మోదీ రాముడు.. అందరివాడు!

14 Aug, 2020 00:24 IST|Sakshi

విశ్లేషణ

అయోధ్యలో రామాలయ భూమిపూజ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం శ్రీరాముడి గురించి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. శత్రుసంహారం చేసే ధనుద్ధారిగా రాముడిని గత 30 ఏళ్లుగా ఆరెస్సెస్‌/బీజేపీ చిత్రిస్తూ వచ్చిన దృక్కోణానికి పూర్తిగా భిన్నమైన రాముడిని మోదీ ఆవిష్కరించారు. దాని ప్రకారం శ్రీరాముడు అందరివాడు. ప్రజలను సమానంగా ప్రేమించాడు. పేదలు ఉండకూడదన్నాడు. దుఃఖం ఉండకూడదన్నాడు. స్త్రీలు, పురుషులు, రైతులు, పశుపాలకులు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కాలంతోపాటు ముందుకెళ్లాలని మోదీ రాముడు బోధిస్తున్నాడు. ఆధునిక భారతదేశంలో ఇవన్నీ సాధ్యం కావాలంటే మొట్టమొదటగా పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపొందించాల్సి ఉంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, 130 కోట్లమంది భారతీయుల ప్రధానమంత్రిగా కూడా శ్రీరాముడిని పునర్విచించారు. ఇది 1989 నుంచి గత ముప్ఫై ఏళ్లుగా ఆరెస్సెస్‌/బీజేపీ శ్రీరాముడి గురించి ఇస్తూ వస్తున్న నిర్వచనానికి పూర్తిగా భిన్నమైంది కావడం విశేషం. అయోధ్యలో, రామజన్మభూమి ఆలయంలో భూమి పూజ సందర్భంగా 2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ తన ప్రసంగంలో కొత్త శ్రీరాముడిని ఆవిష్కరించారు. అందుచేత ఆయన ప్రసంగానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రామాలయ భూమిపూజ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానకి నేను మొదట ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. ‘‘దళితులు, అధోజగత్‌ సహోదరులు, ఆదివాసీలు.. సమాజంలోని అన్ని వర్గాలకు చెందినవారు స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీకి సహకారం అందించినట్లే, రామాలయ నిర్మాణానికి చెందిన బృహత్‌ కార్యక్రమం భారతదేశ ప్రజలందరి సహకారంతో ఈరోజు ప్రారంభమైంది. రాముడికి తన ప్రజలపై సమానమైన ప్రేమ ఉండేది. అయితే పేదలు, పీడితుల పట్ల రాముడు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వివిధ రామాయణాల్లో శ్రీరాముడి వివిధ రూపాలను మీరు కనుగొనవచ్చు.. కానీ రాముడు ప్రతిచోటా ఉన్నాడు. (ఒకే బాణము, ఒకటే పార్టీ!)

రాముడు అందరివాడు. అందుకే భారతీయ భిన్నత్వంలో ఏకత్వానికి శ్రీరాముడు అనుసంధాన కర్తగా ఉంటున్నాడు. ‘ఎవరూ విచారంగా ఉండకూడదు, ఎవరూ పేదవారిగా ఉండకూడదు’ అని రాముడు బోధించాడు. పైగా ‘స్త్రీలు పురుషులతో సహా ప్రజలందరూ సరిసమానంగా సంతోషంగా ఉండాల’ని శ్రీరాముడు సామాజిక సందేశం ఇచ్చాడు. ‘రైతులు, పశుపాలకులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి’ అని కూడా సందేశమిచ్చాడు. అలాగే ‘వృద్ధులను, పిల్లలను, వైద్యులను ఎల్లప్పుడు పరిరక్షించాలి’ అని రాముడు ఆదేశమిచ్చాడు. ఆశ్రయం కోరుకున్న వారికి ఆశ్రయమివ్వడం అందరి బాధ్యతగా ఉండాలని రాముడు పిలుపిచ్చాడు. స్థల, కాల, సమయ పరిస్థితులకు అనుగుణంగా రాముడు మాట్లాడేవాడు, ఆలోచించేవాడు, వ్యవహరించేవాడు. కాలంతోపాటు ఎదుగుతూ, ముందుకెలా వెళ్లాలో రాముడు మనకు బోధించాడు. రాముడు మార్పు, ఆధునికతా ప్రబోధకుడు. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, జ్ఞానాన్ని ఎలా సాధించాలో కూడా రాముడు మనకు బోధించాడు. అందరి మనోభావాలను మనం గౌరవించాలి. మనందరం కలిసి ఉండాలి. కలిసి ముందుకెళ్లాలి, పరస్పరం విశ్వసించాలి’’.

ప్రధాని మోదీ రామాలయ భూమి పూజానంతరం చేసిన ప్రసంగం ప్రకారం రాముడు ఆధునికవాది. దారిద్య్ర నిర్మూలన, స్త్రీ, పురుషుల మధ్య భేదం, కులం, మానవ దోపిడీకి కారణమవుతున్న దారిద్య్రం ఇలా అన్ని రకాల అసమానతలను రాముడు వ్యతిరేకించాడు. వైవిధ్యతకు మద్దతిచ్చాడు. తనకోసం కాకుండా అనేకమంది రోగులకు చికిత్స చేసే వైద్యుడి భద్రత గురించి రాముడు మాట్లాడాడు. ఈ దేశం స్వర్గం కంటే మిన్నగా  మారాలని రాముడు విశ్వసించి ఉంటాడు. రథ యాత్ర సమయంలో ప్రధానంగా ఎల్‌కే అద్వానీ రూపంలో ఆరెస్సెస్‌/బీజేపీ కూటమి ప్రబోధించిన రాముడితో పోల్చి చూస్తే మోదీ రాముడు పూర్తిగా భిన్నమైన వాడు. రాముడంటే విల్లుబాణాలు ధరించి శత్రువులను దునుమాడే పరమ శక్తిమంతుడు అనే ముద్రను గత మూడు దశాబ్దాలుగా ఆరెస్సెస్‌/బీజేపీ ప్రచారం చేసింది. బీజేపీ ప్రవచిస్తూ వచ్చిన రాముడితో పోలిస్తే ఇప్పుడు శ్రీరాముడు అందరివాడు. రాజ్యంలో ఏ ఒక్కరూ దుఃఖంతో ఉండరాదు, పేదవారిగా ఉండరాదు అని రాముడు బోధించినట్లు ప్రధాని మోదీ చెబుతున్నారు. రామాయణ పురాగాథ, రాముడి గురించిన పాత అవగాహనకు పూర్తిగా ఇవి భిన్నమైనవి. రాజ్యాంగంలో పొందుపర్చిన లౌకికవాద స్వరూపాన్ని ఏ ప్రధాని కూడా ధిక్కరించి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనరాదు అని గతంలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం చేసిన సూత్రీకరణను మోదీ ఉల్లంఘించారనడంలో సందేహమే లేదు. కానీ శ్రీరాముడికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా మోదీ ఇప్పుడు రాముడినే లౌకికవాదిని చేసి పడేశారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన)

రామమందిరం గురించి మోదీ చేసిన ప్రసంగం ముస్లిం మైనారిటీలు, ఇకనుంచి భారత్‌లో వారి భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారంతో కూడుకుంది. అయితే దీనికంటే మించిన మౌలిక సమస్య ఇక్కడ ఉంది. అదేమిటంటే వాల్మీకి రామాయణం రచించిన రోజుల నుంచి కుల పీడన, స్త్రీల అణచివేత. కుల పీడన గురించి, స్త్రీల అసమానత్వం గురించి రామాయణం ఏ సందర్భంలోనూ పేర్కొనలేదు. పైగా వర్ణధర్మం, బ్రాహ్మణ పితృస్వామ్యంలో భాగంగా కులం, స్త్రీల అణచివేతకు సంబంధించిన వివిధ అంశాలను రామాయణంలో చొప్పించారు. భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాల్లో వ్యాప్తిలో ఉంటున్న వివిధ రామాయణాల గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావిం చారు. కానీ రామానుజన్‌ రాసిన ‘మూడు వందల రామాయణాలు’ (త్రీ హండ్రెడ్‌ రామాయణాస్‌) అనే రచనను ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్‌ నుంచి హిందూత్వ అనుకూలవాదులు కొన్నేళ్ల క్రితం బలవంతంగా తొలగించారు. కానీ ప్రధాని మోదీ ప్రసంగం రాముడి గురించిన ఆయన సూత్రీకరణలకు కట్టుబడింది. 

