Chandrababu Naidu: బాబు సరికొత్త మహా డ్రామా

2 Jun, 2021 04:06 IST|Sakshi

విశ్లేషణ

‘‘2019 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించండి. ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేశారు. రాష్ట్రాలతో కోఆపరేటివ్‌ ఫెడరలిజంను పాటించడం లేదు. ఏకపక్షంగా ఉన్న మోదీ పాలనపై రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వాసం కోల్పోయాయి. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతోంది...’’ ఇది 2018లో జరిగిన తెలుగుదేశం మహానాడులో చేసిన తీర్మానం. అప్పట్లో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రధాని మోదీని అవమానిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తే నల్లచొక్కాలతో నిరసన, నల్ల బెలూన్లు ఎగరవేయడం వంటివి చేశారు.

అంతేకాక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యక్తిగత దూషణకు దిగి తనకు భార్య, కొడుకు, మనుమడు ఉన్నారని, మోదీకి ఎవరున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలే ఎక్కువ చేస్తుంటారు. అలాగే మోదీపై చేశారు. కానీ బండి తిరగబడింది. తెలుగుదేశం 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. అసెంబ్లీలో 23 సీట్లకే పరిమితం అయితే, మూడు లోక్‌ సభ సీట్లే వచ్చాయి. దాంతో చంద్రబాబు మెల్లగా ప్లేట్‌ ఫిరాయించడం ఆరంభించారు. 2021 మహానాడు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని, ఏపీ ప్రభుత్వంపై పోరాడతామని టీడీపీ చెబుతోంది. ప్రధాని మోదీని కానీ, బీజేపీని కానీ ఒక్క మాట అనే ధైర్యం చేయడం లేదు. ఎలాగోలా బీజేపీతో కలవాలని విశ్వయత్నం చేస్తున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? 

మరోవైపు చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై సీబీఐ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. ఆ కేసు పురోగతి ఏమిటో తెలియదు. అప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటివారిపై సీబీఐ దాడులు జరగడంతో వారు వ్యూహాత్మకంగా చంద్రబాబుకు చెప్పే బీజేపీలోకి వెళ్లిపోయారు. వీరిద్వారా బీజేపీ పెద్దలకు దగ్గరవ్వాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు కొంతమేర ఫలించాయేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో రాజకీయంగా మాత్రం చంద్రబాబును వ్యతిరేకిస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జీగా ఉన్న సునీల్‌ దియోధర్‌... చంద్రబాబు కోరుకుంటున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. 2024ఎన్నికలలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలన్న ఆకాంక్షను చంద్రబాబు మహానాడు వేదికపై నుంచి వ్యక్తం చేశారని, ఇదంతా కేవలం టీడీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా చూడడం కోసం చంద్రబాబు మోసపూరిత ప్రచారం మొదలు పెట్టారని సునీల్‌ ఆరోపించారు. తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు నరేంద్ర మోదీకి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన వ్యాఖ్యానించారు.

నిజంగానే ఈ వ్యాఖ్య చూస్తే బీజేపీ ఎప్పటికీ టీడీపీతో కలవదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. కాకపోతే ప్రస్తుతం సునీల్‌ దియోధర్, సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబును చులకన చేసి మాట్లాడుతున్నా టీడీపీ నోరు విప్పలేకపోతోంది. ఈ అనుభవమే కాదు, వామపక్షాలను కూడా ఆయన వాడుకుని వదలివేశారు.1998లో వామపక్షాలతో కలిసి పోటీచేసి, ఆ తర్వాత వారికి చెప్పా పెట్టకుండా బీజేపీతో కలిసిపోయారు. కాని మళ్లీ 2009లో వామపక్షాలను తనవైపు తిప్పుకునేలా డిల్లీ స్థాయిలో చంద్రబాబు పైరవీ చేశారని అంటారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు.  

కేసుల భయంతో గానీ, మరే కారణంతో గానీ చంద్రబాబు ప్రస్తుతం బీజేపీని విమర్శించవద్దని తన పార్టీ వారందరికి కూడా ఆదేశాలు ఇచ్చారని చెబుతారు. ఆ క్రమంలోనే మహానాడు ద్వారా మళ్లీ ప్రేమలేఖలు పంపడానికి చంద్రబాబు యత్నించారట. ఈ మహా నాడు అంతా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించడం, తమ పార్టీ నేతలు గతంలో చేసిన అక్రమాలను సమర్థించుకోవడం వంటివాటికి పరిమితం అయిందని చెప్పాలి. రకరకాల తీర్మానాలు చేసినా, అందులో ఒకటే సారాంశం. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే. చంద్రబాబు గత రెండేళ్లుగా చేస్తున్న ఆరోపణలను మరోసారి వల్లె వేశారు.  అమరావతి రాజధానిలో రెండు లక్షల కోట్ల సంపద నష్టం జరిగిందని చెబుతున్నారు. అంటే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ద్వారా భూములు సంపాదించిన నేతలు, తమ సంబంధిత వర్గాలు అంతమేర నష్టపోయారని అనుకోవాల్సి ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా గెలుస్తామని తన క్యాడర్‌ను భ్రమ పెట్టే యత్నం చేస్తున్నారు. పైగా అధికారంలోకి రాగానే పార్టీ క్యాడర్‌ను ఆదరిస్తామని, అంతా కలిసి పనిచేయాలని ఆయన అంటున్నారు. తమది అవినీతి రహిత ప్రభుత్వం అని, సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఆయనకు ఆయనే సర్టిపికెట్‌ ఇచ్చుకున్నారు. 

ఆయా బీసీ కులాల వారిని చంద్రబాబే స్వయంగా ఏమని కోప్పడ్డారో అంతా మర్చిపోయారని ఆయన భావన కావచ్చు. తనకు మద్దతు ఇచ్చే మీడియా ఏకపక్షంగా పనిచేస్తుందని, ఏదో ఒక పలుకు ద్వారా తన భజన చేస్తుందని ఆయన విశ్వాసం. ఏసీబీ, జేసీబీ పాలన అంటూ రాజకీయ కక్ష అంటూ ప్రచారం చేస్తున్నారే గానీ తమ నేతలు చేసిన కుంభకోణాల గురించి ఆలోచించి పార్టీని ప్రక్షాళన చేసుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత వ్యవహరించలేకపోతున్నారు. ఏది ఏమైనా కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికల ప్రచారానికి, అడపాతడపా ఏపీకి వెళ్లి రావడమే తప్ప అక్కడ నివాసం ఉండడానికి పెద్దగా సుముఖత చూపుతున్నట్లుగా లేదు. అందువల్లే హైదరాబాద్‌ నుంచే ఆయన మహానాడులో పాల్గొన్నారు. తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని మహానాడులో ప్రకటించారు. ఒక వైపు తానే అభివృద్ధి చేశానని చెప్పుకునే హైదరాబాద్‌లో దాదాపు అన్ని డివిజన్‌లలో డిపాజిట్లు కోల్పోయినా, అసెంబ్లీ ఉప ఎన్నికలలో అదే పరిస్థితి ఎదురైనా టీడీపీ నేతలు రేపో మాపో అధికారంలోకి వస్తామన్నట్లుగా మాట్లాడుతుంటారు.

తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుకుపోకుండా చంద్రబాబు జాగ్రత్తపడితే అదే గొప్ప. చివరిగా... మహానాడు చర్చలలో కులాల ప్రస్తావన వచ్చిన విషయం వైరల్‌ అయింది. అందులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీడీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలతో పాటు రెడ్లు ఎలా దూరం అయ్యారో వివరించారు. దానికి చంద్రబాబు  దాదాపు అంగీకరిస్తూ, రెండు వర్గాల వారు మనతో ఉన్నారని, పరిస్థితులు మారుతున్నందున మిగిలిన వర్గాల వారు కూడా తమవైపు వస్తారని ఆయన అన్నారు. దీనిని బట్టి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గత ఎన్నికలలో పొందిన సామాజిక వర్గాల సమీకరణను యధాతథంగా కొనసాగించగలిగితే టీడీపీకి భవిష్యత్తు శూన్యమేనని వారు చెప్పకనే చెప్పారు కదా!  


వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు