ఏది సంస్కృతి? ఏది విశ్వాసం?

28 Sep, 2022 03:06 IST|Sakshi

విశ్లేషణ

ఎన్‌.టి.ఆర్‌. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడంపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆయన పేరు కొనసాగించాలని కోరవచ్చు. కాని అతిగా ప్రభుత్వంపై, జగన్‌పై విమర్శలు చేయడం ద్వారా తమ పాత చరిత్ర అంతటినీ ప్రజల ముందుకు మరోసారి తెచ్చుకుని తెలుగుదేశం పార్టీ సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్లయింది.

ఎన్‌.టి.ఆర్‌. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్‌.టి.ఆర్‌. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఇక విశ్వాసం మాటకు వస్తే.. తనకు జన్మనిచ్చిన ఎన్‌.టి.ఆర్‌.కు బాలకృష్ణ ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు? బావ చంద్రబాబుతో కలిసి తండ్రిని పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది?!

ఏపీలో ఎన్‌.టి.ఆర్‌. హెల్త్‌ యూనివర్సిటీ పేరును డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సి టీగా మార్చడంపై ఎన్‌.టి.ఆర్‌. కుమారుడు, చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆశ్చ ర్యకరంగా ఉన్నాయి. ఆయన చేసిన ట్వీట్‌ని చూస్తే అసలు ఎన్‌.టి.ఆర్‌. పట్ల విశ్వాసం ఉండవలసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వారికా? తెలుగుదేశం వారికా? అన్న ప్రశ్న వస్తుంది. ఒక్కసారి బాల కృష్ణ ట్వీట్‌ను పూర్తిగా చూద్దాం.

‘‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్‌.టి.ఆర్‌. అన్నది ఒక పేరు కాదు. అది ఒక సంస్కృతి, ఒక నాగరికత, తెలుగు జాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌పోర్టు మార్చారు. కొడుకు గద్దె ఎక్కి యూనివర్సిటీ పేరు మార్చుతున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలు ఉన్నాయి. తస్మాత్‌ జాగ్రత్త. అక్కడ మహనీయుడి భిక్షతో బతుకుతున్న నేతలు ఉన్నారు. పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు’’.. ఇది ఆయన ట్వీట్‌. ఎంత అర్థరహితంగా ఉంది! 

ఎన్‌.టి.ఆర్‌. పేరు మార్చితేనే సంస్కృతి నాశనమైతే.. ఎన్‌.టి.ఆర్‌. పదవినే మార్చేసిన తెలుగుదేశం పార్టీ ఆ సంస్కృతిని చంపేసిందని బాలకృష్ణ ఒప్పుకుంటున్నట్లేగా? ఎన్‌.టి.ఆర్‌.ను పదవి నుంచి దించివేసినందుకు, ఆయనపై చెప్పులు వేసినందుకు టీడీపీ నేతలు కనీసం క్షమాపణ చెప్పకపోతే పోయె, బాధపడినట్లు అయినా ఎక్కడైనా చెప్పారా!

ఎన్‌.టి. రామారావు హృదయ విదారకంగా అందరి ముందు విలపించినప్పుడు; తనను తన పిల్లలు, అల్లుళ్లు కలిసి దారుణంగా అవమానించారని కుమిలిపోయినప్పుడు వీరంతా అధికారం లాగేసుకున్నామని పకపకా నవ్వుకున్నారే... అదేనా సంస్కృతి! ఎన్‌.టి.ఆర్‌. వేదనతో మరణించినప్పుడు ఆయన అభిమా నులు బాధపడ్డారు కాని ఆయన కుటుంబంగా భావించేవారిలో కొంతమంది లక్ష్మీపార్వతి వర్గంతో గొడవ పడడానికే ప్రాధాన్యం ఇచ్చారు! ఆమెపై రకరకాల వదంతులు సృష్టించే పనిలో పడ్డారు! చివరికి అక్కడ కూడా చెప్పులు విసురుకున్నారు. ఇదా తెలుగు జాతి సంస్కృతి? 

