వైరస్‌పై ఇంత విష ప్రచారం ఏల బాబూ?

12 May, 2021 00:53 IST|Sakshi

విశ్లేషణ

ప్రస్తుత విపత్తు అంతర్జాతీయ సమస్య అన్న సంగతిని దాటవేసి.. అదేదో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను సృష్టించారన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేయడం దారుణంగా ఉంది. ప్రజల ప్రాణాలు వేరే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే విలువ కలిగి ఉంటాయని, తన పాలనలో ఉండవని చంద్రబాబు మాటలు చెప్పకనే చెబుతున్నాయి. వాక్సినేషన్‌ కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమన్నట్లుగా ఎన్నికల కమిషనర్‌ను బాబు గతంలో సమర్ధించారు. ఇప్పుడు కరోనా పెరగడానికి కారణం వారు కాదా? అసలు ఏపీ వేరియంట్‌ అంటూ కొత్త వైరస్‌ని కనిపెట్టిన రీతిలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై ఇంత ఉన్మాద స్థాయి విష ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు?రాజకీయాలలో కొన్ని విషయాలు తెలిసినా, తెలియనట్లు నటించడం చేస్తుంటారు. అలాంటి విషయాలలో ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ సిద్ధహస్తులని చెప్పాలి. తాజాగా చంద్రబాబు అండ్‌ కో ఏపీలో వాక్సిన్‌ కొరతపై విమర్శలు చేస్తున్నారు. వాక్సిన్‌ కోసం నలభై ఐదు కోట్లే ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు సైంటిస్టుగా మారి కరోనాకు సంబంధించిన వైరస్‌ ఒకటి కర్నూలులో పుట్టిందని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వేరియంట్‌ అక్కడ పుట్టలేదని, పైగా ఆ వేరియంట్‌ అంత శక్తివంతమైనది కాదని సైంటిస్టులు చెబుతున్నా చంద్రబాబు మాత్రం ప్రజలను భయపెట్టే రీతిలో ప్రసంగాలు చేస్తున్నారు. టీడీపీ నేతల సమావేశాల పేరుతో నిత్యం అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. తద్వారా ఏపీలో అసలు ఏమీ జరగడం లేదేమో అన్న అనుమానం కలిగించాలన్నది ఆయన యత్నం. ప్రభుత్వం పని చేయడం ఒక ఎత్తు అయితే చంద్రబాబును, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియాను భరించడం మరో ఎత్తుగా మారింది.  

ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయకుండా ఉంటుందా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నిజమే. కానీ ఆ విమర్శలు అర్థవంతంగా ఉండాలి. ప్రస్తుత విపత్తు అంతర్జాతీయ సమస్య అన్న సంగతి అంతా తెలుసుకోవాలి. అదేదో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను సృష్టించారన్నట్లుగా ప్రచారం చేయడం దారుణంగా ఉంటుంది. అందుకే మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు కరోనా వైరస్‌ కంటే దారుణమైన వైరస్‌గా మారారని విమర్శిస్తున్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార యావతో తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారో అందరికీ తెలుసు. అయినా దాని గురించి ఆయన ఏమన్నది వీడియోలలో కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ప్రజల ప్రాణాలకన్నా విలువ ఏమి ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. తప్పు లేదు. ప్రజల ప్రాణాలు వేరే వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడే విలువ కలిగి ఉంటాయని, తన పాలనలో ఉండవని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం ఏపీలో స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందేనని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకు మద్దతుగా చంద్రబాబు తందానా అన్నారే. అప్పుడు వాక్సినేషన్‌ పూర్తి చేసుకుందాం, రెండు నెలలు ఎన్నికలు వాయిదా వేద్దాం అని ముఖ్యమంత్రి జగన్‌ అంటే ఇదే చంద్రబాబు, మరికొందరు అడ్డుపడ్డారే. మరి ఇప్పుడు కరోనా పెరగడానికి కారణం వారు కాదా?  

కరోనా రెండో వేవ్‌ ప్రబలడానికి కేంద్ర ప్రభుత్వం కారణమని, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కుంభమేళాలో 90 లక్షల మంది పాల్గొన్న తీరుపై అంతర్జతీయంగా విమర్శలు వచ్చాయి. మరి జాతీయ పార్టీకి నాయకుడుగా ఉన్న చంద్రబాబు ఒక్క మాట అయినా వాటిపై కామెంట్‌ చేయలేక పోతున్నారే. అదే కనుక పొరపాటున ఏపీలో అలాంటివి జరిగి ఉంటే చంద్రబాబు, ఆయన వర్గం మీడియా వైఎస్సార్‌ సీపీపై విరుచుకుపడేవి. మొత్తం కరోనా వ్యాప్తికి కారణం అధికార పార్టీనేనని ప్రచారం చేసేవి. గత  ఏడాది వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు పేదలకు పలురూపాలలో సాయం చేస్తే, అందువల్లే కరోనా పెరిగిందని అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. కాని వాక్సినేషన్‌ కన్నా స్థానిక ఎన్నికలే ముఖ్యమన్నట్లుగా ఎన్నికల కమిషనర్‌ను ఆయన సమర్ధించారు. దేశంలో వాక్సిన్‌ ఎంత ఉత్పత్తి అవుతున్నది? అందులో కేంద్రం ఎంత తీసుకుంటోంది? రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నది వంటి అంశాల గురించి కానీ, ఒకే వాక్సిన్‌కు దేశంలో మూడు రకాలు పెట్టిన తీరుపై పలు వర్గాల నుంచి వస్తున్న విమర్శలను కానీ ప్రస్తావించడానికి భయపడుతున్న చంద్రబాబు ఊ అంటే చాలు సీఎం జగన్‌పై ఏవేవో పిచ్చి ఆరోపణలు చేస్తూ, తామూ రాజకీయంగా ఉనికిలోనే ఉన్నామని చాటుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు సుమారు 200 మందికి కరోనా సోకితే ఎవరో అమెరికా డాక్టర్‌తో మాట్లాడి ట్రీట్‌మెట్‌ ఇప్పించానని చెబుతున్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గ ప్రజలకు ఆ సదుపాయం ఎందుకు కల్పించలేకపోయారు? వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలలో ఉండి, అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మరి చంద్రబాబు ఎందుకు హైదరాబాద్‌ లోని తన భవంతిలోనే ఉంటున్నారు? ఆయన ఈ వయసులో కుప్పం వెళ్లి ప్రజలలో తిరిగి రిస్కు తీసుకోవాలని చెప్పడం లేదు. కాని ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని తప్పు పడుతూ కాలక్షేపం చేస్తున్న తీరు, ఆంద్ర ప్రజలను కరోనా పేరుతో భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత ఈ విషయాలను అడగవలసి వస్తోంది. 

ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎత్తిచూపడం తప్పు కాదు. కాని ద్వేషభావంతో ఉన్నవీ, లేనివి అబద్దాలు ప్రచారం చేయడం మాత్రం దారుణంగా ఉంటుంది. టీడీపీ నేతలు ఎవరి ఇళ్లలో వారు కూర్చుని నిరసన ప్లకార్డులు పట్టుకున్నారట. దానికి ముందు ఒక విషయాన్ని టీడీపీ వారు గుర్తించాలి. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులను చాలావరకు నిర్లక్ష్యం చేశారా? లేదా? వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి యత్నించారా? లేదా? ఇప్పుడు కరోనా సంక్షోభ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు చేతులు ఎత్తివేయడమో లేక అధిక చార్జీలు వసూలు చేయడమో చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ఉంటే దైర్యంగా ఆ మాట చెప్పాలి. కాని ఆయన వాటి జోలికే వెళ్లరు. ఏపీ ప్రభుత్వం కొత్తగా మరో 175 పీహెచ్‌ సీలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను నాడు–నేడు కింద బాగు చేయిస్తుంటే దానిని కూడా చంద్రబాబు తప్పు పడుతున్నారు. అవి కాంట్రాక్టర్‌లకు ఉపయోగపడే పనులట. అంటే చంద్రబాబు తాను చేయరు, ఎదుటివారు చేస్తుంటే ఓర్వలేరన్నమాట. ప్రపంచం అంతా ఏలా ఉన్నా, ఆయన దృష్టి, విమర్శలు, ఆరోపణలు, అసత్య ప్రచారాలు అన్ని ఏపీ మీదే ఉంటాయి.

హైకోర్టులో కొన్ని అబ్జర్వేషన్లు వచ్చాయి. ప్రభుత్వ సిబ్బంది పూర్తి స్థాయిలో పని చేయడం లేదని, 104 నెంబర్‌కు పోన్‌ చేసినా కొన్నిసార్లు రెస్సాండ్‌ అవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందులో వాస్తవాలు ఉండవచ్చు. లేదా కొన్నిసార్లు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉండవచ్చు. కేవలం న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేసినంతనే పరిస్థితులు మారిపోవు. దానికి ఎంతో వ్యయ ప్రయాసలకు గురి కావల్సి ఉంటుంది. ఆ విషయం గౌరవ న్యాయమూర్తులకు తెలియక కాదు. కాకపోతే వారి పని వారు చేస్తుంటారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా వాక్సినేషన్‌ అన్నది ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, న్యాయ వ్యవస్థ ఇందులోకి రాకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసింది. కేంద్రం వాక్సినేషన్‌ తమ పరిధిలోదని, రాష్ట్రాలకు తామే కేటాయిస్తామని చెప్పిన తర్వాత టీడీపీ వారు తప్పుడు విమర్శలు చేస్తున్నారని తేలిపోయింది. రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి ఇంకా రాలేదు. చంద్రబాబుకు సన్నిహితుడైన  ఒక మీడియా అధిపతికి వియ్యంకుడైన భారత్‌ బయోటెక్‌ యజమానితో చెప్పి వాక్సిన్‌ ఇప్పిస్తే రూ. 1600 కోట్లు చెల్లిస్తామని మంత్రులు సవాల్‌ చేస్తే మాత్రం చంద్రబాబు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏవైనా లోటుపాట్లు నిజంగా ఉంటే వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. ఏది ఏమైనా ఏపీ ప్రజలలో కాని , ఇతర రాష్ట్రాలలో కాని జగన్‌కు మంచిపేరే వస్తోంది. ఒక మీడియా సంస్థ జరిపిన సర్వేలో దేశంలోనే రెండో ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్‌ ఎంపికయ్యారు. అందువల్ల ఆయనపై విమర్శలు చేసినంత మాత్రాన  ఏమికాదు.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు     

మరిన్ని వార్తలు