వాజ్‌పేయి ఆలోచనలకు మోదీ పాలనలో పట్టం

25 Dec, 2020 00:12 IST|Sakshi

సందర్భం

పాలకులకు మహత్తర శక్తిని చ్చేది ప్రజాభిప్రాయం. తిరుగు లేని ప్రజాభిప్రాయమే ప్రజా స్వామ్యానికి శ్రీరామరక్ష. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వ మైనా తాను చేసిన మంచి పనుల ఆధారంగా ప్రజల మనసు గెలిచి తిరిగి అధికారంలోకి రావాల నుకోవడం పరిణత ప్రజా స్వామిక లక్షణం. మనదేశంలో 1990ల మధ్యవరకూ కాంగ్రెస్‌ ప్రభు త్వాలు పలుమార్లు ఏర్పాటయ్యాయి.  ఇవి తమ పనితీరు ఆధారంగా కాక, స్వాతంత్య్ర పోరాటానికి తామే నాయకత్వం వహించామని ప్రచారం చేసుకుని సాను భూతి పొందడంతోపాటు, ప్రతిపక్షాల బలహీనతను ఆసరాగా చేసుకుని ఎన్నికవుతూ వచ్చాయి. 1975–77 మధ్యకాలంలో ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజా స్వామ్యం పీక నులిమి కాంగ్రెస్‌ ప్రభుత్వం  విధించిన అత్యయిక పరిస్థితి ప్రజల మనోభావాలను దెబ్బ తీసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయింది. 1990లో ఆర్థిక సరళీకరణ, రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.  

సాంకేతికత కారణంగా వివిధ సమాచార వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు వార్తల్లోని వాస్తవాలను గుర్తించడం మొదలు పెట్టారు. దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న పార్టీలకు తాము అనుకున్నట్టే అంతా జరగాలన్న పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇలాంటి దశలోనే సుపరిపాలనకు మార్గదర్శనం చేసిన భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టింది. ప్రభుత్వం తాను చేసింది ప్రజలకు చెప్పుకోవడంతోపాటు ప్రజలు కూడా ప్రభుత్వాలు ప్రకటించిన మార్పులు జరిగాయో లేదో తెలుసుకునేందుకు అవకాశం కల్పించ డమే వాజ్‌పేయి సుపరిపాలనకు నిదర్శనం. వ్యూహాత్మక దృష్టి, పారదర్శకతను పెంపొందించడం, ప్రభుత్వాన్ని జవాబు దారీగా నిలబెట్టడం అనే మూడు విస్తృతమైన అంశాలు సుపరిపాలనకు ఆధారం. 

మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా మనం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. వాజ్‌పేయి వ్యూహాత్మక దృష్టి కారణంగా మౌలిక వసతుల కల్పన జోరందుకుంది. రహదారుల రంగ చరిత్రగతిని మారుస్తూ, స్వర్ణచతుర్భుజి పేరుతో జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా గ్రామాలకు అనుసంధానత పెరిగి ఉపాధి అవకాశాలు ముమ్మరమయ్యాయి. బాల్యదశ నుంచే మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాలన్న ఆలోచనతో సర్వశిక్షా అభియాన్‌ తెచ్చారు. దీనిద్వారా పాఠశాల విద్యను నిర్ణీతకాల వ్యవధిలో సార్వత్రికంగా మార్చేందుకు ముందడుగు పడింది. పోఖ్రాన్‌లో అణుపరీక్షలను నిర్వ హించాలన్న భారతదేశ నిర్ణయం, ఆ తర్వాత అణ్వా యుధ వ్యాప్తి నిరోధక కూటమిలో చేరడం వంటివి వాజ్‌పేయి దూరదృష్టి, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనాలు. 

పాలకులు తమ ప్రవర్తన విషయంలో ఎంత బాధ్యతతో వ్యవహరించాలో దశాబ్దాల క్రితమే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మాథ్యూ తెలియ జెప్పారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరూ, వారి ప్రవర్తన విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి; తమ పాలకులు చేసే ప్రతి చట్టం గురించి తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంటుందని స్పష్టం చేశారు. 2002 తర్వాతే వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం పారదర్శక పాలనకు మూలస్తంభంలాంటి, సమాచార హక్కు చట్టానికి పూర్వ రంగంలాంటి ద ఫ్రీడం ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ 2002 తెచ్చింది. 

ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారిత్వం దిశగా వాజ్‌పేయి ఎంతో ముందుచూపుతో తీసుకున్న పలు నిర్ణయాలు పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపా డాయి. ప్రజాధనాన్ని కాపాడటం, దాన్ని సద్వినియోగం చేయడం పాలకుల బాధ్యత. బ్రిటన్‌ మాజీ ప్రధాని మార్గరేట్‌ థాచర్, ప్రజాధనం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదనీ, ఉన్నదల్లా పన్ను చెల్లింపుదారుల ధనమేననీ అంటారు. అందువల్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాల్సిన బాధ్యతకు పెద్దపీటవేస్తూ, ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ చట్టాన్ని తేవడం ద్వారా, వ్యవస్థాగతంగా ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించడానికీ, తద్వారా ఆర్థిక లోటును క్రమంగా తగ్గించడానికీ ప్రయత్నం జరిగింది. 

వాజ్‌పేయి సుపరిపాలనా విధానాల ప్రభావం, నరేంద్ర మోదీ మొదటి, రెండవ విడత ప్రభుత్వాలపై స్పష్టంగా కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ ఒప్పందాన్ని చట్ట రూపంలో తేవడం,  ఆర్టికల్‌ 370ని విజయవంతంగా రద్దు చేయడం, మహిళలకు, షెడ్యూలు కులాలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కనపెట్టడం ఇందుకు నిదర్శనం. అందరికీ సమాన అవకాశాలు, ఒకేరకమైన చట్టాలు వర్తించే అంశాలపై ప్రధానమంత్రి దృష్టిపెట్టడం వాజ్‌పేయి సుపరిపాలనా విధానంలోని మరో కోణాన్ని మరింత ముందుకు తీసుకుపోవడంగా చెప్పుకోవచ్చు. జన్‌ధన్‌ యోజన వంటి విప్లవాత్మక చర్యలు ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చాయి.

ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2.57 లక్షల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని 70 కోట్లకుపైగా లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ అయ్యేట్టు చూడటం జరిగింది. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా పేదలకు ప్రభుత్వం నేరుగా సహాయం చేయగలిగింది. ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పారదర్శక పాలన, మెరుగైన శాసన విధానాలు కేంద్ర ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా మారాయి. కాలం చెల్లిన చట్టాలు ఎన్నింటినో మోదీ సర్కారు రద్దుచేసింది.  మోదీ పిలుపునిచ్చిన సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ నినాదం సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం.

జి.కిషన్‌ రెడ్డి
వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
నేడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి; సుపరిపాలన దినోత్సవం

మరిన్ని వార్తలు