భారత ప్రభుత్వాధినేతగా ప్రధాని మోదీ రాముడిని ఒక ఆధునికుడిగా నిర్వచించినందున రాముడిపై ఈ సరికొత్త నిర్వచనాన్ని మేధో చర్చలనుంచి తొలగించలేం. మోదీ నిర్వచనంతో ఏకీభవిం చినా, ఏకీభవించకపోయినా సరే ఈ కొత్త నిర్వచనం గురించి ఎవరైనా చర్చించాల్సిందే. ముస్లిం మైనారిటీని చావుదెబ్బతీసి, హిందూ ఆలయాన్ని నిర్మించాలనే తమ ఎజెండాలో భాగంగా అద్వానీ, ఆరెస్సెస్‌/బీజేపీ నాయకులు ఇంతకుముందు రాముడి గురించి ఏ నిర్వచనం ఇచ్చారో మళ్లీ ప్రస్తావించాలని నేను భావించడం లేదు. ఎందుకంటే ఆ చరిత్ర అందరికీ తెలిసిందే.  అయితే ఇకపై రామాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ జీవితాలపై ప్రధాని మోదీ ప్రసంగం సానుకూల ప్రభావం వేయనుందా లేక ప్రతికూల ప్రభావం వేయనుందా అనే చర్చను, రామ వర్సెస్‌ ముస్లిం సమస్యపై చర్చను ముస్లిం పండితులకే వదిలివేస్తాను. అయోధ్యలో రామాలయం రోమ్‌లోని వాటికన్‌ కంటే, సౌదీ అరేబి యాలోని మక్కాకంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోనుందని అనేకమంది ఆరెస్సెస్‌/బీజేపీ నేతలు గతంలో చెప్పి ఉన్నారు కూడా. మతాలను తులనాత్మకంగా పరిశీలించడంలో నిష్ణాతులైన క్రిస్టియన్, ముస్లిం పండితులు ఈ అంశాన్ని కూడా మత చర్చలో భాగం చేయవలసి ఉంది.

మహిళా సమస్యను అన్ని కులాలకు చెందిన మహిళా రచయితలు, చింతనాపరులు చేపట్టి చర్చిస్తారు. ఇక్కడ నా అందోళన అంతా కుల ఎజెండాను రద్దు చేయడానికి సంబంధించే ఉంటుంది. అయోధ్యలో ప్రధాని ప్రసంగం.. రిజర్వేషన్‌ చట్టాలను మించి పార్లమెం టులో తగిన చట్టం ద్వారా కులాన్ని, అంటరానితనాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఒక బలమైన ప్రాతిపదికను అందిస్తోంది. ఆరెస్సెస్‌/బీజేపీల ద్వారా ఆగమశాస్త్రాలు విధించిన ఆధ్యాత్మిక వివక్షాపూరితమైన చట్టాల నిర్మాణానికి, హిందూయిజంకి సంబంధించి ఆధునిక ఆధ్యాత్మిక సమానత్వాన్ని ప్రబోధిస్తున్న వారికి మధ్య ఉన్న సంఘర్షణను ఈ కొత్త చట్టం పరిష్కరించాల్సి ఉంది. హిందూయిజాన్ని ఒక జీవన విధానంగా మాత్రమే కాకుండా ప్రపంచంలో క్రైస్తవం, ఇస్లాం, బుద్ధిజం వంటి మతాల సరసన నిలిపే అంశంలో ఇదే ప్రధాన సమస్య అవుతుంది. భారత పార్లమెంటు కుల నిర్మూలనను పూర్తిగా పరిష్కరించాల్సి ఉంది. ఆధునిక రాముడిపై తన అవగాహనను నొక్కి చెబుతున్న మోదీ ఈ అంశాన్ని చిత్తశుద్ధితో స్వీకరించాల్సి ఉంది. 2014, 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ తనను తాను ఇతర వెనుకబడిన కులానికి చెందిన ప్రధానిగా అభివర్ణించుకుని ప్రచారం చేసుకున్న వైనాన్ని మనం మర్చిపోకూడదు.

దళితులను అలా పక్కనపెట్టండి.. చివరకు శూద్రులు, ఓబీసీలకు కూడా రామాలయంలో పూజారులుగా ఉండే హక్కు లేదు. మోదీ చెబుతున్న రాముడు అందరికీ సామాజిక న్యాయం పక్షాన నిలబడ్డాడు మరి. పైగా మోదీ ప్రకారం రాముడు మార్పుకు ప్రతినిధి. భూమి పూజ అనంతరం ప్రధాని చేసిన ప్రసంగం ప్రకారం రాముడు కాలాన్ని బట్టి మారుతూ, ఆధునికతను చాటిన పాలకుడు కదా. అందుకే అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, జరగాలంటే పార్లమెంటులో శక్తివంతమైన కులనిర్మూలనా చట్టం రూపకల్పన తప్పనిసరి అవసరంగా ఉంటుంది.

- ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌
సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ 

మరిన్ని వార్తలు