ఒక్కగానొక్కడు

4 Nov, 2020 00:50 IST|Sakshi

సందర్భం

ఎన్నికల వేళల్లో నాయకులు మాట్లాడే మాటలపై అస్సలు నమ్మకముండదు. అసలు పార్టీల మ్యానిఫెస్టోలనే కాలం మరిచిపోయి చాలా కాలమైంది. కానీ, 2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్‌ ఉపన్యాసాలన్నీ వినీ వినీ వాటిని అందరూ మోహించినట్లుగానే మోహించి, వాటిని భద్రపరచాలని ప్రయత్నంచేస్తే అది ‘జయుడు’ అన్న పెద్ద పుస్తకమయ్యింది. అట్లనే 2019 చివర్లో జరి గిన రెండోవిడత ఎన్నికల్లో కేసీఆర్‌ సభల్లో ఉపన్యాసాలన్నీ రికార్డుచేస్తే ‘సమ్మోహనాస్త్రం’ అన్న మహాగ్రంథమైంది. కానీ ఆ రెండు పుస్తకాలలో కేసీఆర్‌ చేసిన ఉపన్యాసాలన్నీ ఓట్లకోసం మాట్లాడినవి మాత్రమేకావు. అవి భవిష్యత్‌ తెలంగాణ కాలజ్ఞానంగా నిలుస్తాయి.  కేసీఆర్‌ మాట్లాడే ప్రతిమాటను ఆచరణాత్మకంగా చేసి చూపిస్తాడు. తను అనుకున్నది సాధించడానికి ఎక్కడిదాకైనా వెళతాడు. ఎన్ని అడ్డంకులొచ్చినా ఎదుర్కుంటాడు. అతడు అనుకున్నది సాధిస్తాడు. అందుకే కేసీఆర్‌ను పట్టువదలని మొండోడు అంటారు.

ఈ వొంటూపిరి బక్కప్రాణమేనా ఇన్ని అద్భుత ఆవిష్కరణలు తెలంగాణ నేలమీద చేసి చూపించింది అనిపిస్తుంది. అవును, ఇది నిజం. తెలంగాణతో ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన ప్రయాణాలు, ఆయన ఆచరణలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రతిపనిని ఒక తపస్సులాగా చేసినోడు. ‘రైతు వేదిక’ను ప్రారంభిం చిన సందర్భంలో జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన మాట్లాడిన ఉపన్యాసం చరిత్రాత్మకమైనది. రైతుల కోసం రైతు సంక్షేమంకోసం ఆయన రైతు వేదికలను ప్రారంభించి ప్రపంచంలో ఎక్కడాలేని రైతు ఆలోచనల ఆవిష్కరణలుచేసి ఆయన చేసిన ఉపన్యాసమది. ఆయన ఆలోచనలకు, ఆచరణకు మొత్తం రైతులోకం నాగళ్లెత్తి స్వాగతిస్తుంది. ఇంతగా రైతుల గురించి ఆలోచించి వాళ్ల జీవితాల్లో కొత్తవెలుగులు రావాలని తపించిన రైతునాయకుడు, రైతుబిడ్డ కేసీఆర్‌. కొడకండ్ల రైతువేదిక ప్రారంభంలో ఆయన మాట్లాడిన మాటలు రైతు చేతుల సంఘటిత పిడికిలిగా మారింది. 

ఈ దేశంలో రైతాంగమంటే అసంఘటిత రంగ ఆవేదన. కానీ రైతు వేదిక నిర్మాణం ద్వారా దాన్ని కేసీఆర్‌ రైతుల ఆత్మగౌరవ చిహ్నంగా, రైతాంగం మహాశక్తిగా మార్చేశారు. కొడకండ్ల రైతు వేదిక ప్రారంభంలో కేసీఆర్‌ మాట్లాడిన సుదీర్ఘ ఉపన్యాసం మట్టిమనుషుల మహాసందేశంగా నిలుస్తుంది. అంబేడ్కర్‌ కులనిర్మూలనా ఉపన్యాసం భారత రాజ్యాంగం అయితే మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఉపన్యాసం నల్లజాతిని మేల్కొలి పింది. మండేలా విముక్తి గీతం దక్షిణాఫ్రికా విముక్తి గీతం. మహాత్మాగాంధీ ఉపన్యాసం భారతదేశం అహిం సామార్గంలో సాధించిన స్వాతంత్య్రం సమరగీతం.

తెలంగాణలో పునర్నిర్మాణ సమయంలో కేసీఆర్‌ చెప్పిన మాటలన్నింటినీ చేసుకుంటూపోతున్నాడు. కేసీఆర్‌ తెలంగాణ తల్లి భాషలో మాట్లాడుతూ అవసరాన్ని సందర్భాన్ని బట్టి ఆయన గద్దిస్తాడు, బుజ్జగి స్తాడు, ఆగ్రహిస్తాడు, జనుల కోసం దేన్నైనా శాసిస్తాడు, శోకిస్తాడు, శోధిస్తాడు, చివరకు సర్వజన సంక్షేమమే తనమతంగా నిలిచిపోతాడు. సమయసందర్భాలను లెక్కగట్టి అనేక సమయాల్లో కేసీఆర్‌ చేసిన ఉపన్యాసాలన్నీ సుప్రసిద్ధ ప్రముఖుల ఉపన్యాసాల జాబి తాలో చేరిపోతాయి. చెప్పిన మాటలను ఆచరణలో చేతలుగా చూపించిన స్థితే తెలంగాణ పునర్నిర్మాణం. కేసీఆర్‌ మాట తెలంగాణ ఉగ్గుపాలపాట.

ఏడ్చేబిడ్డకు అందించే తల్లి పాలు. ఈ నేలమీద ఎక్కువమందికి మేలుచేసే పని ఎవరుచేసినా అది ఏ వాదమైనా శిరోధార్యమే. తెలంగాణలోని సబ్బండవర్ణాలకు నిజంగా ఏదైనా మేలు ఆచరణాత్మకంగా జరుగుతూ ఉందంటే రాష్ట్ర అవతరణ తర్వాతే ఆ పని నిర్విఘ్నంగా వేగవంతంగా జరుగుతుంది. నీళ్లనుంచి నిధులదాకా, నిధుల నుంచి వ్యవస్థ పునర్నిర్మాణం దాకా ఒక పెద్ద కృషి జరుగుతుంది. సబ్బండవర్ణాల వాకిళ్లముందు సంకురాతిరి ముగ్గులాగా వ్యవసాయం నూతనోత్సాహంతో వెల్లివిరియాలన్న తలంపుతో కేసీఆర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ‘తెలంగాణ నా స్వప్నం’ అన్న లక్ష్యాన్ని సాధించాడు. అన్నార్తులు, అనా«థలులేని గ్రామరాజ్యాల్ని నిర్మించే పనిలో మునిగిపోయాడు. ఆయన చెప్పినవన్నీ ఆచరణాత్మక అడుగులై తెలంగాణ తనను తాను నిర్వచించుకుంటుంది. కేసీఆర్‌ అంటే భూమిని దున్నే నాగలి, రైతాంగం పిడికిలి. ఆయన మాటలు పొట్టమీదికొచ్చిన పంట. ఆయన తెలంగాణ ధాన్యాగారం. కేసీఆర్‌ తెలంగాణకు ఒక్కగానొక్కడు. 

-జూలూరు గౌరీశంకర్‌
వ్యాసకర్త కవి, విమర్శకుడు ‘ 94401 69896

మరిన్ని వార్తలు