విద్యా విప్లవానికి నాందీవాచకం

26 Jun, 2021 00:12 IST|Sakshi

విశ్లేషణ

పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్‌ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహిం చడం ఒక్కటే సరైన పద్ధతి. దేశంలోని రైతులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్‌ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేసిన మనోభావాల లింకును వైఎస్‌ జగన్‌ తుంచేశారు. ప్రాథమిక విద్యపై, కళాశాల విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో సీఎంని మనం చూడలేం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యారంగంలో అసాధారణమైన ప్రయోగం చేస్తోంది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. దీనికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే ఏపీ ప్రభుత్వం అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కాలేజీల్లో ఇంగ్లిష్‌ని విద్యా మాధ్యమంగా చేసింది. వీటిని చేపట్టడానికి రాష్ట్ర యువ, ఆశావహ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. తమ పిల్లలను మాత్రం అతి ఖరీదైన ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో చదివి స్తున్న ఏపీలోని కపట మేధావి–రాజకీయ వర్గం జగన్‌ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ దాన్ని మాతృభాషా సమస్యగా మార్చేసింది. తల్లి భాష అంటే తల్లి పాలు అంటూ వీరు గొంతు చించుకున్నారు. తమ గావుకేకలు వైఎస్‌ జగన్‌ని కదిలించకపోవడంతో తర్వాత వీరు న్యాయస్థానం ముందు సాగిలపడ్డారు.

రాష్ట్ర కుహనా మేధావివర్గాల, ప్రతిపక్షాల ఈ కపటత్వాన్ని ఎండగడుతూ, వీరి వీధి పోరాటాలతో, మీడియాలో యుద్ధాలతో తలపడటానికి  ఏపీ ముఖ్యమంత్రి తమ యువ కేడర్‌ని, పార్టీ నాయకులను మోహరించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీతోపాటు వామపక్షాలు కూడా జగన్‌ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన తెలుగు వ్యతిరేకి అని ఆరోపించారు. అయితే ఇంగ్లిష్‌ మీడియంలో విద్య అనేది తన నవరత్నాలు పథకంలో భాగం కాబట్టి, ఎన్నికల మేనిఫెస్టోలో ఈమేరకు వాగ్దానం చేశారు కాబట్టి వైఎస్‌ జగన్‌ తన మాటకు చివరివరకు కట్టుబడ్డారు.

అదే సమయంలో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పనిసరిగా బోధించాలని జగన్‌ ఆదేశిం చారు. అన్ని పాఠ్యపుస్తకాలను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ముద్రించి ఇవ్వాలని కూడా ఆదేశించారు. అంటే అన్ని సబ్జెక్టుల్లోని పాఠాలు ఒక వైపు పేజీలో ఇంగ్లిష్‌లో, దాని పక్కపేజీలో తెలుగులో ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. దీంతో విమర్శకులకు మౌనం పాటించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు వీరి పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా రెండు భాషల్లో విద్య నేర్చుకోవచ్చు. ఇంతవరకు ఏపీలోని ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు తెలుగులో విద్య నేర్చుకోవడాన్ని అనుమతించలేదు. 

విద్యలో జగన్‌ సమూల మార్పులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం విద్యాబోధనకు గ్రామీణ, రైతు, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రుల మద్దతును వైఎస్‌ జగన్‌ పొందారు. తాము ఎంచుకున్న మీడియంలో విద్య పొందాలనుకునే పిల్లల హక్కును ఏ కోర్టూ వ్యతిరేకించదు. ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ఎత్తిపట్టింది. ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా హక్కు ప్రైవేట్‌ రంగానికి మాత్రమే పరిమితమైంది కాదు. పిల్లలంటే పిల్లలే.  ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ.. ఇలా వారు ఏ పాఠశాలలో చదివినా వారి హక్కు వారికే చెందుతుంది. వైఎస్‌ జగన్‌ తన ఇంగ్లిష్‌ మీడియం ఎజెండాను అమ్మ ఒడి పథకంతో మేళవించారు. పిల్లలను బడికి పంపే తల్లికి ఏటా విద్యా ఖర్చుల కోసం రూ. 15,000ల నగదును అందించే పథకమిది. దీంతోపాటు కాలేజీలో చదువుకునేవారి ఫీజు మొత్తం రీయింబర్స్‌ చేస్తున్నారు. దీనికి తోడుగా నాడు–నేడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల మౌలిక వసతులను సమూలంగా మార్చడానికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అమలు చేస్తున్న పథకం కంటే నాడు–నేడు మరింత నిర్దిష్టమైనది, గుణాత్మకమైనది కావడం విశేషం. పైగా ఆంధ్రప్రదేశ్‌ అతి పెద్ద రాష్ట్రం కూడా.

ఏపీ ముఖ్యమంత్రి ఈ విద్యాసంవత్సరం నుంచి అంగన్‌ వాడీలను కూడా ప్రాథమిక పాఠశాలలతో మిళితం చేశారు. పైగా స్కూల్‌ సిబ్బందిని, వసతి సౌకర్యాలను పెంచారు. ప్రతి రోజు స్థిరమైన మెనూతో ప్రభుత్వం నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. అనేక రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈ పథకం కింద పిల్ల లకు మంచి ఆహారం లభిస్తూండటం గమనార్హం. పిల్లలున్న ప్రతి ఇంటి నుంచి ఒక కిలోమీటర్‌ పరిధిలో ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అలాగే మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక హైస్కూలును, ఏడు కిలోమీటర్ల పరిధిలో రెండు జూనియర్‌ కళాశాలలను ఏర్పర్చనున్నారు. ఈ అన్ని విద్యా సంస్థల్లో ఒక సబ్జెక్టులో తెలుగును తప్పనిసరి చేస్తూ ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. పైగా ఇంగ్లిష్, తెలుగు రెండింటిలో టీచర్లు బోధించేలా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణా పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

విద్య అనేది ప్రతి పాప, బాబుకి చెందిన గౌరవనీయమైన ఆస్తిగా పాలకులు భావించనంతవరకు ఏ పాలకుడైనా విద్యపై ఇంత శ్రద్ధ పెట్టలేరు. వైఎస్‌ జగన్‌ 48 ఏళ్ల యువకుడు. సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. నిజానికి దేశంలో అధికారంలో ఉంటున్న ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల్లో జగన్‌ అత్యంత యువ ముఖ్యమంత్రి కావడం విశేషం. భవిష్యత్తులోనూ ఒక రాజకీయనేతగా తన ఈ విద్యా ఎజెం డాను జగన్‌ కొనసాగించినట్లయితే దేశంలోని ప్రభుత్వ రంగ విద్యావిధానంలో గణనీయ ముద్రను వేయడం ఖాయం.

సమానత్వానికి నమూనా
ఎవరి జీవితంలోనైనా విద్య అత్యంత విలువైన సంపద అనేది తెలిసిన విషయమే. ఇది బంగారం కంటే ఉత్తమమైనది. దళితులకు, ఆదివాసీలకు, శూద్రులకు ఇంగ్లిష్‌ విద్య అనేది తమ ట్రావెల్‌ బ్యాగ్‌లో పెట్టుకుని మోసే బంగారు గనిలాంటిది. పదే పదే ఇది రుజువవుతోంది కూడా. అయితే స్వాతంత్య్రానంతర భారత పాలకులు ప్రభుత్వ రంగంలో ప్రాంతీయ భాష, ప్రైవేట్‌ రంగంలో ఇంగ్లిష్‌ భాష అనే రెండు వేర్వేరు రంగాలను నెలకొల్పడం ద్వారా దేశ ప్రజలకు సమానమైన మీడియం విద్యను తిరస్కరించారు. దేశంలోని ఆహార ఉత్పత్తిదారులను, ఇతర శ్రామిక ప్రజానీకాన్ని ప్రాంతీయ, జాతీయ మనోభావాల ఉచ్చులోకి దింపి వారిని ఇంగ్లిష్‌ భాషలో విద్యకు పూర్తిగా దూరం చేశారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలు ఈ సెంటిమెంటును తోసిపుచ్చి, ఇంగ్లిష్‌ కులీన విద్యావంతుల ప్రయోజనాల కోసం పనిచేస్తూ వచ్చాయి. ఇలాంటి సెంటిమెంటల్‌ లింకును జగన్‌మోహన్‌ రెడ్డి తెంచివేసారు. తన నూతన విద్యా ప్రాజెక్టులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వస్తున్నారు. విద్యపై ఇంతగా దృష్టి పెట్టిన మరో ముఖ్యమంత్రిని మనం చూడలేం. విద్యకోసం తన ప్రభుత్వ బడ్జెట్‌ కేటాయింపులు కూడా చాలావరకు మెరుగ్గా ఉన్నాయి. తన విద్యాపథకాల కోసం ఇతర పథకాలను కూడా ఆయన ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం మెరుగైన విద్యా నమూనాపై కృషి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ భాషా విధానం.. ప్రైవేట్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించలేని గ్రామీణ, పేద ప్రజానీకానికి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే స్థాయి విద్యను అందించడంలో తోడ్పడలేదు. పైగా బీజేపీ హయాంలో విద్యారంగంలో ఒక సరికొత్త వైరుధ్యం ఆవిర్భవించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో పాఠశాల విద్య విషయంలో మొండిగా వ్యవహరిస్తూనే, మరోవైపున ఇంగ్లిష్‌ మీడియం కొనసాగించడానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలను అనుమతిస్తోంది. పాఠశాలల్లోని పిల్లలందరికీ నాణ్యమైన, సమానమైన మీడియం విద్యను అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా నమూనా ఒక్కటే ఏకైక మార్గం. సంపన్నులు మాత్రమే చదవగల ప్రైవేట్‌ రంగ విద్యను రద్దు చేసే అవకాశం లేనందున అన్ని పాఠశాలల్ని ఒకే స్థాయిలో నిర్వహించడం ఒక్కడే సరైన, ఏకైక మార్గం.


వ్యాసకర్త ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
ప్రొ‘‘ కంచ ఐలయ్య
షెపర్డ్‌

మరిన్ని వార్తలు