ఈ సంక్షోభానికి అసలు మూలం

14 Mar, 2022 00:33 IST|Sakshi

సమకాలీనం

ఈరోజు ప్రపంచం మొత్తం పుతిన్‌ గురించి మాట్లాడుతోంది. కానీ రష్యాలో పాతుకుపోయిన సనాతన మతతత్వమే అసలు సమస్య. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్‌ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా అక్కడి సనాతన మతం వ్యతిరేకిస్తోంది. ఈ రాజకీయ, ఆధ్యాత్మిక, సామాజిక పునాదే నేడు పుతిన్‌ను ఇలా తయారు చేసింది. ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్‌ తాలిబనిజం, రష్యన్‌ సనాతనవాదం వంటి పలురకాల మత ఛాందసవాదాలతో తలపడుతోంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్‌ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, ఉదారవాద మత ప్రపంచం తమ ప్రజాస్వామ్యం, లౌకికవాదాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించక తప్పదు.

ఆధునిక కాలాల్లో పాలకవర్గ రాజకీయ శక్తులు తీవ్రమైన మత లేదా మత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగితేలడం అత్యంత ప్రతికూల పరిణామాలను తీసుకొస్తుంది. రష్యన్‌ అనుభవం దీన్ని స్పష్టంగా ప్రదర్శిస్తోంది. రష్యాలో కమ్యూనిస్టు దశ సంపూర్ణంగా మత వ్యతిరేకతతో కూడుకుంది. కమ్యూనిస్టు పాలనలో భయంకరమైన బాధలకు గురైన సనాతన చర్చితో ఇప్పుడు పుతిన్‌ రష్యా ప్రగాఢంగా ముడిపడివుంది. 

20వ శతాబ్ది ప్రారంభం నుండి రష్యన్‌ సమాజం, ప్రభుత్వం– రెండూ మత సమస్యపై అత్యంత తీవ్రమైన వైఖరులను తీసుకున్నాయి. బోల్షివిక్‌ విప్లవం తర్వాత రష్యాలో మత వ్యతిరేక ప్రచారం ఎంత తీవ్రంగా సాగిందంటే, చర్చికి సంబంధించిన చిహ్నాలు, భవనాలను కూల్చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు అప్పటికీ మతస్ఫూర్తితో ఉంటున్నందున ప్రజలందరూ నాస్తికత్వాన్ని పాటించాలని కమ్యూనిస్టులు భావించేవారు. ఇప్పుడు రష్యన్‌ అధ్యక్షుడు పుతిన్‌... మతాచరణను రాజ్యవిధానంగా నమ్మాలని ప్రజలను బలవంతపెడుతున్నారు. రష్యన్‌ సనాతన చర్చి ప్రామాణికమైన పితృస్వామిక వ్యవస్థ నేతృత్వంలో ఉండేది. ఇది రోమన్‌ కేథలిక్‌ మతతత్వానికి భిన్నమైనది. అందుకే పుతిన్‌ నిరంకుశ వ్యవస్థను పూర్తిగా సమర్థించడం, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని బలపర్చడమే కాకుండా యుద్ధానికి అవసరమైన బలగాలను కూడా ఇది సమీకరించింది.

రష్యన్‌ చరిత్ర, జాతీయత పట్ల సనాతన చర్చి వ్యాఖ్యానం సరిగ్గా ఇతర ఆధ్యాత్మిక మతతత్వాలను అచ్చుగుద్దేలా ఉంటుంది. మతం అనేది జాతిని నిర్వచించే కీలక వనరుగా మారిపోయినప్పుడు ప్రతి అంశంలోనూ ఛాందసవాదం పాతుకుపోతుంది. రష్యాలో ఉక్రెయిన్‌ భాగమని రష్యన్‌ సనాతన మతబోధకులు నమ్ముతారు. ఎందుకంటే రష్యన్‌ సనాతన చర్చి ప్రస్తుత ఉక్రెయిన్‌ ప్రాంతంలో 10వ శతాబ్దంలో పుట్టింది. సెయింట్‌ ఆండ్రూస్‌ కీవన్‌ రస్‌ ప్రాంతంలో తొలి చర్చిని నెలకొల్పినట్లు చెబుతారు. అదే ఇప్పుడు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ పేరుతో చలామణిలో ఉంది. రష్యా, ఉక్రెయిన్, బెలారస్‌లను సనాతన అఖండ రష్యాగా చెప్పేవారు. దీనికీ... ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను సనాతన హిందూ ప్రాంతాలుగా గుర్తిస్తూ అఖండ భారత్‌ గురించి ఆరెస్సెస్‌ నేతలు చెప్పేదానికీ ఏమాత్రం వ్యత్యాసం లేదు. సోవియట్‌ యూనియన్‌ శాంతియుతంగా విచ్ఛిన్నమైపోవడం ఆమోదించకూడదనీ, కనీసం సనాతన చర్చి కేంద్రంగా ఉన్న రష్యాను ఎలాగైనా సరే మళ్లీ ఐక్యపర్చాలనీ భావిస్తున్న సనాతన మతబోధకుల నుండి పుతిన్‌ ఈ థియరీని తీసుకొచ్చారు. సనాతన చర్చిలో కూడా అసమ్మతివాదులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ చాలావరకు సనాతన నేతలు పుతిన్‌తో ఉంటున్నారు. ఈ రోజు ప్రపంచం మొత్తంగా పుతిన్‌ గురించి మాట్లాడుతోంది కానీ సమస్య ఒక్క పుతిన్‌ మాత్రమే కాదు. మొత్తం సనాతన మతతత్వానికి చెందిన మత జాతీయతే అసలు సమస్య. 

రోమన్‌ కేథలిక్‌ చర్చితో సనాతన రష్యన్‌ చర్చి విభేదించడంలో కొన్ని మౌలిక సమస్యలు ఉన్నాయి. అలాగే పశ్చిమాన ప్రొటెస్టెంట్‌ చర్చితో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. సనాతన చర్చి మద్దతుతో పుతిన్‌ రష్యాకు ఎదురులేని నేతగా మారిన తర్వాత రష్యాలోని రోమన్‌ కేథలిక్కులపై హింసాత్మకంగా దాడి చేయడం మొదలైంది. గర్భస్రావాలపై, స్వలింగ వివాహాలపై రోమన్‌ చర్చి కాస్త ఉదారవాద దృక్పథం తీసుకోవడమే కాకుండా ఉదారవాద డ్రెస్‌ కోడ్‌ను కూడా పాటిస్తూ వచ్చింది. దీంతో ఇవన్నీ పాశ్చాత్య ప్రపంచ ఆధునికానంతర దశలో చొచ్చుకువచ్చిన అనైతిక విధానాలుగా సనాతన చర్చి భావించేది. 

పాశ్చాత్య ఉదారవాదులను సనాతనవాద రష్యన్లు తమ శత్రువులుగా భావించేవారు. అయితే రష్యన్లు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నారని దీని అర్థం కాదు. కమ్యూనిస్టు దశలో శ్రామికవర్గ నియంతృత్వ భావన రష్యన్‌ ప్రజల మనస్తత్వంపై ప్రతికూల ప్రభావం కలిగించింది. కమ్యూనిస్టు పాలనలో వారి అనుభవం వల్ల కావచ్చు. ప్రత్యేకించి సనాతన భావాలు కలిగినవారు సనాతన నిరంకుశ రాజకీయ పాలననే గట్టిగా విశ్వసిస్తున్నారు. నేటి రష్యాను ఆధ్యాత్మిక రాజ్యంగా మనం పిలవలేనప్పటికీ పుతిన్‌ వంటి స్వార్థ కాంక్షగల పాలకులు ఇలాంటి సనాతన వాతావరణాన్ని క్రమేపీ ఆధ్యాత్మిక నిరంకుశత్వంలోకి సులువుగా తీసుకుపోతారు. 

ఉదారవాదం, లౌకికవాదం రెండూ ప్రమాదకరమైన సిద్ధాంతాలని రష్యన్‌ సనాతనవాదులు నమ్ముతున్నారు. కమ్యూనిజం, సోషలిజం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించడమే కాదు, రష్యన్‌ సమాజంలోకి సనాతన వ్యతిరేక విలువలను తీసుకొచ్చిన ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని కూడా సనాతన చర్చి వ్యతిరేకిస్తోంది. పుతిన్‌ మితవాద నిరంకుశత్వం చాలా ఉపయోగకరమని ఇలాంటి జాతీయవాద ప్రాపంచిక దృక్పథాలు భావిస్తున్నాయి. తమ పొరుగున ఉన్న ఉక్రెయినియన్‌ ప్రజాస్వామ్యం తమ మితవాద, లాంఛనప్రాయమైన ఎన్నికలతో కూడిన నిరంకుశత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సనాతన చర్చి భావిస్తోంది. 

చైనా తరహా మార్కెట్‌ కమ్యూనిజాన్ని రష్యన్లు కోరుకోవడం లేదు. కమ్యూనిస్టు వ్యవస్థలు ప్రజల ఆధ్యాత్మిక స్వయంప్రతిపత్తిని నిర్మూలించడమే కాకుండా ప్రజాజీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తూ రావడంతో... ప్రభుత్వమూ, మతమూ ఒకటిగా కలిసిపోయి ఉండే తరహా నియంతృత్వాన్ని రష్యన్‌ సనాతనవాదులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాన్ని, మతాన్ని విడదీయడానికి ఆస్కారమే లేని ఈ వ్యవస్థే పుతిన్‌ను సంపూర్ణంగా బలపర్చింది. చాలావరకు ముస్లిం దేశాలు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక నిరంకుశ రాజ్యవ్యవస్థలలోనే నడుస్తుంటాయి. కానీ ఇవి లౌకికవాదంతో ఘర్షణ పడవు. అఫ్గాన్‌ తాలిబనిజం ఒక్కటే అత్యంత తీవ్రరూపంలోకి మళ్లింది. మతం, రాజ్యవ్యవస్థ కలగలిసిన నిరంకుశత్వం... విభిన్న సామాజిక, రాజకీయ వ్యవస్థలను కొనసాగించదలుస్తున్న పొరుగుదేశాలతో యుద్ధాలు కోరుకుంటుంది. 

సోషలిస్టు వ్యవస్థలు కుప్పకూలిన తర్వాత ప్రపంచం తిరిగి సోషలిస్టు పూర్వ ఘర్షణల స్థాయికి చేరుకుంది. రష్యాలో ప్రజాస్వామిక సంక్షేమ జాతీయవాదం కాకుండా ఆధ్యాత్మిక జాతీయవాదమే జాతి కార్యాచరణను నిర్ణయిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం రష్యాను ఒక ధూర్తదేశంగా వర్ణిస్తున్నప్పటికీ తమపై ఈ ముద్రను ఆధ్యాత్మిక జాతీయవాదం లెక్కచేయదు. క్రిస్టియన్‌ ప్రపంచంలో ఈ దిశను రష్యా ఇప్పుడు చూపిస్తున్నట్లుంది. ఉక్రెయిన్‌ కూడా ప్రభుత్వాన్ని, చర్చిని నామమాత్రంగా మాత్రమే విడదీసే ప్రజాస్వామిక నమూనాను ఆమోదించే సనాతన క్రిస్టియానిటీని కలిగి ఉన్నది కనుక ఈ యుద్ధంలో ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.

ప్రపంచం ఇప్పుడు అఫ్గాన్‌ తాలిబనిజం, రష్యన్‌ సనాతనవాదం వంటి పలురకాల ఆధ్యాత్మిక ఛాందసవాదాలతో తలపడుతోంది. భారతదేశంలో హిందుత్వశక్తులు పదేపదే తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనీ, రాజ్యాంగ పరిధిలో నడుస్తున్నామనీ చెప్పుకుంటున్నప్పటికీ, మతపరమైన ఛాందసవాదం ఈ శక్తులను ఏవైపునకు తీసుకుపోతుందనేది చెప్పలేం. మతమనేది ప్రభుత్వ పాలనతో కలిసిపోయాక, ఒక పాలకుడు జీవితకాల పాలకుడిగా మారాలని అభిప్రాయానికి వచ్చాక, మతపర శక్తులు పౌరసమాజాన్ని దూకుడుగా నియంత్రిస్తాయి. ఎన్నికల వ్యవస్థను కూడా తారుమారు చేసినప్పడు ఏ వ్యవస్థ అయినా నియంతృత్వంలోకి వెళ్లి తీరుతుంది. ఈ యుద్ధంలో రష్యా గెలిచి ఉక్రెయినియన్‌ ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసినట్లయితే, క్రిస్టియన్‌ ప్రపంచం తమ జాతీయవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాద తత్వాల ప్రయోగంలో కొత్త దశలోకి ప్రవేశించడం ఖాయం.

ప్రొ‘‘ కంచ ఐలయ్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త
షెపర్డ్‌ 

మరిన్ని వార్తలు