సర్వతోముఖాభివృద్ధికి దివిటీ

30 Aug, 2020 00:43 IST|Sakshi

సందర్భం

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం, దేశ వాస్తవ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటూ, సామాజిక, సాంస్కృతిక అంశాల సమ్మిళి తంతో రూపొం దించిన నూతన జాతీయ విద్యా విధానం –2020, విద్యారంగంలో ఒక నవశకానికి నాందీవాచకం పలకనుంది. ప్రధాని మోదీ లక్ష్యించిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ను సాకారం చేసుకునే దిశగా, విద్యాబోధనతోపాటు సృజనాత్మకత, నైతికత, శారీరక–మానసిక స్థైర్యాన్ని పెంచుతూ.. విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడే విధంగా నూతన విద్యావిధానం ఆవిష్కృతమైంది. దేశాభివృద్ధి ప్రక్రియలో కుటుం బం, సమాజం అంశాలు కూడా కీలకమని గుర్తించి ‘వసుధైక కుటుంబం’ అన్న భారత జాతి స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పే తరాన్ని, మున్ముందు చూడబోతున్నాం. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నూతన విద్యావిధాన రూపకల్ప నకు ప్రముఖ శాస్త్రవేత్త కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు నాలుగేళ్లపాటు.. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపింది. ఇంకా ఆన్‌లైన్‌ ద్వారా అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని భవ్యమైన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నూతన విద్యావిధానాన్ని రూపొందించింది. ఇది మన దేశానికి ఓ దిక్సూచిగా ఉండబోతోంది. 

భారతీయ ఆత్మను ఆవిష్కరించే  నూతన జాతీయ విద్యా విధానంలో భారతీయ వైవిధ్యత, భాషలు, కులాలు, మతాలు, తెగలు, వారి ఆచార సంప్రదాయాలు వీరందరూ ఉత్పత్తి చేసిన జ్ఞాన సంపద.. మన వారసత్వ సంపద.. మన పాఠశాల విద్యలో, పాఠ్యప్రణాళికలో భాగస్వామ్యం కానున్నాయి. జాతీయ నూతన విద్యా విధానం 2020.. మూడేళ్ల నుండి 18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరినీ విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావడం విప్లవ విప్లవాత్మకమైన మార్పు. ఈ విధానం ద్వారా ముఖ్యంగా.. పాఠశాల స్థాయి, ఉన్నత విద్య, వృత్తి విద్యలో సమూల మార్పులు రాబోతున్నాయి. వీటికి అనుబంధమైన ఉపాధ్యాయ విద్యలోనూ అవసరమైన మార్పులు వస్తాయి. విద్యార్థుల శారీరక, మానసిక, సాంఘిక, భావోద్వేగ వికాస దశలకు గుణంగా పాఠ్యప్రణాళిక, బోధనా పద్ధతి ఆధారంగా, ‘5+3+3+4’ సూత్రం ఆధారంగా..  పాఠశాల విద్య దశల విభజన జరిగింది. ప్రారంభ బాల్య సంరక్షణ్‌ విద్య (ఈసీసీఈ)ని మూడేళ్ల వయసులోనే చేర్చడంతో మరింత మెరుగైన అభ్యాసన, అభివృద్ధి, శ్రేయస్సుకు బాటలు పడతాయి.

ఎనిమిదో తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని ఈ విద్యావిధానం ప్రతిపాదిస్తోంది. నూతన విధానంలో ఆంగ్లభాష నేర్చుకుంటూనే, మాతృభాషలో బోధన జరగడంతో విద్యార్థులు సులభంగా విషయాలను అర్థం చేసుకుంటారు. విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా వారు ఏ మాధ్యమం ఎంచుకున్నప్పటికీ.. అందులో పుస్తకాలు అందుబాటులో ఉండేట్లు జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. బట్టీ పట్టి పరీక్షలు పాసయ్యే మూస పద్ధతికి బదులు విద్యార్థి కేంద్రక విధానం రానుంది. 2040 నాటికి దేశంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ ఉండాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇది విద్యార్థులందరికీ వారి సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా.. ట్రాన్స్‌జెండర్లతో సహా అందరినీ అందుబాటులో ఉండాలని సర్కారు భావిస్తోంది. దేశంలో అందరి అవసరాలకు తగ్గట్లు పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల భాగస్వామ్యం ఉంటుంది. వృత్తి విద్యను అన్ని విద్యా సంస్థలు.. అంటే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం చేస్తారు. 2025 నాటికి కనీసం 50% మంది అభ్యాసకులకు వృత్తి విద్య అందుబాటులో ఉండేట్టు చూస్తారు.

భారమైన పాఠ్యప్రణాళికను తగ్గించి కీలక విషయాలను మాత్రమే చేర్చడం, పాఠ్యపుస్తకాలలో స్థానిక అంశాలకు ముఖ్యమైన స్థానం కల్పించడం, స్థానిక భాషా పుస్తకాలు రూపొందించడం, జాతీయ స్థాయి పాఠ్య పుస్తకాలు ప్రాంతీయ భాషల్లో కూడా ముద్రించి ఉచితంగా అందించడం వంటి కార్యక్రమాలకు నూతన విద్యావిధానం వేదిక కానుంది. స్థానికంగా ఉండే వృత్తి నిపుణులు, కళాకారుల సేవలు వినియోగించుకోవడం ద్వారా శ్రమ పట్ల గౌరవాన్ని, అనుభవపూర్వక అభ్యసనాన్ని విద్యను అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకే విధమైన విద్యాప్రమాణాలు నెలకొల్పడం, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల బోర్డులకు విద్యా ప్రమాణాల నిర్ధారణకు జాతీయ సంస్థ (్కఅఖఅఓఏ) మార్గ నిర్దేశనం చేస్తుంది. పరీక్షల బోర్డులు కీలకమైన విద్యార్థుల సామర్థ్యాలను మాత్రమే పరీక్షిస్తాయి. ప్రతి రాష్ట్ర పరీక్షల బోర్డు ఇతర రాష్ట్రాలతో సమానమైన విద్యాప్రమాణాలని రూపొందించాలి. కోచింగ్‌ సంస్కృతికి చరమగీతం పాడడానికి, ప్రవేశ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ.. వివిధ రాష్ట్రాల పరీక్షల బోర్డుల సమన్వయంతో  పనిచేస్తుంది. ఈ నూతన విద్యావిధానం అమలుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్న తరుణంలో.. రాష్ట్రాలు కూడా దీన్ని అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

కృత్రిమ మేధ, డిజైనింగ్, సమగ్రమైన ఆరోగ్యం, సహజ జీవన విధానం, పర్యావరణ విద్య మొదలైన విషయాలను మాధ్యమిక, సెకండరీ దశలో ప్రవేశపెట్టడం. అదేవిధంగా సమస్య పరి ష్కారం, గణిత ఆలోచన నైపుణ్యాలు–కంప్యుటేషనల్‌ థింకింగ్‌ వంటి అంశాలను మాధ్యమిక దశ లోనే ప్రవేశ పెట్టడం చాలా గొప్ప నిర్ణయం. భారతీయ సాంప్రదాయ భాషలైన సంస్కృతం, ప్రాకృతం, పార్సీ వంటి అన్ని భాషలు నేర్చుకునేందుకు పాఠశాలలు అవకాశం కల్పిస్తాయి  ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ నూతన విద్యావిధానం భారతదేశ ఆత్మలో నిగూఢమై ఉన్న జ్ఞాన నిధిని వెలికితీసి.. విశ్వమానవాళికి మేలు చేయటంలో గొప్ప పాత్రను పోషించబోతుంది.

జి. కిషన్‌రెడ్డి 
వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
ఈ–మెయిల్‌: gkishanreddy@yahoo.com

మరిన్ని వార్తలు