ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?

23 Nov, 2022 12:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్‌ 2న జస్టిస్‌ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్‌ను ఆర్టికల్‌ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్‌కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.

ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. 

గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్‌ రోహిణి కమీషన్‌ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది.  గ్రూప్‌–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్‌– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్‌–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్‌–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 

1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్‌ కమిషన్‌ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. 

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి  పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్‌ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?)


- కోడెపాక కుమార స్వామి
సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు