నిత్య అసత్యాల పుట్ట చంద్రబాబు

18 Nov, 2020 00:29 IST|Sakshi

విశ్లేషణ

నవంబర్‌ 14న బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల భవిష్యత్తు గురించి తాను నిత్యం ఆలోచిస్తున్నట్లుగా చంద్రబాబు పోజుకొట్టారు. తన హయాంలో ఎన్నడైనా ఏపీలోని స్కూళ్లను బాగుచేయాలన్న ఆలోచన బాబు చేశారా? అధికారంలోకి వచ్చాక మొదటిదశలోనే 14,500 స్కూళ్లను అత్యాధునిక పాఠశాలలుగా మలిచిన ఘనత వైఎస్‌ జగన్‌ది కాదా? తమ పిల్లలను కూలీకి పంపించడం కాకుండా, స్కూళ్లకు పంపితే అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వడాన్ని చంద్రబాబు సమర్థిస్తారా? తప్పు పడతారా? జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదే విద్య, వైద్య రంగాలకు. ఆ విషయం ప్రజలలోకి వెళుతోంది. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. బాబు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చేస్తున్న విమర్శలకు అదొక్కటే సమాధానం అవుతుంది.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నవంబర్‌ 14న బాలల దినోత్సవం సందర్భంగా చేసిన వ్యాఖ్యలలోనూ రాజకీయాలు చొప్పించడం ద్వారా ఆయన చెప్పిన లక్ష్యాన్ని ఆయనే దెబ్బతీసుకున్నట్లయింది. స్వార్థ రాజకీయాలను పక్కనబెట్టి.. రేపటి పౌరుల గురించి బాధ్యతగా ఆలోచించినప్పుడే అబ్రహాం లింకన్, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నేతలు కలలుగన్న సమాజం సిద్ధిస్తుందని ఆయన అన్నారు. కానీ, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు చూడండి. ‘ఇప్పుడు అటు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇటు పరిశ్రమలను వాటాల కోసం బెదిరించి వెళ్ళగొట్టి యువత ఉపాధికి గండికొట్టడం విషాదకరం. ఇలాగైతే పిల్లల భవి ష్యత్తు ఏం కావాలి?’ అని బాబు ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్లు వ్యాఖ్యానించే చంద్రబాబు ఎన్నడైనా స్కూళ్లను బాగు చేయాలన్న ఆలోచన చేశారేమో సమాధానం చెప్పాలి. 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు కాదని చంద్రబాబు అనడం సాహసమే. ఉదాహరణకు జగన్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు అన్న కొత్త కార్యక్రమం చేపట్టారు. అనేక ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అక్కడ సదుపాయాలు సమకూర్చడం చంద్రబాబుకు కనిపించడం లేదా? మొదటి దశలో 14,500 స్కూళ్లను అత్యంత ఆధునిక స్కూళ్లుగా చేసిన ఘనత జగన్‌ది కాదని చంద్రబాబు చెప్పగలరా? అంతేకాదు.

పేదలు తమ పిల్లలను కూలీకి పంపించడం కాకుండా, స్కూళ్లకు పంపితే అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వడాన్ని చంద్రబాబు సమర్థిస్తారా? తప్పుపడతారా? ఎప్పుడైనా చంద్రబాబు తన హయాంలో అలాంటి ఆలోచన చేశారా? స్కూళ్ల గురించి, అక్షరాస్యత గురించి ఆలోచించి ఉంటే ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యత ఏపీలో ఎందుకు ఉందన్నదానికి ఆయన జవాబు ఇవ్వగలరా? పిల్లలకు మధ్యాహ్న భోజనం విషయంలో కాని, వారికి పుస్తకాలు, బూట్లు మొదలైన వాటిని జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన తీరు కాని పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేవి కావని చంద్రబాబు చెప్పగలరా? ఏదో ఒక విమర్శ చేయాలని చేయడం కాదు. ఏదైనా మంచి సలహా ఇస్తే ఆయన వయసుకు తగినట్లు ఉంటుంది. 

చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికీ ఉజ్వల భవిష్యత్తు ఉండేలా... యూనివర్సిటీలకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు వారధిగా మన విద్యావ్యవస్థను గత ఐదేళ్ళ తెలుగుదేశం పాలనలో తీర్చిదిద్దాం అని చంద్రబాబు చెబుతున్నారు. అంత గొప్పగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేసి ఉంటే ప్రజలు తెలివితక్కువగా ఆయనను ఓడించారా? కేవలం కార్పొరేట్‌ స్కూళ్లకు, కార్పొరేట్‌ కాలేజీలకు ప్రాధాన్యం ఇచ్చి, ఒక కార్పొరేట్‌ విద్యాసంస్థల యజమానికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత బాబుదే. అది ఎందుకు చేశారో ఆయన ఆత్మను అడిగితే తెలుస్తుంది.

అంతేకాదు.. యూనివర్సిటీలలో సభలు పెట్టి రాజకీయాలు మాట్లాడిన చరిత్రను బాబు మర్చిపోతున్నారా? చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఏపీలో తెచ్చిన పరిశ్రమలు ఎన్ని? వాటిలో వచ్చిన ఉద్యోగాలు ఎన్ని? విద్యా వ్యవస్థలో అసలు ఏమి మార్పులు చేయగలిగారు? ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో స్కిల్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు కూడా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పెట్టిన మాట నిజమే. కాని దానిని ఎలా ఆయన వాడుకున్నది అప్పటి అధికారులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. 

అయినా తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. కానీ, ఆ తర్వాత వ్యాఖ్య చూడండి. మన రాష్ట్రంలో పిల్లలు ప్రతిరోజూ వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులతో కలిసి బిడ్డల సామూహిక ఆత్మహత్యలను చూడాల్సి వస్తోందన్నారు. బాల్యంలోనే భయంకర అఘాయిత్యాలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఇవన్నీ ఇలాగే కొనసాగితే రేపటి సమాజాన్ని ఊహించుకుంటేనే భయమేస్తోందని బాబు ఎంత దారుణంగా మాట్లాడారో గమనించండి. బాబు ఏ ఉద్దేశంతో ఈ మాటలు అంటున్నారు.

స్వయంగా దళితులలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని తానే అన్న సంగతి ఆయన మర్చిపోయి ఉండవచ్చు. నాయీ బ్రాహ్మణులు సచివాలయానికి వస్తే దేవాలయం వంటి ఆఫీస్‌కు మీరు వస్తారా? మీ సంగతి చూస్తాననడం బూతు కాదని ఆయన అనుకుంటున్నట్లున్నారు. మత్స్యకారులను ఉద్దేశించి తోక కట్‌ చేస్తానని అనడాన్ని ఏమంటారు? దళితులు పరిశుభ్రంగా ఉండరని ఆయన మంత్రి ఆదినారాయణరెడ్డి అనడం బూతు కాదు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, బొండా ఉమా వంటి వారు నువ్వు మగాడివైతే అని... నీ అంతు చూస్తాం అని ఆనాటి ప్రతిపక్షనేత జగన్‌ను ఉద్దేశించి బూతులు మాట్లాడితే అవన్నీ సూక్తి ముక్తావళిగా చంద్రబాబు భావించారా? మరో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను ఉద్దేశించి మీకు ఎందుకురా! రాజకీయాలు.. అంటూ చేసిన వ్యాఖ్యలను ఏమనుకోవాలి? నిజమే టీడీపీ, అయినా, వైసీపీ అయినా ఎవరైనా సభ్య భాషలోనే మాట్లాడాలి. కానీ, అదేదో వైసీపీ నేతలు అచ్చంగా బూతులు మాట్లాడుతున్నట్లు టీడీపీ నేతలు పరమ సాధుపుంగవులని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అన్నిటిని మించి పిల్లలకు నేర్పవలసింది అసత్యాలు చెప్పవద్దని.. నిజాయితీగా ఉండాలని, రుజువర్తన కలిగి ఉండాలని. తాను అబ ద్ధాలు ఆడలేదని తన గుండెమీద చేయి వేసుకుని చంద్రబాబు చెప్పగలరా? ఎన్నికల ప్రచారంలో ఎన్ని మాటలు చెప్పారు? అధికారంలోకి వచ్చాక ఎన్ని మాటలు మార్చారు? పిల్లలకు ఆదర్శంగా ఉండవలసిన ముఖ్యమంత్రి స్థాయిలోని వారు, మంత్రి పదవులలో ఉన్నవారు ఎన్ని అబద్ధాలు ఆడారో లెక్కవేయడం కష్టం కావచ్చు. అమెరికా అధ్యక్షుడు తన నాలుగేళ్ల పాలనలో ఇరవై వేల అబద్ధాలు ఆడారని ఒక పత్రిక లెక్క గట్టింది. మరి మన దేశంలో నేతల గురించి ఏమి చెప్పగలం? అందులోనూ బాబు వంటి వారు అబద్ధాలు, అసత్యాలు.. మాట మార్చడాలు ఎన్నివేల సార్లు చేశారో ఎవరైనా లెక్కించగలరా?

పిల్లలపై అకృత్యాల గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించడం శోచనీయం. అదేదో ప్రభుత్వం దగ్గర ఉండి చేయించిందన్న అభి ప్రాయం కలగాలన్న దురుద్దేశంతో ఆయన మాట్లాడారు. నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి అనే యువతి ఆత్మహత్య ఘటనతో సహా అనేక దుర్ఘటనలు అనేకం ఆయన హయాంలో జరిగాయి. అప్పుడు ఆయన ప్రభుత్వం పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరించిందన్న విమర్శలు వచ్చాయి. ఆయన హయాంలో 2017లో పదిహేడు వేల నేరాలు జరిగినట్లు నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో వెల్లడించింది. అబ్రహాం లింకన్‌ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించడం బాగానే ఉంది.

పెద్దలు ప్రారంభించిన పనులను కొనసాగించేది పిల్లలే అని లింకన్‌ అన్నారని తెలిపారు. మంచిదే. అవి మంచిపనులైతే కొనసాగించాలి కానీ, రియల్‌ ఎస్టేట్‌ స్కామ్‌లు చేయడం, చేసిన వాగ్దానాలను విస్మరించడం, లేక నిర్మాణం కాని రాజధాని, నిర్మాణం పూర్తికాని పోలవరం వంటి వాటిని చూడాలంటూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృ«థా చేయడం కూడా ఆదర్శవంతమే అవుతుందా? ఓటుకు నోటు కేసు ద్వారా ఒక ప్రభుత్వాన్ని కూల్చాలని యత్నించడం, సొంత మామ ఎన్‌.టి.ఆర్‌.ను పదవి నుంచి దించడానికి కుట్ర పన్నడం వంటివి పిల్లలకు చెప్పవలసిన ఆదర్శాలు అవుతాయా అన్న ప్రశ్నలు వేస్తే వాటికి ఏమైనా జవాబు ఉంటుందా? 

తన కుమారుడు, మనుమడు, తన పార్టీ నేతల పిల్లలు మాత్రం ఆంగ్ల మీడియంలో చదువుకోవచ్చు.. పేదల పిల్లలు మాత్రం తెలుగులోనే చదువుకోవాలన్నట్లుగా తెలుగుదేశం వారు వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయమని ఎవరైనా చెప్పగలరా?  చంద్రబాబు పిల్లలకు శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు. ఆ సందర్భంగా నాలుగు మంచి మాటలు చెప్పడం ఆక్షేపణీయం కాదు. కానీ ఉన్నవీ, లేనివి కలిపి ప్రతి సందర్భంలోను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్‌పై బురద చల్లాలని ప్రయత్నించడమే దారుణంగా ఉంటుంది. ఒక్కమాట చెప్పవచ్చు.

జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నదే విద్య, వైద్య రంగాలకు. ఆ విషయం ప్రజలలోకి వెళుతోంది. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో  చేరే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. చంద్రబాబు ప్రత్యక్షంగానో, పరోక్షంగా చేస్తున్న విమర్శలకు అదొక్కటే సమాధానం అవుతుంది. డెబ్బై ఏళ్ల వయసులో చంద్రబాబు హుందాగా వ్యాఖ్యలు చేయాలని కోరుకోవడం అత్యాశే అవుతుందా? ఆయన నుంచి పిల్ల లైనా, పెద్దలైనా ఆశించేది అదొక్కటే.

వ్యాసకర్త


కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు
  

మరిన్ని వార్తలు