భారత మహిళలకు కమల ఆదర్శం

14 Nov, 2020 00:34 IST|Sakshi

విశ్లేషణ

శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్న మొట్టమొదటి ఆసియన్‌గా, భారత, నల్లజాతి మూలాలు కలిగిన వ్యక్తిగా కమలా హ్యారిస్‌ చరిత్ర సృష్టించనున్నారు. సముద్రాలను దాటి పరదేశాలవైపు ప్రయాణిస్తే తమ సంప్రదాయాలు కలుషితమవుతాయని వందేళ్ల క్రితం వరకు భారతీయ పురుషులు తటపటాయించిన చరిత్రకు భిన్నంగా కమల కొత్తదారి పట్టారు. జెండర్, జాతి, కులం, వర్గంతో పనిలేకుండా దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అనే మత విశ్వాసంతో.. మానవ సమానత్వం పట్ల నిబద్ధత వహించిన వ్యక్తిగా కమల నుంచి నేర్చుకుందాం. కమల తల్లి, ఇప్పుడు కమల జీవితం నుంచి భారతీయ మహిళలు పాఠం నేర్చుకోవలసి ఉంది. ఒక మహిళ కుల, జాతి వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకుంటే సాహసంతో ఆ పని చేయవచ్చని వారిద్దరూ నిరూపించారు.

నిస్సందేహంగా అమెరికా ఒక ప్రపంచ శక్తి. దాన్ని సవాల్‌ చేయడానికి చైనా ప్రయత్నిస్తున్నప్పటికీ సమీప భవిష్యత్తులో అది విజయం సాధించకపోవచ్చు. ఇప్పటినుంచి అనేక సంవత్సరాల వరకు అమెరికా ప్రజాతంత్ర నైతికత, దాని అత్యంత అధునాతనమైన పెట్టుబడిదారీ సంపద ఈ ప్రపంచాన్ని పాలించబోతోంది. అలాంటి అమెరికాకు భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్‌ తన భుజాలపై నల్ల ముద్రను తగిలించుకుని మొట్టమొదటి ఉపాధ్యక్షురాలిగా మారుతున్నారు. ఇది భారతీయులకు ప్రత్యేకించి భారత మహిళలందరికీ నిస్సందేహంగా గర్వించదగిన విషయమే అవుతుంది.

శ్వేతసౌధం పాలనా భవనంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆమె రెండు చేతుల్లో అనేక ప్రథమ పతాకాలను తనతో తీసుకెళతారు. రంగు తెలుపైనా, నలుపైనా ఆ స్థానంలోకి వెళుతున్న మొట్టమొదటి అమెరికా మహిళ ఆమె. ఉపాధ్యక్ష పీఠం అధిష్టించబోతున్న తొలి ఆసియన్‌ మహిళ, తొలి భారత సంతతి మహిళ.. ఆ రకంగా ప్రథమ భారత మహిళ కూడా. నల్లజాతి, బ్రాహ్మణ నేపథ్యాలు కలగలసిన భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌. ఏరకంగా చూసినా ఇది ఒక అరుదైన, అసాధారణమైన సమ్మేళనం అనే చెప్పాలి. జాతివివక్ష కొనసాగుతున్న దేశంలో భారతీయ బ్రాహ్మిన్‌ నుంచి నల్లజాతితత్వం వరకు ఎంతో అనురక్తితో కమలా హ్యారిస్‌ పొందిన ఈ పరివర్తన అత్యంత అరుదైన సందర్భాల్లో ఒకటిగా నిలుస్తుంది. చరిత్రలో చాలా కాలంపాటు బ్రాహ్మణ పురుషులు సముద్రాలను దాటి ప్రయాణించేవారు కాదు. అలా ప్రయాణిస్తే తమ సంప్రదాయాలు కలుషితమవుతాయని వారు భావించేవారు.

భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లిన బికాజీ బల్సారా అనే పార్సీ వ్యక్తి 1910లో మాత్రమే కోర్టు తీర్పు ద్వారా మొట్టమొదటి అమెరికన్‌ తటస్థ పౌరుడయ్యారు. తెల్లరంగు కలిగిన పార్సీకి అమెరికా పౌరసత్వం పొందే హక్కును కోర్టు అనుమతించింది. అంతకుముందు కొంతమంది సిక్కులు అమెరికాకు కూలీలుగా వలసవెళ్లి పౌరసత్వం పొందని చట్టవిరుద్ధ కూలీలుగా దశాబ్దాలపాటు అక్కడే పనిచేస్తూ ఉండేవారు. తర్వాత ఏకే మజుందార్‌ అమెరికాకు వలసవెళ్లి 1913లో అమెరికన్‌ పౌరసత్వం తీసుకున్న మొట్టమొదటి బ్రాహ్మణుడిగా చరిత్రకెక్కారు. తాను ఆర్య జాతికి చెందినవాడిని కనుక కకేసియన్‌ అమెరికన్‌ శ్వేతజాతికి సరిసమానుడైన వ్యక్తిని అని న్యాయస్థానంలో మజుందార్‌ వాదించారు. ఆ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఆ సమయంలో అమెరికాలో జాతి ఆధిక్యతా భావం మన దేశంలోని కులాధిక్యతలాగే తీవ్ర స్థాయిలో ఉండేది.

కమలా హ్యారిస్‌ తాత పీవీ గోపాలన్‌ ఒక సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. తమిళనాడులో 1940, 50లలో పెరియార్‌ రామస్వామి నాయకర్‌ సాగించిన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి నిరసన తెలిపిన క్రమంలోనే మధ్యతరగతి ఇంగ్లిష్‌ విద్యాధిక బ్రాహ్మణులు వలస పోవడం మొదలైంది. 1950, 60లలో అమెరికాకు ఉన్నతవిద్యకోసం వలసవెళ్లిన కొద్దిమంది భారతీయులు అక్కడే స్థిరపడిపోయారు. కానీ ఆ కాలంలో ఉన్నతవిద్యకోసం అమెరికాకు పెద్దగా మహిళలు వెళ్లిన చరిత్ర లేదు. అలాంటి స్థితిలో కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ సైన్స్‌లో ఉన్నత విద్య కోసం 1958లో అమెరికాకు వెళ్లారు.

నల్లజాతికి చెందిన స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ ఆర్థికశాస్త్ర ఉపాధ్యాయుడు డోనాల్డ్‌ జాస్పర్‌ హ్యారిస్‌ని ఆమె పెళ్లాడారు. ఈయన జమైకా నుంచి అమెరికాకు వలస వచ్చిన వ్యక్తి. ఇద్దరు బాలికలకు (కమలా, మాయా) జన్మనిచ్చిన తర్వాత కొద్ది కాలానికే డాక్టర్‌ హ్యారిస్‌ ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయారు. శ్యామల నల్లజాతి పౌరహక్కుల కార్యకర్తగా అమెరికాలో నివసించారు. ఒక తమిళ బ్రాహ్మణ మహిళ అమెరికాలో అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా అత్యంత అరుదైన ఘటన.

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ నేతృత్వంలో పౌరహక్కుల ఉద్యమం 1960ల నాటి అమెరికాలో పతాక స్థాయికి చేరుకుంది. తన భర్త మతమైన ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌గా కమల మారింది. కానీ తరచుగా ఆమె హిందూ దేవాలయాలను కూడా దర్శించేది. కమల ప్రొటెస్టెంట్‌ క్రిస్టియన్‌ నేపథ్యం అటార్నీ, సెనేట్, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికల్లో ఆమెకు సహకరించింది. జోబైడెన్‌ కేథలిక్‌ క్రిస్టియన్‌. అందుకనే భారతీయ నల్లజాతికి చెందిన ప్రొటెస్టెంట్‌ నేపథ్యం ఉన్న కమలా హ్యారిస్‌ను జో ఎంపిక చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి అది ఎంతగానో పనిచేసింది. శ్యామల తండ్రి పీవీ గోపాలన్‌ బ్రిటిష్‌ పాలనాయంత్రాంగంలో ఒక ప్రభుత్వోద్యోగి.

శ్యామల ఢిల్లీలోని లేడీ ఇర్విన్‌ కాలేజీలో డిగ్రీ చదివారు. తర్వాత ఉన్నత విద్యకోసం బర్క్‌లీ వర్సిటీకి వెళ్లారు. అక్కడే ఆమె తన జమైకన్‌ భర్తను కలిశారు. సాధారణంగా తమిళ బ్రాహ్మణులు సంప్రదాయ వైష్ణవులు. శ్యామల తన ఈ నేపథ్యాన్ని అధిగమించి తన సాంస్కృతిక వారసత్వానికి పూర్తిగా భిన్నమైన ఒక నల్లజాతి వ్యక్తిని పెళ్లాడింది. ఇదే ఒక విప్లవాత్మక చర్య. కమల హార్వర్డ్, కాలిఫోర్నియా వర్సిటీలలో లా చదువుకున్నారు. అమెరికాలో చాలామంది న్యాయవాదులు లా ప్రాక్టీసు చేస్తూనే రాజకీయాల్లోకి ప్రవేశించేవారు. జో బైడెన్, బిల్‌ క్లింటన్, ఒబామా కూడా లాయర్లే. కమల విజయవంతమైన లాయర్‌గా, రాజకీయనేతగా ఆవి ర్భవించారు.

