అన్నదాతల ధర్మాగ్రహం

27 Dec, 2020 00:12 IST|Sakshi

సందర్భం

అన్నదాత సుఖీభవ అని ఒక రంటారు. రైతేరాజని మరొ కరంటారు. జై జవాన్‌ జై కిసాన్‌ అని స్వయానా మాజీ ప్రధానే అన్నారు. ఎవరేమన్నా ఈ దేశంలో ‘రైతు’ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. ఇంతకీ రైతంటే ఎవరు? వందలు, వేల ఎకరాల భూము లున్నవాడు రైతెలా అవుతాడు? అయితే గీయితే భూస్వామి అవుతాడు గానీ. భూమి దున్నే వాడు రైతు. చెమట చుక్కలతో మట్టిని తడిపేవాడు రైతు. రైతు అనేది ఓ కులం గాదు. పారిశ్రామిక విప్లవం కావచ్చు, కమ్యూనిస్ట్‌ తిరుగుబాటు కావచ్చు, ప్రపంచీకరణ భూత కార్పొరేటీకరణ కావచ్చు... రైతుకు ఒరగబెట్టిందేమీ లేదు. భూమితో విడదీయలేని బంధమున్న రైతన్న భూమి లేనివాడుగా మారుతున్నాడు.

ఇంతకీ నోట్లో నాలుక లేని అమాయకజీవి ఎందుకు ఢిల్లీ బాట పట్టాడు? ఎందుకోసం ధర్మాగ్రహంతో కళ్లెర్ర జేస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని,  వ్యవసాయ మార్కెట్లను కూడా కార్పొరేట్లకు అప్పగించి కోట్లాదిమంది రైతుల నోళ్లలో మట్టికొడుతోంది. ఏ పారిశ్రామికవేత్తయినా వస్తువుకు తానే ధర నిర్ణయిస్తాడు. కానీ రైతు పరిస్థితి కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అన్నట్టుగా ఉంది. రైతు పండించిన పంటను కొనడం ప్రభుత్వాల బాధ్యత. అవసరా నికో విధిలేకో ప్రైవేట్‌ వ్యాపారికి అమ్మితే రైతుకు ఇప్పుడు అందుతున్న ధర కూడా లభించదు. 

భారతీయ రైతు నడ్డి విరిచి, ప్రైవేట్, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి రైతుల భూములను చేరవేయడానికే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ చట్టాల వల్ల భూమంతా కార్పొరేట్‌ శక్తుల అధీనంలోకి పోయి రైతులు తమ భూముల్లో తామే కూలీలు అయ్యే పరిస్థితి తలెత్తుతుంది. పైగా వినియోగదారుడు ఇప్పుడు లభిస్తున్న రేటుకంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలోని ప్రభుత్వాలంటే మునుపటి రాజులవి కావు. ప్రజలతో ఎన్నుకోబడ్డవి. ప్రజలను తన కన్నబిడ్డలుగా చూసుకోవాల్సినవి. అలాంటి ప్రభుత్వాలే   అన్నదాత సంక్షేమాన్ని పట్టించుకోకపోతే కార్పొరేట్‌ శక్తులు ఎలా పట్టించుకుంటాయి? రైతులను ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించడం సరైంది కాదు.

డాక్టర్‌ కాలువ మల్లయ్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత. 
మొబైల్‌: 91829 18567 

మరిన్ని వార్తలు