ఈ రహస్యబంధం అసలు లక్ష్యం?

25 Nov, 2020 00:42 IST|Sakshi

విశ్లేషణ

ప్రతి విషయంలోనూ ఏపీ ప్రభుత్వంతో ఢీకొంటున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌.. ఎన్నికైన ప్రభుత్వంతో నిత్యం గొడవపెట్టుకుని రాజకీయ లక్ష్యంతో పనిచేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. పట్టుమని పదిమంది కరోనా రోగులు లేని దశలోనే కరోనా సాకు చూపి పంచాయతీ ఎన్నికలు రద్దు చేసిన ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఇప్పుడు వేల కేసులు నమోదవుతున్న స్థితిలో కూడా తాను పదవినుంచి దిగిపోయేలోగా అన్ని స్థానిక ఎన్నికలు ముగించేయాలని ఉబలాటపడుతున్నారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా ప్రతి అడుగూ వేస్తున్న నిమ్మగడ్డ అసలు లక్ష్యం ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఈ స్థితిలో నిమ్మగడ్డకు, టీడీపీ నేతలకు రహస్య బంధం ఉందన్న సంశయం ఏర్పడుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. ఎలాగైనా ఎన్నికలు పెట్టాలని ఎన్నికల కమిషనర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రిటైరైన తర్వాత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్‌ పదవి ఇచ్చారు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపవలసి ఉన్నప్పటికీ ఆనాటి ప్రభుత్వం సిద్ధపడలేదు కనుక, తాను కూడా మెదలకుండా కూర్చున్నారు. చివరకు కోర్టు మూడు నెలల్లో ఎన్నికలు పెట్టాలని సూచించినా, చంద్రబాబు కానీ, నిమ్మగడ్డ కానీ సీరియస్‌గా తీసుకోలేదు.

శాసనసభ సాధారణ ఎన్నికల తర్వాత బాబు ప్రభుత్వం ఓడిపోవడం, వైఎస్‌ జగన్‌ సీఎం కావడం జరిగాయి. ఆ తర్వాత కొంతకాలం నిమ్మగడ్డ వివాదంలోకి రాలేదు. తదుపరి బీసీ రిజర్వేషన్‌ల వ్యవహారంపై ఒక తీర్పు వెలువడిన తర్వాత అప్పట్లో హైకోర్టు స్థానిక ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దానికి తగినట్లు జగన్‌ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధపడింది. సహజంగానే వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా  పెద్ద సంఖ్యలో ఏకగ్రీవ ఎన్నికలు కావడాన్ని టీడీపీ కానీ, మరి కొన్ని పక్షాలు కానీ జీర్ణించుకోలేకపోయాయి. చిన్న, చిన్న వివాదాలను, ఘర్షణలను కూడా భూతద్దంలో చూపడం ఆరంభించాయి. 

మొదట నిమ్మగడ్డ ఏకగ్రీవ ఎన్నికలన్నిటిని ఓకే చేశారు. ఆ తర్వాత సడన్‌గా ఆయన టీడీపీ ట్రాప్‌లో పడ్డారనిపిస్తుంది. అప్పటికే ఎన్నికలు రద్దు చేయాలనో, వాయిదా వేయాలనో బాబు డిమాండ్‌ చేశారు. ఆ మేరకు ఆయన ఈసీకి లేఖ కూడా పంపించారు. అంతే! నిమ్మగడ్డలో మార్పు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా, ప్రభుత్వానికి ఒక్క మాట చెప్పకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. దీనిపై సీఎం జగన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ ప్రయోజనాలకోసమే నిమ్మగడ్డ అలా చేశారని ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిమ్మగడ్డకు, ప్రభుత్వానికి మధ్య పలు వివాదాలు నడిచాయి. ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంలోని వారిపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి పంపిన ఒక లేఖను మొదట తనది కాదని చెప్పిన నిమ్మగడ్డ ఆ తర్వాత టీడీపీ వారిని రక్షించడానికా అన్నట్లు తానే ఆ లేఖ రాశానని చెప్పారు.  

తదనంతరం న్యాయ వ్యవస్థ ద్వారా మళ్లీ నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌ అయ్యారు. మళ్లీ గేమ్‌ ఆరంభించారు. సడన్‌గా స్థానిక ఎన్నికలు పెడతానంటూ హడావుడి మొదలు పెట్టారు. గత మార్చిలో పది కరోనా కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు వేల కేసులు నమోదు అవుతుంటే ఎన్నికలు పెట్టాలని భావి స్తున్నారు. సహజంగానే టీడీపీ అందుకు మద్దతు ప్రకటించింది. కానీ ప్రభుత్వం తరపున చీఫ్‌ సెక్రటరీ ఇప్పుడు పరిస్థితులు అనువుగా లేవని స్పష్టం చేసినా, కమిషనర్‌ తన పంతం వీడడంలేదు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెడతానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం ఏ మేరకు అందుకు సిద్ధంగా ఉందో తెలుసుకుని ఆ ప్రకారం ఎన్నికల కమిషనర్‌ వ్యవహరించాలి. కానీ నిమ్మగడ్డ తన సొంత సామ్రాజ్యంలా ఇష్టం వచ్చిన నిర్ణయాలు చేయడం మొదలు పెట్టారు. తాను చెప్పినదానికి అంగీకరించకపోతే గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, మళ్లీ హైకోర్టుకు వెళ్లడం చేస్తున్నారు. మార్చి ఆఖరుకు నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత వీలైతే అంత బదనాం చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి చేయాలన్న కుట్రతోనే ఎన్నికల కమిషనర్‌ వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అనుమానిస్తోంది. ఇందుకు తగినట్లుగానే నిమ్మగడ్డ చర్యలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు నాలుగువారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలులో పెడతానని ఆయన ప్రకటించారు. 

ఒకవైపు తెలంగాణలో ఎన్నికల కమిషనర్, ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకుని పోతున్నారు. ప్రతిపక్షాలు ఇక్కడ విమర్శలు చేసినా ఎన్నికల కమిషనర్‌ వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. హైదరాబాద్‌  కార్పొరేషన్‌ ఎన్నికల ప్రకటన, ఆ వెంటనే నోటిపికేషన్, నామినేషన్ల ప్రక్రియ ఆరంభం అయ్యాయి. మరి నిమ్మగడ్డ థియరీ ప్రకారం హైదరాబాద్‌లో నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల కోడ్‌ ప్రస్తావనే ఎందుకు రాలేదు.

ఏపీలో నిమ్మగడ్డ మాత్రం నెల రోజుల ముందే కోడ్‌ అమలు చేస్తానని అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగానే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెట్టదలిస్తే జనవరి నుంచి కోడ్‌ పేరుతో ప్రభుత్వం ఏ పని చేయకుండా అడ్డుకుంటారన్నమాట. పంచాయతీ ఎన్నికలలో ఎక్కడైనా గొడవలు జరగవచ్చు. వాటన్నిటినీ వైసీపీ ఖాతాలో వేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయవచ్చు. పంచాయతీ ఎన్నికల తర్వాత మళ్లీ మున్సిపల్, మండల ఎన్నికలు జరుపుతానని ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ కోడ్‌ కొనసాగిస్తారు. ఈ రకంగా మూడు నెలలపాటు ఏపీలో అసలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కొత్త పనులు కానీ ఏవీ చేయకుండా ఉంచడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న కుట్ర ఉండవచ్చని పలువురి సందేహం. 

గత మార్చిలో నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు రాష్ట్రాన్ని ఆయన కాపాడారని బ్యాండ్‌ వాయించిన టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా, ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని అంటున్నారు. ఇన్ని లక్షల కేసులు వచ్చాయి.. వేల కేసులు నిత్యం నమోదు అవుతున్నాయి.. ఇప్పుడు ఎలా అని ఎవరైనా అడిగితే బీహారు ఎన్నికలు జరగలేదా అని ప్రశ్నిస్తున్నారు. మరి గుజరాత్‌లో పంచాయతీ ఎన్నికలు మూడు నెలలు వాయిదా ఎందుకు పడ్డాయి? అన్నది మాట్లాడరు. డిల్లీలో మూడో కరోనా వేవ్‌ వస్తోందని ఎందుకు భయపడుతున్నారు. ఉత్తరాదిలో అనేక పట్టణాల్లో కరోనా నేప«థ్యంలో మళ్లీ కర్ఫ్యూలు ఎలా పెడుతున్నారు? ఒకప్పుడు కరోనా కేసులు లేకపోయినా నిమ్మగడ్డ ఏపీ రక్షకుడని ప్రచారం చేసినవారు.. ఇప్పుడు ఇన్ని వేల కేసులు ఉంటే ఎన్నికలు ఎలా పెడతావని అడగాలి కదా.. దీనిని బట్టే నిమ్మగడ్డకు, టీడీపీ నేతలకు రహస్య బంధం ఉందన్న సంశయం ఏర్పడుతోంది. 

గతంలో పార్క్‌ హయత్‌లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరితో భేటీ అయినప్పుడే నిమ్మగడ్డ రాజకీయ దురుద్దేశంతో ఉన్నారని వెల్లడైంది. ఆ తర్వాత టీడీపీ వారు రాసిన లేఖను ఓన్‌ చేసుకోవడం ద్వారా ఆ అభిప్రాయాన్ని మరింత బలపరిచినట్లయింది. ఇప్పుడు నిమ్మగడ్డకు టీడీపీ వంత పాడడాన్ని బట్టి వారి మధ్య ఎంత దృఢమైన బంధం ఏర్పడిందో తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తి స్థానిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తారా అన్నది సందేహమే. ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో నిమ్మగడ్డ ముందుకు సాగుతున్నారు.

ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వగలిగితే అప్పుడు ఆయన వాదనలో సహేతుకత ఉందా? లేదా అన్నది నిర్ధా రించవచ్చు. 2018 ఎన్నికలో జరగవలసిన తరుణంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? అప్పుడు కూడా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు పెట్టి ఉండాలి కదా? కేంద్రానికి రాసిన లేఖ విషయంలో రెండుసార్లు రెండు రకాలుగా ఎందుకు మాట్లాడారు? ఆయన కరోనా కేసులు దాదాపు లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారు?

ఒకసారి చీఫ్‌ సెక్రటరీ ప్రభుత్వం తరపున లేఖ రాసిన తర్వాత కూడా వివాదం కొనసాగించడం సరైనదేనా? ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని అనుకుంటే, మూడు నెలల ముందుగా ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టవలసిన అవసరం ఉంటుందా? అంటే పరోక్షంగా ప్రభుత్వంపై పెత్తనం చేయాలనో, ప్రతిపక్ష టీడీపీకి ఉపయోగపడి, అధికారంలో ఉన్న  వైఎస్సార్‌సీపీని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతోనో  ఆయన ఈ చర్యలకు దిగడం లేదని మనస్సాక్షిగా చెప్పగలరా? రాజ్యాంగ సంస్థలో పని చేసే వ్యక్తి గౌరవప్రదంగా ఉండాలి.

ఆయనను మంత్రి కొడాలి నాని వంటి మంత్రులు మరీ తీవ్రమైన పరుష భాషలో విమర్శించడం సమర్థనీయం కాదు. అయినా రమేష్‌ కుమార్‌ చర్యలు కూడా అందుకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిత్యం  కవ్వించడం ద్వారా ఏదో ప్రయోజనం ఆశిస్తున్నారా, ఇందులో ఏమైనా కుట్ర ఉందా  అన్న సందేహాలు  వస్తున్నాయి. సాధారణంగా ఒక ఐఏఎస్‌ అధికారి తాను రిటైర్‌ అయిన తర్వాత అందరి గౌరవ మన్ననలు పొందాలని ఆశిస్తారు. కానీ నిమ్మగడ్డ మాత్రం మరే రాష్ట్రంలోనూ ఏ ఎన్నికల కమిషనర్‌ కూడా వ్యవహరించని రీతిలో ప్రభుత్వంతో నిత్యం సున్నం పెట్టుకుని రాజకీయ లక్ష్యంతో పనిచేస్తున్నారనిపిస్తుంది. దీనివల్ల ఆయనకు అప్రతిష్ట వస్తుందని తెలిసినా ఆయన కుట్రపూరితంగానే ముందుకు వెళ్లాలని యోచించడం దురదృష్టకరం. బహుశా ఆయనకు అలాంటి నిస్సహాయ స్థితిని తెలుగుదేశం పార్టీ సృష్టించగలిగిందా? ఏమో అలా అయినా కావచ్చు!

వ్యాసకర్త
కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు   

మరిన్ని వార్తలు