న్యాయం జరగడమే కాదు, కనిపించాలి

24 Dec, 2020 00:01 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయవ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధుల్లోకి చొచ్చుకుని వస్తోందని తరచూ విమర్శల పాలవుతుండటం విచారకరం. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్ల విచారణలో ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరుగుతున్నదని వ్యాఖ్యానించడం, దానిపై ఆదేశాలు జారీచేస్తామనడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. చాలా కాలంగా అలాంటి విమర్శలు వస్తున్నా మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఈ స్థితిలో సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. 

ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో న్యాయవ్యవస్థ ఒకటి. రాజ్యాంగం ప్రకారం శాసనాలపై వ్యాఖ్యానించి వాటి రాజ్యాంగబద్ధతను తేల్చడం, ప్రభుత్వాల చర్యలు సరిగా వున్నాయో లేదో చూడటం న్యాయవ్యవస్థ ప్రధాన బాధ్యత. ఈ క్రమంలో రాజ్యవ్యవస్థకూ వ్యక్తులకూ మధ్య, వ్యక్తులకూ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకూ మధ్య ఏర్పడే వివిధ వివాదాలను నిష్పాక్షిక రీతిలో పరిష్కరించడం కూడా న్యాయవ్యవస్థ బాధ్యతే. న్యాయస్థానాలు స్వతంత్రంగా ఉండాలి. అంటే ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వేతర వ్యక్తుల అసందర్భ ప్రభావాలకు న్యాయస్థానాలు గురికాకూడదని అర్థం. 

తమ ముందున్న కేసులను నిష్పాక్షికంగా నిర్ణయించడం న్యాయమూర్తుల బాధ్యత కాబట్టి అంతకు మించిన ప్రాధాన్యత వారికి దేంట్లోనూ ఉండదు కనుక నిజమైన న్యాయమూర్తులు ప్రజాకర్షణపై దృష్టి పెట్టరు. ప్రజాకర్షణకోసం వెంపర్లాడేవారు వివాదాలపై నిష్పాక్షిక నిర్ణయాలు వెలువరించలేరు. ఈ కారణం వల్లే న్యాయమూర్తులు ఏ పరిస్థితుల్లోనూ, ఏరకమైన అనుమానాలకూ తావీయకుండా గొప్ప సూక్ష్మగ్రాహ్యతతో, సున్నితత్వంతో పని చేయాల్సి ఉంటుంది. న్యాయం చేయడం మాత్రమే కాదు, న్యాయం చేసినట్లు కనిపించాలి అని సుప్రసిద్ధ నానుడి కూడా ఉంది.

1924లో ఆర్‌ వర్సెస్‌ సెషన్స్‌ జస్టి్టస్‌కి సంబంధించిన ఒక ఇంగ్లిష్‌ కేసును ఉదహరిద్దాం. ఒక మోటార్‌ సైకిల్‌ చోదకుడు రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. అతడిపై విచారణ సాగి అంతిమంగా తనను దోషిగా ప్రకటించారు. తర్వాత ప్రతివాది దీనిపై ట్రయల్‌ కోర్టుకు వెళ్లినప్పుడు కింది కోర్టు తీర్పును కొట్టివేశారు. న్యాయమూర్తుల వద్ద పనిచేస్తున్న ఒక క్లర్కు ఒక న్యాయవాద సంస్థలో సభ్యుడుగా ఉండేవాడు. ఒక పౌర దావాలో ఈ క్లర్కుకూ, ఆ మోటారు సైకిలిస్టుకూ వివాదం నడిచింది. దాంతో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును క్లర్కు ప్రభావితం చేసి ఉంటాడనే అనుమానంతో ప్రతివాది పైకోర్టుకు వెళ్లాడు. కానీ న్యాయమూర్తులు అతడి అభ్యర్థనను తిరస్కరిస్తూ, ఆ క్లర్క్‌ ఈ కేసులో ఏరకంగానూ న్యాయమూర్తులను ప్రభావితం చేయలేదని చెప్పారు.

కానీ ఆ మోటారు సైకిలిస్టు పేర్కొన్న ఇతర అంశాలను ఎగువ కోర్టు ఆమోదించింది. అయితే అతడి అప్పీల్‌ని విచారించిన కింగ్స్‌ బెంచ్‌ అంతిమంగా ఇలా చెప్పింది. ‘నిస్సందేహంగా ఈ కేసు పూర్వాపరాలను చూసినట్లయితే క్లర్కు చాలా జాగ్రత్తగా ఈ కేసు విషయంలో దూరం పాటించాడని తెలుస్తోంది. అయితే అనేక కేసులు ఈ ఉదంతానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండదని సూచిస్తున్నాయి, ప్రాథమిక విషయం ఏమిటంటే, న్యాయం జరగడమే కాదు, నిస్సందేహంగా న్యాయం జరిగినట్లు కనిపించాలి కూడా.’ ఈ కేసు పూర్వాపరాలు స్పష్టంగా నిరూపిస్తున్నది ఏమిటంటే, న్యాయమూర్తులను క్లర్క్‌ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది అనే. ఈ పరిశీలనతోటే కింగ్స్‌ బెంచ్‌ కింది కోర్టు తీర్పును కొట్టిపడేసింది.

న్యాయ సోదరుల్లో ఒక సభ్యుడిగా, నేను న్యాయవ్యవస్థ శ్రేయస్సుకోసం తపిస్తాను, తీర్పు చెప్పే తన యంత్రాంగం ద్వారా ప్రజాస్వామిక సూత్రాలను ఎత్తిపట్టడంలో దానికి కీలక పాత్ర ఉండాలని కూడా కోరుకుంటాను. సంబంధిత ఆదేశాలను చదవకుండానే కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి న్యాయవ్యవస్థ వాస్తవంగా చొరబడిందని నేను చెప్పలేను కానీ న్యాయవ్యవస్థ ఆదేశాలపై ప్రజల స్పందనలను గురించి చెప్పగలను. కలవరం కలిగించే విషయం ఏమిటంటే, 2019 మధ్యలో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ తన నిర్ణయాధికారం ద్వారా కార్యనిర్వాహక వ్యవస్థ విధుల్లోకి ఉద్దేశపూర్వకంగా చొరబడుతున్నదని విమర్శలకు పాత్రమవుతుండటం దురదృష్టకరం. 

న్యాయవ్యవస్థ వస్తుగతంగా కాకుండా ఆత్మాశ్రయరీతిలో నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయం కలగడం దురదృష్టం.  ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రాథమికమైనది. కానీ మీడియా ఇప్పుడు వేరువేరు రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంటున్నందువల్ల, న్యాయస్థానాల నిర్ణయాలతో సహా ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులు బుద్ధిపూర్వకంగా గానీ అనుద్దేశంగా గానీ ఒక గ్రూప్‌లో పాపులర్‌ అవుతున్నారు. మరొక గ్రూపులో లేదా గ్రూపుల్లో చెడుగా ప్రచారానికి లోనవుతున్నారు. దీంతో ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకంగా న్యాయమూర్తులు ఒక గ్రూప్‌ లేదా కొన్ని గ్రూపులకోసం పనిచేస్తున్నారని ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లిపోతున్నాయి. ప్రజల్లో ఏ వర్గంలోనూ న్యాయమూర్తులు ప్రాచుర్యం పొందకూడదన్న భావనకు ఇది సన్నిహితంగా లేదు.

యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 10 మంది కరోనారోగుల మృతికి కారణమైనట్లు ఆరోపణలకు గురైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కేసులో దాని యజమాని డాక్టర్‌ రమేష్‌ అరెస్టు, విచారణ ప్రక్రియపై స్టే ఆదేశాలు ఇవ్వడం కానీ, అమరావతి అసైన్డ్‌ భూముల లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన ఎమ్మార్వో సుధీర్‌ బాబు కేసులో విచారణను ఏపీ హైకోర్టు నిలిపివేయడం కానీ ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ అంశాల్లో హైకోర్టు సరైన రీతిలో వ్యవహరించలేదని విమర్శలు బయలుదేరాయి. తదనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు ఆదేశాల పట్ల అసంతృప్తిని ప్రకటించింది. క్రిమినల్‌ కేసుల దర్యాప్తులో కోర్టులు జోక్యం చేసుకోకూడదని భావిస్తూ సుప్రీంకోర్టు అవసరమైన ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ హైకోర్టుపై విమర్శలకు బలాన్ని చేకూర్చినట్లయింది. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌పై మరో పదిమంది ఇతరులపై భూకుంభకోణానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని మీడియాలో ప్రచురించకుండా హైకోర్టు నిషేధ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, ఈ కేసును దర్యాప్తుపై స్టే విధించినప్పుడు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

విశాఖపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ బాబు పట్ల పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణపై సీబీఐ విచారణకు ఆదేశించడం, ఇజ్రాయెల్‌ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కాంట్రాక్టును తన కుమారుడి కంపెనీకి కట్టబెట్టిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సమర్థిస్తూ కేంద్ర ట్రిబ్యునల్‌ తీర్పును సైతం పక్కనబెట్టడమే కాకుండా అతడికి వేతనం బకాయిలను కూడా చెల్లించాలని ఆదేశించినప్పుడు ఏపీ హైకోర్టు తీవ్ర విమర్శల పాలైంది. హైకోర్టు ఆదేశాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టిపడేయటమే కాకుండా కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ, అతడి సస్పెన్షన్‌ కొనసాగింపునకు ఆదేశాలిచ్చింది కూడా. ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం, పేదలకు ఇళ్లపట్టాలివ్వడానికి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడం వంటి అంశాలపై ఏపీ హైకోర్టు విమర్శలను ఎదుర్కొంది.

పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నత జరిగిందంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించడంపై కనీవినీ ఎరుగని విమర్శలొచ్చాయి. హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయనీ, ఇలాంటి ఆదేశాలు ఎన్నడూ చూసి ఎరగమనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టుపై, ఇలాంటి ఆదేశాలిచ్చిన న్యాయమూర్తిపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిపోయాయి.

సొంత అభిప్రాయాలు చొప్పించకుండా, నిష్పాక్షికంగా నిర్ణయాలు ప్రకటించాల్సిన న్యాయమూర్తులు ఇలాంటి విమర్శలకు ఎందుకు అవకాశమిస్తున్నారు? ఏదైనా కేసులో న్యాయమూర్తి నిర్ణయంపై తగుమాత్రం అనుమానం వచ్చినా సంబంధిత కేసులో నిజమైన న్యాయమూర్తి పాలు పంచుకోకూడదు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలి అనే సూత్రాన్ని కోర్టులు విధిగా పాటించాల్సి ఉంది. చాలా కాలంగా అలాంటి విమర్శలకు గురవుతున్నప్పుడు మంచి వాతావరణం నెలకొల్పే దిశగా ఏపీ హైకోర్టు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇలాంటప్పుడు సగటు మనిషి ఎలా స్పందించగలడో ఎవరైనా సులభంగా ఊహించగలరు. అలాంటి విమర్శకు కోర్టులు తావు కల్పించవని ఆశిద్దాం. అలాంటి విమర్శలు భవిష్యత్తులో ఎదుర్కోకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి, కోర్టుల పట్ల ప్రజల గౌరవం కొనసాగేలా చూడాలి.

జస్టిస్‌ గురిజాల కృష్ణమోహన్‌ రెడ్డి 
వ్యాసకర్త, రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు