Sharad Yadav: ‘మండల్‌’ అమలు వ్యూహం ఆయనదే!

17 Jan, 2023 13:31 IST|Sakshi
శరద్‌ యాదవ్‌ (ఫైల్‌)

దేశరాజధానిలో 2023 జనవరి 12న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూసిన శరద్‌ యాదవ్‌ (75) మృతి దేశవ్యాప్తంగా ఆయన అనుయాయులను, ఆరాధకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన ఈ యువ ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత 1974 జయప్రకాష్‌ నారాయణ్‌ ఉద్యమ సమ యంలో 27 ఏళ్ల ప్రాయంలోనే పార్ల మెంటు స్థానంలో గెలుపొంది జాతీయ నేతగా మారారు. ఓబీసీ భావన, దాని వర్గీకరణ జాతీయ నిఘంటువుగా మారడానికి చాలాకాలానికి ముందే ఆయన శూద్ర, ఓబీసీ, సామాజిక శక్తుల ప్రతినిధిగా, సోషలిస్టు సిద్ధాంతవేత్తగా ఆవిర్భవించారు.

రామ్‌మనోహర్‌ లోహియా, కర్పూరీ ఠాకూర్‌ (బిహార్‌కి చెందిన క్షురక సామాజిక బృందానికి చెందిన నేత)ల సోషలిస్టు సిద్ధాంత భూమిక నుంచి ఉత్తర భారతదేశంలో ఆవిర్భవించిన నూతన యువ శూద్ర, ఓబీసీ నేతల బృందంలో శరద్‌ యాదవ్‌ ఒక భాగమై ఉండేవారు. ఈ బృందంలోని ఇతర నేతలు తమ సొంత రాష్ట్రాలకే పరిమితమై పోగా, ఈయన మాత్రం జాతీయ ప్రముఖుడిగా మారారు. ఈ యువ బృందానికి చెందిన ములాయం సింగ్‌ యాదవ్, లాలూ ప్రసాద్‌ యాదవ్, నితీశ్‌ కుమార్‌లు జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగి రాష్ట్ర రాజ కీయాలకు పరిమితమైపోగా, శరద్‌ యాదవ్‌ మాత్రం పార్లమెంటులోనే ఉండిపోయారు. ఏడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా నెగ్గిన శరద్‌ యాదవ్‌ పార్లమెంటులో పేదల అనుకూల సమరాల్లో పోరాడుతూ వచ్చారు. హిందీలో చక్కటి వక్త, తార్కిక చింతనాపరుడైన శరద్‌ యాదవ్‌ రాజకీయ వ్యూహకర్తగా ఉండేవారు.

ఈయన రాజకీయ వ్యూహం ఫలితంగానే నాటి ఉప ప్రధాని, జాట్‌ నేత అయిన దేవీలాల్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలోనూ... మండల్‌ నివేదికలోని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ ఇచ్చే అంశాన్ని వీపీ సింగ్‌ అమలు చేయవలసి వచ్చింది. జనతా దళ్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పరిణామాల గురించి శరద్‌ యాదవ్‌ వివరించి చెప్పారు. ‘మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాల్సిందిగా జనతా దళ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి మేము సోషలిస్టు నేతలందరినీ సమీకరించడం ప్రారంభించాము. ఇది జరగకుండా శూద్రులకు నిజమైన న్యాయం కలగదని మేము బలంగా నమ్మాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వీపీ సింగ్‌ సన్నిహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని అధిగమించడానికి ఆయన ఉపప్రధాని, ప్రముఖ జాట్‌ నేత దేవీలాల్‌ చౌదరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. చరణ్‌ సింగ్‌ జోక్యం కారణం గానే జాట్లను వెనుకబడిన వర్గాల జాబి తాలో మండల్‌ చేర్చలేక పోయారని తనకు తెలుసు. అయినప్పటికీ అనేక మంది స్థానిక జాట్‌ నేతలు, బృందాలు రిజ ర్వేషన్‌ కేటగిరీలో తమను చేర్చాల్సిందిగా తమ తమ రాజకీయ నేతలను ఒత్తి డికి గురి చేశారు.

ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న వీపీ సింగ్‌ గొప్ప ఎత్తు వేశారు. జాట్లను రిజర్వేషన్‌ జాబితాలో చేర్చడానికి తాను వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రముఖ జాట్‌ నేత అయిన దేవీలాల్‌ జాట్లను చేర్చకుండా మండల్‌ సిఫార్సులను అమలు చేయబోరని వీపీ సింగ్‌కు కచ్చితంగా తెలుసు. జనతాదళ్‌ జనరల్‌ సెక్రెటరీ, పరిశ్రమల మంత్రీ అయిన చౌదరి అజిత్‌ సింగ్‌ కూడా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ప్రచారం ప్రారంభించారు, ఓబీసీ జాబితాలో జాట్లను చేర్చాల్సిందేనని నొక్కి చెప్పసాగారు. దీంతో దేవీలాల్‌ రాజకీయ డైలమాలో చిక్కుకున్నారు. జాట్లను వెనుకబడిన వర్గంగా చేర్చిన ఘనత అజిత్‌ సింగ్‌కు దక్కకూడదని ఆయన కోరుకున్నారు. మరోవైపు, జాట్లను ఓబీసీ జాబితాలో చేర్చకుంటే తన సొంత జాట్‌ కమ్యూనిటీ నుంచి ఆగ్రహాన్ని చవిచూసే ప్రమాదాన్ని కూడా దేవీలాల్‌ కోరుకోలేదు. కాబట్టి, ఇది మండల్‌ కమిషన్‌పై చర్చకు ముగింపు పలుకుతుందని వీపీ సింగ్‌ భావించారు.

