గోడమీది పిల్లులు... లెక్కల్లో కాకులు

9 Jun, 2021 00:11 IST|Sakshi

విశ్లేషణ

చంద్రబాబునాయుడును చూస్తే అన్ని జంతువులూ ఈర్ష్య పడేట్టున్నాయి. ఈయనే కాకి లెక్కలు వేస్తాడు, ఈయనే నక్క జిత్తులు ప్రదర్శిస్తాడు, ఈయనే గోడమీది పిల్లి అవుతాడు. ఆయనకూ, ఆయన నడుపుతున్న టీడీపీకి ఒక విధానం అంటూ ఉన్నట్టు లేదు. తమకు ఏది అవసరమో అక్కడ ఆ వాదనను తెరపైకి తెస్తారు. అనుకూలం కాకపోతే దానికి పూర్తి విరుద్ధమైనది మాట్లాడుతారు. దాన్ని సమర్థించుకోవడానికి అడ్డగోలు లెక్కలు వేయడానికి కూడా వెనుకాడరు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల వారి వ్యవహారంలో ఎంతమాత్రమూ హేతుబద్ధత కనిపించదు. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్లకు నిర్మాణం ఇష్టం లేదు. వీరు విధ్వంస ప్రేమికులు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్న సైంధవులు.కాకి లెక్కలు చెప్పడంలో కానీ, పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని మించిన పార్టీ బహుశా దేశంలోనే ఉండకపోవచ్చు. ఒక వైపు సొంత పార్టీ వారు ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థిస్తారు. మరో వైపు ప్రభుత్వం ప్రజా ఉపయోగార్థం ఏదైనా కొత్త ప్రతిపాదనతో ముందుకు వెళుతుంటే మాత్రం ఏదో రకంగా అడ్డం పడటానికి విశ్వయత్నం చేస్తుంటారు. అదే రాజకీయం అని వారు గట్టిగా నమ్ముతున్నారు. వారికి ఒక ఎంపీ తోడయ్యారు. ఆయన వారికి ఉపయోగపడుతున్నారు. అమూల్‌తో ఒప్పందానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడింది. దానిపై హైకోర్టు వారు ఇచ్చిన తాత్కాలిక తీర్పు వారికే కొంతవరకు అనుకూలంగా ఉండవచ్చు. అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్‌లో మూతపడిపోయిన సహకార డెయిరీలను పునరుద్ధరించడానికీ, వాటి ద్వారా రైతులకు మరింత మేలు కలిగేలా చేయడానికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రైతుల సంస్థ అయిన అమూల్‌తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. అందులో భాగంగా కొన్ని ప్లాంట్‌లను, ఇతర సదుపాయాలను అమూల్‌కు లీజ్‌ ప్రాతిపదికన కేటాయించారు. దీనిని తెలుగుదేశం తప్పుపడుతోంది.


గోడమీది పిల్లి వాటం
ఇదే తరుణంలో తమ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని ప్రొడ్యూసర్‌ కంపెనీగా మార్చి దానిని తన సొంత కంపెనీ మాదిరిగా నడుపుకుంటున్నారన్న అభియోగాన్ని సమర్థిస్తుంటారు. ఆయన వేరే ప్రైవేటు కంపెనీని నడుపుతూ సహకార డెయిరీని ప్రొడ్యూసర్‌ కంపెనీగా మార్చుకున్నా, తన తండ్రి పేరుమీద ఒక ట్రస్టు పెట్టి, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులనే యాజమాన్య బాధ్యతలలో పెట్టి, సంగం డెయిరీకి చెందిన పదెకరాల భూమిని బదలాయించినా తెలుగుదేశం వారు సమర్థిస్తారు. ఇదే వారి గొప్పదనం. వీరు ఏదో ఒక విధానానికి కట్టుబడి ఉండరు. తమకు ఎక్కడ ఏది అవసరమో ఆ వాదనను తెరపైకి తీసుకువస్తుంటారు. తద్వారా వారు తమ డొల్లతనాన్ని బయట పెట్టుకుంటారు. అయినా ప్రజలు వాటిని గమనించలేరని వారి నమ్మకం. ప్రజల విజ్ఞత పట్ల వారికి అంత గౌరవం.


