టీ కప్పులో దౌత్యపు తుపాను

15 Sep, 2022 08:19 IST|Sakshi

దౌత్య రంగంలో చిన్న ఘటన కూడా ఎంత సంక్షోభానికి దారితీయగలదో రుజువు చేసే ఘట్టమిది. కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సదస్సు 1983లో ఢిల్లీలో జరిగింది. ఆ సందర్భంలోనే మదర్‌ థెరెసాకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ను రాష్ట్రపతి భవన్‌లో అందించాలని బ్రిటిష్‌ రాణి రెండో ఎలిజబెత్‌ కార్యక్రమం ‘నిర్ణయమైంది’. ఈ విషయంలో ప్రధాని ఇందిరాగాంధీ సంతోషంగా లేరు. భారత రాష్ట్రపతి తప్ప మరెవరూ రాష్ట్రపతి భవన్‌లో అధికారిక కార్యక్రమం నిర్వహించకూడదు. దీన్ని లోక్‌సభలో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. మీడియా దుమ్మెత్తిపోస్తుంది. ఆ సమయంలో ఇందిర సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. అటువైపున్న శక్తిమంతమైన మహిళలూ అలాగే స్పందించడంతో పెద్ద దౌత్య సంక్షోభం ‘టీ’ కప్పులో తుపానులా సమసిపోయింది.

కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సదస్సు న్యూఢిల్లీలో 1983 నవంబర్‌లో జరిగింది. ఈ భేటీకి ప్రధాన సమన్వయ కర్తగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ నన్ను నియ మించారు. కామన్వెల్త్‌ అధినేతగా బ్రిటిష్‌ రాణి రెండో ఎలిజబెత్‌ ఈ సందర్భంగా న్యూఢిల్లీకి విచ్చేశారు. భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌తో పాటు ఆమె రాష్ట్రపతి భవన్‌లో విడిది చేశారు. అయిదేళ్ల పదవీకాలం పూర్తయిన సర్‌ సానీ రాంఫల్‌ (గయానా రాజకీయ నాయకుడు) స్థానంలో కామన్‌ వెల్త్‌కు నూతన సెక్రటరీ జనరల్‌ను ఎన్నుకోవడం అనేది ఎజెండాలో తొలి అంశం. రాంఫల్‌ మరో అయిదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాలని ఇందిరాగాంధీ కోరుకున్నారు. కానీ బ్రిటన్‌ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ దానికి సుముఖంగా లేరు. ఇందిర ఆ సమావేశానికి చైర్మన్‌గా ఉండేవారు. దాంతో ఆమె తన పలుకుబడిని ఉపయోగించి, రాంఫల్‌ రెండో దఫా పదవిలో కొనసాగేలా చేశారు.

ఆ సందర్భంగా కామన్వెల్త్‌ సదస్సు వెలుపల ఒక చిన్న సంక్షోభం వచ్చినట్లే వచ్చి పక్కకు తప్పుకుంది. నాకు గుర్తున్నంత వరకూ అది సదస్సు రెండో రోజు. మదర్‌ థెరెసాకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ను ఇవ్వడానికి రాష్ట్రపతి భవన్‌లో కార్యక్రమం నిర్వహిస్తున్నారా అని రాష్ట్రపతి భవన్‌ అధికారులను నెమ్మదిగా అడిగి కనుక్కోమని ప్రధాని ఇందిర నాకు చెప్పారు. ప్రధానమంత్రి విన్నది నిజమేనని రాష్ట్రపతి భవన్‌ అధికారులు నిర్ధారించారు. ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రదాన కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు జారీ చేశారు. దానికి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ స్టేషనరీని వాడారు. నాటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌ సింగ్‌ కార్యదర్శిని లేదా సైనిక కార్యదర్శిని సంప్రదించకుండానే ఆ పని చేసేశారు. నేను ఈ విషయాన్ని ఇందిరాగాంధీకి చేరవేశాను. తాను విన్నదాంతో ఆమె సంతోషంగా లేరు. 

