‘కన్యాశుల్కం’ పునరుజ్జీవనం

28 Sep, 2022 13:06 IST|Sakshi

గురజాడ వారి ‘కన్యాశుల్కం’ ఒక అపూర్వ నాటక శిల్పం. లెక్కలేనన్ని పునర్ముద్రణలతో ఈ నాటకం ఎప్పటికప్పుడు పునరుజ్జీవనం పొందుతూనే ఉంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలోని ‘మానవవికాస వేదిక’ కన్యాశుల్కం నాటకాన్ని తాజాగా మళ్లీ ముద్రించింది. విజయనగరంలోని గురజాడ గృహాన్ని సందర్శించే ప్రతి ఒక్కరికి కన్యాశుల్కం ప్రతిని ఉచితంగా ఇవ్వనున్నారు. ఆ ఇంటిని పర్యవేక్షిస్తున్న గురజాడ ముని మనుమడు గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, వారి సతీమణి ఇందిరాదేవిలకు ఈనెల 29వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతి ఆఫీసర్స్‌ క్లబ్‌ జరగనున్న సమావేశంలో ‘కన్యాశుల్కం’ ప్రతులను అందివ్వనున్నారు. 

‘కన్యాశుల్కం’ నాటకాన్ని గురజాడ అసలు ఎందుకు రాశారు!? గర్భస్థ శిశువుకు కూడా బేరం పెట్టడం వంటి దారుణ స్థితిగతులు గురజాడను కలిచివేసి కన్యాశుల్కం నాటక రచనకు ప్రేరేపించాయి. ఈ దురాచారం పైన గురజాడ కత్తి దూయలేదు, దండెత్తలేదు, అవహేళన చేసి వదిలి పెట్టారు. లండన్‌లో మురికివాడల గురించి  ప్రపంచ ప్రసిద్ధ నాటకకర్త జార్జ్‌ బెర్నార్డ్‌ షా ‘విడోవర్స్‌ హౌసెస్‌’ అన్న నాటకాన్ని రాసి 1892 డిసెంబర్‌ 9న ప్రదర్శించారు. దానికి నాలుగు నెలల ముందే 1892 ఆగస్టు 12వ తేదీన విజయనగరంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని గుర జాడ ప్రదర్శించారు. (క్లిక్:  కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి..)

సమకాలీన సమస్యలపైన వచ్చిన తొలి నాటకంగా ‘కన్యాశుల్కం’ ప్రపంచ నాటక రంగ చరిత్రలో నిలిచిపోయింది. గిడుగు రామమూర్తికి బి.ఏ. లో సహ విద్యార్థి అయిన గురజాడ వ్యవహారిక భాషా ఉద్యమం ఊపిరి పోసుకోక ముందే, తన పాతికేళ్ల వయసులో వ్యవహారిక భాషలో ‘కన్యాశుల్కం’ రాసి వ్యవహారిక భాషా ఉద్యమానికి బీజం వేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం కన్యాశుల్కాన్ని నిషేధించకపోయినా, 1929లో బాల్య వివా హాల నిషేధ చట్టం రావడానికి ‘కన్యాశుల్కం’ నాటకం దోహదం చేసింది. అందుకనే ఇదొక మహా దృశ్యకావ్యంగా, తెలుగు వారి సాహిత్య వారసత్వ సంపదగా నిలిచిపోయింది. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం)

– రాఘవ శర్మ

మరిన్ని వార్తలు