‘అదే మా విధానం, మా నినాదం’

21 Sep, 2022 00:40 IST|Sakshi

విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శాసనసభలో రెండు ప్రధాన అంశాలపై సూటిగా, సుత్తి లేకుండా ప్రసంగించారు. తనదైన శైలిలో ఒక అధ్యాపకుడు పాఠం చెబుతున్న రీతిలో విజువల్స్‌ వేసి వివరించారు. చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరి డబ్బు తెచ్చి కేవలం 29 గ్రామాలలో వ్యయం చేయలేమనీ, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు చేరాలనీ, అదే ‘మా విధానం, మా నినాదం’ అనీ వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబులా వేదనతో, రోదనతో కాకుండా ప్రజలకు ఒక భరోసా ఇచ్చేలా మాట్లాడారు. పాలనను ప్రజల గడప వద్దకు తీసుకు వెళ్లడమే అసలు వికేంద్రీకరణ అంటూ దాన్ని ఆయన నిర్వచించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

వికేంద్రీకరణ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శాసనసభలో జరిగిన చర్చ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ పూర్తి స్థాయి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను మరోసారి లేవనెత్తారు. ప్రతిపక్షాలవారిని పెత్తందార్లతో పోల్చారు. ప్రధాన ప్రతిపక్షం గానీ, జగన్‌ను వ్యతిరేకించే ఈనాడు, తదితర మీడియా సంస్థలు గానీ ఆ ప్రశ్నలకు డొంక తిరుగుడు సమా ధానాలు ఇస్తున్నాయే తప్ప, నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నాయి. 

చంద్రబాబు నాయుడు అప్పట్లో ఏ అవకాశం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్‌ కష్టాలలో ఉంది, కట్టుబట్టలతో హైదరాబాద్‌ నుంచి వచ్చేశాం, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, కానీ నేను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా అంటూ రోదన స్వరంతో ప్రసంగించేవారు. ఇక రాజధాని గురించి ఏమని చెప్పేవారు! అది ఇంద్రుడి నగరం, దేవతలు నడయాడే ప్రాంతం, ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తాం, అమరావతిలో భూములకు కోట్ల రూపాయల ధర వచ్చేలా చేశాను, మొత్తం అమరావతే రాష్ట్రానికి ఆధారం, మొత్తం సంపద అంతా ఇక్కడే సృష్టిస్తున్నాము, అయితే మీరంతా విరాళాలు ఇవ్వండి, బ్రిక్స్‌ ఇవ్వండి... ఇలా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ అంటే అమరావతి తప్ప ఇంకేదీ లేదేమో అన్న చందంగా ఆయన మాట్లాడుతుండేవారు.

ఆయన చెప్పిన విషయాలనూ, ప్రస్తుతం అమరావతిలోనే అన్నీ నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ పాదయాత్ర చేస్తున్న వారు ఇచ్చిన నినాదం చూస్తే అసలు విషయం అర్థం అవుతుంది. నారా హమారా! అమరావతి హమారా! అని వారు నినాదాలు ఇస్తూ, ప్లకార్డులు పెట్టుకుని సాగుతున్నారట. అమరావతి మాత్రమే హమారా! ఆంధ్రప్రదేశ్‌ కాదు అని చెబుతున్నట్లుగా ఉందా? ఆ రకంగా చంద్ర బాబు 29 గ్రామాలకు చెందిన నేతగా మాత్రమే మిగిలిపోయారని అనుకోవాలా? 

జగన్‌ వికేంద్రీకరణపై తన స్పష్టమైన విధానాన్ని మరోసారి ప్రకటించారు. తదుపరి ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి గుడివాడ అమరనాథ్‌ వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖ పాలన రాజధాని అవుతుందని ప్రకటించడం విశేషం. అమరావతికి గానీ, ఇక్కడి ప్రజలకు గానీ తాము వ్యతిరేకం కాదనీ, ఇక్కడ శాసన రాజధాని ఉంటుందనీ జగన్‌ తెలిపారు. ఒక్క అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతమైతే మిగిలిన ప్రాంతాల సంగతేమిటని అడిగారు. అసలు వికేంద్రీకరణ అంటే ఏమిటన్నది ఆయన నిర్వచించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తీసుకు వెళ్లడం, వాటిలో మన పిల్లలు లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం వికేంద్రీకరణ అని అన్నారు. పెన్షన్లను వృద్ధుల ఇళ్లవద్దకు తీసుకెళ్లి ఇవ్వడం వికేంద్రీకరణ అని చెప్పారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్‌ ఏర్పాటు వికేంద్రీకరణ అవుతుందని తెలిపారు. అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడం ద్వారా విద్యా వ్యాప్తి చేయడం, నాడు–నేడు కింద స్కూళ్లను వేల కోట్ల వ్యయంతో బాగు చేయడం వికేంద్రీకరణ అన్నారు. ఇలా ఆయా అంశాలను గతంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పలేని రీతిలో జగన్‌ చెప్పారన్న భావన కలుగుతుంది. ఆయన చెప్పిన వాటిలో దేనినీ ప్రతిపక్షం తోసి పుచ్చలేని పరిస్థితి. అందుకే సాధ్యమైనంతవరకూ శాసనసభ చర్చలో పాల్గొనకుండా ఏదో రచ్చ చేసి బయటకు వెళ్లిపోతున్నారనిపిస్తుంది. 

అమరావతిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలుగుదేశం నేతల పేర్లు చదివినప్పుడు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అభ్యంతరం చెప్పారు. అయినా బుగ్గన మాత్రం తన వాదనకు కట్టుబడి ఎక్కడో అనంతపురంలో ఉండే కేశవ్‌ కుటుంబ సభ్యులు అమరావతి ప్రాంతంలో రాజధాని నోటిఫికేషన్‌ రావడానికి ముందు ఇక్కడ మారుమూల గ్రామంలో భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ 14 ఎకరాల భూమిని కొన్న వైనం, ఆ భూమి వద్ద రింగ్‌ రోడ్డును మలుపు తిప్పిన తీరు మొదలైనవి మరోసారి చెప్పి టీడీపీని ఆత్మరక్షణలో పడేశారు.

అయితే టీడీపీ ఒక్క పాయింట్‌ మాత్రం వేయగలిగింది. కోర్టులో కొట్టేసిన తర్వాత మూడు రాజధానులపై ఎలా ముందుకు వెళతారని ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం జవాబు ఇవ్వలేదు. బహుశా వ్యూహాత్మకంగా అలా చేసి ఉండవచ్చు. ఆ తర్వాతి రోజున సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ద్వారా జవాబు ఇచ్చినట్లయింది. రాజధానిపై అసలు చట్టం చేసే అధికారం లేదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఆక్షేపించింది. 

కాగా శ్రీ బాగ్‌ ఒడంబడిక, శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీలు వికేంద్రీకరణపై చేసిన సిఫారసుల గురించీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ల గురించీ టీడీపీ ప్రస్తావించడానికి వెనుకంజ వేసింది. అమరావతిలోని ముప్పైవేల మంది రైతులేకాక, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు కూడా తనకు ముఖ్యమేనని జగన్‌ చెప్పారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే ఉండాలంటూ ఉత్తరాం ధ్రకు వెళ్లి అక్కడి దేవుడిని మొక్కుతారా? ఇది ఆ ప్రాంతంవారిని రెచ్చగొట్టడం కాదా అని నిలదీశారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో అమరావతిని పోల్చడాన్ని ఆక్షేపించి, వాటికీ అమరావతికీ ఉన్న తేడాను జగన్‌ వివరించారు.

విశాఖపట్నంలో పదివేల కోట్లు పెడితే అన్ని వసతులూ సమకూరతాయనీ, అదే అమరావతిలో లక్ష కోట్లు వ్యయం చేసినా సరిపోవనీ తెలియజేశారు. కరోనా పరిస్థితులు ఉన్నా, ఆర్థిక మాంద్యం రాకుండా చేయడంలో, జీడీపీ తగ్గకుండా చేయడంలో ఏపీ సఫలం అయిందంటూ... కేంద్రం అప్పులు, రాష్ట్రం చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, తన హయాంలో చేసిన అప్పులను పోల్చి చూపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరమైనది. చంద్రబాబు హయాంలో గానీ, తన ప్రభుత్వంలో గానీ రాష్ట్ర బడ్జెట్‌ దాదాపు ఒకేలా ఉందనీ, కానీ తాను అమలు చేసిన అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, బడులు, ఆస్పత్రుల నాడు–నేడు తదితర కార్యక్రమాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేకపోయారనీ ప్రశ్నించారు. 

ఒక రకంగా జగన్‌ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం రోదనలే వినేవారం. కానీ జగన్‌ అలా చేయకుండా ఆర్థిక ఆరోగ్యం బాగానే ఉందంటూ, చంద్రబాబు తన ఆరోగ్యం బాగు గురించి చూసుకోవాలని చమత్కరించారు. జగన్‌ ప్రసంగం తర్వాత ఈనాడు య«ధాప్రకారం మరో ఏడుపుగొట్టు విశ్లేషణ ఇచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ కష్టాలు ఎందుకంటూ ఆయా పెండింగ్‌ బకాయిల గురించి ప్రశ్నించింది.

అంతే తప్ప జగన్‌ తాను చెప్పిన విధంగా హామీలు ఎలా నెరవేర్చారన్న సంగతి రాయడానికి మాత్రం వారికి చేతులు రాలేదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వం అన్నాక పెండింగ్‌ బకాయిలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్యం బాగుందంటే ఎవరికీ ఒక్క రూపాయీ బకాయి లేదని కాదు. చంద్రబాబు టైమ్‌లో వేల కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టి ప్రభుత్వం దిగిపోతే, వాటిని కూడా ఈ ప్రభుత్వం ఎలా చెల్లించింది? చంద్రబాబు అంత సమర్థుడైతే అలా బాకీలు పెట్టకూడదు కదా. ఆ విషయాలేవీ ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు? టీడీపీ ఓడిపోయాక జగన్‌ ప్రభుత్వానికి వంద కోట్లే అందుబాటులో ఉన్నాయనీ అదేదో గొప్పగా, భలే అయిందిలే అన్నట్లు రాసింది కదా? 

స్థూలంగా చూస్తే జగన్‌ ఫెయిర్‌ రాజకీయం చేస్తుంటే, చంద్రబాబు మాత్రం డొంక తిరుగుడు రాజకీయానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దానికి కారణం తన వద్ద జగన్‌ అడిగే ప్రశ్నలకు జవాబులు లేవు కాబట్టే! అందుకే ఏదో ఒక సాకుతో సభకు కూడా రావడం లేదు.


వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, 
సీనియర్‌ పాత్రికేయులు     

మరిన్ని వార్తలు