Delhi Horror: మహిళలు రోడ్డెక్కాలంటే భయం.. 90 శాతం ప్రమాదాలు దాని వల్లే:

7 Jan, 2023 07:52 IST|Sakshi

జనవరి 1 తొలి క్షణాల్లోనే దేశ రాజధానిలో ఒక యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల దూరం లాక్కుపోయిన ఘటన 2023 సంవత్సరానికి భయానక మైన ప్రారంభాన్ని ఇచ్చింది. రహదారి భద్రత భారతదేశంలో అతిపెద్ద సమస్య. రోడ్డుపై సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 90 శాతం అతివేగం, ఓవర్‌ టేకింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్‌ వల్లే జరుగుతున్నాయి.

ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 20 అగ్రశ్రేణి దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది. వీటికి అదనంగా చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక దాడి భయం మహిళలను వెంటాడుతుంటుంది. మహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవమైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి.

జనవరి 1న ఐదుగురు పురుషులు ఉన్న కారు ఒక యువతి బైక్‌ని ఢీకొట్టి పలు కిలోమీటర్ల దూరం ఆమెను లాక్కునిపోయిన ఘోరమైన ఉదంతం, 2023 సంవత్సరానికి భయానకమైన ప్రారంభాన్ని ఇచ్చింది. ఈ ఘటనలో ప్రమాదకరమైన అనేక అంశాలు దాగి ఉన్నాయి. మొదటగా, వారు ఒక అమ్మాయిని తమ కారుతో 4 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లి పోతున్నామనే స్పృహ కూడా లేనంత పూటుగా తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. లేదా వారు స్పృహలో ఉండి ఉండవచ్చు కూడా.

రెండు.. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న యువతిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌ ఆమెకు సహాయం చేయాలని కూడా భావించలేదు. బదులుగా, అతడు చాలా వేగంగా కారు తోలాడు. ఒక వార్త ప్రకారం, కారులో ఉన్న వారు ఆ తర్వాత కారు ఆపి యువతి శరీరాన్ని కారు కిందనుంచి తొలగించి పారిపోయారు. ఈ విషయంలో వారు ఎలాంటి విచక్షణ, స్పందన లేకుండా వ్యవహరించారు. ఒక చావుకు కారణమయ్యామనే ఆలోచన కూడా వారికి లేదు. ఒక వ్యక్తిని కాపాడటం కంటే తమను తాము కాపాడుకోవడం గురించే వారు ఆందోళన చెందారు. అందుకే రోడ్డుమీదే ఆమెను చని పోయేలా చేసి వెళ్లిపోయారు.

దారినపోతున్న వారు పోలీసులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. వీధిలోని సీసీటీవీ కెమెరా ద్వారా కారును గుర్తించారు. పైగా, ఆ మహిళ రోడ్డుమీద వివస్త్రగా పడి ఉన్నందున, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉంటుందేమో ఆనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఆ యువతికి  20 సంవత్సరాలుంటాయి. తన పని ముగించుకుని ఆమె ఇంటికి వెళుతోంది. ఆమెకు ఎదురైన భయానకమైన మరణాన్ని, తద్వారా ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యుల దుఃస్థితిని తల్చుకోవాలంటే కూడా హృదయం బద్దలవుతోంది.

రహదారి భద్రత అతిపెద్ద సమస్య
రహదారి భద్రత భారతదేశంలో అతిపెద్ద సమస్య. దుర్బలమైనవారు మరింత ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. రోడ్డు పక్కన కూర్చుని లేదా నిద్రపోతున్నవారిని వేగంగా పోతున్న కార్లు ఢీకొని ప్రమాదాలకు గురిచేస్తున్న అనేక ఉదంతాలు ఉన్నాయి. కేవలం 2021లోనే 1.5 లక్షల మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారు. కొన్నేళ్లుగా ఇదే ధోరణి కొన సాగు తోంది.

నేషనల్‌ క్రైమ్స్‌ రికార్డ్‌ బ్యూరో గణాంకాల ప్రకారం, వీటిల్లో 1.9 శాతం మద్యం, మత్తు పదా ర్థాల ప్రభావంలో జరిగినవి. రోడ్డుపై సంభవి స్తున్న మరణాల్లో దాదాపు 90 శాతం అతివేగం, ఓవర్‌ టేకింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్‌ వల్లే జరుగుతున్నాయి. 2019 నుంచి ప్రపంచ బ్యాంకు డేటాను పరిశీలిస్తే, అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 20 అగ్రశ్రేణి దేశాల్లో ఇండియా తొలి స్థానంలో ఉంది.

చీకటిపడ్డాక బహిరంగ ప్రదేశాల్లో ప్రయాణి స్తున్నప్పుడు లైంగిక దాడికి సంబంధించిన భయం కూడా మహిళలను వెంటాడుతుంటుంది. ఈ ఉదం తంలో లైంగిక దాడి రుజువు కాకున్నప్పటికీ, అలాంటి దాడి జరిగే అవకాశం ఉందన్న వాస్తవం ఈ దేశంలోని ప్రతి మహిళకూ అదనపు ఆందోళ నను కలిగిస్తుంటుంది. జాతీయ మహిళా కమిషన్‌ ప్రత్యేకించి పేర్కొన్నట్లుగా, ఈ కోణాన్ని కూడా ఈ ఉదంతంలో పరిశీలించడం చాలా ముఖ్యం.

నగరాలు మహిళలకు అందిస్తున్న అవకా శాలు, వాటిని వారు దక్కించుకుంటున్న సామర్థ్యా లపై హింస గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఐక్యరాజ్యసమితి, ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ విమెన్‌’ పరిశోధన ప్రకారం నగరాల్లో మహిళలు అనేక రూపాల హింసకు, లైంగిక వేధిం పులకు గురవుతున్నారు. పెద్దగా అరిచి భయ పెట్టడం, దేహ భాగాలను గట్టిగా నొక్కడం, వెంబ డించడంతోపాటు, లైంగిక దాడి వంటి తీవ్ర నేరాలు కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజూ జరుగుతున్న ఈ హింస, వేధింపులు నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో మహిళల అనుభవాలను నిర్దేశిస్తున్నాయి.

నగరాల్లో మహిళల కదలికలను హింస, భయం అడ్డుకుంటున్నాయి. వీటికి పేలవ మైన ప్రజా రవాణా సేవలు తోడవుతున్నాయి. పనిచేయడం, తిరిగి రావడం విషయంలో కీలక వేళల్లో రవాణా ప్రణాళికలు సాధారణంగా పురు షుల ప్రయాణ నమూనాలపైనే దృష్టి పెడు తున్నాయి. మరోవైపు మహిళల ప్రయాణ నమూ నాలు వారి సంరక్షక పాత్రల దృష్ట్యా పురుషులతో పోలిస్తే తరచుగా విభిన్నంగా ఉంటున్నాయని మహిళల కదలికలపై ప్రపంచ బ్యాంక్‌ నివేదిక చెబుతోంది.

మహిళల ప్రయాణాల్లో 84 శాతం వరకు ప్రజా రవాణా ద్వారానే జరుగుతున్నాయని ఇదే నివేదిక తెలుపుతోంది. పనికి నడిచిపోవడాన్నే మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ విష యంలో మహిళల వాటా 45.4 శాతంగా ఉండగా, పురుషుల శాతం 27.4గా మాత్రమే ఉంటోంది. పైగా చాలామంది మహిళలు బస్సు ద్వారా ప్రయా ణిస్తున్నారు. తాము ప్రయాణిస్తున్నప్పుడు మహి ళలు స్థోమతను చూసుకుంటారని ఈ నివేదిక చెబుతోంది. ఖర్చు ఎక్కువయ్యే వేగ ప్రయాణాల కంటే ఖర్చు తక్కువగా ఉండే నిదాన ప్రయాణ సాధనాలనే వీరు ఎంపిక చేసుకుంటున్నారు.

రోడ్డు ప్రమాద బాధితుల్లో అధిక శాతం పురుషులేనని నివేదిక చెబుతోంది. అంటే మహిళలతో పోలిస్తే పురుషులు చాలా ఎక్కువగా బయట కెళ్లడానికి ఇష్ట పడుతుంటారనీ, సొంత బైక్‌ని కలిగి ఉంటారనీ, రాత్రిపూట ప్రయాణిస్తుంటారనీ ఇది ఎత్తి చూపు తోంది. మహిళల కదలికలపై ఆంక్షలు అనేవి పితృస్వామిక ఆచారాలు, సంరక్షక భారం నుంచి ఏర్పడుతున్నాయి. పైగా శ్రామిక శక్తిలో మహిళల స్వల్ప పాత్రపై ఇవి ప్రభావం చూపుతున్నాయి.

ప్రపంచంలోకెల్లా రోడ్డు ప్రమాదాల్లో అధిక మరణాలకు సంబంధించి భారతదేశం అత్యధిక రేటును కలిగి ఉంటోంది. బహిరంగ స్థలాల్లో మహిళలపై హింసకు సంబంధించిన అత్యధిక రేటు కూడా భారత్‌ సొంతమై ఉంది. మన వీధులు, రహదారులు అటు ప్రమాదాలు, ఇటు నేరాల నుంచి తప్పనిసరిగా సురక్షితంగా ఉండాలి. శర వేగంగా వెళ్లే కార్ల కంటే పాదచారుల సురక్షిత కదలి కలకు వీలిచ్చేలా వీధులను రూపొందించాలి.

ఇదే మన నగరాలను గణనీయంగా మారుస్తుంది. కార్లు అతివేగంగా దూసుకెళ్లేలా, మరిన్ని ఫ్లై ఓవర్లకు, ఓవర్‌ బ్రిడ్జిలకు, పెద్దగా వెలుతురు లేని రహదారు లకు దారులు తీస్తున్న మన ప్రస్తుత రహదారి ప్రణాళికలు పాదచారులు సులభంగా గాయాలకు, హింసకు లోనయ్యేలా రూపొందుతున్నాయి. రద్దీ గానూ, చక్కటి వెలుతురుతోనూ ఉంటూ మంచి పేవ్‌మెంట్లు, వీధుల్లో విక్రేతలు, షాపులు, నిఘా కెమెరాలతో కూడిన కెఫేలు తాము సురక్షితంగా ఉన్నామని మహిళలు భావించడానికి ఎంతో అను కూలంగా ఉంటాయని దేశవ్యాప్తంగా ‘సేఫ్టీపిన్‌’ సంస్థ ద్వారా జరిగిన భద్రతాపరమైన మదింపులు స్పష్టం చేస్తున్నాయి.

అదేవిధంగా, సైక్లింగ్‌ కోసం మౌలిక వసతుల కల్పన, ప్రజారవాణాను అందు బాటులోనూ, చౌకగానూ ఉంచడం వల్ల వీధుల్లో ట్రాఫిక్‌ తగ్గుతుంది. ఈ చర్యలు మన వీధులను సురక్షితంగానూ, అందుబాటులో ఉండేలా, ఎక్కువమందికి అనుకూలంగా మలుస్తాయి.


-కల్పనా విశ్వనాథ్‌, 
వ్యాసకర్త లింగ, నగరీకరణ నిపుణురాలు; ‘సేఫ్టీపిన్‌’ సీఈఓ
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు