పునర్విభజనలో దక్షిణాది స్థానమేంటి?

21 Jan, 2022 00:49 IST|Sakshi

పార్లమెంటులో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని తొలగించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ని ఏర్పర్చడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు సంబంధించి అత్యుత్తమ ప్రగతి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో మరింత మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షిణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పార్లమెంటరీ నియోజకవర్గాల హద్దులను మార్చే ప్రక్రియే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ. ఈ ప్రక్రియకు సుదీర్ఘంగా అయిదేళ్ల సమయం పడుతుంది. సాధారణంగా జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడ తారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండేలా చేయడమే దీని లక్ష్యం. భారతదేశం తదుపరి జగగణనకు సిద్ధమవుతున్నందువల్ల, నియోజకవర్గాల పునర్విభజన క్రమం పలుచోట్ల నిరసనలకు కారణమవుతోంది. దేశంలోని ప్రాంతా లమధ్య వ్యత్యాసాలు ప్రబలుతున్న నేపథ్యంలో దీనిపై చర్చకు ఇదే సరైన సమయంగా పరిగణించాల్సి ఉంది.

పునర్విభజన ప్రక్రియ ఉత్తరాదికే అనుకూలం
జనాభా నమూనాలపై ఆధారపడి, పార్లమెంటరీ నియోజకవర్గాలను రాష్ట్రాల వారీగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత విధానం ఉత్తరప్రదేశ్‌ వంటి అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు అత్యంత అనుకూలంగా ఉంటోందన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్‌లో 80 లోక్‌సభా స్థానాలు ఉండగా, బిహార్‌లో 40 ఎంపీ స్థానాలు, తమిళనాడులో 39 స్థానాలున్నాయి. ఇక విభజనానంతరం ఆంధ్రప్రదేశ్‌కు 25 ఎంపీ స్థానాలు దక్కాయి. కర్ణాటకలో 28 పార్లమెంటు స్థానాలుంటున్నాయి. తాజాగా నియోజక వర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో, ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశం ఎక్కువగా నష్టపోయే అవ కాశాలున్నాయి. ఎందుకంటే అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పురోగతి కాస్తా తగ్గుముఖం పడుతోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో ఇపుడున్న పార్లమెంటరీ స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశముంది. అదే సమయంలో జనాభా సంఖ్య అధిక మవుతున్న ఉత్తరాది రాష్ట్రాలు ఎంపీ సీట్ల విషయంలో ఇంకా పైచేయి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ల ప్రాతినిధ్యానికి ప్రజల సంఖ్య మాత్రమే గీటురాయిగా ఉండాలా లేదా వారి నాణ్యతకు కూడా ప్రాధా న్యత ఉండాలా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.

వాస్తవానికి 2000 సంవత్సరం తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికపరంగా నాటకీయ స్థాయిలో ఎంతగానో పురోగమించాయని మనందరికీ తెలుసు. ఆదాయం, పేదరికం వంటి అనేక ప్రమాణాల్లో ఉత్తరాది రాష్ట్రాలు 1960ల ప్రారంభంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉండేవి. అయితే 1990ల ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత ఇటీవలి కాలంలో దక్షిణ భారత రాష్ట్రాలు బాగా పుంజుకున్నాయి. 

పురోగతిలో దక్షిణాది విజృంభణ
కర్ణాటక, కేరళ, తమిళనాడు మూడు రాష్ట్రాల స్థూలదేశీయ ఉత్పత్తిని కలిపి చూస్తే 13 తూర్పు రాష్ట్రాల ఆదాయం కంటే ఎక్కువగా ఉంటోం దని ఇటీవలే ఒక కథనం వెల్లడించింది. ఆదాయపరంగా ఈ విభజ నకు... ఇటీవలి కాలంలో దక్షిణ భారతదేశం ఎంతో మెరుగ్గా పురోగతి సాధించడం కూడా తోడైంది. మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగ రూకత వంటి అనేక అంశాలు దక్షిణాదిని ముందువరసలోకి నెట్టాయి. ఇప్పుడు మనం రాష్ట్రాల జనాభా, వాటి మానవ సామర్థ్యాలు, నైపుణ్యాలు, జాగరూకత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారిద్దాం. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.

విద్యా ఫలితాలు, పాఠశాలలకు హాజరవుతున్న పిల్లల శాతం, పలు గ్రేడ్లకు సంబంధించి వీరిలోని గ్రహణ శక్తి సామర్థ్యాలను పరిశీలించి చూస్తే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది కంటే ఎంతో మెరుగ్గా ఉంటున్నాయని గత కొంతకాలంగా వెలువడుతున్న వార్షిక విద్యా స్థితిగతుల నివేదికలు పదేపదే చెబుతున్నాయి. అయితే తరగతి గదిలో మౌలిక సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాం వంటి అంశాలపై పెడుతున్న ఖర్చు విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు గతంలో దక్షిణాది కంటే ఎంతో మెరుగ్గా ఉండేవి. 
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టభద్రుల అధిక నిష్పత్తి అనేది, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల విషయంలో ఎంతో ముందంజ సాధించింది. ఉదాహరణకు, 2011లో ఉత్తరప్రదేశ్‌ జనాభాలో 5 శాతం మాత్రమే పట్టభద్రులుండేవారు. తమిళనాడులో మాత్రం 8 శాతం మంది పట్టభద్రులు నమోదయ్యారు.

నిర్ణయాలు తీసుకునే క్రమంలో చక్కటి ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కోవిడ్‌–19 మహమ్మారి ప్రపంచం ముందు చక్కగా ప్రదర్శించింది. కరోనా మహమ్మారి వివిధ దశల్లో విజృంభి స్తున్న సమయంలో దక్షిణాది రాష్ట్రాలు వైరస్‌ పరీక్షలో ముందు వరసలో నిలిచాయి. 2021 డిసెంబర్‌ నాటికి తమిళనాడులో 7 కోట్ల 80 లక్షల మంది జనాభాకు గానూ 314 కరోనా వైరస్‌ పరీక్షా కేంద్రా లను నెలకొల్పారు. కానీ 23 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో 305 కోవిడ్‌ పరీక్షా కేంద్రాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్ర అవసరాలకు ఇవి ఏమాత్రం సరిపోవు.

నిస్సందేహంగా, ఆరోగ్య సౌకర్యాలు, సాధిస్తున్న ఉత్తమ ఫలితాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజానీకం ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నారు. కోవిడ్‌–19 వల్ల ఆయుర్దాయం కాస్త తగ్గిపోయి నప్పటికీ, 2021లో దక్షిణాదిలో ప్రతి మనిషీ సగటున 73.2 సంవత్స రాలు జీవిస్తుండగా (1971లో ఇది 51.6 సంవత్సరాలు మాత్రమే), ఉత్తరాదిలో సగటు ఆయుర్దాయం 69 సంవత్సరాలకే పరిమితమైంది (1971లో ఇది 47 సంవత్సరాలుగా ఉండేది).

సమర్థ పాలన
దక్షిణాది రాష్ట్రాలు విద్యా, ఆరోగ్య ఫలితాల్లో మెరుగ్గా ఉంటున్నా యంటే... విషయ గ్రహణలో, నిర్ణయాలను తీసుకోవడంలో నాణ్యత ప్రదర్శించడంతో ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అర్థం. దక్షి ణాదిలో విద్యావంతులైన పౌరులు తమకు అవసరమైన  మెరుగైన సౌకర్యాల విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. పౌరుల చైతన్యం, కార్యాచరణ ఈ రీజియన్‌లో చాలా ఎక్కువ. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లోని ఓటర్లు ఉత్తరాది ఓటర్లతో పోలిస్తే మెరుగైన పాలనను అందించే ప్రభుత్వాలనే ఎన్నుకుంటూ ఉంటారు. 1960 లలో ఇలాంటి పోలికకు తావుండేది కాదు. కానీ 1970ల తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పదవీ కాలం ఉత్తరాదితో పోలిస్తే దీర్ఘకాలం కొనసాగడాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు.

విద్య, ఆరోగ్యం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అధిక ఆర్థిక పురోగతి వంటి అంశాల్లో ఓటర్ల నాణ్యతను నియోజకవర్గాల పునర్వి భజనలో పరిగణనలోకి తీసుకోరా? నియోజక వర్గాల పునర్విభజన సమయంలో ఉత్తరాది రాష్ట్రాల రాజకీయాధికారానికీ, దక్షిణాది రాష్ట్రా లలోని ఆర్థిక బలసంపన్నతకూ మధ్య వైరుధ్యం ప్రబలం కానుంది. అంతిమంగా దక్షిణాది రాష్ట్రాలు సాధించిన ఆర్థిక పురోగతి శక్తి ఉత్త రాది రాష్ట్రాల రాజకీయ బలాన్ని తోసి రాజనవచ్చు కూడా. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లోని మానవ నైపుణ్యాలు, సామర్థ్యాల రీత్యా వారికి పార్లమెంటులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉండే దక్షి ణాది ప్రాతినిధ్యం వల్ల యావద్దేశం మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందనడంలో సందేహమే లేదు.

ఉత్తర భారతదేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే, అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాదికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పటికే రాష్ట్రాల మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక శక్తుల మధ్య ఘర్షణ వాతావరణం పొడసూపుతుండటం మనకు తెలుసు. ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపులకు సంబంధించి ఇప్పటికే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అత్యంత సున్నితంగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.
– కళా సీతారాం శ్రీధర్‌
ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ ఎకనమిక్‌ ఛేంజ్‌
 

మరిన్ని వార్తలు