మీరు చేస్తే అప్పు! వీరు చేస్తే తప్పా?

25 Aug, 2021 02:53 IST|Sakshi

విశ్లేషణ

ఎడ్డెం అంటే తెడ్డెం అందామని అనుకున్నాక ఎదుటివాళ్లు ఏం చేసినా తప్పుగానే కనబడుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీరు అంత ఆశ్చర్యం కలిగించడం లేదు. ‘జగన్‌ ముఖం చూస్తే అప్పే పుట్టద’ని మొదట్లో వ్యాఖ్యానించారు. తీరా కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు నిధులు సమకూర్చుకుంటే ‘ఇంత అప్పా’ అని విమర్శిస్తున్నారు. ఒకవేళ జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఉంటే... ‘వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నార’ని ఇదే టీడీపీ అనేది. ఇంతాచేసి వాళ్లు ఓట్ల కోసం చేసినప్పుడు గొప్ప అయిన అప్పు, ఇప్పుడు సంక్షేమం కోసం చేస్తే తప్పుగా కనబడుతోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించడం అంటే ఏమిటో ఎన్నికల్లో మట్టికరిచినప్పుడే ఈ ప్రతిపక్షం మరిచిపోయింది.

ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు చేసే అప్పుల మీద చర్చ జరుగుతోంది. ఒక వర్గం మీడియా ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రమే అప్పులు చేస్తున్నట్లు ప్రచారం చేస్తోంది. తాజా  సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూ. 119 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గతంలో యూపీఏ ఆధ్వర్యంలోని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ముగిసేనాటికన్నా ఈ అప్పులు రెట్టింపు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. దేశంలో అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్‌ ఉన్నాయి.

ఒక వర్గం మీడియా ఏపీ ప్రభుత్వంపై చిమ్ముతున్న విష ప్రచా రాన్ని ఎదుర్కోవడానికి సోషల్‌ మీడియానే ప్రధాన ఆయుధంగా మారింది. ఒక మీడియా అయితే ఏపీ అప్పులపై కేంద్రం సీరియస్‌ అయిందనీ, ఏదో చర్య తీసుకోబోతున్నారనీ ప్రచారం చేసింది. ఏపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్‌ 1 నుంచి చేసిన బ్యాంకు రుణాలపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకుగానూ, ఏ బ్యాంక్‌ ఎంత అప్పు ఇచ్చిందో కేంద్రం వివరాలు అందించింది. ఇప్పటివరకు పది ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. 56,076 కోట్ల రుణాలను ఏపీ తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ వెల్లడించారు. ఇందులో అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 15,047 కోట్లు ఇచ్చిందన్నారు. తదుపరి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ. 8,450 కోట్లు ఇచ్చింది. మరో ఎనిమిది బ్యాంకులు ఇచ్చిన రుణాల గురించి కూడా తెలిపారు. ఆర్‌బీఐ చట్టం(1934) సెక్షన్‌–1, క్లాజ్‌ బీ ప్రకారం, ఏ రాష్ట్రప్రభుత్వమైనా ఆర్‌బీఐతో రుణాల సమీకరణపై ఒప్పందం కుదుర్చుకుని కొత్త రుణాలు పొందవచ్చని మంత్రి స్పష్టీకరించారు. అంటే దీనర్థం ఎవరికీ తెలియకుండా రుణాలు తీసుకోవడం కాదు కదా? అదేదో రహస్యంగా రుణాలు తీసుకున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు.

మరి ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడానికిగానూ చంద్రబాబు అప్పటికప్పుడు ‘పసుపు–కుంకుమ’, ‘అన్నదాతా సుఖీభవ’ వంటి స్కీములను ప్రవేశపెట్టి వేల కోట్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు చేసిన కార్యక్రమం కనుక ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మలేదు. ఫలితంగా టీడీపీ ఓటమి చవిచూసింది. కనకమేడల వేసిన ప్రశ్నకు వచ్చిన సమాధానం చూస్తే, 2019 ఏప్రిల్‌ నుంచి జగన్‌ ప్రభుత్వం అప్పులు చేసిందేమోనన్న అనుమానం కలుగుతుంది. ఏప్రిల్, మే నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పుల గురించి, అలాగే 2014–2019 మధ్య చేసిన రుణాల గురించి ప్రశ్నించి, ప్రస్తుత అప్పులతో పోల్చి చెప్పి ఉంటే అసలు విషయం అర్థం అయ్యేది. కానీ ఆయన అలా చేయలేదు. జగన్‌ ప్రభుత్వాన్ని బదనామ్‌ చేయడం ఆయన ఉద్దేశం కనుక అంతవరకే పరిమితం అయ్యారు. 

చివరికి అప్పులు చేయడంలో కొత్త కొత్త పద్ధతులు అవలంబిం చిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అప్పులపై విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికర అంశం ఏమిటంటే, 2019 ఏప్రిల్‌లో చంద్రబాబు ప్రభుత్వమే ఉంది. మే 30న జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికి ప్రభుత్వ ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమే ఉన్నాయని టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో టీడీపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వంటివారు ‘జగన్‌ ముఖం చూసి ఎవరు అప్పులు ఇస్తార’ని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే తెలుగుదేశం నేతలు ‘అమ్మో ఇంత అప్పు చేశార’ని దుష్ప్రచారం చేస్తున్నారు. 


ఎవరైనా మితిమీరి అప్పులు చేయడం మంచిది కాదు. కానీ కరోనా సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నప్పుడు వారిని ఆదుకోవ డానికి అప్పులు తెస్తే తప్పు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పేదలందరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేసింది ఈ ప్రతిపక్షమే. కరోనా సమయంలో ఆదాయాలు పడిపోయాయి. మొత్తం లాక్‌డౌన్‌ అయిపోయింది. కేంద్రం కూడా రుణాలు సమకూర్చుకోవడానికి వెసులుబాటు కల్పించిందే గానీ, రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వలేదు. మరో వైపు కేంద్రమే లక్షల కోట్ల అప్పు తెచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెలికాప్టర్‌ మనీ ద్వారా సంక్షోభాన్ని అధిగమించాలని సూచించారు గానీ కేంద్రం అంగీకరిం చలేదు. కేంద్రం చేసిన అప్పుల గురించి గానీ, రాష్ట్రాలకు ఆర్థిక గ్రాంట్లు ఇవ్వలేని కేంద్రంపైన గానీ టీడీపీ నేతలు ఒక్కమాట మాట్లాడే ధైర్యం చేయరు. ఒకవేళ జగన్‌ అప్పులు చేయకుండా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలూ అమలు చేయకుండా ఉండి ఉన్నట్ల యితే ఇదే టీడీపీ, వారి అనుకూల మీడియా ‘నవరత్నాలు’ అమలు చేయడం లేదని గగ్గోలు పెట్టేవి. ‘చేసిన వాగ్దానాలను అమలు చేయ కుండా ప్రజలను మభ్య పెడుతున్నార’ని వ్యాఖ్యానించేవి. కానీ జగన్‌ ఎలాగోలా తంటాలు పడి అప్పులు తెచ్చో, మరో రకంగానో పేద ప్రజలను ఆదుకోవడంతో... వీరు కొత్త పల్లవి అందుకున్నారు. 

ఇదే చంద్రబాబు రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మొత్తం లక్ష కోట్లు మాఫీ చేస్తానన్నప్పుడు ఆయనను రైతుబాంధవుడు అని ప్రచారం చేశారు. ఈ ప్రభుత్వానికి అప్పులే పుట్టవని అనుకుంటే ఆయన లక్ష కోట్లకు పైగా వనరులు సమకూర్చగలగడం వారికి జీర్ణం కాని విషయమే. అలాగని ఈ స్కీములు వృథా అని చెప్పే ధైర్యం వారికి లేదు. ‘ఆ స్కీములో వీరికి న్యాయం జరగలేదు... ఈ స్కీములో న్యాయం జరగలేదు... ఇంకా అనేక మంది లబ్ధిదారులకు సాయం అందలేదు... మోసం గురూ’ అంటూ చెత్తాచెదారం తమ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటారు. ప్రతిదానిలో ద్వంద్వ వైఖరి అవలం బించే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలోనూ అలాగే చేస్తోంది. ప«థ కాలు అమలు చేయకపోతే చేయలేదనీ, చేస్తే అప్పులనీ విమర్శలు సాగిస్తుంటారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక విమర్శల కన్నా, ద్వేష భావంతో కువిమర్శలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. 

తమ ఐదేళ్ల పాలనలో రెండు లక్షల కోట్లకు పైగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. ఆ డబ్బును ఫలానా రకంగా వెచ్చిం చామనీ, ఫలానా అభివృద్ధి సాధించామనీ టీడీపీ ఎన్నడూ చెప్పలేదు. అమరావతిలో నిర్మాణాల కోసమంటూ రెండువేల కోట్ల రూపాయ లను దాదాపు పదిన్నర శాతం అధిక వడ్డీకి బాండ్ల రూపంలో సేక రించి, అసలు చంద్రబాబు కనుక ఆ బాండ్లు అమ్ముడు పోయాయని ప్రచారం చేశారు. ఆ తర్వాతి రోజుల్లో ఆ బాండ్లు ఎవరు కొన్నా రన్నదానిపై కథనాలు వచ్చాయి. అది వేరే విషయం. తాము అప్పు చేస్తే గొప్ప, ఎదుటివారు చేస్తే తప్పు అన్న చందంగా వ్యవహరించడం వల్లనే ఈ విషయాలను గుర్తు చేయవలసి వస్తోంది. ఏ బ్యాంక్‌ అయినా, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించలేదని అనుకుంటే అన్ని వేల కోట్ల అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తుందా? అందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అంగీకరిస్తుందా? కార్పొరేషన్‌ల ద్వారా అప్పులు చేయడం కొత్త కాదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేస్తుండవచ్చు. ఆయా కార్పొరేషన్‌ లలో ఉన్న నిధులను ఇతర అవసరాలకు అప్పుడు మళ్లించారు. ఇప్పుడు మళ్లిస్తుండవచ్చు. కానీ ఈ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయా లన్న తాపత్రయంతో వాస్తవాలను విస్మరిస్తున్నారు. ఈ రెండేళ్లు కరోనా కారణంగా జగన్‌ ప్రభుత్వం అప్పులు తెచ్చి పేదలను ఆదు కోవడం వల్ల మంచి పేరు వచ్చింది. భవిష్యత్తులో అప్పులు తగ్గించు కుని, ఆదాయ మార్గాలను పెంచుకుని రుణాలు తిరిగి చెల్లించడం మొదలైతే ఈ సమస్యలు తీరిపోతాయి. ‘పిండి కొలది రొట్టె’ అని అంటారు. ఏ ప్రభుత్వం అయినా తన వనరులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను రూపొందించుకోవడమే మంచిది. 


వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
 సీనియర్‌ పాత్రికేయులు     


 

మరిన్ని వార్తలు