న్యాయవ్యవస్థపై ఆరోపణలు దాచేయాలా!

21 Oct, 2020 00:26 IST|Sakshi

విశ్లేషణ 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవ్యవస్థలోని కొందరు ప్రముఖులపై పలు ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖ, దానిని పారదర్శకంగా ప్రజ లకు వెల్లడించిన వైనంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. జగన్‌ అలా ఫిర్యాదు చేయవచ్చా? ఆ ఫిర్యాదును బహిరంగం చేయవచ్చా అన్న మీమాంసను కొందరు లేవనెత్తుతున్నారు. అలాగే ఎక్కడో ఒక చిరుద్యోగి వంద రూపాయల లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడితే గంటల కొద్దీ టీవీలలో వార్తలను మీడియా ప్రచారం చేస్తుం టుంది. అలాంటిది ఏకంగా న్యాయ వ్యవస్థలోనే ఒక సంచలనం అయిన విషయాన్ని జగన్‌ బయటపెడితే ఒక వర్గం మీడియా మాత్రం మౌనం దాల్చడం కూడా ఆసక్తికరంగానే ఉంది.

ఒకప్పుడు ఎక్కడ అవినీతి ఉందన్న ఆరోపణలు వచ్చినా అంకుశంతో పొడవాలని సుద్దులు చెప్పిన ఈనాడు మీడియా ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఏపీ ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం మీడియా సమావేశం పెట్టి సుప్రీంకోర్టు జడ్జిపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైన నిర్దిష్ట ఫిర్యాదు చేసినట్లు వెల్లడిస్తే, ఒక వర్గం మీడియా  చానళ్లలో ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. అలాగే వారి పత్రికలో కూడా అసలు వార్తే కనిపించలేదు. ఇది చరిత్ర నమోదు చేసుకున్న ఘట్టం అని చెప్పాలి. ఆ తర్వాత రెండు రోజులకు ఆ మీడియాతో పాటు టీడీపీకి మద్దతు ఇచ్చే కొన్ని మీడియా సంస్థలు ఏ మాత్రం భేషజం లేకుండా ఫలానావాళ్లపై ఆరోపణలు వస్తే మాత్రం వారిపై ఫిర్యాదు చేస్తారా? వారిపై  చర్యలు తీసుకుంటారా అన్నట్లు ప్రశ్నిస్తూ కథనాలు ఇస్తున్నాయి. చర్చలు నడుపుతున్నాయి. రెండు వాదనలకూ చోటిస్తే తప్పు కాదు. కానీ ఏపీ ప్రభుత్వ వాదనను పూర్తిగా విస్మరించి, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తూ కొందరి ఇంటర్వ్యూలను కూడా ప్రముఖంగా

ప్రజలలోకి తీసుకువెళ్లే యత్నం చేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు రిటైర్డ్‌ న్యాయమూర్తులు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ సాక్షికి ఇంటర్వ్యూ ఇస్తూ న్యాయవ్యవస్థలోని వారిపై తీవ్ర ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారని, ఆయన అధికారికంగా ఏదైనా ఫిర్యాదు చేస్తే, దానిని విస్మరించడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత ముఖ్యమని స్పష్టం చేశారు. హైకోర్టు వ్యవహారాలలో ఒక సుప్రీంకోర్టు జడ్జి జోక్యం చేసుకుంటున్నారని, తన రాజకీయ విరోధుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే యత్నాలు న్యాయవ్యవస్థలో కొందరు చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి ఆరోపిస్తే దానిని ఎలా విస్మరిస్తారని ఆయన ప్రశ్నించారు.

సాధారణ ప్రజలకు వచ్చిన సందేహాలనే ఆయన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం, నిజాయితీగా నడుస్తున్నట్లు కనిపించడం అవసరమన్న ప్రజల భావనకు దగ్గరగా ఆయన అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాక న్యాయ వ్యవస్థలోని వారిపై కానీ, వారి కుటుంబ సభ్యులపై కానీ ఆరోపణలు వస్తే వాటి జోలికి వెళ్లకూడదని, అసలు ప్రచారమే జరగరాదని  హైకోర్టు చెప్పడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు. అదే సామాన్యుడి అభిప్రాయం కూడా. పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యుడికి మరో న్యాయమా అన్న ప్రశ్న వస్తున్న సందర్భంలో గంగూలీ కూడా అదేరీతిలో మాట్లాడినట్లు కనిపిస్తుంది. 

మరో వైపు ఈనాడు పత్రిక గత కొద్ది రోజులుగా ఇస్తున్న ఇంట ర్వ్యూలు, వార్తలు చూస్తే ఏమిటీ ఈ పత్రిక ఇలా తయారైందన్న బాధ కలుగుతుంది. అసలు మొదటి వార్తను ఇవ్వలేదు కానీ దానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందేమిటి? అంటే న్యాయవ్యవస్థలో అవినీతి జరిగిందన్న ఆరోపణ వస్తే దానిని రహస్యంగా ఉంచాలన్నట్లుగా ఆ పత్రిక కథనాలు ఉండడం జర్నలిజం చరిత్రలో ఒక విషాదం అని చెప్పాలి. సామాన్యుడి అభిప్రాయాలతో సంబంధం లేకుండా కథనాలు ఇవ్వడం ద్వారా ఆ పత్రిక ప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈనాడు పత్రిక ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్‌.ఎస్‌.సోధీని ఇంటర్వ్యూ చేసి ప్రముఖంగా ప్రచారం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం ద్వారా జగన్‌ లక్ష్మణ రేఖ దాటారని ఆయన అన్నారు. సీఎం లేఖ రాయడమే సమంజసం కాదని ఆయన అన్నారు. కోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు జరిగితే, కోర్టులపై ప్రజలలో విశ్వాసం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో ఏ సీఎం ఇలా ఆరోపణలు చేయలేదని ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు, జవాబులు చది విన తర్వాత ఎవరికైనా కలిగే అభిప్రాయం ఏమిటంటే, పాలనా వ్యవస్థ కన్నా న్యాయ వ్యవస్థ గొప్పదని, వారు ఏమి చేసినా ప్రశ్నించజాలరని ఆ రిటైర్డ్‌ న్యాయమూర్తి చెప్పినట్లుగా ఉంది. 

ముఖ్యమంత్రి జగన్‌ చేసిన ఆరోపణలు ఏమిటి? వాటిలో వాస్తవాలు ఉన్నాయా? లేవా అన్న దాని గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదు? అసలు ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదుపై విచారణ జరపాలా? వద్దా అన్నదాని గురించి ఆయన ఎందుకు మాట్లాడలేదో తెలియదు. బహుశా ఆ మీడియాకు ఆయా వ్యవస్థలలో ఉన్నవారితో అనుబంధం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుతో ఉన్న సాన్నిహిత్యాన్ని వారికి వారే బహిర్గతం చేసినట్లయిందా అన్న సందేహం వస్తుంది. నిజంగానే ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖలో అవాస్తవాలు ఉన్నాయని అనుకుందాం. వాటిని రిటైర్డ్‌ జడ్జీలు ముగ్గురితో విచారణ చేయించి నిగ్గుతేల్చి ప్రభుత్వ చర్యను తప్పుపట్టవచ్చు కదా? అప్పుడు న్యాయవ్యవస్థ అంతా కడిగిన ముత్యంలా ఉందని అంతా భావిస్తారు కదా.. మరి ఈ విషయాలపై సోది ఎందుకు సలహాలు ఇవ్వలేకపోయారు. ఒక రిటైర్డ్‌ న్యాయమూర్తి పారదర్శకత కోరుకుంటుంటే, మరో రిటైర్డ్‌ న్యాయమూర్తి అంతా గప్‌చుప్‌ అన్నట్లుగా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంటుంది. 

మరో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అయితే నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెబుతూ చక్రవర్తుల కాలంలో న్యాయమూర్తుల్ని రాజుల ప్రతినిధులుగా పరిగణించేవారని, న్యాయవ్యవస్థలోని అవినీతిపై ప్రజల నోళ్లు నొక్కేయడం ద్వారా న్యాయమూర్తుల విశ్వసనీయతను కాపాడలేం అని ప్రశాంత్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోని అవినీతి, లేదా ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ అన్నిటికీ అతీతం అని సుప్రీంకోర్టు కూడా భావిస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతమే అవుతుంది. న్యాయవ్యవస్థలో కొందరిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అభియోగాలు మోపితే, అదేదో మొత్తం న్యాయ వ్యవస్థపై చేసినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటిని విజ్ఞులైన ప్రజలంతా గమనిస్తున్నారు. కనుక పాలు తాగే పిల్లి మాదిరి ఒక వర్గం మీడియా తమకు అనుకూలమైన వారిపై అవినీతి అభియోగాలు వచ్చినా వాటిని దాచివేయాలని ప్రయత్నం చేసే కొద్ది న్యాయ వ్యవస్థలోని ఆయా వ్యక్తులపై అనుమానాలు మరింత బలపడతాయి. ఆ మీడియా విశ్వసనీయత పూర్తిగా పోతుందన్న సంగతిని వారు విస్మరిస్తున్నారు.అది అత్యంత దురదృష్టం.

ఎక్కువమంది న్యాయకోవిదులు న్యాయవ్యవస్థలోని వారిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేసి నిగ్గు తేల్చాలని సూచిస్తున్నారు. గతంలో జడ్జీలుగా పనిచేసినవారిపై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయిన సందర్భాలు ఉన్నాయని ఉదాహరణలతో సహా ఉటంకిస్తున్నారు. అంతేకాదు.. గతంలో కూడా ప్రభుత్వంపై  కొందరు జడ్జీలు ఇష్టం వచ్చినట్లు వాఖ్యానాలు చేస్తే, ఆ ప్రభుత్వాలు చీఫ్‌ జస్టిస్‌కు ఫిర్యాదు చేసిన ఘట్టాలు కూడా ఉన్నాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీకి చెందిన కొందరు జడ్జీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, కేంద్రం విచారణ చేసి వారిని బదిలీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ముందు ఉన్నవి రెండు ఆప్షన్‌లు అనీ, వాటి ప్రకారం ఫుల్‌ కోర్టు పెట్టి దీనిపై విచారణకు అనుసరించవలసిన పద్ధతి నిర్ణయించడం, లేదా అంతర్గతంగా ఒక కమిటీని నియమించడానికి చర్య తీసుకోవడం అనీ అంటున్నారు. అంతే తప్ప ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రాసిన లేఖను విస్మరించడం సాధ్యం కాని విషయమని విశ్లేషణలు వస్తున్నాయి. పలు జాతీయ ఆంగ్ల పత్రికలలో ఈ విషయమై పెద్ద ఎత్తున వ్యాసాలు కూడా వస్తున్నాయి. 

ప్రభుత్వంలో ఒక చిన్న ఉద్యోగి నియామకానికి పరీక్షలు ఉంటాయి కాని, జడ్జి పదవికి పరీక్షలు ఉండవా? ఎవరినైనా నియమించడం సరైనదేనా? అన్న ప్రశ్నలు పలువురు లేవనెత్తుతున్నారు. జస్టిస్‌ ఎన్‌.వి. రమణ న్యాయమూర్తులు నిర్భయంగా నిర్ణయాలు చేయాలని చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఇప్పుడు ప్రజలలో వ్యక్తం అవుతున్న సందేహం కూడా అదే. అంత దాకా ఎందుకు? ఒక కుంభకోణంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయితే దానిని నిలిపివేయడమే కాకుండా, ప్రచారం కూడా చేయరాదని ఇచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను ఏపీ హైకోర్టు వారు ఎందుకు సవరించుకోవడానికి ఇష్టపడడం లేదో తెలియదు. అలాగే చిన్న, చితకా విషయాలకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు వారు, ఇంత పెద్ద స్కామ్‌పై విచారణకు ఎందుకు అంగీకరించడం లేదన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్‌ న్యాయవ్యవస్థలోని కొన్ని అవలక్షణాలను బయటపెట్టడం ద్వారా ఆ వ్యవస్థను ఒక కుదుపునకు గురి చేశారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఉపయోగపడాలని ఆశించడం తప్పుకాదు. పాలనా వ్యవస్థపై ఎన్నో వ్యాఖ్యలు చేసే న్యాయ వ్యవస్థ తనవరకు వచ్చేసరికి ఎందుకు నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఉండలేకపోతోందన్న దానికి జవాబు దొరికితే ఆటోమేటిక్‌గా పరిష్కారం కూడా వస్తుంది. అలా జరుగుతుందా? లేదా అన్నది కాలమే తేల్చుతుంది. 


కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

   

మరిన్ని వార్తలు