తండ్రి గద్దెనెక్కి ఎయిర్‌ పోర్టు పేరు మార్చారని పరోక్షంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఎయిర్‌పోర్టు పేరు వ్యవహారం కేంద్రం పరిధి లోనిది. పోనీ బాలకృష్ణ చేసిన విమర్శ కరెక్టే అను కున్నా, 2014 నుంచి నాలుగేళ్లపాటు కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే.. అప్పుడు అశోక్‌ గజపతిరాజు కేంద్ర విమాన యాన శాఖ మంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! మరి ఎందుకు మళ్లీ శంషాబాద్‌ విమానాశ్రయంలో డొమెస్టిక్‌ టెర్మి నల్‌కు ఎన్‌.టి.ఆర్‌.పేరు పెట్టలేదు?

అంటే వారికి ఈ విషయంలో చిత్తశుద్ధి లేనట్లే కదా! పోనీ విజయవాడ విమానాశ్రయానికి అయినా ఎందుకు ఆయన పేరు పెట్టలేదు? రాజధాని ప్రాంతానికి ఎన్‌.టి.ఆర్‌. సిటీ అని పేరు పెట్టాలని సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లేఖ రాసినప్పుడు ఏమి చేశారు? బుచ్చయ్య చౌదరిపైనే ఫైర్‌ అయ్యారు తప్ప ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టారా? రామోజీ ఆదేశాల మేరకు చంద్రబాబు అమరావతి అనే పేరు పెట్టారు.

అంటే రామోజీకి ఇచ్చిన విలువ ఎన్‌.టి.ఆర్‌.కు చంద్రబాబు ఇవ్వలేదనే కదా? ఎన్‌.టి.ఆర్‌.కు వ్యతిరేకంగా 1995 ప్రాంతంలో ‘ఈనాడు’ దారుణమైన కార్టూన్లు వేస్తే బాలకృష్ణ కాని, ఆయన సోదరులు కాని ఎవరైనా ఇదేమిటి అని ప్రశ్నించారా? తనను తన కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని లక్ష్మీపార్వతిని ఎన్‌.టి.ఆర్‌. వివాహమాడితే ఆయనతో తగాదా పెట్టుకున్నది ఎవరు? అధికారం వచ్చాక లక్ష్మీపార్వతితో ఆదరణగా ఉన్నట్లు నటించింది ఎవరు? ఎన్‌.టి.ఆర్‌. మరణం తర్వాత ఆమెను ఎన్‌.టి.ఆర్‌. కుటుంబ సభ్యులు ఎవరైనా పట్టించుకున్నారా? ఆమె ఉంటున్న ఇంటి నుంచి ఆమెను తరిమేశారే! మరి ఇదంతా తెలుగు జాతి సంస్కృతి, నాగరికత అని అనుకోవాలా?

‘‘ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలు, పీతలు ఉన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాల ముందు తలవంచుకుని బతికే సిగ్గులేని బతుకులు..’’ అని బాలకృష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. ఎన్‌.టి.రామారావు టీడీపీని స్థాపించి ప్రజలలో తిరుగు తున్నప్పుడు కాంగ్రెస్‌ వారిని ‘కుక్కమూతి పిందెలు’ అని విమ ర్శించేవారు. విశేషమేమిటంటే అప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండేవారు.

ఎన్‌.టి.ఆర్‌. తన అల్లుడు మినహా మిగిలిన కాంగ్రెస్‌ వారికి ఆ తిట్టు వర్తిస్తుందని చెప్పలేదు. పోనీ బాలకృష్ణ చెప్పినట్లు చేరిన పార్టీలోనే ఉండడమే విశ్వాసం అయితే, తొలుత అది వర్తించవలసింది చంద్రబాబుకే కదా! రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను కాదని, తన ఓటమి తర్వాత మామ ఎన్‌.టి.ఆర్‌. స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి జంప్‌ చేశారు కదా. మరి దానిని బాలకృష్ణ ఏమని అంటారు? ఆ మాటకు వస్తే తనకు జన్మనిచ్చిన ఎన్‌.టి.ఆర్‌.కు ఆయన ఎంత విశ్వాసపాత్రుడుగా ఉన్నారు?

బావ చంద్రబాబుతో కలిసి ఆయనను పదవి నుంచి దించేసినప్పుడు తన విశ్వాసం ఏమైంది? అప్పుడు కుక్కలు వెక్కి రించలేదా? వాటి ముందు తెలుగుదేశం నేతలు ఎవరూ తలదించు కుని సిగ్గు లేకుండా బతకలేదా? తన సోదరి పురందేశ్వరి కాంగ్రెస్‌లోకి వెళ్లి కేంద్ర మంత్రి పదవులు అలంకరించారే... తదుపరి ఆమె బీజేపీలో ఎలా చేరారు? దీనిని విశ్వాసమే అంటారా? తన బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ చూపి, ఎన్‌.టి.ఆర్‌.కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగస్వామిని చేశారే... తీరా చంద్రబాబు సీఎం అయ్యాక దగ్గుబాటిని పరాభవించి బయటకు పంపేశారే... మరి బాలకృష్ణకు విశ్వాసం ఏమైంది?

ఎన్‌.టి.ఆర్‌. పట్ల అందరికీ గౌరవం ఉంది. పేరు మార్చడానికి ముఖ్యమంత్రి జగన్‌ తన కారణాన్ని వివరించారు. తమకు ఎన్‌.టి.ఆర్‌. అవసరం లేదని, ఆయనకు విలువలు లేవని చంద్రబాబు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే, జగన్‌ చాలా పద్ధతిగా మాట్లాడారు. తనకు ఎంతో గౌరవం ఉంది కనుకే ఒక జిల్లాకు ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టానని అన్నారు. అలా పేరు పెట్టినప్పుడు బాలకృష్ణ కనీసం స్వాగతించలేక పోయారే? నిజానికి ఎన్‌.టి. రామారావు, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ప్రత్యర్ధులు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు అయితే ఎన్‌.టి.ఆర్‌.తో అసలు సంబంధమే లేదు. ఆ విషయాన్ని కూడా గమనించాలి.

ఎన్‌.టి.ఆర్‌. పేరు మార్చితేనే మొత్తం జాతి అంతా తల్లకిందులవుతున్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారే మరి చంద్రబాబు టైమ్‌లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరును మార్చి ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టలేదా? రాజీవ్‌ పేరు మార్చినప్పుడు దేశానికి అంతటికీ అవమానం జరిగినట్లు అను కోవాలా? తెలం గాణలో ఎన్‌.టి.ఆర్‌. హెల్త్‌ యూనివర్సిటీ పేరు తొలగించి కాళోజీ నారాయణరావు పేరు పెట్టినప్పుడు టీడీపీ వారు, బాలకృష్ట వంటి వారు కనీసం నోరెత్తి ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తు న్నారు. ఆ మాటకు వస్తే కాకాని వెంకటరత్నం పేరుతో ఉన్న మెడికల్‌ కాలేజీని యూనివర్సిటీగా మార్చినప్పుడు ఆయన పేరును ఎన్‌.టి.ఆర్‌. ఎందుకు తొలగించారు?

తెలుగుదేశం వారికి ఎన్‌.టి.ఆర్‌.పేరును వాడుకునే అర్హత లేద న్నది వాస్తవం. ఎన్‌.టి.ఆర్‌. తన అల్లుడు చంద్రబాబు నాయుడును దూషిస్తూ, ‘ద్రోహి, ఔరంగజేబు కన్నా నీచం’ అని అన్నారు. అలా తన తండ్రి దూషణలకు గురైన చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడుగా, విధేయుడుగా బాలకృష్ణ వ్యవహరించడం ఏమి సంస్కృతి అన్నదానికి ముందుగా ఆయన వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఎదుటివారిపై వ్యాఖ్యలు చేస్తే మంచిది.
  
కొమ్మినేని శ్రీనివాసరావు, 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు