బాబు తప్పిదాలే పోలవరానికి శాపాలు

28 Oct, 2020 02:55 IST|Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌పై ఏ మాత్రం అవగాహన ఉన్నవారికైనా పోలవరం ప్రాజెక్టు అన్నది ఒక కల. అది ఎప్పటికైనా సాకారం కావాలన్నది అందరి ఆకాంక్ష. దీనికోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో ఉద్యమాలు నిర్వహిం చారు. పార్టీలకు అతీతంగా డిమాండ్లు చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఈ ప్రాజెక్టు శంకుస్థాపనలకే పరిమితం అయింది తప్ప అడుగు ముందుకు కదలలేదు. వైఎస్‌ జలయజ్ఞంలో భాగంగా పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన దీనికి సంబంధించి అవసరమైన అనుమతులు సాధించడంలో విశేష కృషి చేశారు. ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు ఈ ప్రాజెక్టు వల్ల మునిగిపోతాయి కనుక అక్కడ నిర్వాసితులు అయ్యేవారికి ఆ రోజుల్లో అధిక పరిహారం ఇచ్చారు. అంతేకాక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేసరికి కాల్వలను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో రెండువైపులా భూసేకరణ జరిపి కాల్వల తవ్వకం చేపట్టారు. అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. ప్రాజెక్టు కట్టకుండా కాల్వలు తవ్వుతున్నారా? అంటూ విమర్శలు చేసేది. వైఎస్‌ ఆరోజు ఆ పని చేయకుంటే ఈ రోజు పోలవరం ప్రాజెక్టు ఈ మాత్రమైనా ఉండకపోయేదేమో! ఆయన ఆకస్మిక మరణం ఉమ్మడి ఏపీలో ఎన్నో మార్పులకు కారణం అయింది.

ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పోలవరం కాంట్రాక్టు ఖరారుకే ఎక్కువ సమయం తీసుకున్నాయి. అంతలో ఉమ్మడి ఏపీ విభజన జరిగిపోయింది. ఆ సందర్భంలో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం అంగీకరించి చట్టంలో పెట్టడం కాస్త ఊరటగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్లీ తారుమారు అవుతున్నట్లుగా ఉన్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి తీరని నష్టం జరిగేలా ఉంది. అసలు కేంద్రమే పోలవరం ప్రాజెక్టును నిర్మించి ఇవ్వాల్సి ఉండగా 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తమకు అప్పగించాలని కోరింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన సమయంలోనే ఈ డీల్‌ కుదుర్చుకున్నారని బుగ్గన చెబుతున్నారు. కేంద్రం అయితే సకాలంలో నిర్మించలేదు.. తాము అయితేనే వేగంగా నిర్మిస్తామని కేంద్రంలోని పెద్దలు కూడా భావించారని చంద్రబాబు చెబుతుండేవారు. ఇప్పుడు అదే పెద్ద శాపంగా మారినట్లు కనబడుతోంది. ఎందుకంటే పోలవరంపై తాజా వ్యయ అంచనాలను పరిగణనలోకి తీసుకోబోమని, 2014కి ముందు ఉన్న అంచనాల ప్రకారమే డబ్బు ఇస్తామని కేంద్రం మెలిక పెట్టడం ఏపీకి పెద్ద అశనిపాతమే అని చెప్పాలి. నిజానికి చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టును మొదలు పెట్టి ఉన్నా, లేక కేంద్రంతో నిర్మాణం చేయించడానికి కృషి చేసినా, ఈపాటికి సిద్ధం అయ్యేది. అప్పుడు నిర్వాసితుల బాధ్యత కూడా కేంద్రం పైనే ఉండేది. కానీ చంద్రబాబు ఆ పని చేయలేదు. అసలు పోలవరం ప్రాజెక్టుకు బదులు పట్టిసీమ పేరుతో లిప్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను తెచ్చి తాను నదుల అనుసంధానం చేసేశానని ప్రచారం చేసుకునేవారు.  అప్పట్లో పట్టిసీమ కాదు.. ముందుగా పోలవరం పూర్తి చేయండి అని ఎంతమంది చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు.

