AP: మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే..

3 Nov, 2022 12:51 IST|Sakshi

మహా నగరాలు ఒకే రోజులోనో, స్వల్ప సమయంలోనో నిర్మింప బడవు. కాలక్రమంలో చారిత్రక, సామాజిక, సాంఘిక, మానవ వన రుల అవసరాలను బట్టి గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మహా నగరాలుగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ‘రోమ్‌ వజ్‌ నాట్‌ బిల్ట్‌ ఇన్‌ ఎ డే’ (రోమ్‌ నగరం ఒక్క రోజులో నిర్మితమవ్వలేదు) అనే నానుడి పుట్టింది. హైదరాబాద్, చెన్నయ్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ లాంటి మహానగరాలు కూడా ఒక సంవత్స రంలోనో, స్వల్పకాలంలోనో మహానగరాలుగా ఎదిగినవి కావు. ఇది చరిత్ర.

చారిత్రక దృష్టిలేనివారు; చరిత్రనుండి పాఠాలు, గుణపాఠాలు నేర్వలేనివారు... వేల కొద్ది ఎకరాల పంట భూములను సేకరించి అక్కడ రాజధాని భవనాలు నిర్మించి అత్యల్ప కాలంలోనే సింగపూర్‌ లాంటి నగరాలను తీసుకు వస్తామని చెబుతారు. ‘చరిత్ర తెలి యనివారు చరిత్రను సృష్టించలేరు’. అక్కడేమీ లేకున్నా రాజధాని పేరు మీద కొన్ని భవనాలు నిర్మించినంత మాత్రాన అది సింగపూర్‌ అవుతుందని భావించడం సరైందికాదు. ఉమ్మడి పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న పట్టణాలను వదిలి... ఛండీగర్‌ను కొత్త రాజధానిగా నిర్మించి రెండు రాష్ట్రాలకు రాజధానిని చేయడం వల్ల జరిగిందేంటి? అది నాలుగు దశాబ్దాలు గడిచినా మహానగరం కాలేదు. పట్టణంగా మాత్రమే ఉండి పోయిందన్న సంగతి మరువరాదు.

ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంతరాలతో మూడు ప్రాంతాల సమాహారంగా ఉంది. ఇది సహజం. వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా మూడు ప్రాంతాల్లోని అసమానతలను, అంతరాలను వీలైనంతవరకు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ‘మూడు రాజధాను’లను ప్రతిపాదించింది జగన్‌ ప్రభుత్వం. మొత్తం బడ్జెట్‌ అమరావతికే ఉపయోగిస్తే రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, వ్యవసాయాభివృద్ధి, సంక్షేమ పథకాల మాటేంటి? మంచి పాలకునికి చరిత్ర తెలిసిన పాలకునికి ప్రజలు ముఖ్యం కదా!

అమరావతిలో అసెంబ్లీ ఉంచి, విశాఖపట్టణంలో సచివాలయం నిర్మించి పరిపాలనా రాజధానిని చేయడం వల్ల వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న విశాఖ పట్ట ణాన్ని రాజధాని చేస్తే అత్యంత తక్కువ సమయంలో మరింత గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలా ఇక్కడ వేలకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని రూపు మాపి సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. అమరావతిలో అసెంబ్లీ భవనాలు, శాసన రాజధాని ఉంటుంది. కాబట్టి ఇది కూడా నగరంగా అభివృద్ధి చెందుతుంది. 

మరో దిక్కున కర్నూలులో హైకోర్టు వల్ల అదో మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది. 3 ప్రాంతాల్లో విద్యా, వైద్యం, ఐటీ విస్తరణ, ఉద్యోగ కల్పన, సేద్యం వంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక న్యాయం బాగా జరిగేలా చూస్తే అంతకంటే మించిన సుపరిపాలనేముంది? ఆ దిశగా శర వేగంతో అడుగులేస్తున్నాడు జగన్‌. దీంతో భవిష్యత్తులో వేర్పాటు వాదాలు వచ్చే అవకాశం ఉండదు. ప్రజల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా సోదర భావం నెలకొంటుంది. అప్పుడే శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి. ఫలితంగా పెట్టుబడులు దేశ, విదేశాల నుంచి ఏపీకి ప్రవహిస్తాయి. అందువల్ల రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుంది.

మూడు రాజధానులను వ్యతిరేకించడం ఆపి రాజ ధాని నిర్మాణం త్వరగా పూర్తి కావడానికి సహకరిస్తే శూన్యంగా మిగిలిన తెలుగు దేశానికి ఇసుమంతైనా ప్రజామోదం లభిస్తుంది. అలా కాదంటారా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సకల జనుల వృద్ధిని ఆశించే ప్రస్తుత సీఎం జనం హృదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. (క్లిక్ చేయండి: రాజధాని పట్ల మరింత స్పష్టత)


- కాలువ మల్లయ్య 
ప్రముఖ సాహితీ వేత్త

మరిన్ని వార్తలు