ఏ ఛాందసవాదమైనా చెల్లనిదే!

22 Nov, 2020 00:25 IST|Sakshi

సందర్భం

డెహ్రాడూన్‌ నుంచి ఒక ముస్లిం బాలుడు నాకు ఒక ఉత్తరం రాశాడు. ‘‘జూలియో ఎఫ్‌ రిబీరో గారూ, అల్లా ఆశీర్వాదం మీపై ప్రసరించుగాక. నిన్న నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఫ్రాన్స్‌లో ఒక క్లాస్‌ టీచర్‌ ప్రవక్త మహమ్మద్‌(సా) వ్యంగ్యచిత్రం గీయమని విద్యార్థులను ఆదేశించారు. ఒక ముస్లిం విద్యార్థి అలాంటి పరిస్థితి పట్ల ఆశ్చర్యచకితుడై చివరకు ప్రవక్త గురించి నోట్‌బుక్‌పై రాశాడు. ప్రవక్త మహమ్మద్‌(సా) మా హృదయాల్లో నిండి ఉన్నారు. ముస్లిం ఉమ్మాలు ప్రవక్తను ప్రేమిస్తారు. వారు జీసస్, మోజెస్, డేవిడ్, ఇజాక్, ఇస్మాయిల్, అబ్రహాం, నోహ్‌లను కూడా ప్రేమిస్తారు. వారు ఖురాన్‌ ఆదేశాలను అనుసరించి హిందూ దేవతలను కూడా గౌరవిస్తారు.

ప్రవక్త మహమ్మద్‌తో అలాంటి శాశ్వత బంధాన్ని ఎవరైనా, ఏరీతిగానైనా అగౌరవిస్తే ఇతర మతాలతో సంబంధాలు అర్థంలేనివిగా మారిపోతాయి. ఒక ముస్లిం తన ప్రవక్తపై అలాంటి దాడిని సహించలేడు. వాక్‌ స్వాతంత్య్రం పేరిట జీసస్‌ని అవమానిస్తున్న రీతిలో యూరప్‌.. ప్రత్యేకించి డెన్మార్క్, ఫ్రాన్స్‌ దేశాలు ప్రవక్త మహమ్మద్‌ను కూడా అలాగే అవమానించగలమని ఎలా భావిస్తున్నాయి? ఒక ప్రేమాస్పదుడైన ఇస్లాం మతప్రవక్తను రాక్షసుడిగా చిత్రించే వాతావరణం ఎలా తయారవుతోంది? వాక్‌ స్వాతంత్య్రం పేరిట ఇస్లాం మతప్రవక్త పట్ల ప్రదర్శిస్తున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగా మీరు కూడా గళం విప్పుతారని భావిస్తున్నానండీ..’’

నేను ఆ అబ్బాయికి సమాధానం పంపాను. ‘ప్రవక్త ముఖచిత్రం ఎవరూ గీయవద్దని, అలా ఎవరైనా చిత్రిస్తే, అతడు లేక ఆమెను చంపేయాలని ఖురాన్‌ ఎక్కడైనా చెప్పిందా? అని తెలుసుకోకుండా ఈ అంశంపై ఎవరైనా రాయాలంటే కష్టమే. ఈ విషయంపై కాస్త స్పష్టత  తప్పనిసరి’ అయితే ఈ అబ్బాయి మనోభావాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అలాంటి మత సంప్రదాయపరుల అంతరంగాన్నే ప్రతి బింబిస్తున్నాయి. ఇలాంటి వారిని పెంచి పోషిస్తున్న వారు కూడా, ప్రవక్తను వ్యతిరేకించినవారిని చంపవద్దన్న ఖురాన్‌ ప్రవచనాలను గౌరవించినట్లయితే ఇలాంటి పిల్లల మనోభావాలను నేను గౌరవిస్తాను. లౌకికవాద ఉదారవాదులు ఒక పక్షం వహించి.. ఆ పక్షంలోని కొంతమంది చేసే అన్యాయాన్ని క్షమించేలా వ్యవహరించకూడదు.

బాధితులకు రక్షణగా ఉదారవాదం
పశు వ్యాపారులను, మాంస వ్యాపారులను, పశుమాంసాన్ని ఆరగించేవారిని కొట్టి చంపినప్పుడు,  సీఏఏ, ఎన్నార్సీ వంటి వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నందుకు విద్యార్థులను, వృద్ధ మహిళలను యూఏపీఏ వంటి నిరంకుశ చట్టాలతో వెంటాడి వేధిస్తున్నప్పుడు లౌకిక ఉదారవాదులు బాధితులకు రక్షణగా నిలుస్తారు. అదేసమయంలో ఫ్రాన్స్‌ వంటి శక్తివంతమైన రాజ్యవ్యవస్థతో తలపడే శక్తి లేని కారణంగా ముస్లింలు కొందరు ఉగ్రవాద చర్యలకు పాల్పడినప్పుడు (ప్రవక్తపై పత్రికలో వచ్చిన కార్టూన్లు ప్రదర్శించినందుకు ఒక టీచర్‌ తల నరికారు) ఇదే లౌకికవాద ఉదారవాదులు శషభిషలు లేకుండా ఈ ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తారు.

తన దేశ పౌరుడి హత్యను ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఖండించారు. మన ప్రధాని మోదీ కూడా ముస్లిం ఉగ్రవాదులు పారిస్‌ టీచర్‌ని హత్య చేసిన ఘటనను ఖండించిన తొలి ప్రపంచ నేతగా ముందుకొచ్చారు. కానీ భారత్‌లో ముస్లింలను చిత్రవధ చేసిన ఘటనలపై మన ప్రజారంజక ప్రధాని చేసే ఖండనకోసం మనం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం. 
ఫ్రాన్స్‌ జాతీయ విషాదంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్‌కి మోదీ మద్దతు తెలుపడం మంచిదే. తెలివైన చర్య కూడా. కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో పశువ్యాపారులపై వరుసగా జరుగుతూ వచ్చిన చిత్రవధ ఘటనలపై కూడా మోదీ అంతే స్థిరంగా ఖండన తెలిపి ఉంటే మన దేశంలోని లౌకిక ఉదారవాదులు ఆయన్ని అభినందించి ఉండేవారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా ఏ మతస్థులైనా సరే.. మతఛాందసవాదంతో చేసే అతి చర్యలన్నింటినీ నాలాంటి ఉదారవాదులం తీవ్రంగా ఖండిస్తూనే ఉంటాం.

జాతీయ విలువలకు మతంతో సంబంధం లేదు
రాజీలేని సమరశీలి తీస్తా సెతల్వాద్‌ భర్త జావేద్‌ ఆనంద్, లౌకిక ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆయన తోటి ముస్లింల బృందం ఫ్రాన్స్‌ అధ్యక్షుడి పక్షం వహించి, టీచర్‌ తల నరికిన అనాగరిక చర్యకు పాల్పడిన ఫ్రెంచ్‌ ముస్లింలను ఖండించినప్పుడు లౌకిక ఉదారవాదులు ఉప్పొంగిపోయారు. కానీ ఆ మరుసటి రోజు ముంబైలో, ఇతర భారతీయ నగరాల్లోనూ వేలాదిమంది ముస్లింలు వీధుల్లోకి వచ్చి ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రకటనపై ఆగ్రహం ప్రదర్శించడం నావంటివారిని ఎంతో అసంతృప్తికి గురిచేసింది. ఫ్రెంచ్‌ జాతీయ విలువలతో ఇస్లాంకి మాత్రమే కాదు ఏ ఇతర మతానికీ సంబంధం లేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించారు. క్రిస్టియన్‌ మత విశ్వాసాలను స్థిరంగా ఖండించిన ‘ది డావిన్సీ కోడ్‌’ వంటి సినిమాలను ఎలాంటి హింసాత్మక ప్రతిచర్యలు లేకుండా ఫ్రాన్స్‌ సినిమా హాళ్లలో ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా మనందరం తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఫ్రెంచ్‌ పౌరుల్లో మెజారిటీగా ఉన్న క్రిస్టియన్లు కూడా మతం పట్ల తమ వైఖరిని సడలించిన సందర్భంలో ఫ్రాన్స్‌ జనాభాలో ఒక మోతాదులో ఉన్న ఇస్లాం అనుయాయులు తమ ప్రవక్తపై ఈగ వాలనీయనంత సున్నితంగా ఉంటున్నారు. ట్రిపుల్‌ తలాఖ్‌ అంశంలో ముల్లాలను తీవ్రంగా ప్రతిఘటించిన ఉత్తమ ముస్లిం మహిళ జకియా సోమన్‌ కూడా ఫ్రాన్స్‌లో తన తోటి మతస్థులు జరిపిన అనాగరిక చర్యను ఖండిస్తూ బహిరంగంగా ముందుకొచ్చారు. దీనికి గానూ ఆమె భారతీయ ముస్లింల వ్యతిరేకతను చూరగొనవచ్చు. అయినాసరే, పత్రికా కాలమ్‌లో తన అభిప్రాయాన్ని చాటి చెప్పినందుకు ఆమెకి నా సెల్యూట్‌.

ఇస్లాంను పాటిస్తున్న నా తోటి మానవులు అనేక తిరోగమన సంప్రదాయాలను వ్యతిరేకించాల్సిన, త్యజించవలసిన అవసరం ఉంది. వారి వివాహ, విడాకుల చట్టాలు, వారి రోజువారీ జీవి తంలో మహిళలకు లభిస్తున్న స్థానం వంటి ప్రధానాంశాలపై చర్చ సాగించాల్సి ఉంది. రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం షా బానో తీర్పును మార్చిపడేసిన తీరు భారత్‌లో ముస్లింల పట్ల సానుభూతి ప్రదర్శించేవారికి కూడా షాక్‌ కలిగించింది. ఇదే తదనంతర కాలంలో కాంగ్రెస్‌ పాలన పతనానికీ, బీజేపీ వికాసానికి దారితీసింది.

ఛాందసవాదం తెచ్చే నష్టాలు
ఇస్లాం ముల్లాలు తీసుకున్న మరొక నిర్ణయం కూడా నాకు మరింత షాక్‌ కలిగించింది. చరిత్రలోకి వెళితే 1965 లేక 1971 యుద్ధంలో ఒక బారతీయ సైనికుడిని పాకిస్తానీయులు బంధించారు. అతడు ఒక ముస్లిం. అయితే అతడి గురించిన సమాచారం ఏడు సంవత్సరాలకు పైగా ప్రపంచానికి తెలీకుండా పోయింది. దీంతో అతడి భార్య మరో వివాహం చేసుకుంది. రెండో భర్త ద్వారా ఆమె ఒక బిడ్డను కన్నది. వారు సంతోషంగా గడిపేవారు. ఉన్నట్లుండి ఒక రోజున పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈ భారతీయ ముస్లిం సైనికుడిని విడుదల చేసి స్వదేశానికి పంపించేసింది.

ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో ముస్లిం మతగురువులు ఆమె చేసుకున్న రెండో వివాహాన్ని రద్దు చేసుకుని మళ్లీ తన తొలి భర్త అయిన సైనికుడితోనే కాపురం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయంలో ఆమె అభిప్రాయమేమిటో తెలుసుకోవాలని కూడా ముల్లాలు భావించలేదు. శత్రుదేశంలో నిర్బం ధంలో ఉండి విడుదలై వచ్చిన మన ముస్లిం సైనికుడు.. రెండో భర్త ద్వారా ఆమెకు కలిగిన బిడ్డను ఆమోదించకపోవడంతో ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన కూడా ఎవరూ పోలేదు.

నాతోటి భారతీయ ముస్లిం సోదర సోదరీమణులను లక్ష్యంగా చేసుకుని వారిపై అన్యాయంగా దాడి చేసిన సందర్భంలో వారికి సహాయం చేయడానికి నేను ముందుకొచ్చాను. కొన్ని సమస్యల్లో వారికి తోడ్పడ్డాను కూడా. ఇకపై కూడా ఇలాంటి ఘటనల సందర్భంలో నేను నావంతు సహాయం అందించడానికి తప్పక ప్రయత్నిస్తాను. అదే సమయంలో మతం పేరిట అనాగరిక చర్యలను నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించలేను.

ముస్లిం సోదరులు ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలను వారి ఇంట్లోనూ, వారి మతంలోనూ బానిస స్థానంలో ఉంచాలని ఏ దేవుడైనా చెప్పగలడా? ఏ దేవుడైనా తనను ధిక్కరించిన వారిని వెంటాడి చంపాలని చెప్పగలడా? ఇలాంటి అసమానత్వాన్ని, అన్యాయాన్ని నేను పాటించే లౌకిక ఉదారవాదం ఎన్నటికీ అంగీకరించదు.. ఆమోదించదు కూడా.

వ్యాసకర్త
జూలియో రిబీరో
రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి

మరిన్ని వార్తలు