తెలుగు క్రీడా శిఖరం మల్లీశ్వరికి అరుదైన గౌరవం

3 Jul, 2021 01:36 IST|Sakshi

తెలుగు నేలలో ఉదయించిన క్రీడా శిఖరం, గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఉవ్వెత్తున ఎగిసిన అథ్లెటిక్‌ కెరటం, ఒలింపిక్‌ పతకాన్ని భారత దేశానికి అందించిన ఆంధ్రుల ఆడపడుచు, మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత, దేశ ఉన్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్న భరతజాతి ముద్దుబిడ్డ... ఇప్పటివరకు ఇవన్నీ కరణం మల్లేశ్వరి గురించి మనకి తెలిసిన విషయాలు. కానీ దేశంలోనే ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకొని మళ్లీ వార్తల్లో నిలిచారామె. తెలుగు ప్రజల ఖ్యాతిని మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నెలకొల్పిన ‘ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయాని‘కి ఉపకులపతిగా ఎంపిక కావడం ద్వారా  దేశ చరిత్రలో పదిలమైన స్థానాన్ని పొందారు. తనలాగే దేశంలో ఎందరో ఔత్సాహిక క్రీడాకారులకు అత్యుత్తమ సదుపాయాలతో కూడిన మంచి శిక్షణలో దిశానిర్దేశం చేయాలనే ఆమె తపనను ఢిల్లీ ప్రభుత్వం గుర్తిం చింది. ఇప్పటివరకు ప్రత్యేకంగా క్రీడా యూనివర్సిటీలు నెలకొల్పిన సందర్భాలు అరుదు. జాతీయ స్థాయిలో ఒకే ఒక క్రీడా యూనివర్సిటీ నెలకొల్పారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేసింది. దీనిని నడిపించి మెరికల్లాంటి యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే బాధ్యతను కరణం మల్లీశ్వరి భుజస్కంధాలపై ఉంచింది. 

ఇది నిజంగా ఒక గొప్ప ప్రయత్నమే. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విధమైన యూనివర్సిటీలు నెలకొల్పితే గ్రామీణ యువతకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని క్రీడా నిపుణుల అభిప్రాయం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా 130 కోట్లకు పైగా ప్రజలు ఉన్న మనం క్రీడల్లో చాలా వెనకబడి ఉన్నాం. దీనికి ప్రధానమైన కారణం సమర్థులైన క్రీడాకారులు లేక కాదు. శక్తి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాన్ని అందించి తగిన విధంగా తీర్చిదిద్దేందుకు సరైన యంత్రాంగం లేకపోవడమే. క్రీడలలో రాణించాలంటే శరీర ధారుఢ్యం ఉండాలి, పౌష్టికాహారంతో పాటు తగిన అత్యుత్తమ శిక్షణ ఉండాలి. దేశంలో ఔత్సాహిక క్రీడాకారులకు కొదువ లేదు. కానీ వారిని గుర్తించి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామీణ నేపథ్యంతో పాటు పేద కుటుంబాలకు చెందిన క్రీడాకారుల నైపుణ్యాలను గుర్తించి వారికి వెన్నుదన్నుగా నిలిస్తే అద్భుతాలు సాధించవచ్చు. ఈ దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 

గ్రామీణ క్రీడాకారులకు కరణం మల్లేశ్వరి ఒక ఆదర్శం. మారుమూల కుగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో తన సోదరి నరసమ్మ స్ఫూర్తితో తన 12వ ఏట నుండే క్రీడలపై ఆసక్తితో, నిరంతర శ్రమతో, పట్టుదలతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అలుపెరుగని ఆమె ప్రయత్నం సఫలీకృతం అయింది. ప్రపంచ అగ్రశ్రేణి వెయిట్‌ లిఫ్టర్‌గా కీర్తిని సొంతం చేసుకున్నారు. మౌలిక వసతుల లేమి, అరకొర శిక్షణ, పరిమితమైన ప్రభుత్వ ప్రోత్సాహం ఇవన్నీ దేశంలో క్రీడాకారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. వీటిని ఆమె అధిగమించారు. ఒలింపిక్‌ పతకంతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ క్రీడలలోను రాణించారు. ఈ క్రీడా ప్రయాణంలో ఆటుపోట్లు ఆమెకు తెలుసు. ఆ స్థాయికి చేరేందుకు క్రీడాకారులు పడుతున్న ఇబ్బందులను ఆమె దగ్గరగా చూశారు. ఆ అవరోధాలను అధిగమించి దేశానికి అత్యుత్తమ అ«థ్లెట్లను అందించేందుకు ఆమె తపన పడ్డారు. తన మాతృభూమి రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాలో ఒక వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీ నెలకొల్పేందుకు స్థల కేటాయింపు కోసం నాటి ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె మెట్టినిల్లు హరియానా రాష్ట్రంలో అకాడమీని నెలకొల్పి క్రీడాకారులను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.

అడిగిందే తడవుగా విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ నెలకొల్పేందుకు ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి.సింధుకు రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని ప్రకటించారు. కానీ 2000వ సంవత్సరంలో దేశానికి ఒలింపిక్‌ పతకాన్ని అందించిన తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరి అథ్లెటిక్‌ అకాడమీ ఏర్పాటు కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మొండిచేయి చూపింది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఆ దిశగా ప్రయత్నించినా ఆమెకు ప్రోత్సాహం లభించలేదు. 

తాను జన్మించిన తెలుగు నేలకు సేవలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటారు కరణం మల్లేశ్వరి. తన పతకాల వేటతో తన పని పూర్తి అయినట్లు ఆమె భావించలేదు. తనలాంటి క్రీడాకారులను  దేశానికి అందించాలని దీక్షబూనారు. ఆమె సంకల్పాన్ని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం ఆమెకు ఆ బాధ్యతను అప్పగించింది. ఆమె సారథ్యంలో పలువురు క్రీడాకారులు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆకాంక్షిద్దాం.

నేలపూడి స్టాలిన్‌ బాబు 
వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు
మొబైల్‌ : 83746 69988 

మరిన్ని వార్తలు