సైద్ధాంతికంగా కాంగ్రెస్‌ మేల్కొన్నట్లేనా?

27 May, 2022 00:45 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ‘సామాజిక న్యాయ సాధన ప్యానెల్‌’ చేసిన సిఫార్సులు దాని భవిష్యత్‌ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో చెబుతున్నాయి. ఓబీసీల మద్దతుతో ఓబీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా చేసిన బీజేపీని ఎదుర్కోవడానికి... ఓబీసీ వర్గాల అనుకూల పంథాను ఎంచుకోవడమే సరైన మార్గమని కాంగ్రెస్‌ నిర్ణయించుకున్నట్లుంది. సంస్థాగతంగా పునర్నిర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కి ఆలస్యంగానైనా బోధపడింది. లౌకిక వాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్‌ అవగతమైంది. ఉదయ్‌పూర్‌లో ఇటీవలే ముగిసిన మేధోమథన సదస్సులో సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్‌ తీసుకురావడం ఈ అవగాహనలో భాగమే. 

కాంగ్రెస్‌ పార్టీ పునరుద్ధరణ వ్యూహం ఒక బలమైన ప్రయోజనాన్ని సాధించింది. రాజ స్థాన్‌లోని ఉదయపూర్‌లో ఇటీవలే మూడు రోజుల పాటు జరిగిన ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌’ లేదా నూతన మేధోమథన సదస్సులో సీనియర్‌ నేతలు సల్మాన్‌ ఖుర్షీద్, కె. రాజు నేతృత్వంలో ‘సామాజిక న్యాయ కమిటీ’ని కాంగ్రెస్‌ పార్టీ నియమించింది. ఈ కమిటీ పార్టీ పునర్నిర్మాణం కోసం పలు సామాజిక న్యాయ చర్యలను ప్రతిపా దించింది. మీడియా రిపోర్టులను బట్టి ఈ ప్యానెల్, పార్టీ నిర్మాణం లోని అన్ని స్థాయుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సిఫార్సు చేసిందని తెలుస్తోంది. పార్లమెంటు లోనూ, రాష్ట్రాల అసెంబ్లీలలోనూ ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలని ప్యానెల్‌ సిఫార్సు చేసింది. ఆలాగే మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ‘కోటా లోపలి కోటా’ను సమర్థించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్‌ కల్పించాలని కూడా ఇది సిఫార్సు చేసింది.

మరింత కీలకమైన విషయం ఏమిటంటే, ప్రైవేట్‌ రంగంలోనూ కుల ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పనను కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయ సాధన ప్యానెల్‌ సిఫార్స్‌ చేయడం! ఇది పాలక భారతీయ జనతా పార్టీకి మింగుడు పడని సమస్యే అవుతుంది. వాస్తవానికి ఓబీసీల ఓటు కారణంగానే బీజేపీ కేంద్రంలో రెండుసార్లు అధికారం లోకి వచ్చింది. ప్రైవేట్‌ రంగంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ఉనికిని మెరుగుపర్చడం వైపుగా బీజేపీ ఎలాంటి చర్యా తీసుకోలేదు. నిజానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రైవేటీకరణ కారణంగా ఉద్యోగరంగంలో అనేక కోతలు విధించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత కమిటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ), సామాజిక న్యాయ ప్యానెల్‌ సిఫార్సులను అప్పటికప్పుడు ఆమోదించ లేదు. సంస్కరణాత్మకమైన సామాజిక న్యాయ కార్యక్రమం పార్టీ ఆలోచనా తీరులో కనబడిందంటే ఇది దాని భవిష్యత్‌ రాజకీయాలను నిర్ణయించగలదు. ఇలాంటి సామాజిక న్యాయ ప్యాకేజిని కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీ తీసుకురావడమే గొప్ప. అదేవిధంగా కుల ప్రాతిపదికన జనాభా గణన కోసం కాంగ్రెస్‌ పోరాడాలని సిఫార్సు చేసింది. దీన్ని బీజేపీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

లౌకికవాదం, వైవిధ్యత, బహుళత్వం, మతతత్వ వ్యతిరేకత వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా పార్టీ అధికారంలోకి రావాలనీ, వస్తుందనే భావన పట్ల కాంగ్రెస్‌ మేథోమథన బృందాలు ఇంతవరకు సానుకూలంగా ఉండేవి. కానీ శూద్ర ఓబీసీలు, దళితులు, ఆదివాసీ ప్రజానీకం ఇలాంటి అమూర్త భావాలపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఎట్టకేలకు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించినట్లుంది. ఈ విషయంలో రాహుల్‌ గాంధీకే ఘనత దక్కుతుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌ ఒక్కరే ప్రజానేత, జనాకర్షక నేతగా ఉన్నారు. పైగా తన అంతర్గత వ్యవస్థాగతమైన డోలాయ మానం కారణంగా సామాజిక న్యాయ ఎజెండాపై బలమైన వైఖరి తీసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ చాలా కాలంగా తడబడుతూ వచ్చింది. వీపీ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చేసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ 15 సంవత్సరాలు రాజ్యమేలింది. పీవీ నరసింహరావు అయిదేళ్లు, తర్వాత మన్మోహన్‌ సింగ్‌ పదేళ్లు దేశాన్ని పాలించారు. అయినా సరే కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా సామాజిక న్యాయ వ్యతిరేక కులీనవర్గాల ఆధిపత్య పట్టులోనే ఉండిపోయింది. 

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కులీన నేతల్లో చాలామంది బోర్డ్‌ రూమ్‌ మేనేజర్లే తప్ప ఓట్లు రాబట్టేవారు కాదు. మన్మోహన్‌ సింగ్, పి. చిదంబరం, జైరాం రమేష్, మణి శంకర్‌ అయ్యర్, దివంగత అహ్మద్‌ పటేల్‌ వంటివారు ప్రభుత్వాన్నీ, పార్టీని మేనేజ్‌ చేసేవారు మాత్రమే కాదు...  క్షేత్రస్థాయిలో మండల్‌ శక్తుల పట్ల వ్యతిరేక భావంతో ఉండే వారు. పార్టీలోని ఈ కులీన వర్గాలకు రాజ్యసభే అధికార రాజకీ యాల్లోకి వచ్చేందుకు మార్గంగా కనిపించేది. ఇప్పుడు ఆ మార్గం రెండేళ్లుగా మూసుకు పోయింది.

1984 లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్‌ గాంధీ విజయం తర్వాత (ఇందిరా గాంధీ హత్య నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 414 ఎంపీ స్థానాలు చేజిక్కించుకుంది) కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా డూన్‌ స్కూల్‌ టీమ్‌గా మారిపోయింది. ఇది పార్టీలో అంతర్గత సంక్షోభానికి దారితీసి నూతన జాతీయ నేతగా వీపీ సింగ్‌ పెరుగుదలకు దారితీసింది. 1991లో పీవీ నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పటికీ కాంగ్రెస్‌ని ముందుకు తీసుకుపోగలిగే మాస్‌ లీడర్‌గా అయన ఎప్పుడూ లేరు.

మెరిట్‌ సిద్ధాంతాన్ని బలపర్చిన రిజర్వేషన్‌ వ్యతిరేక వర్గాలు మండల్‌ ఉద్యమాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. రాజీవ్‌ గాంధీ బద్ధశత్రువు వీపీ సింగ్‌ మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు చేశారు. దీన్ని రాజీవ్‌ గాంధీ, ఆయన కులీన బృందం ఇష్టపడలేదు. ఓబీసీ రిజర్వేషన్‌ని వీరు శక్తికొద్దీ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ కులీన బృందంలో ఒక్కరంటే ఒక్కరు కూడా శూద్ర ఓబీసీ, దళిత్, ఆదివాసీ నేపథ్యంలోంచి వచ్చిన వారు ఉండేవారు కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలూ శూద్ర ఓబీసీ యువత, ప్రజల ఆకాంక్షలను గానీ, వారి బలాన్ని గానీ అంచనా వేయడంలో పొరపడ్డాయి.

యూపీఏ పదేళ్ల పాలనలో (2004–2014) మరింతగా సంఘటితమైన మండల్‌ వర్గాలను సంతృప్తి పరిచేందుకు కొన్ని సానుకూల చర్యలు చేపట్టారు. అయితే ప్రభుత్వంలో గానీ, పార్టీలో గానీ ఏ మండల్‌ అనుకూల నేతకూ కాంగ్రెస్‌ చోటు ఇచ్చిన పాపాన పోలేదు.

2014 నాటికి గత పదేళ్ల పాలనా కాలంలో తామేం చేసిందీ గ్రామీణ భారత ప్రజానీకానికి సమర్థవంతంగా చెప్పగల నాయకుడు కాంగ్రెస్‌ పార్టీలో ఒక్కరూ లేకపోయారు. భారతదేశ వ్యాప్తంగా చక్కగా వ్యవస్థీకృతమై ఉన్న ఆరెస్సెస్, బీజేపీతో పోరాడటానికి యువ రాహుల్‌ గాంధీపై మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఆధారపడింది. ఇదే సమయంలో మండల్‌ శక్తుల ప్రాధాన్యతను చక్కగా అర్థం చేసుకున్న బీజేపీ ఓబీసీ కార్డు ఉపయోగించి నరేంద్రమోదీని రంగంలోకి దింపింది.

నరేంద్రమోదీ వికాసం, దాని వెనుకనే ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్‌కు జ్ఞానోదయం కలిగినట్లయింది. సంస్థాగతంగా పునర్ని ర్మాణం కాకపోతే ఓబీసీలు పార్టీతో కలవరని కాంగ్రెస్‌కు బోధపడింది. శూద్ర ఓబీసీల సంఖ్యను బట్టి చూస్తే (మండల్‌ అంచనా ప్రకారం జనాభాలో 52 శాతం) వీరి సమస్యలను పట్టించుకోకుండా, ప్రస్తావించకుండా సాధారణ ఎన్నికల్లో గెలవడం అనేది నేటి రాజకీయాల్లో ఆలోచనకు కూడా సాధ్యం కాని విషయం అని చెప్పాలి. లౌకికవాదం, బహుళత్వం, మైనారిటీ ప్రాధాన్యవాదం అనే పాత సైద్ధాంతిక ఎజెండా ఇక ఏమాత్రమూ ఓబీసీ ఓట్లను సాధించిపెట్టదని కాంగ్రెస్‌ పార్టీకి అర్థమైపోయింది.

సామాజిక న్యాయ శక్తుల్లో రాహుల్‌ గాంధీ ఇమేజ్‌ మారుతుందేమో చూడాలి. తానూ, ఖుర్షీద్‌ నేతృత్వంలోని ప్యానెల్‌ తీసుకుంటున్న సామాజిక న్యాయ చర్యలను వ్యతిరేకించే గ్రూప్‌ని లైన్‌లో పెట్టడం రాహుల్‌కి చాలా కష్టమైన పనే అవుతుంది. మతతత్వ శక్తుల ప్రమాదంతో క్షీణించిపోతున్న భారతీయ వ్యవస్థల పరిరక్షణ కోసమైనా సరే, కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయకోసం పోరాటం చేయాల్సి ఉంది. భారత రాజ్యాంగ సంవిధానాన్ని తిరిగి ప్రజాస్వా మీకరించాల్సి ఉంది. ఇది మాత్రమే దేశాన్ని ప్రస్తుత అంధకార మార్గం నుంచి వెనక్కు మళ్లిస్తుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పునర్‌ వైభవం తీసుకొస్తుంది. ఉదయ్‌పూర్‌ సదస్సులో కాంగ్రెస్‌ ఆ మార్గాన్ని ప్రారంభించడం మంచి పరిణామమే అని చెప్పాలి. 

వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
 ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు