-

ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!

19 Aug, 2022 12:58 IST|Sakshi

డెబ్భై ఐదేళ్ల స్వాతంత్య్ర భారతంలో సామాజిక ఆర్థిక వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణం దళిత, బహుజన ఉత్పత్తి వర్గాలను ప్రధాన స్రవంతి లోని ఉత్పాదక శక్తులుగా మార్చకపోవడమే. అంటే ఒక 500 ఏళ్ల నుంచి నాటు వేసే కుటుంబాలు భూమి కలిగి లేకపోవడం; ఏ రంగంలో అయితే వారు తమ శ్రమను ధారబోస్తున్నారో ఆ రంగం భూస్వామ్య పెట్టుబడిదారుల చేతుల్లో ఉండడం ప్రధాన కారణం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో శిశు ఆరోగ్య సంరక్షణ మరింతగా క్షీణించడం వలన పుట్టే పిల్లలు శక్తిమంతంగా పుట్టడం లేదు. మాతా శిశు పోషక ఆరోగ్య బాధ్యతలు మరింతగా క్షీణిస్తున్నాయి. అవినీతి అన్ని వైపులా అల్లుకుంటూ ఇచ్చే చేతికీ, తీసుకునే చేతికీ మధ్య వంద చేతులు ఏర్పడుతున్నాయి. భరత భూమిలో ప్రధాన వనరు భూమి. భూమి అందరి సొత్తు. కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఇప్పుడు అది ఐదు కులాల చేతుల్లోనే ఉంది. మొత్తం భారత దేశంలో సుమారు 6,000 కులాలున్నాయి. అయితే దాదాపు భూమి అంతా 100 కులాల చేతుల్లోనే ఉంది. ఇంతకంటే పెద్ద అసమానత మనకి ఏ దేశంలోనూ కనిపించదు. మన జాతీయాదాయం మొత్తంలో 22 శాతం... ఒక్క శాతం మంది దగ్గరే ఉంది. 

భారతదేశ సంపదాభివృద్ధి ప్రక్రియలోకి దళితులను ఎందుకు రానివ్వడం లేదు అనేది మన ముందున్న ప్రశ్న. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. సంపదను సృష్టిస్తున్న ఐటీ పరిశ్రమ భారతదేశంలో 1990 నుండి ప్రారంభమైంది. అతికొద్ది కాలంలోనే 16 లక్షల కోట్లు వ్యాపారం చేసింది. ఈ రంగంలో దేశంలోని పది, పది హేను కులాలే  జొరబడ్డాయి. ఈ రంగంలోకి దళితులు ప్రవేశించకుండా పెద్ద ప్రయత్నం జరుగుతోంది. ఇది పెద్ద సామాజిక ద్రోహం. ఇక జీడీపీ సంగతికొస్తే... ప్రపం చంలో రెండు దేశాలు ముందున్నాయి. ఒకటి చైనా. రెండోది దక్షిణ కొరియా. దీనికి కారణం అక్కడ కుల, మత భేదాలు లేకుండా అందరినీ, అన్ని రంగాలలో ప్రోత్సహించడమే. భారతదేశంలో అటువంటి ప్రోత్సాహమే లేదు. దానికి కారణం కులవ్యవస్థ, అస్పృశ్యతా భావన. చైనా  ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. చైనాతో మనం పోటీపడలేక పోవ డానికి కారణం మనదేశం లోని 60 కోట్ల మందినీ మనం ఉత్పత్తి రంగంలోకి తీసుకురాకపోవడం.

సామాజిక న్యాయానికి విఘాతం
ముఖ్యంగా 1970 తర్వాత ఏ కులం వారు ఆ కుల వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నారు. పారిశ్రామిక వ్యవస్థలు, విద్యా సంస్థలు అన్నింటిలోనూ స్వకులం వారినే రిక్రూట్‌ చేసుకుంటున్నారు. ఇది సామాజిక న్యాయ దూరం. మరోపక్క దేశంలో అవినీతి పెరిగిపోతోంది. అవినీతి మీద మాట్లాడే గళాలను అణచి వేయాలని చూస్తున్నారు. కనీసం స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియా, హీరేన్‌ ముఖర్జీ, డాంగే, పుచ్చలపల్లి సుందరయ్య, కృష్ణ మీనన్, మాలవ్యా, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, గుల్జారీలాల్‌ నందా, సుశీలా నాయర్, మొరార్జీ దేశాయ్, నంబూద్రి పాద్‌ వంటి వారు ప్రజాస్వామ్యంలోని లొసుగులను గురించి తమ గళాలు వినిపించగలిగే వారు. ఇప్పుడా పరిస్థితి భారత దేశంలో లేదు. స్వాతంత్య్ర భారతంలో ప్రజల వాక్కుకు స్వాతంత్య్రం లేదు. ఈ దశాబ్దంలో ఎంతో మంది తమ వాక్కు వినిపించి హతులయ్యారు. 

సంపన్న వర్గాలు, అగ్రకులాలు ఎన్నికలను పెట్టుబడి, రాబడిగా చూస్తున్నాయి. రాజకీయ రంగంలో ఓటు కొనడం ఎప్పుడు ప్రారంభించారో అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కుప్పకూలడం ప్రారంభమయ్యింది. ధనికుల రక్షణ, పేదల భక్షణ కొనసాగుతోంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పాలక వ్యవస్థ ధనవంతులకు ఊడిగం చేస్తున్నాయి. ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి కారణం రాజ్యాంగ ఉల్లంఘనే. 

ఈ 75 ఏళ్లలో శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక జ్ఞానం అంతరిస్తూ వస్తోంది. భారతదేశంలో ప్రధాన మతమైన బౌద్ధం పునరుజ్జీవం మీద దెబ్బ కొట్టారు. హిందూ మతో ద్ధరణకు పూనుకుని బడులు తగ్గించి గుడులు పెంచారు. హిందూ మతేతరమైన జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, జొరాస్ట్రియన్‌ వంటి మత ధర్మాలను ఎదగకుండా చేశారు. మానవ, సామాజిక, వ్యక్తి ధర్మాలను ధ్వంసం చేసి అరాచకత్వాన్ని పెంచారు. భారతీయ తాత్వికులైన చార్వాకులు, సాంఖ్యాయనులు వంటి భౌతిక తాత్వికుల ధర్మాలను కాలరాశారు. వీటన్నిటి ఫలితంగా భారతదేశం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దోపిడీలో మగ్గుతోంది. స్వాతంత్య్రం అగ్రకులాల, అగ్ర వర్గాల అనుభవైకవేద్యమయ్యింది. (క్లిక్‌:  ప్రగతి ఫలాలు దక్కిందెవరికి?)

అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దళితుడూ, బహుజనుడూ, మైనారిటీలు చేతబూనాల్సిన చారిత్రక సందర్భం ఇది. రాజ్యాంగం ఇచ్చిన ఉద్యమ హక్కుని, పోరాట హక్కుని పునరుజ్జీవింపజేసి మనుషులు చైతన్యవంతులై, నీతిమంతులై, వ్యక్తిత్వ నిర్మాణదక్షులై తమను తాము అమ్ముకోకుండా; తమను తాము రక్షించుకుని, జీవింపజేసుకుని, నూతన భావాలను పునరుజ్జీవింప జేసుకుని రాజ్యాధికార దిశగా కొనసాగ వలసిన రోజులివి. పోరాటం మానవుని హక్కు. జీవించడం మానవుని హక్కు. సంపద అందరికీ సమానంగా పంపిణీ అయ్యే వరకూ పిడికిళ్లు బిగుసుకునే ఉంటాయి. ఐక్యతా పోరాటమే స్వాతంత్య్రానికి పునాది.


- డాక్టర్‌ కత్తి పద్మారావు 
సామాజిక ఉద్యమకారుడు

మరిన్ని వార్తలు