బాగుపడితే ఓర్వరా?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కానీ మూతపడిన సహకార డెయిరీలను ఇప్పుడు అమూల్‌కు అప్పగించడంలో కుంభకోణం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించడం మొదలు పెట్టారు. టీడీపీ మీడియా దానికి ప్రాధాన్యత ఇచ్చి వార్తలు ఇస్తుంటుంది. నిజంగానే స్కామ్‌ ఉందని అనుకుంటే ఆ మీడియానే పరిశోధించి వార్తలు ఇవ్వవచ్చు కదా? కేవలం టీడీపీ వారి ఆరోపణలనే ప్రముఖంగా ఇచ్చారంటేనే వాటిలో ఎంత నిజం ఉందన్న ప్రశ్న వస్తుంది. మూత పడ్డ సహకార డెయిరీలలోని యంత్రాల విలువ 550 కోట్ల రూపాయలుగా వీరు లెక్కవేశారు. అలాగే భవనాలు, భూముల విలువ 750 కోట్ల రూపాయలుగా గణించారు. రాష్ట్రంలోని 9,800 గ్రామాలలో బల్క్‌ కూలర్లు ఖర్చు చేయడాన్ని వీరు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కూలర్ల కోసం ఖర్చు పెడితే అది ఆస్తి అవుతుందా, లేదా? మూతపడ్డ డెయిరీ ప్లాంట్లను తెరచి పనిచేయించేందుకు అమూల్‌కు తక్కువ మొత్తానికే లీజుకు ఇచ్చారని తెలుగుదేశం ప్రచారం ఆరంభించింది. అంటే తెలుగుదేశం పార్టీ వారికి ఈ సహకార డెయిరీలు మూతపడి, యంత్ర పరికరాలన్ని తుప్పుపట్టినా, భవనాలు శి«థిలావస్థకు చేరినా ఫర్వాలేదు కానీ, అమూల్‌ వంటి రైతుల సంస్థలకు అప్పగించి బాగు చేయించడం ఇష్టం లేదన్నమాట.


చేయరు... చేయనివ్వరా?
నిజానికి పాలపరిశ్రమ రంగంలో అనుభవం ఉన్న చంద్రబాబు పాలనాకాలం లోనే వాటిని పునరుద్ధరించడానికి ప్రయత్నం జరిగి ఉండాల్సింది. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. మరి దీనికి చంద్రబాబుకు సొంతంగా హెరిటేజ్‌ పాల సంస్థ ఉండడమే కారణమని ఎవరైనా ఆరోపిస్తే తెలుగుదేశం పార్టీ వారు అంగీకరిస్తారా? ఇప్పుడు ప్రభుత్వం వీటిని పునరుద్ధరించడానికి చర్యలు చేపడితే తప్పు పడతారా? మరి వీరే ఇప్పుడు ధూళిపాళ్ల నిర్వాకాన్ని ఎలా అంగీకరిస్తారు? ఆయన అరెస్టును రాజకీయ కక్షగా ఎలా ప్రచారం చేస్తారు? ఆయన రైతుల శ్రేయస్సే ప్రధానంగా పనిచేసి ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అలా జరగడం లేదన్నది విమర్శ. సహకార రంగంలోని డెయిరీని ప్రొడ్యూసర్‌ కంపెనీగా మార్చి సొంత సంస్థలా ధూళిపాళ్ల నడపడం సరైనదా, కాదా? అన్న విషయం వీరు ఎందుకు చెప్పడం లేదు. పైగా ఆయనే మరో ప్రైవేటు డెయిరీని నడుపుకోవచ్చా? అది తప్పా? కాదా? అన్నదానిపై తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడరు. 


అధినేత లాభాల కోసమేనా?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కదా... విశాఖ సహకార డెయిరీ కూడా ఒక వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయింది. మరో వైపు అమూల్‌ ఏడాదికి వంద కోట్ల రూపాయలు అయినా ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో హేతుబద్ధత ఎంత ఉందన్నది వారికి అనవసరం. నిజంగానే ప్రభుత్వానికి అమూల్‌ ఇంకాస్త చెల్లించాలని అడిగితే అడగవచ్చు. కానీ అసాధారణ డిమాండ్‌ చేయడమే ఆక్షేపణీయం. అందుకే టీడీపీ వారివి కాకి లెక్కలు అనేది. అమూల్‌ సంస్థ రైతుల సహకార సంస్థ కాదని తెలుగుదేశం చెప్పగలదా? దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరొందిన అమూల్‌ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెడితే టీడీపీ నేతలకు ఉలికిపాటు దేనికి? తమ అధినేత కంపెనీకి లాభాలు తగ్గుతాయని వీరు ఆందోళన చెందుతున్నారా? అమూల్‌ కంటే ఎక్కువ మొత్తంలో రైతులకు చెల్లిస్తామని మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ముందుకు వచ్చినా ప్రభుత్వం అంగీకరించలేదట. టీడీపీ మాటల్లోని మతలబు గుర్తించడం కష్టం కాదు. 


మూతపడ్డవి తెరవొద్దా?
చంద్రబాబు హయాంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం అయ్యాయి. వాటిలో నిజాం షుగర్స్‌ ఒకటి. వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న ఈ సంస్థను, ప్రత్యేకించి బోధన్‌లో ఉన్న ఆస్తులను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. అది కొన్నాళ్లు నడిపి చేతులెత్తేసింది. అంతే, ఆ తర్వాత అది మూతపడింది. మళ్లీ ఇంతవరకు తెరుచుకోలేదు. ఇలా చేస్తే తెలుగుదేశం పార్టీ సంతోషిస్తుందా? అమూల్‌ రంగంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు జరిగిందా? లేదా? హెరిటేజ్‌తో సహా ఆయా ప్రైవేటు డెయిరీలు రైతులు సరఫరా చేసే పాలకు ఇస్తున్న ధరను పెంచాయా? లేదా? వీటిని పరిగణనలోకి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ పెద్ద నేతలు చెబితే, చోటా మోటా నేతలు వారి అనుకూల టీవీలలో కూర్చుని ఆరోపణలు చేస్తుంటే ప్రజలు ఎవరూ నమ్మరు. ఎందుకంటే టీడీపీ వారు విధ్వంసం కోరుకుంటున్నారన్న సంగతి అర్థం అయిపోతుంది. ఒక పక్క పరిశ్రమలు రావడం లేదని విమర్శలు చేస్తూ, మరో పక్క వచ్చిన ఒక భారీ పరిశ్రమను అడ్డుకోవడానికి టీడీపీతో సహా కొన్ని శక్తులు కుయుక్తులు పన్నుతున్నాయన్న విమర్శ వస్తోంది. తెలుగుదేశం పార్టీ వారు గుడ్డి ద్వేషంతో ప్రతిదానిని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే వారు మూల్యం చెల్లించుకున్నారు. ఎన్నికలలో ఎన్నిసార్లు ఓడినా వారి వారి ఆలోచనలలో మార్పు రావడం లేదు. ముందుగా టీడీపీ వారు ఇలాంటి విషయాలలో ఒక విధానం తయారు చేసుకుని మాట్లాడాలి. లేకుంటే పోయేది వారి పరువే. ధైర్యం ఉంటే మూతపడ్డ సహకార డెయిరీ ప్లాంట్లను తెరవవద్దని వీరు చెప్పగలరా? కానీ ఆరోపణలు మాత్రం చేస్తుంటారు. ఇదే  దిక్కుమాలిన రాజకీయం. 
    


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు