అనువాదాలు అవసరమైన సామాజిక సందర్భాలు

9 Jul, 2022 12:36 IST|Sakshi

సృజన సాహిత్యానికి ఉన్నట్లు అనువాదానికి ఒక సామాజిక సాంస్కృతిక సందర్భం ఉంటుందా? ఉంటుంది అనే చరిత్ర చెబుతున్నది. బౌద్ధ జైన మత సంస్కృతులను అభావం చేస్తూ ‘వర్ణాశ్రమ ధర్మ పరి రక్షణ’, ‘మను మార్గ వర్తన’ ప్రధానంగా గల వైదిక మత స్థాపన నాటి మత సాంస్కృతిక అవసరంగా ముందుకు వచ్చినపుడు తెలుగు సమాజానికి సంస్కృతం నుండి మహాభారత అనుసృజన అవసరమైంది. జాతీయోద్యమ నిర్మాణానికి భారతదేశపు భిన్న ప్రాంతాల, భాషల ప్రజా సమూహాల మధ్య ఐక్యతా భావాన్ని అభివృద్ధి చెయ్య వలసిన సందర్భం నుండి అనువాదం ప్రాధాన్యం లోకి వచ్చింది. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా మానవ సమూహమంతా ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని రెండు వర్గాలుగా విడిపోయివుందనీ, బ్రిటన్‌లోని పారిశ్రామికాభివృద్ధి నేపథ్యంలో పెట్టు బడిదారీ సమాజం అభివృద్ధి చెందిన విధానాన్ని గుర్తించి, కార్మికవర్గ అంతర్జాతీయ ఐక్యతను సంభావించిన మార్క్స్, ఎంగెల్స్‌ విశ్వమానవుల మధ్య సంభాషణకు తలుపులు తెరిస్తే సాహిత్య రంగంలో అది అనువాదాలకు దారితీసింది.

1917 రష్యా విప్లవ విజయం తరువాత భారత దేశంలోని కార్మిక కర్షక పోరాటాలకు స్ఫూర్తి ఇవ్వటానికి ‘అమ్మ’ (మాక్సిమ్‌ గోర్కీ) వంటి నవలలు తెలుగులోకి అనువాదం కావడం గమ నించవచ్చు. 1930వ దశకంలో ప్రారంభమై 1950ల వరకు సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమం... ప్రపంచంలో భూస్వామ్య పెట్టుబడిదారీ ఆధిపత్యాల మీద జరిగిన తిరుగుబాట్ల చరిత్రను భిన్న దేశాల సాహిత్యం నుంచి అనువాదం చేసుకొన్నది. మరొక వైపు దేశంలోనే భిన్న ప్రాంతాలలో భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు వస్తువుగా వచ్చిన సాహిత్యాన్ని అనువాదం చేసుకొన్నది. మొత్తంగా ఇవన్నీ దేశం మీద జరుగుతున్న పీడితుల పోరాట చరిత్రకు నైతిక మద్దతు కూడగట్టడంలో కీలకపాత్ర పోషించాయి. అలాగే విప్లవోద్యమ అవసరాల నుండి చైనా విప్లవోద్యమం, లాటిన్‌ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంబం ధించిన కథనాలు అనేకం తెలుగులోకి అనువాదం అయ్యాయి. 

ఈ రకమైన అనువాద చరిత్రను స్త్రీల కోణం నుండి అధ్యయనం చేయటం స్త్రీల సాహిత్య, సాంస్కృతిక చరిత్ర నిర్మాణం దృష్ట్యా అవసరం. ఇది రెండు రకాలుగా జరగాలి. ఒకటి: స్త్రీల జీవన సమస్యలను, సంఘర్షణలను చిత్రించిన సైద్ధాంతిక సృజన విమర్శన సాహిత్యాన్ని ఎంతగా తెలుగులోకి తెచ్చుకున్నాం? అందువల్ల తెలుగు సమాజ తాత్విక భావధార ఎంత పదునెక్కింది? అన్న ప్రశ్నలతో తరచి చూడటం. రెండు: అనువాదకులుగా తెలుగు స్త్రీల అభిరుచులు, ఆసక్తులు, చైతన్యం ఎటువంటివి? వారు చేసిన అనువాదాల సందర్భశుద్ధి ఎటువంటిది? వంటి ప్రశ్నలతో మదింపు చేయటం. 

ఇతర భాషలలోని స్త్రీల రచనలు, తెలుగులో స్త్రీలు చేసిన అనువాదాలు తెలుగు సమాజంలో మహిళా సమస్యల గురించిన అవగాహనను పదునెక్కించటంలో నిర్వహించిన పాత్రను ప్రత్యేకంగానూ, సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సందర్భాలకు అనువాదాల ద్వారా స్త్రీలు సమకూర్చిన శక్తిని మొత్తంగానూ అర్థం చేసుకొనటాన్ని ఉద్దేశించి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ‘అనువాద సాహిత్యం – స్త్రీ సందర్భం’ అనే అంశంపై ఆరవ మహాసభను జూలై 9, 10 తేదీలలో గుంటూరులో నిర్వహించ తలపెట్టింది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా అందరినీ ఆహ్వాని స్తున్నది. (క్లిక్‌: తరతరాలనూ రగిలించే కవి)


- కాత్యాయనీ విద్మహే 
జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక

మరిన్ని వార్తలు