అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!

8 Jan, 2022 00:44 IST|Sakshi

ఇటీవల జరిగిన ధర్మసంసద్‌ వ్యాఖ్యానాలు భారత సామరస్య వాతావరణాన్ని దెబ్బకొట్టేలా ఉన్నాయి. బ్రాహ్మణవాదాన్ని మోసే వీళ్లందరి ధోరణి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సవాల్‌ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తమ ఎజెండాను అమలు చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ శూద్రులు, ఓబీసీలను కూడా హిందూమతంలో భాగమని చెప్పే వీళ్లందరూ బీజేపీ ప్రకటిత ‘సబ్‌ కా సాథ్‌... సబ్‌ కా వికాస్‌’ నినాదాన్ని నిజం చేయాల్సి ఉంది. వాస్తవికంగా ఆ వర్గాల వారిని పైకి తెచ్చేలా, వారి కోసం స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక ప్రకటించాల్సిన అవసరం ఉంది.

హరిద్వార్‌లో నరసింగానంద్‌ తదితరులు ఇటీవల నిర్వహించిన ధర్మసంసద్‌ భారత సామరస్య వాతావరణానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా అలాంటి సమావేశం ఒకటి జరిగే అవకాశం లేనట్లే. కానీ ప్రశ్నల్లా ఆ సమావేశం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఆమోదం లేకుండానే, లేదా అందులోని పైస్థాయి నాయక గణంలో కొందరికైనా తెలియకుండానే జరిగిందా అన్నదే. ముస్లింల హననానికి బహిరంగంగా పిలుపునిచ్చిన వక్తల వ్యవహారం కేవలం మైనార్టీ వర్గాల ఉనికికి సంబంధించిన విషయం కానే కాదు.

మహాత్మా గాంధీ హంతకుడు నాథూరామ్‌ గాడ్సే పేరును పదే పదే ప్రస్తావిస్తూండటం... మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూండటాన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని సైతం వీరు నేరుగా సవాలు చేస్తున్నట్లు కనిపి స్తోంది. భారత దేశం నుంచి ఇస్లాంను చెరిపివేయడం అసాధ్యమనీ, భారతీయ ముస్లింలు ఒంటరి వారు కాదనీ ధర్మసంసద్‌ నిర్వాహ కులకు స్పష్టంగా తెలుసు. ఇలాంటి వారు ఇస్లామిక్‌ ప్రపంచపు శక్తికి ఎదురొడ్డడం, అది కూడా ఆర్‌ఎస్‌ఎస్‌/భారతీయ జనతా పార్టీల పూర్తిస్థాయి మద్దతు ఉన్నా కూడా అసాధ్యం. 

‘సాధు సమాజం’ ఇటీవలి కాలంలో జాతీయ అంశాల్లో జోక్యం చేసుకోవడం ఎక్కువవుతోంది. కాకపోతే కుల భావజాలపరంగా వీరంతా బ్రాహ్మణవాదులే. హిందూమతంలో భాగమని నమ్మే శూద్రుల్లో సాధువులు అయినవారు అతితక్కువ. చారిత్రకంగా చూస్తే శూద్రులను సాధువులయ్యేందుకు అనుమతించే వారు కూడా కాదు.
నరేంద్ర మోదీ విషయాన్ని తీసుకుంటే.. ఆయనేమో తనను తాను ఓబీసీ ప్రధానిగా ప్రకటించుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో విజయం తరువాత మొదలైన రెండో టర్మ్‌లో పరిస్థితి ఆయన చేయిదాటిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌  ఈ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని తన అజెండాను అమలు చేయడం మొదలు పెట్టింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో ముస్లింలు, వారికి సంబంధించిన పలు అంశాలున్నాయి. 2014–2019 మధ్యకాలంలో వీటిని సంఘ్‌ వర్గాలు దూరం పెట్టాయి. మోదీ కూడా ఢిల్లీ గద్దెకు కొత్తయినా సాధికారికంగా పెత్తనం చలాయించగలిగారు. 

2019 ఎన్నికలు వచ్చే సమయానికి  యాంటీ పాకిస్తాన్, ముస్లిం వ్యతిరేక రొడ్డకొట్టుడు నినాదాలు, వివాదాలను రెచ్చగొట్టే అవకాశం బీజేపీకి లేకుండా పోయింది.  ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత అమిత్‌ షా భవిష్యత్తు ప్రణాళికను ఆచరణలో పెట్టాడు. ముందుగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, ఆ తరువాత ట్రిపుల్‌ తలాఖ్, సిటిజన్‌షిప్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్, జాతీయ సంస్థల్లో ముస్లింల ఉనికిని పరిమితం చేయడం వంటి చర్యలన్నీ ఈ ప్రణాళికలో భాగమే. వీటిల్లో కొన్నింటికి శూద్ర/ఓబీసీ వర్గాల్లోని కొందరి మద్దతు కూడా లభించింది. ఈ చర్యల వల్ల తమకు లాభం కలుగుతుందని వారు భావించడం దీనికి కారణం. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ శూద్రులు/దళితులు, ఆదివాసీల కోసం  ఎలాంటి ప్రణాళిక, అజెండా సిద్ధం చేయలేదు– వాళ్లంతా హిందువులే అని పదేపదే చెప్పడం మినహా! సంఘ్‌ వ్యవస్థలోనూ శూద్రులు/ఓబీసీ వర్గాలకు చెందిన వారు ఎవరూ సిద్ధాంతకర్తలుగా ఎదిగే అవకాశం ఇవ్వలేదు. శూద్రులు, ఓబీసీలకు సంబంధించి అజెండాలో రిజర్వే షన్లు, అధికారంలో భాగస్వామ్యం, విద్య వంటి రాజకీయ, సామాజిక అజెండాలు కూడా సంఘ్‌ వ్యవస్థకు వెలుపల పుట్టుకొచ్చినవే. కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న సమయాల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌ వీటిల్లో ఏ ఒక్క అంశాన్ని కూడా లేవనెత్తింది లేదు. 

శూద్రులు, ఓబీసీల్లో అధికులు రైతులు. వ్యవసాయ చట్టాల రూపకల్పనతో తమపై జరిగిన తొలి దాడిని వారు గుర్తించారు. విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్న సంఘ్‌ కూడా రైతుల నుంచి రాగల వ్యతిరేకతను ముందుగానే గుర్తించలేదని అనుకోవడం అనూహ్యం. మొండిగా వారిని అణచివేయాలని అనుకున్నారు. కానీ వ్యూహం కాస్తా బెడిసికొట్టింది. ప్రధానిగా మోదీ ‘‘సబ్‌ కా సాథ్‌... సబ్‌ కా వికాస్‌’’ అన్న నినాదమే ఇవ్వకపోయి ఉంటే శూద్రులు, ఓబీసీలు ఆయనను ఎప్పుడూ నమ్మి ఉండే వారు కాదని నా భావన. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘచాలక్‌ మోహన్‌ భాగవత్‌ మాటలను కొంచెం జాగ్రత్తగా గమనిస్తే... ‘‘సబ్‌ కా సాథ్‌... సబ్‌ కా వికాస్‌’’ అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు తాను కానీ.. తన సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్‌) కానీ ప్రయత్నిస్తుందని ఎక్కడా సూచన ప్రాయంగానూ చెప్పలేదని స్పష్టమవుతుంది.

వాస్తవానికి 2014 ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నంత సమయమూ మోహన్‌ భాగవత్‌ నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది ఒకటి ఉందన్న విషయమూ ఎవరి దృష్టిలో లేకుండా ఉండింది. మోదీ ఓబీసీ నేపథ్యం గురించి ప్రజలకు తెలుస్తున్న కొద్దీ మోహన్‌ భాగవత్‌ జాతీయ స్థాయిలో ‘కనిపించడం’ మొదలైంది. వివిధ వేదికల్లో మాట్లాడుతూ రిజర్వేషన్లు, మైనార్టీ అజెండాలపై తన వ్యతిరేకతను వెళ్లగక్కారు. రిజర్వేషన్లపై చర్చ జరగాలనడం, మదర్‌ థెరెసాకు చెందిన సంస్థలపై దాడుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఓట్లు, అధికారం కోసం మోదీ ఎలాంటి హామీలైనా ఇవ్వనీ అన్న చందంగా ఆర్‌ఎస్‌ఎస్‌ 2014 ఎన్నికల వ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం అత్యంత శక్తిమంతమైన మోదీ ప్రభుత్వం చేతుల్లోంచి కూడా వ్యవస్థ చేయిదాటినట్లుగా అనిపిస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే– అంతర్జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా పాశ్చాత్య క్రిస్టియన్‌ ప్రపంచంలో మోదీ ఇమేజ్‌ను పెంచే ప్రయత్నం జరుగు తున్నట్లుగా అర్థమవుతుంది. పోప్‌ను కలిసి భారత్‌ రావాల్సిందిగా మోదీ ఆహ్వానించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు.  భారత్‌లో క్రిస్టియన్‌ అజెండా అమలుకు పోప్‌ ప్రయత్నిస్తున్నాడని వారు భావిస్తూండటం ఇందుకు కారణం. అయితే క్రిస్‌మస్‌కు ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చర్చిలపై దాడులు మొదలయ్యాయి. దాడులకు పాల్పడిన వారిలో అధికులు అగ్ర కులాలకు చెందిన వారే.

చిత్రకూట్‌లో డిసెంబరు 16న జరిగిన హిందూ మహా కుంభ్‌లో మోహన్‌ భాగవత్‌ ‘ఘర్‌ వాపసీ’కి పిలుపునిచ్చారన్నదీ ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చర్చిలపై జరిగిన దాడులపై దేశమంతా ఆవేదన వ్యక్తమవుతున్న సమయంలో హోంశాఖ మదర్‌ థెరెసా హోమ్స్‌కు సంబంధించిన ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించింది. అది కూడా సరిగ్గా క్రిస్‌మస్‌ రోజునే! కొన్నేళ్ల క్రితం మోహన్‌ భాగవత్‌ స్వయంగా మదర్‌ థెరెసా గురించి చెప్పిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ‘‘మదర్‌ థెరెసా పేదలకు చేసిన సేవల వెనుక వారిని క్రైస్తవం వైపు మళ్లించా లన్న దురుద్దేశం ఉంది’’ అని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.  మోదీ ఇప్పటివరకూ క్రిస్టియానిటీపై ఆ స్థాయిలో ఎప్పుడూ మాట్లాడలేదు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో అత్యధికం క్రైస్తవాన్ని ఆచరించేవే. పోప్‌ను ఆహ్వానించడం ద్వారా దేశంలో జరిగిన క్రైస్తవ వ్యతిరేక చర్యలను కొంతవరకైనా సర్దుకోవచ్చునని మోదీ అనుకుని ఉండవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో సంఘ్‌ నెట్‌వర్క్‌ ఆ ఆలోచనకు పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీంతో ‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌’ అన్న నినాదాన్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది.

హరిద్వార్‌లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. మోదీ కూడా ఇలాంటి ప్రణాళికాబద్ధమైన నేరాలు జరిగినన్ని సార్లూ మౌనాన్నే ఆశ్రయించారు. కానీ హరిద్వార్‌ అంశంపై మోదీ మౌనం ప్రభుత్వానికి పెద్ద దెబ్బే. రైతు ఆందోళనల తరువాత జరిగిన ఈ ఘటనకు మరింత ప్రాధాన్యమేర్పడింది. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిందేమీ కాదు. సంఘ్‌ వర్గాల్లో ఏదో మథనం సాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈలోపు దేశం మాత్రం అన్ని రకాల సమస్యలూ ఎదుర్కొంటోంది!


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు