మంచి చేస్తుంటే... మాటలంటారా?

15 Sep, 2021 00:17 IST|Sakshi

విశ్లేషణ

బ్యాంకుల జాతీయీకరణ వల్ల సామాన్యులూ బ్యాంకుల్లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం ద్వారా నిరుపేదలు ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన దారుణం తప్పింది. ఆరోగ్యశ్రీ వల్ల ఎందరో బడుగు జీవుల బతుకు తెల్లారిపోయే ఘోరం తప్పింది. మరి ఇలాంటి పథకాలను ఓటు బ్యాంకు రాజకీయాలు అనవచ్చా? వాటిని అమలు చేసిన ఉద్దేశమే దీనికి గీటురాయి. ఎన్నికలకు ముందు హడావిడిగా రకరకాల స్కీములను ప్రకటించి, బొక్కబోర్లా పడిన ట్రాక్‌ రికార్డు చంద్రబాబుది. మేనిఫెస్టోలో ముందుగానే ప్రకటించిన పథకాలను అమలుచేస్తూ ప్రజామన్నన పొందుతున్న ఘనత – వైసీపీ ప్రభుత్వానిది. అయినా జగన్‌ను విమర్శిస్తున్నారంటే, అది రాజకీయం కోసం రాజకీయం చేయడమే.

ఈమధ్య తెలుగుదేశం పార్టీకి వత్తాసుపలికే మీడియా ఒకటి, ఓటు బ్యాంక్‌ రాజకీయం రివర్స్‌ అంటూ ఒక కథనం ఇచ్చింది. విద్యాదీవెన పథకం కింద విద్యా ర్థుల తల్లుల ఖాతాలలో కాకుండా, కాలేజీల ప్రిన్సిపాల్స్‌ ఖాతాలలో వేయాలని హైకోర్టు ఆదేశించడమే ఇందుకు కారణం. దాంతో ఆ మీడియా చొక్కా చింపుకుని మరీ ఓటు బ్యాంక్‌ రాజకీయాలంటూ ఊదరగొట్టింది. తెలుగు రాష్ట్రాలలో ప్రభు త్వాలు ఈ రకంగా డబ్బు ఖర్చు చేసేస్తున్నాయని కూడా ఆ మీడియా వాపోయింది. చిత్రమేమి టంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి ఆయా స్కీములు అమలు చేశారు. ఉదాహరణకు 2018లో రోడ్ల నిర్మా ణానికి తీసుకున్న మూడువేల కోట్ల రూపాయల రుణాన్ని పసుపు– కుంకుమ స్కీమ్‌ కోసం మళ్లించారని  చెబుతారు. ధాన్యం కొనుగో లులో రైతులకు చెల్లించవలసిన 4,800 కోట్ల రూపాయలను కూడా అలాగే ఈ పథకానికి మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి. అదే పౌర సరఫరాల సంస్థ ద్వారా తీసుకున్న మరో 2,700 కోట్ల రుణాన్ని కూడా ఇందుకే వాడారు. మొత్తం మీద పదివేల కోట్లను ఇలా మళ్లించి ఖర్చు చేశారు. కానీ అప్పుడు ఇదే మీడియా చంద్రబాబు అంత గొప్ప వాడు... ఇంత గొప్పవాడు... పసుపు కుంకుమ స్కీముతో మహిళ లంతా ఎగబడి టీడీపీకి ఓట్లు వేస్తున్నారని ప్రచారం చేసింది. అప్పుడు అందులో ఓటు బ్యాంక్‌ రాజకీయం కనిపించలేదు. 

అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు హడావుడిగా డబ్బులు పంపిణీ చేశారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు 89 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం హామీ ఇచ్చింది. మరో పదిహేనువేల కోట్ల డ్వాక్రా రుణాలను కూడా రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అవేవీ ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఆ వర్గం మీడియాకు కనిపించలేదు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హామీని గాలికి వదలిపెట్టారు. ఆ కమిటీ, ఈ కమిటీ అని చెప్పి చివ రకు 15 వేల కోట్ల వరకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. పైగా అప్పుడు బ్యాంకులకు నేరుగా ఈ రుణాల నిమిత్తం ఈ డబ్బు ఇవ్వలేదు. రైతుల ఖాతాలకు జమచేశారు. ఇప్పుడు తల్లుల ఖాతా లలో డబ్బు వేస్తే తప్పని ప్రచారం చేస్తున్నవారికి ఆ రోజు మాత్రం అందులో గొప్పదనం కనిపించింది. అయితే ప్రజలు ఇదంతా మోసం అని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారని భావించి బాబు నాయక త్వంలోని టీడీపీని ఘోరంగా ఓడించి 23 సీట్లకే పరిమితం చేశారు. 

2004 ఎన్నికలకు ముందు బీసీ వర్గాల వారికి ఆదరణ స్కీము అంటూ బాబు హడావుడి చేశారు. దానికింద రకరకాల పనిముట్లు అందజేశారు. కోటి మందికి తమ స్కీములు ఉపయోగపడ్డాయని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసేది. కానీ ప్రజలు మాత్రం ఓటు బ్యాంక్‌ రాజకీయంగానే గుర్తించి అప్పుడు కూడా ఓడించారు. దానికి కారణం ఒకటే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు వందల కొద్దీ హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం. మరో ఉదాహరణ కూడా ఉంది. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రచారం చేస్తూ టీడీపీ గెలిస్తే 2 రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని కొనసాగి స్తామని చెప్పేవారు. కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే బియ్యం ధరను 5 రూపాయలు చేశారు. మద్య నిషేధం ఎత్తివేశారు. ఇదంతా బాబు ట్రాక్‌ రికార్డు. 

