‘బురద జల్లుదాం ఛలో ఛలో’

27 Jul, 2022 02:13 IST|Sakshi

విశ్లేషణ

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భావన చూడండి. ఆంధ్రప్రదేశ్‌ అప్పుడే శ్రీలంకలా మారిందట. అయినా ప్రజలు ఇంకా తిరుగుబాటు చేయడం లేదట. శ్రీలంక ప్రజలకన్నా ఏపీ ప్రజలకే ఎక్కువ ఓర్పు ఉందట. ఎప్పుడు ఏపీ శ్రీలంకలా మారి ప్రజలలో తిరుగుబాటు వస్తే అప్పుడు తాను గద్దె ఎక్కవచ్చన్న అత్యాశతో ఆయన ఉండవచ్చు. కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున అవేవీ తమకు వద్దని ప్రజలు జగన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలా? అమ్మ ఒడి, చేయూత, విద్యాకానుక వంటి వాటి కింద ఆర్థిక సాయం చేస్తున్నందుకు తిరగబడాలా? అది సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటూ, ప్రజలను మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది.

గోదావరి వరద బాధితులను పరామర్శించ డానికి ఆయన పశ్చిమ గోదావరి, కోనసీమ లకు వెళ్లారు. తన పర్యటనను రాజకీయ దండయాత్ర మాదిరి, ఎన్నికల ప్రచారం మాదిరి చేశారే తప్ప పరామర్శించడానికి చేసినట్లు కనిపించదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా, పదిహేనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా వ్యవహరించవచ్చా? ఆయన పాత తరహా ఫ్యూడల్‌ రాజకీయాలకు అలవాటు పడి పోయారు. ఏపీ, శ్రీలంకలా కావాలని ఎవరైనా కోరుకుంటారా? కొన్ని విషయాలలో శత్రువుకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని అను కుంటాం. అలాంటిది ఒక రాష్ట్రం మొత్తానికి ఆ పరిస్థితి రావాలని అభి లషిస్తున్నారంటే, తన ఓటమిని ఇంకా ఎలా జీర్ణించుకోలేకపోతు న్నారో స్పష్టం అవుతోంది. తన హయాంలో లక్షా పదకొండు వేల కోట్లకు సంబంధించి లెక్కలు ఎందుకు ఇవ్వలేదన్నదానికి చంద్ర బాబు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత శ్రీలంక గురించి మాట్లాడాలి. కరోనా సమయంలో అప్పో సప్పో చేసి ఆదుకున్నందుకు నిరసనగా ప్రజలు ఉద్యమించాలా? రైతు భరోసా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నందుకు రైతులు తిరగబడాలా? గ్రామాలలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పాలన అందిస్తున్నందుకు నిరసన చెప్పాలా? తమ ఇళ్ల వద్దకే పెన్షన్‌ ఎందుకు తెస్తున్నారని ప్రజలు నిలదీయాలా? ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇస్తున్నారని లబ్ధిదారులు పోరాడాలా?

పోనీ ఆ స్కీములకు తాను వ్యతిరేకిననీ, వాటివల్ల నష్టం జరుగు తున్నదనీ చంద్రబాబు చెప్పరు. పైగా ముఖ్యమంత్రి జగన్‌ కంటే తాను ఇంకా ఎక్కువగా సంక్షేమం అమలు చేస్తానంటారు. అప్పుడు ఏపీ శ్రీలంక కాదా? ఇది సింపుల్‌ లాజిక్‌ కదా! అసలు వరద బాధితు లకూ, శ్రీలంకకూ సంబంధం ఏమిటి? అర్థం పర్థం లేకుండా ఆయన మాట్లాడడం, అదేదో భగవద్గీత మాదిరి టీడీపీ అనుబంధ మీడియా ప్రచారం చేయడం... ఆ మాటకు వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆంధ్రుల పరువు తీసినందుకూ, పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను వదలుకున్నందుకూ, గోదావరి పుష్కరాలలో తన ప్రచార యావకు 29 మంది బలయి నందుకూ... ఇలా ఆయన హయాంలో అనేక విషయాలలో జనం తిరగబడి ఉండాలి కదా?

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనకు సన్నిహితులుగా ఉన్న కొందరు ప్రముఖులు బ్యాంకులకు ఎగవేసిన డబ్బును చెల్లించేలా చూడవచ్చు కదా! ఆ డబ్బును ఏపీలో వ్యయం చేయమని బ్యాంకు లను కోరవచ్చు కదా. అది జరిగితే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ నలభై ఐదువేల కోట్లు, సుజనా చౌదరి ఏడు వేల కోట్లు, రాయపాటి సాంబశివరావు ఎనిమిది వేల కోట్లు, రఘురాజు వెయ్యి కోట్ల మేర బ్యాంకులకు బాకీ పడిన సంగతి తెలియదా? ఇలా పలువురు ఆయనతో రాజకీయ సంబం ధాలు ఉన్నవారే కదా? ఏపీలో పేదలకు ఇస్తున్న పథకాల వల్ల పేద లకు వేల కోట్ల వ్యయం అవుతోందని బాధపడేవారికి ఇది ఒక జవాబే.

నిజంగానే వరద బాధితులకు ప్రభుత్వ పరంగా సాయం అందకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించి తగు న్యాయం చేయాలని కోరవచ్చు. అలాకాకుండా ఉన్నవి లేనివి మాట్లాడడం టీడీపీకే చెల్లింది. ఎంత రెచ్చగొట్టినా ఆయన ఆశించిన విధంగా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకపోవడంతో నిరాశతో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వాలకూ, ఈ ప్రభుత్వానికీ తేడా ఏమిటంటే, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగాన్ని జగన్‌ ప్రభుత్వం సమర్థంగా ఏర్పాటు చేసుకోగలిగింది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న సహాయ సిబ్బంది ఇప్పుడు వందల సంఖ్యకు పెరిగారు. తన హయాంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకు బాగా స్పందించేవాడినని  చంద్రబాబు సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నారు. తిత్లి తుపాను సమయంలో వరద బాధితులను ఎలా గదిమింది సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర జల సంఘం ముందస్తుగా హెచ్చరిం చినా వరదలను నియంత్రించలేకపోయారని విమర్శించారు. ఇంకా నయం... తనకు మాదిరి తుపానును ఆపలేకపోయారనీ, అమరావ తిలో ఎండలు తగ్గించాలని తన మాదిరి అధికారులను ఆదేశించ లేకపోయారనీ అనలేదు. 

గోదావరి వరద ఆరంభం కాగానే అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే 36 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎక్కడా పెద్దగా ఇబ్బంది రాలేదు. ఈ స్థాయిలో వరద వచ్చినప్పుడు లంక గ్రామాలు మునిగిపోవడం సర్వసాధారణం. 1986లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇదే స్థాయిలో వరద వస్తే గోదావరి గట్లకు గండ్లు పడి రెండు జిల్లాల్లో పెద్ద నగరాలు, పట్టణాలతో సహా వందలాది గ్రామాలు నీట మునిగాయి. రోజుల తరబడి ప్రజలు తీవ్ర కష్టాలు పడ్డారు. 1996, 98లలో వచ్చిన తుపానుల కారణంగా పలువురు మరణించారు. ఆ విషయాలు మర్చిపోతే ఎలా!  ప్రజలకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదనీ, మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే టీడీపీ అందిస్తుందనీ ఆయన అన్నారట. నిజంగానే ప్రభుత్వం నీరు అందిం చకపోతే వెంటనే తన పార్టీ ద్వారా సాయం చేస్తానని అనాలి కానీ, మరో రెండు రోజులు గోదావరి బురద నీరు తాగండి, ఆ తర్వాత నీరు తెస్తాం అన్నట్లు మాట్లాడడాన్ని ఏమనుకోవాలి? 

రాజంపేట ప్రాంతంలో పర్యటించినప్పుడు చంద్రబాబు, సహాయ కార్యక్రమాలపై ప్రజలు తిరుగుబాటు చేయరా? మీరు సంతృప్తి చెంది జగన్‌కు జేజేలు పలుకుతారా అని కుళ్లుకున్నారు. వరద బాధితులకు రెండువేల రూపాయల సాయం కాదు, తెలంగా ణలో మాదిరి పదివేలు ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో ప్రకటన వచ్చింది కానీ ఇంకా మొదలు కాలేదు. జగన్‌ తాను చెప్పిన మేరకు సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి రెండువేల రూపాయలు అందించి పంపుతున్నారు. పోనీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు, కరువులు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారో చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు డిమాండ్లు పెట్టవచ్చు. ఆ పని చేయరు. ఎందుకంటే ఆయన ఏమీ ఇవ్వలేదు కదా! లంకల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఏభై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయరాదు. అదే సమయంలో అందరికీ వేలకు వేల సాయం చేయాలి. ఇలాంటి వింత వాదనలతో చంద్రబాబు తన పరువు తానే తీసుకుంటున్నారు. చివరికి చంద్రబాబు టీమ్‌ పడవ లలో పర్యటించినప్పుడు అధికారులు వారించినా వినకుండా, అధిక సంఖ్యలో వాటిలో ఎక్కడం, ఆ తర్వాత ప్రమాదం సంభవించడం, అదృష్టవశాత్తూ ముప్పు తప్పడం జరిగింది. కానీ దీనిపై కూడా టీడీపీ నేత వర్ల రామయ్య యధాప్రకారం భద్రతా ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం అని విమర్శించారు. ఇంకా నయం. జగన్‌ ప్రభుత్వ కుట్ర వల్లే పడవ నుంచి టీడీపీ  నేతలు పడిపోయారని చెప్పలేదు. 

చివరిగా ఒక మాట. పార్టీ తరపున చంద్రబాబు సాయం చేసినా, చేయకపోయినా ఫర్వాలేదు. కానీ శక్తివంచన లేకుండా సహాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వంపై బురద చల్లకుండా ఉండగలిగితే మంచిది. సొంత ఖర్చులతో బాధితులకు సాయం చేస్తున్న రంగనాథ రాజు వంటి ఎమ్మెల్యేలపై దూషణలకు దిగకుంటే అదే పదివేలు. అధికారం పోయిందన్న దుగ్ధతో ఉన్న చంద్రబాబు విచక్షణ, విజ్ఞత కోల్పోయి వ్యవహరించడమే దురదృష్టకరం.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు