మీడియా ద్వేషానికి మందేమిటి?

30 Jun, 2021 00:08 IST|Sakshi

విశ్లేషణ 

పరీక్షించే సదుపాయం లేదు. అలాంటిది ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఆరోగ్యరంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనట్టుగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి బాధితుల పూర్తి బాధ్యత తీసుకుంది. రికార్డు స్థాయిలో రెండు కోట్ల పరీక్షలు చేసింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య విష యంలో ఇతర రాష్ట్రాల్లా కాకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ మరణించిన కుటుంబాలకు మానవతా కోణంలో ఆర్థిక సాయం అందిస్తోంది. ఇవేవీ టీడీపీ మద్దతు మీడియాకు పట్టవు. వారికి కావాల్సింది రంధ్రాన్వేషణే. ప్రభుత్వ ప్రతిష్ట మీద బురద జల్లడమే. సీఎం విలువను తగ్గించి చూపడమే. ఎందుకంటే ఈ పచ్చమీడియాకు జబ్బు చేసింది. అది నిలువెల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ద్వేషమనే జబ్బు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా బాధపడినట్లు అనిపిస్తోంది. తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా అనండి, ఎల్లో మీడియా అనండి... వారు రాస్తున్న రాతలు, చేస్తున్న ప్రచారాలకు ఆయన బాధపడ్డారు. కరోనా కట్టడిలో మంచి పేరు వస్తున్నందునే కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్‌ కొరతతో ముగ్గురు కరోనా బాధి తులు మరణించారని వచ్చిన వార్తపైన, అలాగే ఆయనేదో రాత్రివేళ జీసస్‌తో మాట్లాడానని అన్నట్లుగా మరో పత్రిక రాసిన పిచ్చిరాతల పైన స్పందించారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చర్చించాలి. 

జగన్‌ ఏపీకి ముఖ్యమంత్రి కావడానికి ముందు రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య రంగ పరిస్థితి ఏమిటి? ప్రభుత్వ ఆస్పత్రులపై ఆనాటి చంద్ర బాబు ప్రభుత్వం శ్రద్ధ వహించిందా? కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటువారికి అప్పగిస్తే ఇదే మీడియా ఆహోఓహో అన్నట్లు వ్యవహ రించిందేగానీ వైద్యరంగాన్ని ప్రైవేటు పరం చేస్తే వచ్చే ప్రమాదాల గురించి ఎక్కడైనా చెప్పిందా? గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పసిబాలుడి వేలును ఎలుక కొరికిందా, లేదా? అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ అప్పుడప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలో నిద్రిస్తానంటూ హడావుడి చేసినా, పెద్దగా ఉప యోగం జరగలేదన్నది నిజం కాదా? దానికి కారణం ఆయన తప్పు కాకపోవచ్చు. వైద్య రంగానికి చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా ప్రాధా న్యత ఇవ్వకపోవడమే. జగన్‌ సీఎం అయ్యాక నాడు–నేడు అంటూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వాతా వరణాన్ని, పరిస్థితులను మార్చే యత్నం ఆరంభించారు. 16 మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేసి ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుంటే, అన్ని కాలేజీ లకు ప్రొఫెసర్లు ఎక్కడ దొరుకుతారు? ఎన్నివేల మంది సిబ్బంది కావాలి? అంటూ నిరాశాపూరిత కథనాన్ని ఒక పత్రిక ఇచ్చింది. ఇవే ప్రశ్నలతో ప్రభుత్వానికి సూచనపరంగా వార్త ఇస్తే తప్పు కాదు. కానీ ప్రతి అక్షరంలోనూ ద్వేషం నిండేలా రాయడమే అభ్యంతరకరం.

కరోనా సంక్షోభం వచ్చేనాటికి ఏపీలో ఒక్క వైరాలజీ ల్యాబ్‌ అయినా ఉందా? బాధితుల శాంపిళ్లను హైదరాబాద్‌కో, పుణేకో పంపి పరీక్షలు చేయించాల్సి వచ్చేది. అలాగే ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్‌ బెడ్లు అప్పుడు ఎన్నున్నాయి? వాటిని ఎలా పెంచిందీ కళ్లముందు కనబడుతూనే ఉంది. రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సకాలంలో రాక పోవడం వల్ల కొందరు మరణించిన మాట నిజమే. అది సిబ్బంది లోపమా, ప్రభుత్వ తప్పా అన్నది ఆలోచించాలి కదా? ఆ తర్వాత ఎక్కడా ఆక్సిజన్‌ సరఫరాలో లోపాలు లేకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నది వాస్తవం కాదా? ప్రభుత్వ ఆసుపత్రు లలో అనేక ఆక్సిజన్, వెంటిలేటర్‌ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇదే మీడియాలోని ఒక పత్రిక ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం రాసింది. ఆ విషయాన్ని మర్చిపోయి మళ్లీ ఆ మీడియా ఇప్పుడు ఈ తరహా రాతలు రాసి ఉండవచ్చు. అధికారిక వివరణ తీసుకున్న ఎలాంటి కథనాన్ని రాసినా ఆక్షేపించనవసరం లేదు. కానీ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న లక్ష్యంతో ఈ మీడియా పనిచేస్తున్నదన్న భావన కలిగించడం ప్రమాణాల క్షీణతకు నిదర్శనం అవుతుంది. ఏలూరులో ముగ్గురు పేషెంట్లు మరణించిన వార్తపై అధికారులు వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తికి డయాబెటిస్‌తో సహా పలు ఆరోగ్య సమస్యలు ఉండటంతో మరణించారు. మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారని అధికా రులు చెబుతున్నారు. ఆ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసు కోరు? ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత ఏమిటన్న ఇంగితం ఉండాలి కదా అన్నది ప్రభుత్వం వాదన. 

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రభుత్వమే ఖర్చు భరిస్తున్న రాష్ట్రాలు ఏపీ కాకుండా ఇంకేవైనా ఉన్నాయా? కరోనా నుంచి కోలు కుని ఇళ్లకు వెళ్లే వారికి రెండువేల రూపాయల చొప్పున ఇవ్వడం, దురదృష్టవశాత్తు మరణిస్తే వారి అంత్యక్రియలకు,  పేద కుటుంబా లకు పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తున్న ప్రభుత్వాలు ఏపీ కాక ఎన్నున్నాయి? రెండుకోట్లకు పైగా పరీక్షలు చేయడమే కాకుండా, కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్యను వెల్లడించడంలో ప్రభుత్వం పార దర్శకంగా ఉందా, లేదా? పొరుగు రాష్ట్రాలు కొన్ని పాజిటివ్‌ కేసు లను, మరణాల సంఖ్యను తగ్గించి చూపాయని జాతీయ పత్రికలలో వార్తలు వచ్చాయి. ఏపీపై అలా వచ్చిన వార్తలు ఎన్ని? తెలంగాణలో అయితే ఆరోగ్య శాఖ మంత్రే ప్రస్తుతం లేరు. కేవలం ఇద్దరు అధికా రులు మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. ఒకటి, రెండుసార్లు ముఖ్య మంత్రి కేసీఆర్‌ సమీక్షలు చేసి, ఆసుపత్రులను సందర్శించారు. ఇదే పరిస్థితి కనుక ఏపీలో ఉంటే ఈపాటికి ఎన్ని కథనాలు ఈ మీడియా వండి వార్చేదో! అదే తెలంగాణలో అలాంటి వ్యతిరేక కథనాలు రాయగల ధైర్యం ఈ మీడియాకు ఎంత మేర ఉందో తెలియదా? ఏపీ ముఖ్యమంత్రి ప్రతి వారంలో రెండు, మూడుసార్లు సమీక్షలు నిర్వ హించి, అధికారులకు మార్గదర్శకాలు ఇస్తున్నారు. గతంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జవహర్‌ రెడ్డిని టీటీడీ కార్యనిర్వాహక అధికారిగా నియమించినా, కోవిడ్‌ రెండో వేవ్‌ నేపథ్యంలో మళ్లీ ఆయనను టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌గా నియమించారు. మూడో వేవ్‌ వచ్చినా అందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించి, చిన్న పిల్లల ఆసు పత్రుల  నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చింది కనిపించదా? 

గ్రామాలలో కొత్తగా విలేజ్‌ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయాలని సంక ల్పించారు. ఇక వ్యాక్సినేషన్‌ విషయానికి వస్తే, కొన్ని నెలల క్రితం స్థానిక ఎన్నికలు కొంతకాలం ఆగుదాం అంటే ఈ మీడియానే ప్రతి పక్షంతో కలిసి ఎంత యాగీ చేసిందో తెలియదా? దానివల్ల టీకాలకు ఆటంకం కలిగినా, ఇటీవలికాలంలో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. ఎవరైనా కావాలని ప్రైవేటు హాస్పిటల్‌కు వెళితే తప్ప, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆసుపత్రులలో, గ్రామ సచివాలయాలలో టీకా వేస్తున్నారు. ఒకే రోజు 13.5 లక్షల టీకాలు ఇచ్చి తమ సామర్థ్యం రుజువు చేసుకుంటే దాని గురించి ఫోకస్‌ చేయని ఈ మీడియా, అక్కడక్కడా జరిగే కొన్ని విషాద ఘటనలను మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. బీజేపీ వారు తమ కార్యవర్గ సమావేశంలో నిరు పేదలను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ పనేదో కేంద్రాన్ని డిమాండ్‌ చేసి ఉంటే దానికి కాస్త విలువైనా వచ్చేది. ఒక పక్క సుప్రీంకోర్టు కరోనా బాధితులు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తే, అది అయ్యే పని కాదని, అసలు కరోనా విపత్తు నివారణ చట్టం కిందకు రాదని కేంద్రం చేతులెత్తేసింది. కేంద్రం తప్పు చేసిందని అనడం లేదు. ఆర్థిక పరిస్థి తులను గమనంలోకి తీసుకుని కోర్టులు సూచనలు ఇవ్వాలి కానీ తమకు తోచిన విధంగా ఇస్తే ఎవరైనా ఏమి చేస్తారు! అలాగే ఏపీ బీజేపీ నేతలు గురివింద గింజ మాదిరి మాట్లాడితే నవ్వుల పాలు అవుతారని చెప్పవలసి ఉంటుంది. 

మరో పత్రిక ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో తాను జీసస్‌తో మాట్లాడానని అన్నారని రాసింది. దానిపై జగన్‌ బాధ పడ్డారు. ఇలాంటి రాతల ద్వారా ముఖ్యమంత్రి పదవి విలువ తగ్గించాలని వారి ఉద్దేశమని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇలాంటి పిచ్చిరాతల వల్ల తగ్గేది ఆ మీడియా విలువే. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించేలా అధికారులను ఆదేశించినట్లు బహిరంగంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినప్పుడు, తాము తుఫానులను కంట్రోల్‌ చేస్తామని అన్నప్పుడు, అమరావతిలో ఒలింపిక్స్‌ పెడతా మని అన్నప్పుడు చాలా ఆనందపడిన ఈ మీడియా ఇప్పుడు పూర్తిగా మనసన్నది లేకుండా కేవలం అణువణువునా ద్వేషంతో ఇలాంటి వెకిలి రాతలకు పాల్పడుతోంది. ఎప్పటికైనా ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలకు స్వస్తి పలికే రోజు రాకపోతుందా?


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు,      

మరిన్ని వార్తలు