నిజానికి చంద్రబాబుకు భారీ ప్రాజెక్టుల మీద నమ్మకం లేదు. గతంలో 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎవరైనా పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తే అవి అయ్యేవి కావని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. పులిచింతల ప్రాజెక్టు గురించి అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు ఎవరైనా ప్రస్తావిస్తే, దాని గురించి మాట్లాడవద్దని, తెలంగాణవాదులు ముఖ్యంగా నల్గొండ జిల్లావారు వ్యతిరేకిస్తారని, తన ప్రభుత్వానికి అది చికాకు అవుతుందని బాబు భావించేవారు. కానీ రాజశేఖరరెడ్డి ఎవరు వ్యతిరేకించినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. పైగా ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్‌ నేతలను వైఎస్‌ కంట్రోల్‌ చేసేవారు. తర్వాత విభజన సమయంలో వైఎస్‌ అప్పటివరకు చేసిన కృషి కారణంగానే పోలవరానికి జాతీయ హోదా వచ్చిందంటే అతిశయోక్తికాదు. ఆయన పోలవరం ప్రాజెక్టులో కాల్వల నిర్మాణంతో పాటు ఇతరత్రా కేంద్రం నుంచి రావల్సిన అనుమతులను సంపాదించారు. పులిచింతల ప్రాజెక్టు అయితే చాలా వరకు పూర్తి చేశారు. ఇదంతా చరిత్ర. 

విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు వెంటనే పోలవరంపై శ్రద్ధ కనబరచలేదన్నది వాస్తవం. తాజాగా బుగ్గన చెబుతున్నదాని ప్రకారం 2014 నాటి వ్యయ అంచనాలకు బాబు ఓకే చేస్తూ కేంద్రానికి 2016లో ఒక లేఖ రాశారట. అది ఇప్పుడు పెద్ద సమస్య అయిందని చెబుతున్నారు. 2017 మార్చిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2014 నాటి సవరించిన అంచనాల ప్రకారమే ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వ్యయాన్ని కేంద్రం ఇస్తుందని, 2014 తర్వాత అంచనా వ్యయాల పెరుగుదలను కేంద్రం భరించదని తీర్మానించారు. 2010– 14 వరకు భూసేకరణ కోసం ఇచ్చిన అంచనాల మేరకే నిధులు ఇస్తామని చెప్పారు. దానికన్నా వ్యయం పెరిగితే కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆ మంత్రివర్గంలో టీడీపీకి చెందిన అశోక్‌ గజపతిరాజు, సుజ నాచౌదరి కూడా ఉన్నారు. వారు అప్పట్లో అసమ్మతి ఎందుకు తెలియచేయలేదని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. అంటే టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందనే కదా..! 

పైగా రాష్ట్రమే పోలవరం కట్టేస్తుందని చంద్రబాబు ప్రకటనలు చేశారు. కానీ కేంద్రం చేసిన తీర్మానాలను ఎందుకు వ్యతిరేకించలేదన్నదానికి ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలేదు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టు కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత అయిన వైఎస్‌ జగన్‌ కూడా పాదయాత్ర చేసి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్‌  చేశారు. కాని చంద్రబాబు మాత్రం పట్టిసీమ లిప్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చి, పోలవరాన్ని ఆలస్యం చేయడం ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఆయన టైమ్‌లో కొత్త చట్టం ప్రకారం భూ సేకరణ, తదితర వ్యయాలన్నీ కలిపి రూ. 55,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసి కేంద్రానికి ప్రతిపాదన పంపించారు. ఇక కాంట్రాక్టర్లను తనకు తోచిన విధంగా మార్చారు. కావల్సిన వారికి సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. వీటిలో నిబంధనలను పాటించని క్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రధాని మోదీనే ఎన్నికల ప్రచార సభలలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తర్వాత వచ్చిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిస్థితి మొత్తాన్ని సమీక్షించి కాంట్రాక్టర్‌ను మార్చి, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 800 కోట్లు ఆదా చేసింది. అలాగే మొత్తం భూ సేకరణ తదితర అంచనాలను రూ. 47 వేల కోట్లకు పరిమితం చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 

