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా