విద్యార్థులు బలిపశువులు కారాదు!

4 Dec, 2021 02:55 IST|Sakshi

సాంకేతిక సమస్య కారణంగా గడువుతేదీ లోపు ఫీజు చెల్లించలేకపోయిన ఒక దళిత విద్యార్థికి తప్పకుండా సీటు కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవలే కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దంటూ సుప్రీంకోర్టు అసాధారణ వ్యాఖ్య చేయడం గమనార్హం. విద్యార్థి భవిష్యత్తు విషయంలో శిలాసదృశంగా ఉండొద్దని, కాస్త మానవీయ దృష్టితో వ్యవహరించాలని ఉన్నత న్యాయస్థానం హితవు చెప్పింది.

ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం నుంచి కోర్సు ముగింపు వరకు తీవ్రమైన ఇక్కట్లను ఎదుర్కొం టున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు ఈ తీర్పు ఒక ఆశా కిరణమై నిలిచింది. ఉన్నత విద్యను ఆశించి, అష్టకష్టాలు పడి సీటు సాధించి, ఉద్యోగ జీవితంలో కూడా వివక్ష పాలవుతున్న వెనుకబడిన వర్గాల పిల్లలకు... ప్రిన్స్, అతడి తండ్రి సాగించిన పోరాటం నిజంగానే స్ఫూర్తిదాయకం అవుతుంది.

పద్దెనిమిదేళ్ల దళిత కుర్రాడు ప్రిన్స్‌ జైబీర్‌ సింగ్‌కి 48 గంటలలోపు బాంబే ఐఐటీలో ప్రవేశం కల్పించాలని, సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిష్ఠా త్మక ఐఐటీలో చేరడానికి ఫీజు చెల్లింపు విషయంలో బ్యాంకు నుంచి జరిగిన సాంకేతిక లోపం కారణంగా ఈ విద్యార్థి గడువుతేదీ లోగా ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో అతడికి ప్రవేశార్హత లేదని అధికారులు ప్రకటించారు.

తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక సాంకేతిక తప్పిదానికి ఆ కుర్రాడి భవిష్యత్తు పట్ల అమానవీయ దృష్టితో వ్యవహరించడం తగదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ సమస్య మానవీయ కోణానికి సంబంధించింది కాబట్టి నియమనిబంధనలను శిలాసదృశంగా పాటించకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున ఆ విద్యార్థికి ప్రవేశం కల్పించడం చెడు పరిణామాలకు దారి తీస్తుందని బాంబే ఐఐటీ అధికారులు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

తాను చేయని తప్పుకు ఆ విద్యార్థిని బలిపశువును చేయవద్దని, ఒక యువకుడి భావి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో వీలైనంత సహాయం చేసి అతడికి మేలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో భారత పీడిత ప్రజానీకంలో మన న్యాయవ్యవస్థ కాస్త ఆశలు నిలిపినట్లయింది.

ఐఐటీ బాంబేలో తన స్థానంకోసం ప్రిన్స్‌ అనే పేరున్న ఈ దళిత కుర్రాడు చేసిన పోరాటం కానీ, ఈ క్రమంలో తాను సాధించిన విజయం కానీ సాధారణమైంది కాదు. ఇది ఇజ్రాయెల్‌ జానపద గాథల్లో గోలియెత్‌ని ఓడించిన  గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన డేవిడ్‌ను తలపించింది. ఒక దళిత కుర్రాడు అందులోనూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రిన్స్‌ అనే పేరు పెట్టుకోవడం అసాధారణమే అని చెప్పాలి. ప్రిన్స్‌ అంటే ఇంగ్లిష్‌లో ‘ఎదుగుతున్న పాలకుడు’ అని అర్థం. 

అన్యాయానికి మూలం ఇదా?
బాంబే ఐఐటీకి చెందిన జాయింట్‌ సీట్‌ అలోకేషన్‌ అథారిటీలోని అధికారులు ప్రిన్స్‌ అనే పేరు కల ఈ కుర్రాడి దళిత మూలాలను అనుమానించి ఉండవచ్చు. కానీ నిర్దేశించిన సమయంలోనే ఈ కుర్రాడి సోదరి ఐఐటీ పోర్టల్‌లో అవసరమైన అన్ని పత్రాలనూ అప్‌లోడ్‌ చేసిన తర్వాత పీజు కట్టడానికి ప్రయత్నించింది. కానీ వెబ్‌సైట్‌ పనిచేయ లేదు. దాంతో ప్రిన్స్‌ స్వయంగా మరోసారి ప్రయత్నించగా మళ్లీ అతడి ప్రయత్నం తిరస్కరణకు గురైంది. మన సంస్థాగత పునాదిలో ఆన్‌లైన్‌ అడ్మిషన్లను కూడా పక్షపాత దృష్టితో వేధించడానికి ఉపయోగిస్తారన్నది తెలిసిందే. భారతదేశంలో చివరకు ఇంటర్నెట్‌ కూడా దళిత వ్యతిరేక పాశుపతాస్త్రంగా మారిపోవడం విచారకరం. 

ఆ కుర్రాడు, ఉమ్మడి సీట్‌ కేటాయింపు విభాగం పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌ లోని ఐఐటీ ఖర్గపూర్‌కి సాధారణ కానిస్టేబుల్‌ అయిన తండ్రితో కలిసి వెళ్ళాడు. ఫీజు కడతానని చెప్పినా అతడిని చేర్చుకోవడానికి అధికారులు తిరస్కరించారు. గడువుతేదీ ముగిసిందని కారణం చెప్పారు. దీంతో అతడు బాంబే హైకోర్టు తలుపులు తట్టాడు. అక్కడా అతడి పిటిషన్‌ని కొట్టేశారు. చివరకు అతడు సుప్రీకోర్టుకు వెళ్లాడు.

ఆ కుర్రాడిని ఐఐటీలో చేర్చుకోవలసిందిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వై.డి. చంద్రచూడ్, ఏఎస్‌ బోపన్న సంచలనాత్మక ఆదేశాలు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన దళిత కానిస్టేబుల్‌ కుమారుడు అనేక స్థాయిల్లో పోరాటం సల్పి చిట్టచివరకు ఐఐటీ బాంబేలో చేరగలగడం ఆధునిక ఏకలవ్య గాథను తలపిస్తుంది. సమర్థుడైన విలుకాడు అయినందుకు తన బొటనవేలును కోల్పోవలసి వచ్చిన ఏకలవ్యుడు శస్త్రచికిత్స సహా యంతో తిరిగి తన బొటనవేలును పొందగలిగాడు. ఇప్పుడు ఈ దళిత కుర్రాడు ప్రిన్స్, ఐఐటీ సీటు కోసం పడిన తపనకు సుప్రీంకోర్టులో మాత్రమే న్యాయం జరిగింది. 

ఉన్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందడానికి తీవ్రంగా ఘర్షిస్తూ, అంతిమంగా సీట్లు చేజిక్కించుకుంటున్న, రిజర్వేషన్‌ హక్కు కలిగిన యువత పడుతున్న తపనలో, ఘర్షణలో ఇది ఒంటరి ఘటన కాదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో జనరల్‌ కేట గిరీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరిన ఓబీసీలకు చెందిన యువకుడు విపిన్‌ పి. వీటిల్‌.. మద్రాస్‌ ఐఐటీ నుంచి వివిధరకాల వివక్షల పాలబడి తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ప్యాకల్టీ అతడి కులనేపథ్యాన్ని కనిపెట్టి, అవమానించడం, వేధించడం మొదలెట్టింది. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని అధికారులకు విపిన్‌  రాసిన ఉత్తరాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు  ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో కులతత్వం ఎంతగా పేరుకుపోయిందో స్పష్టం చేశాయి.

ప్రస్తుత సందర్భానికి వస్తే మన దళిత ప్రిన్స్‌ ప్రవేశం కోసం చేసిన పోరాటంతోనే రిజర్వుడ్‌ అభ్యర్థుల పోరాటం ముగిసిపోలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో చేరడం ఒకెత్తు కాగా, వీటిలో చదువు కొనసాగించడం మరొక ఎత్తు. వీరు క్యాంపస్‌లలోనే ఉంటున్నందువల్ల వివక్ష ఈ సంస్థల్లో ఒక నిరంతర సమస్యగా ఉంటుంది. ఇలా చెబితే అతిశయోక్తి కావచ్చు. ఆరెస్సెస్‌ శక్తులు మైనారిటీలను భారతీయేతరులుగా వ్యవహరిస్తున్నట్లుగా... దళితులు, ఓబీసీలు, గిరిజనుల పిల్లలను ఘనత వహించిన మన ఐఐటీలు భారతీయేతరులుగా చూస్తున్నాయి. ఈ విద్యా సంస్థలనుంచి రిజర్వేషన్లను తొలగించాలని వీరు అనేకసార్లు విద్యామంత్రికి పలు ఉత్తరాలు రాశారు. కానీ వారనుకున్నది జరిగితే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటం కంటే మించిన పెద్ద పోరాటాన్ని దేశం ఎదుర్కోవలిసి వస్తుందని వీరు గ్రహించడం లేదు.

ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం విషయంలో నిరాకరణకు గురైన విద్యార్థులకు ప్రిన్స్‌ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం కానుంది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన నా వంటి తొలితరం రిజర్వేషన్‌ విద్యార్థులకు, ఆపై ప్యాకల్టీగా మారినవారికి... గడువు తేదీలు, చివరి క్షణంలో మార్కుల కోతలు, రిజర్వేషన్‌ సంఖ్యలు వంటివాటిని ఎలా తారుమారు చేయగలరో స్పష్టంగా తెలుసు.

ఒక విద్యార్థిగా చేరి, కోర్సు పూర్తి చేసుకునే తరుణంలో, విద్యార్థులకు ఏ గ్రేడ్‌ని ఇవ్వాలి అనే అంశాన్ని కూడా వీరు తారుమారు చేయగలరు. చదువు పూర్తయ్యాక ఉద్యోగ జీవితం కూడా వెనుకబడిన వర్గాల యువతకు రోజువారీ పోరాటంగా మారిపోతుంది. ఒక వైపు పోటీపడలేకపోవడం, మరోవైపు మోతాదుకు మించి పోటీపడటం అనేవి రిజర్వేషన్‌ విద్యార్థులను వెంటాడతాయి. మద్రాస్‌ ఐఐటీకి చెందిన విపిన్‌ తాను రెండో కారణం వల్ల వివక్షకు గురయ్యానని చెప్పారు. తన విభాగంలోని దళిత్‌/ఓబీసీ ఫ్యాకల్టీ సభ్యుడి కంటే ఎక్కువ సమర్థతను ప్రదర్శించడమే తన పట్ల వివక్షకు కారణమైందట.

ఈ ఉన్నత విద్యాసంస్థల్లో ఏకలవ్యుల బొటనవేళ్లను నరికేసే ద్రోణాచార్యులూ ఉన్నారు. అలాగే వీటిలో చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువత జీవిత ప్రక్రియనే నరికేసే ద్రోణాచార్యులు కూడా ఉన్నారు. గ్రామీణ భారత్‌ నుంచి తొలి తరం విద్యా నేపథ్యం కలిగిన వారిలో చాలామంది విద్యార్థులు ఇలాంటి వివక్షకు గురైనప్పుడు విద్యాసంస్థలనే వదిలేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రిన్స్‌ చదువు ముగించి తన కానిస్టేబుల్‌ తండ్రి కంటే ఉన్నతదశకు ఎదిగితే గొప్ప ఆదర్శంగా మారతాడు.

విద్యాసంస్థలను టీచర్ల ద్వారా మాత్రమే సంస్కరించవచ్చు. అయితే ఇలాంటి విద్యాసంస్థల్లోని టీచర్లు ద్రోణాచార్యులను తమ ఆదర్శ గురువులుగా చేసుకున్నంతకాలం, వీరు జాతి మొత్తానికి పెను నష్టం కలిగించగలరు. ఈ విద్యా సంస్థలు గురునానక్‌ని తమకు ఆదర్శంగా తీసుకుంటే, సాంకేతిక అభివృద్ధిలో చైనానే సవాలు చేసే రీతిలో ఇవి దేశాన్ని మార్చివేయగలవు. ఈ సందర్భంగా ప్రిన్స్, ఆయన తండ్రి మనందరి అభినందనలకు అర్హులు.


కంచె ఐలయ్య షెపర్డ్‌,
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

మరిన్ని వార్తలు