సమున్నత స్త్రీవాద ఉద్యమ శిఖరం

3 Oct, 2021 00:52 IST|Sakshi
కమలా భాసిన్‌

నివాళి 

సెప్టెంబర్‌ 25న ఢిల్లీలో కన్నుమూసిన కమలా భాసిన్‌ రాజీపడని, అలుపెరగని మహిళా ఉద్యమకారిణి, అద్భుతమైన వక్త. గాయని, రచయిత్రి, ఆర్గనైజర్‌. భారతదేశంలోనూ, దక్షిణాసియా వ్యాప్తంగా మహిళా ఉద్యమంపై విశిష్టమైన ముద్రను వదలిపెట్టి వెళ్లారు. స్త్రీవాద సిద్ధాంతానికి విభిన్నంగా ఆలోచించేవారిపై కూడా ఆమె తనదైన ప్రభావం చూపారు. పంజాబ్‌లోని షహీదన్వాలి గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) 1946లో పుట్టిన కమలా భాసిన్‌ రాజస్తాన్‌లో పెరిగారు. రాజస్తాన్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తి చదివాక జర్మనీలో సోషియాలజీని అధ్యయనం చేశారు.

1972లో దేశానికి తిరిగొచ్చిన కమల ఉదయ్‌పూర్‌ కేంద్రంగా పనిచేసే వాలంటరీ సంస్థ సేవామందిర్‌లో చేరారు. గ్రామీణ, పట్టణ పేదలను స్వీయాభివృద్ధి వైపు కదిలించే లక్ష్యంతో పనిచేసే సంస్థ ఇది. ఆ రోజునుంచి 2021 సెప్టెంబర్‌ 25న కేన్సర్‌ వ్యాధితో అంతిమ శ్వాస వదిలేంతవరకు ఆమె జీవితాంతం జెండర్, అభివృద్ధి, శాంతి, అస్తిత్వ రాజకీయాలు, సైనికీకరణ, మానవ హక్కుల, ప్రజాస్వామ్యం వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై నిమగ్నమవుతూ వచ్చారు.

కమలా భాసిన్‌ని నేను 1990లో తొలిసారిగా కలిశాను. అప్పుడు నా వయస్సు పాతికేళ్లు. ఢిల్లీకి నేను కొత్త. మహిళా ఉద్యమంపై నా పీహెచ్‌డీ పరిశోధనను పూర్తి చేయాలనుకుంటున్న సమయం. ఎవరిని ప్రశ్నించినా సరే తరచుగా వారందరూ పేర్కొనే పేరు కమలా భాసిన్‌. విరామమెరుగని ఫెమినిస్టుగా, 1970లలో మహిళా ఉద్యమాల క్రమంలో చాలా తరచుగా వినిపించిన పేరు ఆమెది. పితృస్వామ్య భావజాలాన్ని అత్యంత పదునైన స్వరంతో అపహాస్యం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరు.

ఆమెను నేను కలిసిన సమయానికే, కమల రెండు దశాబ్దాలుగా మహిళా ఉద్యమ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. వరకట్నం, అత్యాచారం (మధుర రేప్‌ కేసు నేపథ్యంలో), గృహ హింసకు వ్యతిరేకంగా మహిళా బృందాలు తమదైన నిరసనతో వీధుల్లోకి వస్తున్నప్పుడు ఈ అన్ని క్యాంపెయిన్‌లలో ఆమె అంతర్భాగమై ఉండేవారు. ‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’ అనే ఫెమినిస్టు నినాదం నాటి నిరసన ప్రదర్శనల్లో మారుమోగేది.

ఈ నేపథ్యంలోనే ఇండియా గేట్‌ వద్ద జరిగిన ఒక మహిళా ప్రదర్శనలో ఆమెను కలిశాను. ఆరోజుల్లో ఆక్కడ నిరసనలకు అనుమతించేవారు. ఒక పెద్ద చీరపై మహిళల హక్కుల నినాదాలను చిత్రించిన బ్యానర్‌ని కార్యకర్తలు పట్టుకునేవారు. శరీర రాజకీయాలపై ఒక సామూహిక ప్రకటన చేయడానికి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా మహిళల శరీరాలను ఒక చీరపై చిత్రించడం చూసి ఆశ్చర్యపోయాను. అనేకమంది మహిళలకు లాగే ఆ రోజు కమలను చూసి నేను కూడా ప్రేమలో పడిపోయాను. ‘ప్రేమలో పైకి ఎదగండి, ఓడిపోవద్దు’ అని కమల ఎల్లప్పుడూ మాకు ప్రబోధించేవారు.

ఆ ప్రదర్శన ముగిశాక, కమల నన్ను ‘జాగోరి’కి పంపారు. జాగోరి అనేది మహిళా ఉద్యమంలో భాగమైన మరో ఆరుగురు మహిళలతో కలిసి 1984లో ఆమె స్థాపించిన మహిళా కలెక్టివ్‌. గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు మహిళా చైతన్యాన్ని తీసుకెళ్లి సిద్ధాంతాన్ని, కార్యాచరణను ఒకచోటికి చేర్చడంలో నిమగ్నమైన సంస్థ జాగోరి. మల్టీమీడియా కమ్యూనికేషన్‌ అనే పదం ఇంకా వ్యాప్తిలోకి రాకముందే ఫెమినిస్టు భావాలను పాటలు, సంగీతం, కవిత్వం, పోస్టర్లు, ఫెమినిస్టు థీమ్‌తో కూడిన డైరీల ద్వారా ప్రచారం చేసి విస్తృతంగా శ్రోతలను ఆకట్టుకోవడంలో జాగోరి సంస్థ గొప్ప విజయం సాధించింది.

అది అత్యంత కష్టభరితమైన సమయం. భన్వరీదేవి అత్యాచారం కేసు 1992లో ఢిల్లీ, రాజస్తాన్‌కి చెందిన అనేక మహిళా బృందాలను ఏకం చేసింది. భన్వరీదేవికి న్యాయం చేయాలంటూ ఈ మహిళా బృందాలు చేసిన విస్తృత ప్రచారం కారణంగా 1997లో పనిస్థలాల్లో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకురావడానికి దారితీసింది. ఆ సమయంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమలా భాసిన్‌ రోడ్డు మధ్యలోని ట్రాఫిక్‌ పోలీసు బూత్‌పైకి ఎక్కి ‘నా సోదరీమణులు స్వేచ్ఛ కోరుకుంటున్నారు’ అంటూ గొంతెత్తి చేసిన నినాదం ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఈ నినాదాన్ని పాకిస్తాన్‌ ఫెమినిస్టుల నుంచి తీసుకున్న కమల దాన్ని ఫెమినిస్టు ఉద్యమ గీతంగా మార్చింది. అది ఈనాటికీ మహిళా ఉద్యమాలకు బలమైన నినాదంగా కొనసాగుతోంది.

ప్రజలతో, వారి భిన్నాభిప్రాయాలతో దాపరికం లేకుండా వ్యవహరించడం కమల విశిష్ట గుణాల్లో ఒకటి. ఎవరు చెప్పినా ముందు ఆమె శ్రద్ధగా వినేవారు. ప్రజల నుంచి నేర్చుకోవడానికి ఆమె సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఒకసారి రాత్రి 10 గంటల సమయంలో నా కుమార్తెను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుండగా కమల నాకు కాల్‌ చేశారు. ముందుగా నా  కూతురే ఫోన్‌ తీసుకుని ‘మా అమ్మతో మాట్లాడే సమయం ఇది కాదు’ అనేసింది. నేను వెంటనే ఫోన్‌ లాక్కుని కమలకు క్షమాపణ చెప్పాను. కానీ ‘నీ కూతురు మాట్లాడిందే సరైనది’ అంటూ కమల నాకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత రాత్రిపూట ఆమె నాకు ఎన్నడూ ఫోన్‌ చేయలేదు.

దేశదేశాల్లో ఆమెను ఎరిగిన వ్యక్తులు, ఉద్యమ కార్యకర్తలు సైతం ఆమెను తమలో ఒకరిగా భావించేవారు. దక్షిణాసియాలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆమె ప్రగాఢంగా కోరుకునేవారు. అద్భుతమైన వక్తగా, భావ ప్రచారకర్తగా వెలిగిన కమల ఎనిమిది పిల్లల పుస్తకాలతో సహా 35 పుస్తకాలు రచించారు. స్త్రీవాదం, పితృస్వామ్యంపై ఆమె రాసిన పుస్తకాలు విస్తృతంగా ప్రచారానికి నోచుకున్నాయి. అతి సాధారణమైన భాషలో సైద్ధాం తిక భావనలను రాయడంలో ఆమె ఆరితేరారు. విజిల్‌ వేయడం ఆమె ట్రేడ్‌ మార్క్‌. ఈ ఒక్కటి మాత్రం ఎంత ప్రయత్నించినా మేం నేర్చుకోలేకపోయాం. మానవ మాత్రురాలిగా కమల తప్పిదాలకు అతీతం కాదు. కానీ తాను తప్పులు చేశానని ఒప్పుకునే అరుదైన గుణం ఆమెకి ఉంది. స్నేహాల్ని కొనసాగించడం ఆమె జీవితంలో కేంద్రబిందువు.

కమల సృజనకు హద్దుల్లేవు. ఫెమినిస్టు వర్క్‌షాపుల్లో ఆమె 200 పాటలు రాశారు. భారత్‌లోనే కాకుండా దక్షిణాసియా వ్యాప్తంగా అనేక నిరసన ప్రదర్శనల్లో వాటిని ఆమె పాడింది. కనీసం పది భాషల్లోకి ఆమె పాటలు అనువదించారు. ‘బంధనాలను తెంచుకుని సోదరీమణులు వచ్చారు’ అనే ఆమె పాట విన్నప్పుడల్లా మహిళలుగా మేం చేస్తున్న ప్రయాణంలో అన్ని రకాల సాంప్రదాయాలను, శృంఖలాలను నిజంగానే తెంచుకున్నట్లు భావించేవాళ్లం. అందుకే సెప్టెంబర్‌ 25న ఆమె అంత్యక్రియల సందర్భంగా ఆమె పాటనే కాకుండా అనేక ఫెమినిస్టు గీతాలనూ పాడి ఆమెకు నిజమైన నివాళిని అర్పించాము.


కల్పనా విశ్వనాథ్‌
వ్యాసకర్త సేఫ్టీపిన్‌ సీఈఓ, స్త్రీవాద ఉద్యమకారిణి

మరిన్ని వార్తలు