Juluru Gowri Shankar: ప్రజల ఆకాంక్షలే అజెండాగా...

13 Jan, 2023 12:44 IST|Sakshi

అభిప్రాయం

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే చారిత్రాత్మక వేదికగా ఖమ్మం సిద్ధమైంది. ఒకనాడు ఎర్రకొండగా ఉన్న స్తంభాద్రి ఇప్పుడు ఎర్రకోటపై ప్రజల అజెండాను ఎగుర వేసే ఒక మహాశక్తికి శంఖారావ క్షేత్రం అవుతోంది. బీఆర్‌ఎస్‌ ఒక మహోన్నత సమాజ నిర్మాణం వైపు అడుగులు వేస్తూ సృజనాత్మక మార్పుకు నడుంబిగించే సభకు ఖమ్మం గుమ్మం స్వాగతం పలుకుతోంది. 

దేశం అన్ని రంగాల్లో దివాళా తీసింది. ఎంతో స్ఫూర్తితో నిర్మించుకున్న ప్రభుత్వ రంగం కొడిగట్టే దీపమవుతోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడుతున్న తరుణంలో ఖమ్మం వేదికగా బీఆర్‌ఎస్‌ గొంతు విప్పబోతుంది. ఎమర్జెన్సీ తర్వాత అన్ని ప్రజాస్వామిక హక్కులు కాలరాయబడటంతో ప్రజాస్వామ్య పరిరక్షణకు కదిలిన లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ వెంట దేశం నడిచింది. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణకు లెఫ్ట్, రైట్‌లందరూ కలిసి నడిచారు. ఇవ్వాళ కూడా కేంద్రంలో పెద్దలు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తీరును చాటిచెబుతూ దేశంలోని ప్రజాస్వామిక శక్తులందర్నీ కూడగట్టవలసిన అవసరం ఉంది. దేశానికి అత్యవసరమైన ఆర్థిక విధానాలను రచించుకోవాలి. 2014 నుంచి దేశం ఉత్పత్తిని పెంచుకోవటంలో పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ ఆస్తులను మాత్రం తెగనమ్మటంలో ముందుంది. తక్షణం ఈ అమ్మకాల నుంచి దేశాన్ని కాపాడాలి. సహజ వనరులను, అడవి సంపదలను గుత్తకు అప్పజెబుతున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగాన్ని తగ్గించడానికి యువతను ఉత్పత్తి రంగంలో ఎక్కువగా వాడుకోవాలి.

భారీగా పెరిగిపోయిన ప్రైవేట్‌ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు జరపాలి. అంబేడ్కర్‌ పేరు జెప్పి ఆయన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్న తీరును ఎత్తి చూపాలి. ఒక కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్నీ, ఒక మతానికి వ్యతిరేకంగా మరో మతాన్నీ రెచ్చగొట్టి విద్వేష భారతాన్ని రచిస్తున్న తీరుకు అడ్డుకట్టవేయాలి. భారత గడ్డపై పుట్టిన వాళ్లనే పరాయి వాళ్లను చేస్తున్న తీరు ప్రమాదకరమైనది. దేశభక్తి కావాలి కానీ విద్వేషభక్తి ఉండకూడదు. ఒక్క భాషపైననే ప్రేమకాకుండా దేశ ప్రజలు మాట్లాడే అన్ని భాషలపై ప్రేమ ఉండాలి. ఇతరులపై గుడ్డి ద్వేషాన్ని పెంచే భావజాలం ఏదైనా అది విషాన్ని నింపటం కంటే ప్రమాదకరమైనది. చివరకు పాఠ్యప్రణాళికల్లో కూడా మతభావనలు చూపించే దశకు పోవటం అన్యాయమని ఎవరైనా అడిగితే వారిని జాతివ్యతిరేకి అంటున్నారు. లౌకిక ప్రజాస్వామిక వ్యవస్థలను పరిరక్షించకపోతే దేశం కుప్పకూలుతుంది. మహాత్మాగాంధీ, జ్యోతిబాఫూలే, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అనంతర భారతం ఇదేనా? దేశాన్ని సంపన్న భారతం చేయమంటే వలసల భారతంగా మార్చేశారు. వారి దుందుడుకు విధానాల పట్ల మొత్తం జాతిని మేల్కొలిపి ముందుకు నడిపించటానికే ఖమ్మం వేదికగా ప్రజల అజెండాకు రూపకల్పన జరుగుతోంది. కమండలాలకు సరైన సమాధానం చెప్పి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపిన లల్లూప్రసాద్‌ యాదవ్‌లాగా, ములాయంసింగ్‌ యాదవ్‌లాగా, ఒక వీపీసింగ్‌ లాగా దేశంలోని వలస భారతానికి ధైర్యం చెప్పే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది. 

తమకు అనుకూల రాష్ట్ర ప్రభుత్వాలపై ఒక పద్ధతీ, తమకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వాలపైన కక్షకట్టే రాజకీయాలూ పోవాలి. తమకు అను కూలురైన సీఎంలు లేకపోతే గవర్నర్‌తో పాలి స్తామనే సంస్కృతి ఫెడరల్‌ వ్యవస్థను పెను ప్రమాదంలో పడవేస్తుంది.

సంప్రదాయాల్లోకి, విశ్వాసాల్లోకి, నమ్మకాల్లోకి, మతాల్లోకి, కులాల్లోకి, గనుల్లోకి, గుడుల్లోకి, బడుల్లోకి, వనాల్లోకి, అడవుల్లోకి మన ఇంటి గడపల్లోకి, మంది మెదడుల్లోకి అన్నిట్లోకి తమ పాత భావాలను, ఛాంద సత్వాన్ని చొప్పించి ప్రజాస్వామ్యాన్ని లౌకికత్వాన్ని అవహేళన చేస్తున్నారు. ఎవరు తమను ప్రశ్నించినా ఈడీలు, బేడీలు వేస్తున్నారు. అన్ని వ్యవస్థలూ కళ్లముందే ధ్వంసం అవుతున్నప్పుడు ఇదేమి న్యాయమని అడిగితే నేరుగా జైలుకే పంపించేస్తున్నారు. ఇది ఫాసిజం కంటే ప్రమాదకమైనది.

ఇపుడు తక్షణంగా దేశాన్ని రక్షించుకునేందుకు దేశభక్తియుత ఉద్యమాలు రావాలి. అటువంటి ఉద్యమాన్నే కేసీఆర్‌ ఖమ్మం వేదికగా ప్రారంభి స్తున్నారు. ఆ ఉద్యమంలో దేశ ప్రజ అంతా భాగం కావాలి. (క్లిక్ చేయండి: జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట)


- జూలూరి గౌరీశంకర్‌ 
ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
(జనవరి 18న ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ జనగర్జన)

మరిన్ని వార్తలు