‘‘1990 ఆగస్టు 3న, వీపీ సింగ్‌ నాకు కబురంపి ‘సోదరా శరద్‌! చౌదరి దేవీలాల్‌ని ఇక ఏమాత్రం నేను సహించలేన’ని చెప్పారు. దేవీలాల్‌తో మాట్లాడతాననీ, ఈ అధ్యాయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతాననీ నేను వీపీ సింగ్‌కు హామీ ఇచ్చాను. అయితే దేవీ లాల్‌ని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించవద్దని నేను వీపీ సింగ్‌ను అభ్యర్థించాను. కానీ అప్పటికే దేవీలాల్‌కి ఉద్వాసన పలుకుతున్న ఆదేశాన్ని తాను రాష్ట్రపతికి పంపేసినట్లు వీపీ సింగ్‌ సమాధాన మిచ్చారు. దీంతో నేను సంభాషణను ముగించాల్సి వచ్చింది. మరుసటి రోజు తన కార్యాలయానికి రావలసిందిగా వీపీ సింగ్‌ కబురంపారు. నేను వెళ్లాను. దేవీలాల్‌ గురించి చర్చించుకున్నాము. నన్ను విశ్వాసంలోకి తీసుకోవాలని వీపీ సింగ్‌ భావించారు. అలాగైతేనే నేను దేవీలాల్‌తో జతకట్టబోనని ఆయన భావించారు. దేవీలాల్‌ పక్షంలో నేను చేరినట్లయితే ప్రధానమంత్రిగా తాను ఎక్కువ కాలం కొనసాగలేనని వీపీ సింగ్‌ భావిస్తున్నారని దీనర్థం. 

ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న నేను మండల్‌ కమిషన్‌ సిఫార్సులను వెంటనే అమలు చేస్తున్నట్లు ప్రకటించాలని వీపీ సింగ్‌ను కోరాను. ఆయన 1990 ఆగస్టు 15న దీనిపై ప్రకటన వెలువరించడానికి మొదట అంగీకరించారు. కానీ ఆగస్టు 9వ తేదీనే ఆయన దాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అలా ప్రకటించకపోయి ఉంటే నేను ఢిల్లీలో జరగనున్న దేవీ లాల్‌ ర్యాలీలో చేరడం తప్ప మరొక అవకాశం నాకు ఉండేది కాదు. మండల్‌ సిఫార్సులను అమలు చేస్తే అవి సమానతా సమాజాన్ని విశ్వసించి, దానికోసం కలగన్న అంబేడ్కర్, కర్పూరీ ఠాకూర్, లోహియా, జయప్రకాష్‌ నారాయణ్‌ స్వప్నాలు సాకారమవుతాయని నేను భావించాను.  

1990 ఆగస్టు 6న వీపీ సింగ్‌ నివాసంలో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్‌ సమావేశం జరిగింది. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు ఈ సమావేశ ప్రధాన ఎజెండా. సన్ని హితులు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆ మరుసటి రోజు అంటే 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు కల్పిస్తూ మండల్‌ కమిషన్‌ చేసిన రికమంండేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించింది. చివరకు 1990 ఆగస్టు 13న ఓబీసీ రిజర్వేషన్‌ అమలుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆగస్టు 10 నుంచే ఆధిపత్య కులాలు రిజర్వేషన్‌కి వ్యతిరేకంగా నిర సనలు ప్రారంభించాయి. నెలరోజుల పాటు విద్యార్థులు, బ్యూరోక్రాట్లు, టీచర్లు దేశవ్యాప్తంగా రిజర్వేషన్‌ వ్యతిరేక నిర సనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. రహదారులు దిగ్బంధనకు గురయ్యాయి.’’ – ‘ది శూద్రాస్‌– విజన్‌ ఫర్‌ ఎ న్యూ పాత్‌’ అనే పుస్తకం నుంచి.

అయితే, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలన్న మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేసేలా వీపీ సింగ్‌ ప్రభుత్వాన్ని ప్రేరేపించడంలో; వీధుల్లో మండల్‌ అనుకూల, వ్యతిరేక పోరాటాలను రగుల్కొల్పడంలో నాటి యువ శరద్‌ యాదవ్‌ తగిన పాత్ర పోషించకపోయి ఉంటే, భారతీయ శూద్ర/ఓబీసీలు ఈ రోజు దేశంలో ఈ స్థాయికి చేరుకుని ఉండేవారు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ శక్తులను నియంత్రిస్తున్న ద్విజులు మండల్‌ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆనాడు శూద్ర/ఓబీసీలు భారీ స్థాయిలో మండల్‌ అనుకూల సామాజిక సమీకరణకు పూనుకోకపోయి ఉంటే, నేడు ఓబీసీలు తమకు నాయకత్వం వహించి, నరేంద్రమోడీ భారత ప్రధాని కావ డానికి ద్విజులు అమోదించి ఉండేవారు కాదు. చివరగా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ శూద్ర/ఓబీసీ నేతలు నేటి తమ రాజకీయ ప్రతిపత్తికి గాను శరద్‌ యాదవ్‌ అనే గొప్ప పోరాటకారుడికి ఎప్పటికీ రుణపడి ఉంటారు.

- ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య షెపర్డ్‌ 
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

మరిన్ని వార్తలు