ఈ నేపథ్యంలోనే యూదు అమెరికన్‌ను పెళ్లాడారు. మొట్టమొదటి ఉపాధ్యక్షురాలైన కమల అమెరికా అధ్యక్షురాలిగా కూడా కావచ్చు. ఈ నవంబర్‌ 20 నాటికి 78 సంవత్సరాలు పూర్తయ్యే జో బైడెన్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తిన పక్షంలో కమల దేశాధ్యక్షురాలు కావచ్చు. లేదా ఉపాధ్యక్షురాలిగా తాను సమర్ధురాలిని అని నిరూపించుకున్న పక్షంలో రాబోయే సంవత్సరాల్లో నేరుగా అధ్యక్షపదవికి పోటీ చేయవచ్చు కూడా. భారతీయులుగా మనం అమెరికాలో కమలా హ్యారిస్‌ ఉత్థానం నుంచి నేర్చుకోవలసిన పాఠం ఒకటుంది. జెండర్, జాతి, కులం, వర్గంతో పనిలేకుండా దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించాడు అనే మత విశ్వాసంతో మానవ సమానత్వం పట్ల నిబద్ధత వహించిన వ్యక్తిగా కమల నుంచి నేర్చుకుందాం. ఒక మహిళ కుల, జాతి వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకుంటే అత్యంత సాహసంతో  ఆ పని చేయవచ్చని శ్యామల, కమల నిరూపించారు.

శ్వేతసౌధంలో కమల పోషించే పాత్ర భారత్‌కు ఎలా ఉపకరి స్తుంది? వచ్చే నాలుగేళ్లలో భారత ప్రభుత్వానికి, బైడెన్‌–హ్యారిస్‌ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉండబోతుంది? పోలిస్తే కమల, బైడెన్‌లు కశ్మీర్‌ సమస్యపై విభిన్న దృక్పథాన్ని కలిగి ఉన్నారు. కమల భారతీయ మూలాలు కలిగి ఉండటం ఒక అంశం కాగా, మోదీ ప్రభుత్వ విధానాలపై వారి ప్రభుత్వ దృక్పథం ఏమిటనేది మరో అంశం. హౌస్టన్‌లో అమెరికన్‌ ఇండియన్‌ ర్యాలీలో అమెరికా గడ్డపై ‘ఆబ్‌కీ బార్‌ ట్రంప్‌కీ సర్కార్‌’ వంటి ప్రకటనలు చేయడంద్వారా ప్రధాని మోదీ అనేక దౌత్యవిరుద్ధ ప్రకటనలు చేసి ఉన్నారు.  

భారత్‌లో కూడా ఈ మార్చి నెలలో అహ్మదాబాద్‌ బహిరంగ సభను నిర్వహించిన మోదీ మరోసారి ట్రంప్‌ అధికారంలోకి రావాలన్న ఉద్దేశాన్ని ప్రకటించారు. అయితే మోదీ ప్రభుత్వం ట్రంప్‌ అనుకూల ప్రదర్శనలు ఎన్ని చేసినప్పటికీ అమెరికన్‌ భారతీయుల్లో ఎక్కువమంది బైడెన్‌–హ్యారిస్‌ ప్రచారానికి అనుకూలంగా ఓటేశారు. 2019 ఎన్నికల్లో గెలిచాక, మోదీ ప్రభుత్వం అంతర్గతంగా, విదేశీ విధాన పరంగా తీసుకున్న చర్యలు భారత్‌ను సంక్షోభం నుంచి సంక్షోభం లోకి నెట్టాయి. మోదీ మానవ హక్కుల సమస్యపై తన వైఖరిని మార్చుకోవడంపైనే అమెరికాతో తన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. భారతీయ మూలాలు ఉన్నాయి కాబట్టి కమలా హ్యారిస్‌ ఈ అంశంపై కాస్త ఔదార్యంతో వ్యవహరించే ప్రసక్తే ఉండకపోవచ్చు.

వ్యాసకర్త 
ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు