‘భావజాల’ విముక్తే ప్రత్యామ్నాయానికి దారి

11 Oct, 2022 00:43 IST|Sakshi

విశ్లేషణ

భారతదేశం ఈనాడు అంబేడ్కర్‌ మార్గంలో నడవాలా? గాంధీ మార్గంలో నడవాలా? అనే పెద్ద ప్రశ్న దేశంలోని పార్టీల ముందు ఉంది. భారత దేశంలో ఈనాడు రాజకీయ కూటములు ఎక్కువ ఏర్పడు తున్నాయి. బీజేపీ కూటమి గాంధీ, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ భావజాలాల్లో నడుస్తోంది. కాంగ్రెస్‌ కూటమి గాంధీ, నెహ్రూ భావజాలాల్లో నడుస్తున్నది. కేసీఆర్, నితీష్‌ కుమార్, మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌ వంటి వారితో ఏర్పడుతుందని చెబుతున్న మూడవ కూటమి ఇంకా తన భావజాలాన్ని ప్రస్పుటం చేయలేదు. కానీ భారతదేశంలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మౌలికమైన మార్పు రావాలంటే తప్పకుండా అంబేడ్కర్‌ భావజాలమే ఈనాడు భారతదేశానికి అవసరం.

బీజేపీ పైకి గాంధీ పేరు చెప్తున్నా అది హిందూ మతోన్మాద భావజాలాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గంలో నడుపుతోంది. హిందూ మతోన్మాదాన్ని భారతదేశంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సరిగ్గా అంచనా వేశారు. హిందూ మతాన్ని నిర్మూలించకుండా భారతీయ సామాజిక విప్లవం విజయవంతం కాదనీ, హిందూ మతోన్మాదం ప్రమాదకరమైనదనీ అంబేడ్కర్‌ నొక్కి వక్కాణించాడు. భారత సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయిన బౌద్ధ ఉద్యమంలోని మాన వతా వాదాన్ని ఆయన పరివ్యాప్తం చేశాడు. కమ్యూని స్టులు ప్రాచీన భారత సామాజిక ఉద్యమకారులను, ఆధునిక సామాజిక ఉద్యమకారులైన మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరియార్‌ వంటి వారినీ; వారి సిద్ధాంతా లనూ నిర్లక్ష్యం చేశారు. దాని ఫలితంగా భారతదేశంలో ఈనాడు మతోన్మాదం తెట్టెం కట్టుకుపోయింది.

మతోన్మాదులు, సామ్రాజ్యవాదుల అండ తీసుకొని మరింతగా బలపడటం ప్రారంభించారు. ఇక దీనికి రాజ్య వ్యవస్థ తోడైందంటే ఎంత ప్రమాదమో చూడండి! అంబేడ్కర్‌ విషయానికి వస్తే... మొదటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి ప్రత్యామ్నా యంగా... భారతదేశంలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, తాత్విక రంగాలలో ప్రామాణికమైన కాంగ్రెస్‌ నాయకులు మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, జవహర్‌లాల్‌ నెహ్రూలను ఎదిరిస్తూ వచ్చాడు. తన ‘వాట్‌ కాంగ్రెస్‌ అండ్‌ గాంధీ హావ్‌ డన్‌ టు ది అన్‌టచ్‌బుల్స్‌’ అనే గ్రంథంలో కాంగ్రెస్‌ నాయకుల నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. నిజానికి కాంగ్రెస్‌లో అంత ర్గతంగా హిందూయిజం వుంది. బీజేపీ తమ సిద్ధాంతకర్తలుగా కాంగ్రెస్‌ నాయకులను తలకెత్తు కోవడంలోని ఆంతర్యం అదే.

అంబేడ్కర్‌ అసలు హిందూమతం అంటే ఏమిటి? హిందూ మత భావజాలంతో నడిచేవి అసలు పార్టీలు అవుతాయా? అని ప్రశ్నించాడు. నిషేధాల శిక్షాస్మృతినే హిందూ మతంగా చలామణీ చేసి ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించడం జరుగుతోందని అంబే డ్కర్‌ అన్నారు. ఒక వర్గానికి ఒక న్యాయం, మరొక వర్గానికి మరొక న్యాయం... వీటిలో ఎప్పటికీ మార్పు లేకుండా చేసి అన్యాయాన్ని శాశ్వతీకరించడం మరీ దురన్యాయం అన్నారాయన. లేని ‘హిందూ’ మతాన్నీ, వాదాన్నీ గాంధీ తలకెత్తుకున్నాడు. దానితో ముస్లిం లీగ్‌ విజృంభించింది. మతవాద రాజకీయాలు, స్వాతంత్య్ర ఉద్యమాలతోనే హిందూ రాజకీయ వాదం ప్రారం భమైంది. హిందూ శబ్దం వేదాల్లో లేదు. భారత, రామాయణ, భాగవత అష్టాదశ పురాణాల్లో లేదు. వైదిక మతం, బ్రాహ్మణమతం ఉన్నాయి కానీ హిందూ మతం లేదు. ఇప్పుడు బీజేపీ హిందూ మతోన్మాదాన్నీ, కాంగ్రెస్‌ హిందూ సాంప్రదాయ వాదాన్నీ ముందుకు తెస్తున్నాయి. ఇప్పటికే అంబేడ్కర్‌ హిందూ ప్రత్యా మ్నాయ రాజకీయ వ్యవస్థను రూపొందించారు. ఆయన కొత్త మ్యానిఫెస్టోలు ఎప్పటికప్పుడు రచిం చారు. అంబేడ్కర్‌ రాజకీయ ఉద్యమంలో బౌద్ధ తత్వ ప్రభావం వుంది. బౌద్ధ తాత్వికతలో వున్న సమసమాజ నిర్మాణ భావన ఆయనలో వ్యక్తమయ్యింది. 

అంబేడ్కర్‌ మానవతావాది. హేతువాది సామ్య వాది. ఆయన జాన్‌డ్యూయీ శిష్యుడు. జాన్‌డ్యూయి లోని ప్రజాస్వామ్య భావాలనూ, కారల్‌ మార్క్స్‌లోని సామ్యవాద భావాలనూ, కబీరులోని మానవతావాద భావాలనూ ఆయన రాజకీయాలతో సమన్వయిం చారు. ఆయన నిర్మించిన రాజకీయ పార్టీలో సామ్య వాద భావాలు నిండి వున్నాయి. మార్క్స్‌ భావజాలాన్ని కూడా ఆయన తన రాజకీయ ప్రణాళికలో చేర్చాడు. మార్క్సియన్‌ పద్ధతిలో కాకపోయినా, భారతీయ సామాజిక విప్లవకారుడిగా సమసమాజం కోరుతున్న అంబేడ్కర్‌ కుల నిర్మూలనా వాదం వర్గపోరాటానికి సజీవశక్తి అనడంలో అతిశయోక్తి లేదు. అంబేడ్కర్‌ కొన్ని అంశాల్లో మార్క్స్‌తో విభేదించాడు. కొన్ని అంశాల్లో అంగీకరించాడు. అంగీకరించిన ప్రధాన అంశం ‘సమ సమాజం’. అంగీకరించని అంశం సాధించే పద్ధతిలోనే బలప్రయోగం లక్ష్యం. ఇద్దరిదీ సమ సమాజమే. సాధించే పద్ధతిలోనే కొంత తేడా వుంది. ఇద్దరి సామా జిక తత్త్వవేత్తల వైరుద్ధ్యాలను, సమన్వయాలను పరి శీలించి భారత సామాజిక విప్లవానికి వారిరువురి సిద్ధాంతాలను ఉపయుక్తం చేసుకోవలసిన ‘సమ సామాజిక వాదులు’ ఆ చారిత్రక బాధ్యతను విస్మరిం చారు. కులవాదం మీద అంబేడ్కర్‌ విశ్లేషణలను మార్క్స్‌ మీద అంబేడ్కర్‌ చేసిన విశ్లేషణలుగా ప్రచారం చేసి అంబేడ్కర్‌ను మార్క్స్‌ వ్యతిరేకిగా చిత్రించడంలో హిందూ కమ్యూనిస్టులు కృతకృత్యులయ్యారు. 

అంబేడ్కర్, లోహియా, మార్క్స్‌ల భావజాలాల సమన్వయమే హిందూ భావజాల రాజకీయాలకు ప్రత్యామ్నాయం. దళిత బహుజన మైనార్టీ లౌకిక వాదులు ఈ మార్గంలో నడిస్తేనే భారతదేశానికి భావ జాల విముక్తి. భావజాల విముక్తి వల్లే రాజకీయాలకు ప్రత్యామ్నాయ యుగం ఆవిర్భవిస్తుంది. ఆ దిశగా పయనిద్దాం.


డా‘‘  కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నేత
మొబైల్‌: 98497 41695

మరిన్ని వార్తలు