మరి అదే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేతగా జగన్‌ ఏమి చేశారు? 2017 లోనే పార్టీ సభ పెట్టి నవరత్నాల పేరుతో తాను అమలుచేయ తలపెట్టిన స్కీములను ప్రకటించారు. ఆ తర్వాత పాదయాత్రలో కూడా వాటి గురించి ప్రజలకు వివరించారు. ప్రజలు నమ్మి ఆయనకు ఓటు వేశారు. అమ్మ ఒడి, చేయూత, నేతన్న నేస్తం, చిన్న పరిశ్రమలకు సాయం, అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఇలా పలు స్కీములను అమలు చేస్తున్నారు. దాదాపు తొంభై శాతం స్కీములను అమలు చేస్తుండటంతో టీడీపీకి, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాకు మింగుడు పడటం లేదు. ఒక వైపు వీటిని ఓటు బ్యాంక్‌ రాజకీయాలని ప్రచారం చేస్తూనే, మరో వైపు ఇంకా మిగిలిన కొద్దిపాటి స్కీములు ఇంకా అమలు చేయలేదని ఎత్తి చూపుతూ ప్రచారం చేస్తోంది. అంటే ఎన్నికలకు ముందు హడావుడిగా చంద్ర బాబు అమలు చేసిన స్కీములేమో గొప్ప విజనరీ స్కీములని, జగన్‌ తాను చెప్పినవి చెప్పినట్లు చేస్తుంటే ఓటు బ్యాంక్‌ రాజకీయాలని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో బ్యాంకులను జాతీయీకరణ చేసి, పేదలకు ఆ బ్యాంకుల ద్వారా రకరకాల స్కీముల కింద రుణాలు ఇప్పించింది. పేదలు బహుశా బ్యాంక్‌ గడప తొక్కడం ఆరంభం అయింది అప్పుడే. ఆ రోజుల్లో పాడిపశువుల వంటివాటికి అధికంగా రుణాలు ఇచ్చేవారు. అయితే ఆ స్కీములలో అవినీతి చోటు చేసుకుంటోందని ఆరోపణలు వచ్చేవి. పశువులను  కొనుగోలు చేయకుండానే కొన్నట్లు చూపించేవారు. అధికారులు కూడా అందులో వాటాలు పొందేవారు. ఆ అవినీతిని అరికట్టడానికి ప్రయత్నాలు జరిగాయి; అది వేరే విషయం. కానీ ఇందిర ప్రభుత్వం అమలు చేసిన ఆయా స్కీములను ఓటు బ్యాంకు రాజకీయాలని ఆనాటి ప్రతిపక్షం, ముఖ్యంగా స్వతంత్ర పార్టీ వంటివి విమర్శించేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి. రామారావు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్ల నిర్మాణం, చౌక ధరలకు దుస్తులు తదితర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఎన్టీఆర్‌ వృథా ఖర్చు చేస్తు న్నారని అప్పట్లో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ విమర్శించేది. రెండు రూపా యలకు కిలో బియ్యం పథకంపై చాలా చర్చే జరిగేది. అప్పటికి ఇంత విస్తారంగా సంక్షేమ పథకాల అమలు ఆరంభం కాలేదు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ స్కీములు అమలు చేసినప్పుడు కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. ఉచి తంగా విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అప్పట్లో సీఎంగా ఉన్న బాబు ప్రచారం చేసేవారు. అదే బాబు ఇప్పుడు ఏమం టున్నారో చూస్తున్నారు కదా! ఉచిత విద్యుత్‌ కింద మీటర్లు పెడితే కూడా అన్యాయం జరిగిపోతోందని చెబుతున్నారంటే మరి ఆయన తన అభిప్రాయం ఎలా మార్చుకున్నారనుకోవాలి? ఆ రోజుల్లో టీడీపీ ఆరోగ్యశ్రీని వ్యతిరేకించింది. మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి తది తరులు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టే డబ్బును ప్రభుత్వ ఆసుపత్రులకు వ్యయం చేయాలని వాదించేవారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ కూడా ఎంతో కొంత మేర ఆరోగ్యశ్రీని అమలు చేయక తప్పలేదు. రోశయ్య సీఎం అయ్యాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తర్జనభర్జన జరి గింది. కాలేజీలలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని అభిప్రాయపడి దానిని నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నిం చింది. ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం వంద రూపా యలకే వివిధ సరుకుల ప్యాకెట్‌ అంటూ మరో స్కీమును అమలులోకి తెచ్చింది. ఇలాంటి వాటన్నిటిని ఓటుబ్యాంకు రాజకీయాలు అనాలా?  పేదలను ఆదుకోవడం అనాలా? ఎవరి అభిప్రాయాలు వారికి ఉండ వచ్చు. కానీ జగన్‌ చెప్పింది చేయడం ఓటు బ్యాంకు రాజకీయం అయితే, ఒకవేళ జగన్‌ చెప్పిన మాటలు నెరవేర్చకపోతే మరింత పెద్ద స్థాయిలో ప్రతిపక్షం విమర్శలు సాగించేది. ఆ వర్గం మీడియా గురించి చెప్పనవసరం లేదు. కరోనా సంక్షోభ సమయంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన స్కీములు పేదలకు బాగా ఉపయోగపడ్డాయి. పైగా మధ్యలో ఎక్కడా లీకేజీ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి డబ్బు వేయడం వల్ల ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడింది. వాటన్నిటిని జీర్ణించుకోలేని ప్రతిపక్షం, ఒక వర్గం మీడియా చేస్తున్న విమర్శలను పట్టించుకోనవసరం లేదు.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

మరిన్ని వార్తలు