కాంగ్రెస్‌కు చన్నీ చూపిన బాట

4 Feb, 2022 00:57 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ 2014లో అధికారం కోల్పో యిన తర్వాత తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క రాష్ట్ర స్థాయి యువనేత కూడా బీజేపీతో పోరాడగలిగే స్థితిలో లేకపోవడం దీనికి ఒక కారణం. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ నేతలు గెలుపు సాధిస్తుండగా అక్కడ కూడా కాంగ్రెస్‌ తరఫున గెలిచే నాయకులు కరువయ్యారు. ప్రత్యర్థులను సవాలు చేస్తూ ఎదిగిన ఏ నాయకుడినీ ఢిల్లీలోని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిలుపుకొన్న పాపాన పోలేదు. ప్రజాకర్షక నేతలుగా ఎదిగివచ్చిన యువనేతలను ఆ పార్టీ దూరం చేసుకుంది. వీరిలో కొందరు సొంత ప్రాంతీయ పార్టీలను ఏర్పర్చుకున్నారు. దీనికి మమతా బెనర్జీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి ఉదాహరణ. ఇప్పుడు వీరు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా పాలిస్తూ శక్తిమంతమైన ప్రాంతీయ నాయకులుగా విలసిల్లుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఓట్లను రాబట్ట లేనివారి మార్గదర్శకత్వంలోనే పనిచేస్తోంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ పార్టీ అధిష్ఠానంగా మారిన తర్వాత, క్షేత్రస్థాయిలో అనుభవం కలిగిన ఒక్క నేతను కూడా నెహ్రూ కుటుంబం అంతర్గతంగా తయారు చేసుకోలేకపోయింది. రాజీవ్‌ గాంధీ, సంజయ్‌ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ... ఇలా వీరందరికీ కుటుంబపరంగా మంచి పేరు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అనుభవం లేకుండా పోయింది. పైగా ఆరెస్సెస్, బీజేపీ తరహా శక్తులతో పోరాడటానికి అవసరమైన రాజ కీయ, సామాజిక, భావజాలపరమైన అనుభవం వీరికి కరువైంది.

ఇందిరాగాంధీ అనంతరం నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన నాయకులందరూ అద్దాలమేడలో పెరుగుతూ వచ్చారు. కాగా, విదే శాల్లో చదువుకుని వచ్చిన ద్విజ (బ్రాహ్మణ, వైశ్య, కాయస్థ, ఖాత్రి, క్షత్రియ) మేధావులు మెల్లగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. వీరు రాజ్యసభ ద్వారానే అధికార స్థానాల్లోకి ప్రవేశించి, ఓట్లు, సీట్లు గెలవ డానికి నెహ్రూ కుటుంబ సభ్యులపైనే ఆధారపడుతూ వచ్చారు. తర్వాత వీరు మంత్రులుగా మారి పాలించారు. దీంతో అనేక రాష్ట్రాల్లో ఓట్లను భారీగా రాబట్టే నేతలు కాంగ్రెస్‌ పార్టీలో లేకుండా పోయారు.

కాంగ్రెస్‌ పార్టీలో క్షేత్రస్థాయి నేతలు చాలావరకు శూద్రులు, దళితులు, ఆదివాసీ నేపథ్యంలోంచే వచ్చారు. ఉదాహరణకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి, విలాసరావు దేశ్‌ముఖ్‌ వంటివారికి శూద్ర వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి బలమైన రాష్ట్ర స్థాయి నేతలను ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషించడానికి కాంగ్రెస్‌ ఎన్నడూ అనుమతించలేదు. ఆదివాసీ నేపథ్యం నుంచి పీఏ సంగ్మా కాంగ్రెస్‌ పార్టీలో ఎదిగారు కానీ, ప్రస్తుతం పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చన్నీ వంటి శక్తిసామర్థ్యాలు, దళిత నేపథ్యం కలిగిన నేతలు ఏ రాష్ట్రం లోనూ ఆ పార్టీలో ఆవిర్భవించలేదు. యూపీలో అఖిలేష్‌ యాదవ్, బిహార్‌లో తేజస్వీ యాదవ్‌ బీజేపీని బలంగా ఢీకొంటున్నారు. ఇలాంటి నేతలను ఎదగనిచ్చి ఉంటే కాంగ్రెస్‌లో కుటుంబ కేంద్రక రాజకీయాలు తగ్గుముఖం పట్టేవి.

అయితే అధిష్ఠానం చుట్టూ తిష్ఠ వేసిన కోటరీకి ఢిల్లీ వెలుపల క్షేత్ర స్థాయిలో ప్రజలను కూడగట్టడం, సంఘటితం చేయడం వంటి పార్టీ నిర్మాణ కౌశలాలు ఏ కోశానా లేవు. ఈ కారణం వల్లే బీజేపీ అతిశక్తి మంతమైన పార్టీగా ఆవిర్భవించడమే గాకుండా కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యం లోనే చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ వంటి యువ దళిత నాయకుడు కష్ట కాలంలో కాంగ్రెస్‌కి దారి చూపుతూ పంజాబ్‌ ముఖ్యమంత్రిగా రంగం మీదికి వచ్చారు. భూస్వామ్య ప్రభువు లాంటి అమరీందర్‌ సింగ్‌ను తోసిరాజనడమే కాకుండా, సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధూ వంటి దూకుడైన క్రికెట్‌ ప్లేయర్‌ను ఎదుర్కొని అగ్ర పదవిని చేపట్టారు. రాహుల్‌ గాంధీ నష్టం జరుగుతుందేమోనని అనుమానిస్తూనే, చన్నీని సీఎం స్థానంలో కూర్చుండబెట్టారు. అయితే చన్నీ అనతికాలంలోనే తానొక సమర్థనేతనని నిరూపించుకోవడమే కాదు... పంజాబ్‌ వంటి రాష్ట్రంలో ప్రధాని మోదీ అవలంబించే ముందస్తు ఎన్నికల జిత్తులను ఎదుర్కొనే సమయస్ఫూర్తి గల రాజకీయ నేతగా ముందుకొచ్చారు. చన్నీ విద్యాధికుడు. ఆయన లా, ఎంబీయే చదివారు. ప్రస్తుతం పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు.

జనవరి 5న ప్రధాని నరేంద్రమోదీ తన భద్రత విషయంపై గరిష్ఠ స్థాయిలో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తూ చన్నీపై నేరుగా దాడి చేశారు. ‘‘భటిండా విమానాశ్రయానికి నేను సజీవంగా తిరిగి వచ్చినందుకు మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపండి’’ అని మోదీ వ్యంగ్యంగా విమర్శించారు. కానీ చన్నీ ఎంత చురుగ్గా స్పందించా రంటే, ‘‘ఈరోజు ఫిరోజ్‌పూర్‌ జిల్లా నుంచి ప్రధాని మోదీ వెనక్కు వెళ్లవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. మా ప్రధానిని మేము గౌర విస్తాం’’ అంటూ తిప్పికొట్టారు. పైగా తన సహచరుడికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో తనతో సన్నిహితంగా ఉన్నందున, ప్రధానిని కలవలేకపోయానన్నారు.

తన ప్రత్యర్థులను ఎలా తుదముట్టించాలో మోదీకి బాగా తెలుసు. కానీ గతంలో ఎవరూ చేయలేనట్లుగా దళితుడిగా ఉంటూనే ఈ వ్యవహారాన్ని దారిలోకి తెచ్చుకోగలనని చన్నీ బ్రహ్మాండంగా నిరూపించుకున్నారు. ఆ తర్వాత కూడా పంజాబ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసే వైపుగా మోదీ, ఆయన బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కానీ చన్నీ దృఢంగా నిలబడగలిగారు. ఆయన పంజాబీల ఆత్మగౌరవ సమస్యను లేవనెత్తారు. ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘకాలికంగా పంజాబ్‌ రైతులు చేసిన శాంతియుత నిరసన ప్రదర్శనలను, మోదీ పర్యటన సందర్భంగా రైతుల నిరసనను కూడా చన్నీ సమర్థించారు. ప్రధానికి ప్రాణాపాయం అంటూ బీజేపీ నేతలు చేసిన అతిశయ ప్రకటనలపై చన్నీ నిజంగానే నీళ్లు చల్లారు. దీనికోసం ఆయన సర్దార్‌ పటేల్‌ సూక్తిని బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ‘‘కర్తవ్య నిర్వహణ కంటే తన జీవితం గురించి ఎక్కువ శ్రద్ధ వహించే వారు భారత్‌ వంటి దేశంలో పెద్ద పెద్ద బాధ్యతలు స్వీకరించకూడదు.’’

ఈ ఒక్క ట్వీట్‌ చన్నీని హీరోను చేసింది. ప్రధాని ఆరోజు బహిరంగ సభకు వెళ్లలేకపోవడం వాస్తవమే కానీ ఆయనపై ఏ హింసా త్మక దాడీ జరగలేదు. ‘నిజానికి ఆరోజు ప్రధానికి వ్యతిరేకంగా ఎవరూ నినాదాలు చేయలేదు, రాళ్లు విసరలేదు, కాల్పులు జరప లేదు, ఏమీ జరగలేదు. అయినా ఇలాంటి ముతక నాటకాలు ఎందుకు ఆడుతున్నా’రంటూ చన్నీ నిలదీశారు. ఒక యువ నేత ఇంత పెద్ద సమస్యను, దుష్ప్రచారాన్ని ఎదుర్కొని నిలబడాలంటే ఎంతో ధైర్య సాహసాలు కావాలి. ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలూ చేయవద్దని ఢిల్లీ నాయకత్వం చన్నీని కోరిన నేపథ్యంలోనూ ఇంత పెద్ద పరిణామం జరిగింది. పంజాబ్‌లోనే కాకుండా దేశంలో కూడా చన్నీకి గుర్తింపు వచ్చేసింది. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కాంగ్రెస్‌ ఇప్పటికైనా గ్రహించాలి. అప్పుడు మాత్రమే ఈ వర్గాలనుంచి భవిష్యత్తులోనైనా ప్రధాని కాగలరు.

చక్కటి ఆధునిక విద్య, పాలనానుభవంతోపాటు క్షేత్రస్థాయిలో పార్టీ పని చేయగలిగిన వ్యక్తులను ఎదిగేందుకు కాంగ్రెస్‌ పార్టీ అవకాశ మివ్వాలి. వారి విద్య, కమ్యూనిటీ నేపథ్యం ఏదైనా, ఢిల్లీనుంచి రుద్దబడిన నాయకులు ఎవరూ ఎన్నికల్లో గెలుపొందలేరు. ప్రస్తుత కుల పరిస్థితులు, సంక్షేమం, ఓటర్ల చైతన్యం వంటివి ఢిల్లీలో అధిష్టాన వ్యవహార తీరుకు భిన్నంగా నడుస్తున్నాయి. పంజాబ్‌లో ముఖ్య మంత్రి పదవికి చన్నీని ఎంపిక చేయడమనేది కచ్చితంగా కొత్త మార్గాన్ని సూచిస్తోంది.
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

ప్రజాకర్షణ, క్షేత్రస్థాయి పునాది కలిగిన ప్రాంతీయ నేతలను వరుసగా దూరం చేసుకున్నందుకే కాంగ్రెస్‌ ఇవాళ పతనావస్థను చవిచూస్తోంది. మమతా బెనర్జీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మొదలైన ఈ పరిణామం ఇప్పుడు బలమైన ప్రాంతీయ నేతలు లేని దుఃస్థితికి కాంగ్రెస్‌ని నెట్టింది. ఈ నేపథ్యంలో దళిత నేపథ్యం కలిగిన చన్నీని పంజాబ్‌ ముఖ్యమంత్రిని చేయడం, ప్రధాని భద్రతా వివాదంలో చన్నీ హీరో కావడం– కాంగ్రెస్‌ కొత్త మార్గంలో పయ నించాలని సూచిస్తున్నాయి. శూద్ర, దళిత, ఆదివాసీ మూలాలు కలిగిన ఇలాంటి తెగువ, చేవ ఉన్న విద్యాధిక నేతలను ప్రతి రాష్ట్రంలోనూ ప్రోత్సహించా ల్సిన అవసరాన్ని కాంగ్రెస్‌ ఇప్పటికైనా గ్రహించాలి. అధిష్ఠానం ఆశీస్సులు మాత్రమే ఉన్న నాయకులు ఓట్లను రాబట్టలేరని అర్థం చేసుకోవాలి.

ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
 

మరిన్ని వార్తలు