ఈలోగా ఎంపీ హెచ్‌ఎన్‌ బహుగుణ ప్రధానికి ఉత్తరం పంపారు. రాష్ట్రపతి భవనలో మదర్‌ థెరెసాకు బ్రిటిష్‌ రాణి అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్లు తనకు తెలిసిందన్నది ఆ లేఖ సారాంశం. అయితే తాను విన్నది నిజం కాదని భావిస్తున్నట్లు ఆయన ముక్తా యించారు. భారత్‌లో రాష్ట్రపతి మాత్రమే ఆయన ఆధికారిక భవ నంలో పురస్కార కార్యక్రమం నిర్వహించగలరు. ఒకవేళ బ్రిటిష్‌ రాణి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికే ముందుకు వెళ్లినట్లయితే తానూ, ఇతర ప్రతిపక్ష నేతలూ కలిసి ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తాల్సి ఉంటుందని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొన్నారు.

బహుగుణ చెప్పింది నిజం. బ్రిటిష్‌ రాణి సిబ్బంది తెలీకుండా తప్పు చేశారు. ఆ తప్పును తప్పకుండా సవరించాల్సి ఉంది. చోగమ్‌ (కామన్వెల్త్‌ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల సదస్సు) ప్రధాన సమన్వయకర్తగా, కనీవినీ ఎరుగని అసాధారణమైన ప్రోటోకాల్‌ ఉల్లంఘనతో నేను వ్యవహరించాల్సి వచ్చింది.

నాటి బ్రిటన్‌ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌కు ఈ విషయం తెలియజేసి ఆమె ఏం చెబుతారో తన దృష్టికి తీసుకురావాలని ఇందిరా గాంధీ నన్ను కోరారు. ఆనాడు భారత్‌లో అధికార బాధ్యతల్లో ఉన్న బ్రిటిష్‌ హై కమిషనర్‌ ఒక విజయవంతమైన, నిపుణుడైన దౌత్యవేత్త. రాష్ట్రపతి భవన్‌లో అలాంటి పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించకూడదని థాచర్‌కూ, బ్రిటిష్‌ రాణికీ ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా నేను బ్రిటిష్‌ హైకమిషనర్‌ను కోరాను. భారత్‌లోని బ్రిటన్‌ హైకమిషన్‌లో లేదా బ్రిటిష్‌ కమిషనర్‌ నివాసంలో ఆ అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని నేను తెలియజేశాను. బ్రిటిష్‌ రాణి అంటే మాకు అపారమైన గౌరవం ఉందనీ, ఇక మదర్‌ థెరీసా అయితే మా దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అనీ నేను ఆయనతో చెప్పాను. అదే సమయంలో ఈ విషయంలో మనం ముఖాముఖాలు చూసుకునే పరిస్థితి రాకూడదనీ వివరించాను.
బ్రిటిష్‌ హైకమిషనర్‌ నాకు రెండు గంటల్లో ఫోన్‌ చేశారు. రాణి తలపెట్టిన వేదికను మార్చడానికి కూడా సమయం దాటిపోయిందని నాకు చెప్పారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు పంచడం అయి పోయిందనీ, పైగా ఈ విషయం చెబితే రాణి చాలా ఇబ్బంది పడతారనీ ఆయన చెప్పారు. పైగా బ్రిటన్‌ ప్రెస్‌కు ఈ కార్యక్రమం గురించి తెలిసిపోయింది. ఇది నిజంగా చెడ్డవార్తే. మార్గరేట్‌ థాచర్‌ ప్రతిస్పందనను భారత ప్రధాని ఇందిరాగాంధీకి తెలియజేస్తానని నేను బ్రిటిష్‌ హైకమిషనర్‌కు చెప్పాను. అయితే ఒక విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. రాష్ట్రపతి భవన్‌లో అలాంటి అధికారిక పురస్కార ప్రదాన కార్యక్రమానికి మనం అంగీక రించ కూడదని ప్రధాని ఇందిరాగాంధీకి నేను సిఫార్సు చేస్తానని తేల్చి చెప్పాను. 

ఇక్కడ మాముందు అత్యంత ప్రమాదకరమైన ప్రొటో కాల్‌ మందుపాతర సిద్ధంగా ఉంది. నలుగురు ప్రపంచ ప్రముఖ మహిళల ముందు జరుగుతున్న నాటకీయ పరిణామం అది. ఇద్దరు శక్తిమంతులైన ప్రధానమంత్రులు, ఒక రాణి, మరొకరు సన్యాసిని కంటే ఎక్కువైన మహిళ. ఈ కథ గానీ బయటపడిందంటే భారత్‌ మీడియా ఏం చేస్తుంది? అది వెలిగించే పెద్ద భోగిమంటను తల్చుకుంటేనే వణుకు పుట్టింది.
తర్వాత బ్రిటిష్‌ ప్రధాని చెప్పిన మాటలను నేను ఇందిరాగాంధీకి నివేదించాను. ఇందిర ముఖంలో వెంటనే చిరాకును చూశాను. ఒక క్షణం అలాగే ఉండి, తర్వాత ఆమె గొప్ప నైపుణ్యంతో ఒక దౌత్యపరమైన గూగ్లి వేశారామె. ‘‘నట్వర్, థాచర్‌ వద్దకు వెళ్లి రాష్ట్రపతి భవన్‌లో బ్రిటిష్‌ రాణి ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని నా మాటగా చెప్పు. కానీ ఈ విషయాన్ని మరుసటి రోజు భారత పార్లమెంటులో తప్పకుండా లేవనెత్తుతారని ఆమెకు చెప్పు. దీనిపై తప్పకుండా విమర్శలు  చెలరేగుతాయి. పైగా రాణి పేరును కూడా దీంట్లోకి లాగుతారు. బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది.’’

నిజంగానే ఒక అద్భుతమైన ప్రతిస్పందన అటువైపు నుంచి వెంటనే వచ్చింది. రాష్ట్రపతి భవనలో మదర్‌ థెరెసాకు అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనేలేదు. మదర్‌ థెరెసాను ఎలిజబెత్‌ రాణి ఉద్యాన వనంలో తేనీటి విందుకు ఆహ్వానించారు. అక్కడే ఆమె నోబెల్‌ గ్రహీత అయిన మదర్‌ థెరెసాకు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రదానం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్‌లోనే నిర్వహించి ఉంటే దౌత్యపరంగా ఎంత కల్లోలం చోటు చేసుకునేదో మదర్‌ థెరెసాకు అయితే అసలు తెలిసేది కాదు. 

చివరకు ఈ సమస్య పరిష్కారమైన తీరు నన్ను కూడా వ్యకిగతంగా ఎంతో సంతోషపెట్టింది. ఆ తర్వాత కామన్వెల్త్‌ దేశాధి నేతల సదస్సు ముగింపు సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని మార్గరేట్‌ థాచర్‌ నన్ను ప్రశంసిస్తున్నట్టుగా సైగ చేశారు. భారత్‌ పర్యటనను ముగించుకుని బ్రిటన్‌ వెళ్లిపోయేముందు ఎలిజబెత్‌ రాణి నన్ను పిలిచారు. నా పట్ల ఆమె ఎంతో దయతో వ్యవహరించారు. మరింకె వరికీ అది దక్కి ఉండదనిపించింది. అంతే కాకుండా నాకు ఆమె ఒక రాచ బహుమతిని కూడా ప్రసాదించారు.


కె. నట్వర్‌ సింగ్‌, వ్యాసకర్త మాజీ విదేశాంగమంత్రి
(‘ఫస్ట్‌ ఇండియా’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు