తనవాళ్లయితే తప్పుచేసినా సరేనా?

18 May, 2022 00:19 IST|Sakshi

విశ్లేషణ

లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు దారుణంగా ఉంది. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు ఈ కేసులో సంబంధం ఉందని పోలీసులు తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు చేసిన వాదన బహుశా దేశంలో మరెవరూ చేసి ఉండరేమో! నారాయణ దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ అనీ, దానిపై అభియోగాలు ఎలా మోపుతారనీ ప్రశ్నించినట్లుగా వార్తలలో వచ్చింది. ఎవరో కొందరు సిబ్బంది ఏదో చేస్తే నారాయణను అరెస్టు చేస్తారా అని ఆయన అంటున్నారు. టీడీపీ అక్రమా లకు పాల్పడ్డవారికి అండగా ఉండదలిచింది. తప్పు చేసినవారు తమవారైతే వారిని సమర్థించడానికి టీడీపీ ఎంతదూరమైనా వెళ్తోంది.


కింగ్‌ ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యాకు విమానయానం, మద్యం తదితర వ్యాపా రాలు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా ఉన్నాయి. ఆయన బ్యాంకులకు వేల కోట్లు ఎగవేశారు. అయినా చంద్రబాబు మాటల ప్రకారం ఆయన జోలికి వెళ్లకూడదన్నమాట. అలాగే నీరవ్‌ మోదీ, మేహుల్‌ చోక్సీ వంటివారికి కూడా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కనుక వారు బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టి పారిపోయినా ప్రభుత్వం ప్రశ్నించకూడదన్నమాట. ఒకప్పుడు ఎవరైనా ఒక తప్పు చేస్తే, పార్టీ లతో సంబంధం లేకుండా నేతలు స్పందించేవారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేవారు. మంత్రి పదవులలో ఉన్నవారిపై ఆరోప ణలు వస్తే వారిని తొలగించేవారు. అలాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయి. గతంలో ముద్దు కృష్ణమనాయుడు విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నాపత్రం లీక్‌ అయితే బాధ్యత వహించి రాజీనామా చేశారు. వివిధ ఇతర కేసులలో కనుమూరి బాపిరాజు, కోనేరు రంగారావు కూడా పదవుల నుంచి వైదొలిగారు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం వాళ్లు తప్పు చేసినవారు తమ పార్టీ వారైతే ఎంతవరకైనా వెళ్లి వారిని సమర్థించడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. 

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు తత్వవేత్త కారల్‌ మార్క్స్‌ అన్నారు. దానిని ఎంతవరకు ఆమోదిం చవచ్చో తెలియదు గానీ, రాజకీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న సూత్రాన్ని తయారు చేసుకుని రాజకీయం చేస్తున్న ఏకైక నేత చంద్రబాబు నాయుడు అని గత మూడేళ్లుగా జరుగుతున్న వివిధ పరి ణామాలు రుజువు చేస్తున్నాయి. ఇందులో మంచీ చెడుతో నిమిత్తం లేదు. ప్రమాణాలతో అసలు పని లేదు. విశాఖలో పాలిమర్స్‌ కంపె నీలో ప్రమాదం జరిగి పదమూడు మంది మరణించారు. అప్పుడు ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని డిమాండ్‌ చేశారు? వెంటనే ఆ కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని కోరారు. అప్పట్లో గౌరవ హైకోర్టు కూడా ఎందుకు యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నిం చింది. అన్ని విషయాలను పరిశీలనకు తీసుకున్న తర్వాత యాజ మాన్యం వారితో సహా పలువురిని ప్రభుత్వం అరెస్టు చేసింది. 

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తే, తొలుత నారాయణ సంస్థలలోని టీచర్లనూ, కొందరు ప్రభుత్వ టీచర్లనూ అరెస్టు చేశారు. తదుపరి విచారణలో వెల్లడైన విషయాల నేపథ్యంలో నారాయణను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అప్పటివరకు అమ్మో... లీకేజీ... ఇదేమి ప్రభుత్వం అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు టీమ్‌ వెంటనే తమ అభిప్రాయాలను మార్చేసి... నారాయణ, చైతన్య వంటి గొప్ప సంస్థలపై కేసులు పెడ తారా? లీకేజీ నేరం మోపుతారా అని ఎదురు దాడి ఆరంభించింది.  నారాయణ కుమారుడి వర్ధంతి అయినా కూడా పోలీసులు పట్టించు కోలేదని చంద్రబాబు, టీడీపీ మీడియా ఒకటే ప్రచారం చేశాయి. ఏదైనా నేరం జరిగితే, నేరారోపణకు గురైన వ్యక్తికి ఉన్న కార్యక్రమా లను బట్టి పోలీసులు చర్య తీసుకోవాలని కొత్త రాజ్యాంగాన్ని చంద్రబాబు తయారు చేసినట్లుగా ఉంది. నిజంగానే నారాయణ ఆ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తుంటే కారులో నాందేడ్‌ పారిపోవలసిన అగత్యం ఏమి వచ్చింది? దీని గురించి మాట్లాడరు. నాలుగు రోజుల పాటు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నారాయణ భార్యను కారులో నుంచి పోలీసులు దించేశారట! అంటే ఆమెపై కేసు లేకపోయినా పోలీసులు వెంటబెట్టుకుని వెళ్లి ఉంటే, అప్పుడు ఇదే చంద్రబాబు మహిళ అని కూడా చూడకుండా తీసుకు వెళతారా అని విమర్శించేవారు. తమను కిడ్నాప్‌ చేశారని నారాయణ భార్య గానీ, నారాయణ గానీ ఎందుకు కావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారన్నదానికి సమాధానం దొరకదు. అయితే గౌరవ కోర్టువారు బెయిల్‌ పిటిషన్‌ లేకుండానే బెయిల్‌ ఇచ్చారన్న వార్త న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీని దెబ్బతీసేదిగా ఉందని కొందరు న్యాయ వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. 

విశాఖ పాలిమర్‌ కేసులో యజమానులది కూడా తప్పని ఆరోపించిన టీడీపీ... విజయవాడలో కరోనా చికిత్సా కేంద్రంగా ఉన్న హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది మరణిస్తే మాత్రం అక్కడ ఆసుపత్రి యజమానికి ఏమి సంబంధం ఉందని అడిగింది. గౌరవ కోర్టువారు కూడా ఆసుపత్రి యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టు అయిన అచ్చెన్నాయుడు బీసీ కనుక అరెస్టు చేశారనీ, హత్యకేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై బీసీ కనుక కేసు పెట్టారనీ వ్యాఖ్యలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. విశాఖపట్నంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలపై కొందరు టీడీపీ నేతల నుంచి భూమిని స్వాధీనం చేసుకుంటే సంతోషించవలసింది పోయి, అదంతా ప్రభుత్వ కక్ష అని ప్రచారం చేయగలిగారు. ఒకప్పుడు ఎక్కడ అవినీతి కనిపించినా, అక్రమం జరిగినా అంకుశంతో పొడవాలని కథలు చెప్పిన ‘ఈనాడు’ పత్రిక ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితు లకు వత్తాసుగా ఉన్నట్టు వ్యవహరించడం శోచనీయం. 

పాలనకు అడుగడుగునా కోర్టుల ద్వారా గానీ, ఇతరత్రా గానీ అడ్డు తగులుతూ తన సత్తా చూపుతున్న వ్యక్తి చంద్రబాబు అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ తనకు కావల్సిన విధంగా వ్యవహారాలను చక్కబెట్టుకోగలుగుతోంది. అదే ధీమాతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కార్యకర్తలను ఒక్కొక్కరు డజనుకు తక్కువ కాకుండా కేసులు పెట్టించుకోవాలనీ, బెయిల్, కోర్టు వ్యవహారాలు తమకు వదిలివేయాలనీ చెప్పగలుగుతున్నారు. దేవాలయాలపై దాడులు జరిగిన కేసులలో కొన్ని చోట్ల తెలుగుదేశం వారికి ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు తాము ఆత్మహత్యల స్క్వాడ్‌ నడుపుతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, నారాయణను అరెస్టు చేస్తే, స్టేషన్‌ గోడలు బద్దలు కొట్టి విడిపిస్తామని కూడా ఆయన ప్రకటించారు. వీటన్నిటి మీద కేసులు పెడితే ప్రజలలో మళ్లీ అక్రమ కేసులు పెడుతున్నారని ప్రచారం చేయవచ్చన్నది వారి వ్యూహం కావచ్చు. చంద్రబాబు అయితే ఏపీలో ప్రజలు తిరగబడాలని పిలుపు ఇస్తున్నారు. శ్రీలంకలో మాదిరి ఎందుకు తిరగబడటం లేదని ప్రశ్నించే స్థాయికి దిగజారారంటే ఆయన పార్టీ ఎంత నీచమైన వ్యవహారాలు నడిపేందుకు అయినా సిద్ధపడుతోందని అర్థం కావడం లేదా? స్థానిక ఎన్నికల సమయంలో కూడా గుంటూరు, విజయ వాడలలో ప్రజలను ఉద్దేశించి ‘మీకు రోషం ఉందా, సిగ్గు ఉందా?’ అంటూ రెచ్చగొట్టే యత్నం చేశారు. అయినా ఆయన పప్పులు ఉడకలేదు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి, వైసీపీ గెలుపొందింది. అయినా చంద్రబాబు మాత్రం తన పాత పద్ధతి మార్చుకోలేదు. 

ఇలా ప్రజలను అవమానించేలా ఎలా చేస్తారని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఆయనపై ప్రభుత్వం కేసులు పెట్టలేదా?  ఆయా వ్యవస్థలలో తనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు గేమ్‌ ఆడుతున్నట్లుగా ఉంది. ఎంతకాలం ఇలా సాగుతుందన్నది ఎవరు చెప్పగలరు? వ్యవస్థలలో అయితే భద్రతా వలయాలను ఏర్పాటు చేసుకున్నారు గానీ, ప్రజల విశ్వాసం పొందలేకపోతున్నారని పలు సందర్భాలలో రుజువైంది. లక్షలాది మంది జీవితాలపై ప్రభావం చూపే కేసులలో అయినా, ఆయా వ్యవస్థలు పద్ధతిగా వ్యవహరిస్తున్నాయన్న భావన ప్రజలలోకి వెళ్లక పోతే, ఆ వ్యవస్థలకు తీరని చేటు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేయడం మినహా ఏమి చేయగలం!


వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు 
సీనియర్‌ పాత్రికేయులు     

మరిన్ని వార్తలు