దానికి కేంద్ర జలశక్తి శాఖ కూడా ఓకే చేసిందని వార్తలు వచ్చి అంతా సంతోషించారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారు అయినట్లుగా ఉంది. కేంద్రం ప్రభుత్వ ఆర్థిక శాఖ 2014లో అంచనా వేసిన ప్రకారం రూ. 20,398 కోట్లకే పరిమితం అవ్వాలని నిర్ణయం తీసుకుందట. అందులో రూ. 4 వేల కోట్లను అప్పటికే ఖర్చు చేయడంతో దానిని మినహాయించి సుమారు 16 వేల కోట్ల రూపాయలకే అంచనా వ్యయాన్ని భరిస్తామని చెబుతోంది. అందులో ఇప్పటికే 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినందున మిగిలిన 7 వేల కోట్లే ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. అంటే మొత్తం అంచనాలో సుమారు ముప్పైవేల కోట్లకు కేంద్రం ఎగనామం పెట్టడానికి సిద్ధం అయిందన్న అభిప్రాయం కలుగుతోంది. ఇది ఏపీకి అత్యంత నష్టం చేసే అంశం. 2016లో ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ తీసుకోవాలని చంద్రబాబును కేంద్రం ఒప్పించడం, దానికి ప్రతిగా పోలవరం కాంట్రాక్టును రాష్ట్రానికి అప్పగించడం జరిగాయి. 2017 లోనూ కేంద్ర క్యాబినెట్‌ పాత ధరలతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామన్నప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందన్నది ప్రశ్నగా ఉంది. 

కేంద్రమే పూర్తి బాధ్యత వహించి నిర్మాణం చేపట్టి ఉంటే, భూసేకరణ, పునరావాసం తదితర కార్యక్రమాలకు కూడా కేంద్రమే ఖర్చు చేయవలసి ఉండేది. ఇప్పుడేమో రాష్ట్రమే అవన్నీ చూసుకోవాలని చెప్పడం ఏపీ ప్రజలను మరోసారి మోసం చేసినట్లే అవుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న ఏపీ ప్రభుత్వం సొంతంగా 30వేల కోట్లను అదనంగా భరించే స్థితిలో ఉందా అన్నది కేంద్రం ఆలోచించాలి. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ కూడా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా కేంద్రంతో మొత్తం వ్యయం భరించేలా చూడాలని ప్రయత్నాలు సాగిస్తామని చెబుతున్నారు. ఏపీలో బీజేపీకి పెద్ద స్టేక్‌ లేకపోవచ్చు. అయినా ఆంధ్రులను కూడా ఆదుకోవడం దేశ ప్రధానిగా మోదీ బాధ్యత అని చెప్పక తప్పదు. 

ప్రస్తుత ప్రభుత్వం 2021 ఆఖరుకు పోలవరాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు పూర్తి అయినా, భూ సేకరణ, స్థలాలు, పొలాలు కోల్పోయినవారికి పరిహారం చెల్లింపు వంటివి పూర్తి చేయకపోతే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలాగోలా ఒప్పించగలిగే విషయంలో జగన్‌పై మాత్రం పెద్ద బాధ్యతే పడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఆయన మరికొన్ని ప్రాజెక్టులను తలపెట్టారు. రాయలసీమ వరకు గోదావరి నీటిని మళ్లించడానికి కూడా పథకాలు సిద్ధం చేశారు. అవన్నీ సాఫల్యం కావాలంటే ముందుగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కేంద్రమే తీసుకుని పూర్తి చేసి ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకుంటుందన్న గ్యారంటీ లేదు. బాబు తనకు ఎంతో విజన్‌ ఉందని ప్రచారం చేసుకుంటారు. కానీ ఆ విజన్‌ సంగతేమో కాని, కేంద్రం నిర్మించవలసిన ప్రాజెక్టును తాను తీసుకుని ఏపీ ప్రజలపై పెద్ద భారం పెట్టారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం దానిని మోయవలసి వస్తోంది. పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేసి జగన్‌ తన ప్రతిష్టను, అలాగే తన తండ్రి వైఎస్సార్‌ కలను నెరవేర్చుతారని ఆశిద్దాం. ఇందుకు ప్రధాని మోదీ సహకరించి ఆంధ్రుల మన్ననలను పొందాలని కోరుకుందాం!

- కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  
 

 

మరిన్ని వార్తలు