అనర్హత వేటుపై ఇంత తాత్సారమా?

21 Jul, 2021 00:40 IST|Sakshi

విశ్లేషణ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసి ఏడాది దాటినా లోక్‌సభ స్పీకర్‌ ఎలాంటి చర్యా తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గడువులోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో లేకపోవడం ఒక లొసుగుగా భావిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ పదేపదే ఒత్తిడి చేస్తే కానీ ఇప్పటికీ ఒక నోటీసు వెళ్లలేదు. గతంలో కాంగ్రెస్‌ చేసినదానికి, ఇప్పుడు బీజేపీ చేస్తున్నదానికి పెద్ద తేడా లేకుండా పోయింది. నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను మనం ఏమనాలి? వారిపై వేటు వేయడానికి వెనుకాడుతున్న వ్యవస్థలను ఏమని అనుకోవాలి? వీరిని ప్రజలు ఎలా ఆదర్శంగా తీసుకోవాలి?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు విషయంలో లోక్‌సభ స్పీకర్‌పై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శల ఘాటు పెంచినట్లు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. కేంద్రంపై ఇతర అంశాలతో పాటు ఈ విషయాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. లోక్‌సభ సచివాలయం రఘురాజుకు నోటీసు పంపించిన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ విమర్శలు చేయడం ఆసక్తికరంగానే ఉంది. రఘురాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసి ఏడాది దాటినా స్పీకర్‌ చర్య తీసుకోకపోవడం పార్టీకి తీవ్ర అసంతృప్తి కలిగించినట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న వివిధ పరిణామాలను గమనించినట్లయితే పడిపోతున్న రాజకీయ విలువలకు పార్లమెంటు కూడా దర్పణం పడుతున్నదా అన్న అనుమానం ఎవరికైనా వస్తే కాదనగలమా? అయితే ఒక ప్రక్రియ ప్రకారమే తాను ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటానని ఓం బిర్లా అన్నట్లు వార్తలు వచ్చాయి. గడువులోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో లేకపోవడం ఒక లొసుగుగా భావిస్తున్నారు. అదే సమయంలో సంబంధిత ఎంపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి సరైన ఆధారాలు చూపడంలో కొన్ని పార్టీలు సఫలం కాకపోవడం వల్ల కూడా ఇవి ఆలస్యం అవుతున్నాయన్న అభిప్రాయం లేకపోలేదు. సాంకేతిక కారణాలు చూపుతూ స్పీకర్‌ కార్యాలయం ఈ అనర్హత వేటు పిటిషన్‌లను పక్కనబెడుతోంది. 

ఇది ప్రజాస్వామ్యం బలహీనతేనా?
నరసాపురం ఎంపీ రఘురాజు తాను పార్టీని విమర్శించలేదని, ప్రభుత్వ చర్యలు కొన్నిటిని మాత్రమే తప్పుపట్టానని వాదిస్తున్నారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని, తనపై అనర్హత వేటు అన్నది కల్ల అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజు ఇతర పార్టీ ఎంపీలతో కలిసి వేదిక పంచుకోవడం, పార్టీ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించడం, ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు పాల్ప డటం వంటివి చేశారన్నది పార్టీ అభియోగంగా ఉంది. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ నాయకత్వం ఫిర్యాదు చేసింది. దానిని తేల్చి, ఒక నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది. కాని దురదృష్టవశాత్తు స్పీకర్‌ కార్యాలయంలో పెద్దగా  చలనం లేకపోవడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనత అనుకోవాలా? ఒకవేళ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయదలచుకోకపోతే ఆ విషయాన్నే స్పీకర్‌ తెలియచేయవచ్చు. అందుకు కారణాలు వివరించవచ్చు. ఇవన్నీ చూస్తే ఒక రాష్ట్రంలో  అధికారంలో ఉన్న పార్టీ మాటకన్నా రాజు పలుకుబడే ఎక్కువగా ఉందని ఎవరైనా అనుకుంటే తప్పేముంది? వైఎస్సార్‌సీపీ పదేపదే ఒత్తిడి చేస్తేకానీ ఇప్పటికీ ఒక నోటీసు వెళ్లలేదు.

రాజ్యసభలో సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌ జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీలో తగాదాలు వచ్చాయి. బీహారు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో విభేదాలు వచ్చాయి. తదుపరి ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. అనంతరం శరద్‌ యాదవ్‌ వేరే పార్టీ వారితో కలిసి ఏదో ఒక సమావేశంలో పాల్గొన్నారని, పార్టీకి  వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు ఫిర్యాదు రావడం, దానిపై వాయువేగంతో ఆయన స్పందించి శరద్‌ యాదవ్‌పై చర్యకు ఉపక్రమించి అనర్హత వేటు వేయడం కూడా జరిగిపోయింది. గతంలో అణు ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఆనాటి టీడీపీ ఎంపీ మందా జగన్నాథంపై అప్పటి స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ సుమారు మూడు నెలల్లో అనర్హత వేటు వేశారు. అధికార కాంగ్రెస్‌కు ఓటు వేసినా, ఛటర్జీ మాత్రం దానిని పట్టించుకోలేదు. మరి రాజు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే కేంద్రంలో బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందన్న అభిప్రాయం వస్తోంది.

రాజధర్మం పాటిస్తున్నారా?
ఒకపక్క వైఎస్సార్‌సీపీ ఆయా సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉన్నా, కొందరి ప్రభావానికి లోనై ఆ పార్టీ డిమాండ్‌ను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక్కడే వాజ్‌పేయి ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా విశ్లేషణకు వస్తోంది. వాజ్‌పేయి కొన్ని ధర్మసూత్రాలకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నించేవారు. కానీ మోదీ ప్రభుత్వం పాటించడం లేదా అన్న చర్చ వస్తోంది. నిజంగా ప్రధాని మోదీ కానీ, హోం మంత్రి అమిత్‌ షా కానీ తలచుకుంటే స్పీకర్‌ వెంటనే చర్య తీసుకుంటారు. లేదా కనీసం నోటీసు ఇచ్చి, తదుపరి విచారణ జరిపిఉండి ఒక నిర్ణయం చేసేవారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అలా చేయలేదంటే దాని అర్థం ఏమిటి?

వైఎస్సార్‌సీపీ పట్ల కేంద్రం ఉదాసీనంగా ఉంటున్నదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు. అందుకే పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మొదటిసారిగా కేంద్రానికి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పారు. స్పీకర్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా, వెంటనే చర్య తీసుకోకపోతే లోక్‌సభను స్తంభింపచేస్తామని కొద్దిరోజుల క్రితం హెచ్చరించారు. తిరిగి మళ్లీ అఖిలపక్ష సమావేశం తర్వాత కూడా అలాగే మాట్లాడారు. ఇక్కడ ఇంకో సంగతి వివరించాలి. 2014–2019 టరమ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. అప్పట్లో ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు తెలుగుదేశంకు మద్దతు ప్రకటించి, ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిపై కూడా ఫిర్యాదు చేసినా, ఐదేళ్లపాటు ఆ కథ నడిచిందే కానీ, వారిపై అనర్హత వేటు వేయలేదు. ఈ విషయాలలో దేశానికి ఆదర్శంగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం అనండి, స్పీకర్లు లేదా రాజ్యసభ చైర్మన్‌లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, ఇతర మరికొన్ని పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే విమర్శించిన బీజేపీ కేంద్రంలో మాత్రం టీడీపీ రాజ్యసభ సభ్యులను తన పార్టీలో విలీనం చేసుకుంది. ఈ విషయంలో వెంకయ్య నాయుడిపై విమర్శలు వచ్చినా, ఆయన నిస్సహాయంగా మిగిలిపోయారన్న భావన ఏర్పడింది. దేశంలో అది ఒక సంప్రదాయంగా మారింది.

ఫిరాయింపులను ప్రోత్సహించడంలో దొందూదొందే!
రాజ్యసభలో టీడీపీ ఎంపీలను కూడా అదే పద్ధతిలో బీజేపీలో విలీనం చేయడంతో దానికి చట్టబద్ధత వచ్చేసినట్లయింది. మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో బీజేపీ కొత్త టెక్నిక్‌ అమలు చేసింది. ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, జేడీయూ ఎమ్మెల్యేలను ఆకర్షించి, వారితో తమ పదవులకు రాజీనామా చేయించి, ఆ తర్వాత అధికారాన్ని కైవసం చేసుకుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అయితే ముందుగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక అడ్రస్‌ లేని పార్టీలోకి పంపించారు. ఆ తర్వాత వారందరూ బీజేపీలో విలీనం అయినట్లు ప్రకటించారు. విలువలతో కూడిన పార్టీగా చెప్పుకునే బీజేపీ ఇలాంటి నిర్వాకాలకు పాల్పడిన తర్వాత ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకు అర్థం ఏమి ఉంటుంది. గతంలో కాంగ్రెస్‌ చేసినదానికి, ఇప్పుడు బీజేపీ చేస్తున్నదానికి పెద్ద తేడా లేకుండా పోయింది. దాదాపు అన్ని రాజ కీయ పక్షాలు పైకి నీతులు చెబుతూ, లోపల మాత్రం చట్ట విరుద్ధ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. కనీసం రాజీనామాలు చేయిం చడం, తమ పార్టీలో అధికారికంగా చేర్చుకోకుండా ఉండడం వంటివి చేసినా అదో రకం. కానీ అసలు నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలను మనం ఏమనాలి? వారిపై వేటు వేయడానికి వెనుకాడుతున్న వ్యవస్థలను ఏమని అనుకోవాలి? వీరిని ప్రజలు ఎలా ఆదర్శంగా తీసుకోవాలి?


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  

మరిన్ని వార్తలు