డాక్యుమెంటరీపై మాటల సెల్ఫ్‌ గోల్‌

30 Jan, 2023 04:21 IST|Sakshi

కామెంట్‌

గుజరాత్‌లో 2002లో జరిగిన హింసపై ‘బీబీసీ’ నిర్మించిన తాజా డాక్యుమెంటరీని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఖండించారు. తాను దాన్ని చూడలేదని పేర్కొంటూనే, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా, తప్పుడు వాదనతో, ప్రచార యావతో తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్‌ శాఖ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన సీనియర్‌ అధికారులు... బీబీసీ తాజా డాక్యుమెంటరీపై కనీసపాటి ఆలోచన కూడా లేకుండా తీవ్ర ధోరణిలో మాట్లాడారు. భారతదేశ సార్వభౌమత్వాన్నీ, సమగ్రతనూ ఆ డాక్యుమెంటరీతో కించపర్చారంటూ వారు ఆరోపించారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? వారు వ్యక్తం చేసిన ఆందోళన బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశ మనుగడ పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టుగా తయారైంది. తప్పుగా మాట్లాడటం ద్వారా వారు తమ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారు. 

ఈ విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించేకొద్దీ, నిజానికి సమస్య మనలోనే ఉందని చెబు తాను. సాధారణంగా రాజకీయ నాయకుల వద్ద ప్రతి సమస్యకూ పరిష్కారం ఉండాలనీ, ప్రతి సమ స్యపై వారు వ్యాఖ్యానించాలనీ, ప్రతి వ్యక్తికి సంబంధించి అర్థవంతమైన, కచ్చితమైన అభిప్రా యాన్ని కూడా కలిగి ఉండాలనీ, అన్ని పరిస్థితు లనూ వారు అర్థం చేసుకోవాలనీ మనం భావిస్తుంటాం. కాని వారు అలా చేయలేరు. అది వారికి సాధ్యం కూడా కాదు. అలాగని తాము దేన్నయినా సరే... చేయగలమని వారు నటించినట్లయితే దానిని మనం వారిని అగౌరవించాల్సిన పని లేదు. సూటిగా చెప్పాలంటే, రాజకీయ నాయకులు వారి పట్ల మనకు ఉందనుకుంటున్న గౌరవాన్ని కోల్పో వలసిన అవసరం లేదు. అయితే వారు గుర్తించనిది ఏమిటంటే, మన అంచనాలు వారికి ఒక ఉచ్చు లాంటివి. ఆ సంగతి వారు స్పష్టంగా గ్రహిస్తూనే, గర్విస్తూనే మనం ఏర్పరచిన ఉచ్చులో చిక్కుకుంటూ ఉంటారు. 

ఇవాళ ఆలోచనాత్మకమైన, మేధాసహితమైన స్పందనల కంటే ఆకట్టుకునేలా అభిప్రాయాలు వెల్లడించడమే ఎక్కువ అవసరమని రాజకీయ నాయకులు భావించే దశకు మనం చేరుకున్నాం. ఎందుకంటే, వీటిలో ఆకర్షణీయమైన స్పందనే పతాక శీర్షికలకు ఎక్కుతుంది. అది వారికి ప్రచా రాన్ని కల్పిస్తుంది. మరోవైపున ఆలోచనతో కూడిన స్పందన మరింత అర్థవంతంగానూ, సహాయకారి గానూ ఉండవచ్చు కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి కాస్త ఏకాగ్రత అవసరమవుతుంది. కాబట్టి పునః పరిశీలనకు అది పిలుపునిస్తుంది. పైగా ఆకర్షణీయ మైన స్పందనకు సరిసమానమైన ప్రభావాన్ని మేధాసహితమైన స్పందన కలిగించనే కలిగించదు.

‘షారుఖ్‌ ఖాన్‌ ఎవరు? అతడి గురించి నాకేమీ తెలీదు’ అని అస్సామ్‌ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇటీవల చేసిన ప్రకటన దీనికి అత్యుత్తమ మైన ఉదాహరణ అని నేను చెబుతాను. గౌహతిలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆయన చేసిన ఈ వ్యాఖ్య అత్యంత వివాదాస్పద మైంది. అంతేకాదు. ఆయన మాటల్లో అసలు నిజం లేదు. ఒకవేళ ఆయన వ్యాఖ్య గనక నిజమే అయితే... మన దేశంలోని ప్రజల గురించి ఏ మాత్రం తెలియని స్థితిలో సదరు అస్సామ్‌ ముఖ్య మంత్రి ఉన్నారని చెప్పక తప్పదు. నిజానికి ఆయన చేసిన ఆ ప్రకటన అమితాబ్‌ బచ్చన్‌ స్వయంగా ‘నరేంద్ర మోదీ ఎవరు? ఆయన గురించి నాకేమీ తెలీదు’ అని చెప్పినట్టు ఉంది.

ప్రముఖ హిందీ సినీ కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ ఎవరో తెలియని భారతీయులు ఎవరైనా ఉంటారా అని నాకు సందేహం. అలాగే, భారతీయ జనతా పార్టీ నేత – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా తెలియనివారు ఉన్నారంటే కూడా సందేహించాల్సి ఉంటుంది. అందుకనే అస్సామ్‌ ముఖ్యమంత్రి వ్యాఖ్యను జనం దృష్టిని ఆకర్షించడానికి, జనం తమను ఏదో ఒకలా గుర్తుంచుకునేలా చేసే తప్పుడు ప్రయత్నంగానే చూడాల్సి ఉంటుంది. ఈ ఉదంతంలో అన్నీ తప్పుడు అంశాలే ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది.

విషాదం ఏమిటంటే, కనీసపాటి ఆలోచన కూడా లేకుండా షారుఖ్‌ ఖాన్‌ గురించి అలా మాట్లాడటం వల్ల అస్సామ్‌ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా మూర్ఖుడిగా మారిపోయారు. 2002 నాటి గుజరాత్‌ హింసపై బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ) రూపొందించిన డాక్యుమెంటరీని విమర్శించి, ఖండించాలన్న ఉద్దేశంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి కూడా దాదాపు ఇలాంటి పనే చేశారు. ఆ డాక్యుమెంటరీని తాను చూడలేదని ఒప్పుకుంటూనే, నిర్దిష్టంగా ఒక తప్పుడు వాదనను జనంలోకి తీసుకుపోవడానికి, ప్రచారమే పరమావధిగా తీసిన డాక్యుమెంటరీగా దాన్ని ప్రకటించారు. పైగా అది పక్షపాతంతో కూడుకున్నదనీ, దాంట్లో నిష్పా క్షికత లోపించిందనీ నిందించారు. 

అయితే బీబీసీ తాజా డాక్యుమెంటరీని చూడ నప్పుడు దాంట్లోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావించారు? అది కూడా తానొక అధికారిక ప్రతి నిధి అయ్యుండి, తాను చూడని విషయంపై ఎలా వ్యాఖ్యానించారు అనే ప్రశ్న వస్తుంది. అయితే తాను దేని గురించి మాట్లాడుతున్నదీ తనకు స్పష్టంగా తెలుసన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, వర్ణనలు ఉన్నాయి. అధికారిక ప్రతినిధి చేసే ప్రక టన సాధికారికంగా ఉంటుందనీ, విశ్వసించదగిన దనీ ఎవరైనా భావిస్తారు. వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విని చెబుతున్నట్టుగా, వేరెవరి అభిప్రాయాలో మళ్లీ ప్రస్తావించినట్టుగా ఉంటాయనీ, ఉండాలనీ ఎవరూ అనుకోరు. కానీ ఆయన తాజా వ్యాఖ్య లన్నీ అచ్చంగా అలాగే ఉన్నాయని గ్రహించాలి.

భారత విదేశీ వ్యవహారాల శాఖ, హోమ్‌ శాఖ, ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి పలు మంత్రిత్వ శాఖలకూ, సంస్థలకూ చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్‌ అధికారులు దాదాపుగా దేశంలోని అన్ని పత్రికలతో మాట్లాడారు. బీబీసీ తాజా డాక్యుమెంటరీపై తమ వాదనను బలంగా వినిపించడం కోసం కనీసపాటి ఆలోచన అయినా కూడా లేకుండా వారు తీవ్ర ధోరణితో మాట్లాడారు. ఆ తొందరలో చివరకు భారతదేశం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలు పొడసూపేలా చేశారు. ఆ డాక్యుమెంటరీలో భారత సార్వభౌమత్వాన్నీ, సమ గ్రతనూ కించపర్చారంటూ వారు ఆరోపించారు. నిజమా? నిజంగానే అలా జరిగిందా?

ఇంతకూ వారు గుర్తించని విషయం ఒకటి ఉంది. అది ఏమిటంటే – తాము ఏం మాట్లాడు తున్నాం అనే విషయం గురించి వారు కనీసం ఒక్కసారి కూడా ఆగి, నింపాదిగా ఆలోచించలే పోయారు. భారతదేశంలో అసలు ప్రసారమే చేయని ఒక డాక్యుమెంటరీ చిత్రం మన దేశాన్ని ఆ స్థాయిలో ముక్కలు ముక్కలు చేస్తుందా? పైగా యూట్యూబ్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా ప్రచార, ప్రసార వేదికలను వాడేవారు మన జనాభాలో అతి తక్కువమంది అని తప్పక గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఆ కొద్దిమంది ఆ డాక్యుమెంటరీ చూసినంత మాత్రాన మన జాతీయ చట్రమే కదిలి పోతుందా? విచ్ఛిన్నమవుతుందా?

చివరకు వచ్చేసరికి వారు వ్యక్తం చేసిన ఆందోళన అంతా బీబీసీ పైనా, దాని డాక్యుమెంటరీ పైనా కాదు. మన దేశంలోని పరిస్థితి పైనా, దేశ మనుగడకు సంబంధించిన అంశం పైనే వారు కలవరం వ్యక్తపరిచినట్టు అయింది. అలా వారు దాన్ని గురించి తప్పుగా మాట్లాడటం ద్వారా సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్టు అయింది. ఇప్పుడు మన ప్రియమైన ముఖ్యమంత్రి, మన అధికార ప్రతినిధి, అలాగే నిగూఢమైన మన ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఈ విషయంపై భయకంపిత స్వరంతో మాట్లాడి ఉన్నట్లయితే నేను దానికి ఏమాత్రం భయపడను. బదులుగా ముసి ముసిగా నవ్వుకునేవాడిని.


కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు