బాబు అనుభవం నయవంచనలోనే! 

9 Sep, 2020 01:00 IST|Sakshi

‘‘ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనుభవం లేదు.. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ తెలియదు. ఆయన వల్ల రాష్ట్రం ఎన్నడూలేని విధంగా అప్రతిష్టపాలవుతోంది’’. ఇది ప్రతి పక్షనేత చంద్రబాబునా యుడు చేస్తున్న ప్రచారం. మొదటి సారి విన్నవారికి ఇవి నిజమేనేమో అన్న చందంగా భ్రమలు కల్పించగల నేర్పరితనం బాబుకు  ఉంది. జగన్‌ మొదటిసారి సీఎం అయినమాట నిజమే. కానీ రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగాను, రెండుసార్లు ఎమ్మెల్యేగాను ఘనవిజయం సాధించిన విషయాన్ని బాబు మరుగునపరుస్తారు. జగన్‌ ఐదేళ్లు ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని కావాలనే విస్మరి స్తారు. అయినా మొదటిసారి సీఎం అయి అప్పుడే ఏడాది మూడు నెలల పాలన పూర్తి చేశారు. ఆయన ఈ కాలంలో ఏమీ చేయకపోతే అనుభవం లేక చేయలేకపోతున్నారని విమర్శించవచ్చు. జగన్‌ తన పాలనలో అప్పుడే వందకు పైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారని ఆయన అభిమాని ఒకరు వాట్సాప్‌లో సందేశం పంపితే చూసిన మాబోటి వాళ్లకు.. ఇన్ని చేశారా అన్న విస్మయం కలిగింది. కనీసం నలభై, ఏభై కొత్త స్కీములు తీసుకువచ్చారంటేనే ఆశ్చర్యం కలుగుతుంది.

బాబు తన నలభై రెండేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని పథకాలు జగన్‌ తీసుకు వచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవాటిలో ఎనభై పైగా హామీలను నెరవేర్చానని జగన్‌ ప్రకటించారు. అలా బాబు తన ప్రభుత్వ టైమ్‌లో ఫలానా స్కీములన్నిటిని తాను తీసుకు వచ్చానని, పూర్తి చేశానని చెప్పగలరా? మరి ఇప్పుడు ఎవరు అనుభవజ్ఞులు అనుకోవాలి? జగన్‌ ఎన్నికల ప్రచారంలోకానీ, పాదయాత్రలో కానీ చెప్పినట్లు  వృద్ధులకు పెన్షన్‌ పెంచారా? లేదా? అమ్మ ఒడి స్కీమును విజయవంతంగా అమలు చేశారా? లేదా?  రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో డబ్బులు వేశారా? లేదా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? లేదా? అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక విడత డబ్బు ఇచ్చారా? లేదా? రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో సుమారు 3 వేల కోట్ల రూపాయలు ఆదా చేశారా? లేదా? ఆరోగ్యశ్రీని విజయవంతంగా అమలు చేయడమే కాకుండా అనేక వ్యాధులను ఆ స్కీములోకి తెచ్చారా? లేదా? నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లను ఎంత చక్కగా మార్చుతోంది ఎదురుగా కనిపిస్తోంది కదా.. కరోనా పరీక్షల విషయంలో ఏపీలో ఒక టెస్టు కూడా చేయలేని స్థితి నుంచి ఇప్పుడు అరవైవేల టెస్టులు చేసే దశకు వచ్చారా? లేదా? క్వారంటైన్‌ సెంటర్‌లలో మంచి భోజనం, ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా రెండువేల రూపాయల సాయం, ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే పది హేనువేల సాయం ఇస్తున్నది అబద్ధమా? 

చేనేత కార్మికులు, మత్స్యకారులు, టైలర్లు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు ఇలా ఆయా వర్గాలకు కరోనా కష్టకాలంలో వైఎస్‌ జగన్‌ తప్ప, ఏ ముఖ్యమంత్రి అయినా ఆర్థిక సాయం చేయగలిగారా? వలంటీర్ల వ్యవస్థ ద్వారా, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షల మందికి ఉపాధి కల్పించడమే కాకుండా, మొత్తం పాలనా వ్యవస్థను క్షేత్ర స్థాయికి తీసుకు వచ్చిన ఘనత జగన్‌ది అవుతుందా? కాదా? ఇలాంటివి ఎప్పుడైనా చంద్రబాబు ఊహకు అయినా వచ్చాయా? ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్‌ ఆలోచన చేశారా? లేదా? పోలవరం ప్రాజెక్టును వేగిరం చేశారా? లేదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆలోచన చేయడం ద్వారా ఆ ప్రాంతానికి నీటి సమస్య తీర్చడానికి యత్నించడం లేదా? ఇవన్నీ ఏ అనుభవంతో జగన్‌ చేశారని అనుకోవాలి? దిశ పోలీస్‌ స్టేషన్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్‌.. ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి కొత్త ఒరవడి సృష్టించిన జగన్‌కు అనుభవం లేదని ఇన్నాళ్ల తర్వాత చంద్రబాబు అనడం దుస్సాహసమే అని చెప్పాలి. లేదా ద్వేషంతో మాట్లాడినవి అని అనుకోవాలి. ప్రజలకు ఉపయోగపడేవాటిని చేయడానికి అనుభవం అక్కర్లేదు. చిత్తశుద్ధి చాలు. చంద్రబాబులో లేనిది జగన్‌లో ఉన్నది అదే.

ఆ విషయాన్ని వైఎస్‌ జగన్‌ రుజువు చేసుకున్నారని చెప్పడానికే ఈ విషయాలన్ని ప్రస్తావించాం. ఇతర విషయాలు చూద్దాం. చంద్రబాబు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఏ అనుభవంతో ఎవరి వద్ద పైరవీ చేసుకుని మంత్రి అయ్యారో ఆయనకు గుర్తు లేదా? ఆయన మామ ఎన్‌.టి.రామారావు పార్టీ పెడుతుంటే సినిమావాళ్లకు రాజకీయాలు ఏమి తెలుసు అన్నది చంద్రబాబు కాదా? కావాలంటే మామ మీద అయినా పోటీచేస్తానని సవాలు విసరలేదా? తదుపరి ఎన్టీఆర్‌ అభ్యర్థి వెంకట్రామనాయుడు చేతిలో చంద్రబాబు ఓటమి చెందలేదా? ఆ తర్వాత అల్లుడి హోదాలో ఎన్టీఆర్‌ పంచన ఏ అనుభవంతో చేరారో తెలి యదా? తదుపరి ఆయనపై ఒత్తిడి తెచ్చి కర్షక పరిషత్‌ పదవి పొంది మామను రాజకీయంగా ఎంత అప్రతిష్టపాలు చేసిందీ తెలియదా? అప్పట్లో హైకోర్టు ఏమి చేసింది ఆయనకు గుర్తు లేదా? ఇక ఎన్టీఆర్‌ ఏ అనుభవంతో మొదటిసారే ముఖ్యమంత్రి అయ్యారు? ఆయన క్యాబినెట్‌లో నాదెండ్ల భాస్కరరావు, మహేంద్రనాథ్‌ వంటి కొద్ది మంది తప్ప మిగిలినవారంతా తొలిసారి మంత్రులు అయినవారే కదా. ఎన్టీఆర్‌ కూడా మండల వ్యవస్థను తీసుకువచ్చి ఉమ్మడి ఏపీలో ఒక కొత్త మార్పునకు శ్రీకారం చుట్టారు. పాలనను ఎన్టీఆర్‌ మండలస్థాయికి తీసుకువెళితే, ఇప్పుడు జగన్‌ పాలనా వికేంద్రీకరణను సామాన్యుడి గడపవద్దకు తీసుకు వెళ్లారు. ఆ మాటకు వస్తే ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఎకాఎకి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి మూడోసారి కూడా గెలిచారే? ఇవన్నీ ఎందుకు! తన కుమారుడు లోకేశ్‌కు ఏ అనుభవం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేశారు? ఏ అనుభవం ఉందని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు?  రాజకీయ అవసరాల కోసం తొలిసారి ఎన్నికైన అప్పటి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను పార్టీ మార్పించి మంత్రి పదవి ఇచ్చారే. అలాగే యూనివర్సిటీలో చదువుకుంటున్న శ్రావణ్‌ కుమార్‌ను తీసుకు వచ్చి మంత్రిని చేశారే. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అని అంటారు. 

ఇక్కడ కొన్ని విషయాలు అంగీకరించాలి. కొన్నిటిలో చంద్రబాబుకు ఉన్న అనుభవం జగన్‌కు లేదని అంగీకరించాలి. చంద్రబాబు మాదిరి ఆయా వ్యవస్థలను మేనేజ్‌మెంట్‌ చేసే స్కిల్‌ జగన్‌కు లేదన్నది వాస్తవం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ జగన్‌ ఉత్తపుణ్యానికి పదహారు నెలలు జైలులో గడపవలసి రావడం.. మరి అదే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో నేరుగా దొరికిపోయినా కోర్టుబోను ఎక్కాల్సిన అవసరం రాకుండా మేనేజ్‌ చేసుకున్నారు. అంతేకాదు పద్నాలుగు ఏళ్లుగా కోర్టులలో తనపై ఏ కేసు విచారణ రాకుండా స్టేలతో గడపగల నేర్పరితనం దేశంలోనే చంద్రబాబుకు ఉన్నంత అనుభవం మరెవ్వరికి రాదు. వ్యక్తిగత విషయాలను పక్కనబెడితే పాలనాపరంగా చూస్తే జగన్‌ తన మానాన తాను పనిచేసుకుంటూ పోతూ వివిధ వ్యవస్థల నుంచి వస్తున్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ వ్యవస్థలను ఈయన కూడా మేనేజ్‌ చేయాలబ్బా అనేవారు కూడా ఉంటున్నారు. మరి అదే చంద్రబాబు గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోతే ఒక్కరిపై కూడా చర్య లేకుండా ఎలా మేనేజ్‌ చేయగలిగారు? అసలు సీసీటీవీ పుటేజీ కూడా కనిపించకుండా ఎవరు ఎలా మేనేజ్‌ చేశారన్నది ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నే. జన్మభూమి కమిటీల పేరుతో ఇతర పార్టీలవారికి సంక్షేమ పథకాలు అందకుండా చేయడం కూడా అనుభవమే అనుకోవాలి? ఏపీకి పెట్టుబడులు వచ్చినా, రాకున్నా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేశాయని చెప్పి మీడియాను మేనేజ్‌ చేయడం కూడా అనుభవమే కావచ్చు. హుద్‌హుద్‌ తుపాను పేరుతో విశాఖలో 60 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రచారం చేయడం, బస్‌లోనే ఉంటున్నానని ప్రజలను మభ్య పెట్టడం వంటివి అనుభవంతోనే  చేశారనుకోవాలి. 

చంద్రబాబు ప్రచారం చూసి చివరికి ప్రధాని మోదీ సైతం ఆశ్చర్యపోవలసి వచ్చింది. అందుకే విశాఖ తుపానుకు  ఆయన వెయ్యి కోట్ల సాయం ప్రకటించి చివరికి 600 కోట్లు ఇచ్చారు. ఇక అమరావతి పేరుతో సాగిన క్రీడ గురించి చెప్పే అవసరం లేదు. రాజకీయ ప్రకటనలు, మాట మార్చడాలు, కూటములు మార్చడాలు.. ఇలా ఎన్నో యూట ర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం జగన్‌కు లేదన్నది వాస్తవమే. బాబు అనుభవం ఆయన స్వప్రయోజనాలకు, ప్రచారానికి ఎక్కువగా ఉపయోగపడితే, జగన్‌ అనుభవం ప్రజలకు ఇవ్వతలపెట్టిన స్కీంలలో కనిపిస్తుంది. మరి ప్రజలకు ఏమి కావాలి? ప్రచారానుభవమా? లేక ప్రజాక్షేత్రంలో అనుభవమా? ఆ విషయం తెలుసు కనుకే ప్రజలలో జగన్‌కు ఆదరణ చెక్కుచెదరడం లేదని సర్వేలు చెబుతున్నాయి. అందువల్లే  జగన్‌ పాలనపై మరక వేయాలని బాబు విశ్వయత్నం చేస్తున్నారు. విష ప్రచారంలో ఎంతో అనుభవం ఉన్న బాబును జగన్‌ ప్రజాదరణతోనే తిప్పి కొడతారా? లేక ఆయన కూడా ప్రత్యేక వ్యూహాలు వేసుకోవాలా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు