ఇదా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం?

3 Nov, 2021 00:40 IST|Sakshi

విశ్లేషణ

రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఒక చిత్రమైన క్యారెక్టరు. ప్రశ్నిస్తానంటారు; నోరెత్తరు. పార్టీ పెడతారు; పోటీ చేయరు. అవినీతిపరులని అంటారు; మళ్లీ అదే టీడీపీతో అంటకాగుతారు. వామపక్షం అన్నారు, మాయావతికి పాదాభివందనం చేశారు; చివరికి బీజేపీతో స్నేహం చేస్తున్నారు. అదైనా నమ్మవచ్చా అంటే చంద్రబాబు చెప్పినవారికే తన పార్టీ టికెట్లు ఇచ్చారు. ఏ దశలోనూ ఆత్మాభిమానం చూపని, ఆత్మగౌరవం అసలే ప్రదర్శించని ఈ సినిమా నటుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సభలో ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడమే మేలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇదీ ఆయన విజ్ఞత! ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని విమర్శించకుండా వైసీపీని లక్ష్యం చేసుకున్నారు. ఇదీ ఆయన పరిణతి!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిపిన సభలో చేసిన ప్రసంగంలో పలు అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడమే మేలు అన్నది. ఏ మాత్రం విజ్ఞత లేకుండా చేసిన దారుణమైన వ్యాఖ్య ఇది. పరిణతి లేని సినిమా నటుడు రాజ కీయాలలోకి వస్తే ఎంత ప్రమాదమో పవన్‌ పదేపదే రుజువు చేస్తున్నారు. 

కొద్ది నెలల క్రితం పవన్‌ ఏమి చెప్పారు! ‘ఇది కేంద్ర ప్రభుత్వ విధానం. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించు కోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది దేశం అంతటికి సంబంధించిన అంశం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మాత్రమే పరిమితం కాదు’ అని ప్రకటించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాన్నీ, భారతీయ జనతా పార్టీ వైఖరినీ సమర్థించారు. అప్పుడు పవన్‌ ఆత్మాభిమానం తోనే, ఆత్మగౌరవంతోనే ఈ మాట చెప్పారా? ఇప్పుడు అదే పెద్ద మనిషి ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడం మేలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో కూడా పోరాడారనీ, ఏపీలో అది కనిపించడం లేదనీ బాధపడ్డారు. పోరాటాలు అన్నవి ప్రజాకాంక్షలు, పరిస్థితులను బట్టి ఉంటాయి గానీ సినిమా షూటిం గ్‌ల విరామంలో వచ్చి ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఆంధ్రులు అమాయకులు కారన్న సంగతి పవన్‌ అర్థం చేసుకోవాలి. తనను, తన పార్టీని ఘోరంగా ఓడించారన్న కోపంతో, ద్వేషంతో ఆయన రగిలిపోతున్నారన్న సంగతి ఇట్టే బయటపడిపోతుంటుంది. పవన్‌ రెండు చోట్ల పోటీ చేసి ఆ రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. అందుకే విశాఖ ఉక్కుపై పోరాడుదామనుకుంటే గాజువాక నియోజ కవర్గ ప్రజలు తనను ఓడించారని నిష్టూరమాడారు. గెలిపిస్తే పోరాడ తాననీ, లేకుంటే సంబంధం లేదనే కదా ఆయన చెప్పదలిచింది!

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా  వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శ చేయడం ద్వారా తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏమైనా తప్పులు జరుగుతుంటే కచ్చితంగా ఎత్తి చూపవచ్చు. కానీ ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం జోలికి వెళ్లకుండా, అక్కడ నాయకత్వం వహిస్తున్న బీజేపీని ఒక్క మాట అనకుండా వైసీపీనే విమర్శించారంటే ఏమిటి దానర్థం? పైగా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడడం లేదట. పవన్‌ షూటిం గులలో బిజీగా ఉండి పార్లమెంటులో ఏమి జరుగుతోందో ఫాలో అయివుండరు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెండు సభలలోనూ దీనిపై పలుమార్లు మాట్లాడారు. నిరసన తెలి పారు. వాకౌట్లు చేశారు. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తన ప్రసం గంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉద్దేశించి, ఆమె ఆంధ్రప్రదేశ్‌ కోడలనీ, దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు బంగారాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడరనీ, అలాగే బంగారం వంటి విశాఖ  ఉక్కును ఆమె అమ్మరాదనీ, ఆంధ్రులు సెంటిమెంట్‌ను గౌరవించాలనీ కోరారు.

నిజానికి పవన్‌ కల్యాణ్‌ ప్రకటన ఏపీ బీజేపీ నేతలకే తగులు తుంది. వారు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి. మనసులో అలా జరగకుండా ఉండాలని కోరుకున్నా పైకి చెప్పలేని నిస్సహా యులు. బీజేపీ వారికి ఆత్మగౌరవం లేదని ఆయన భావిస్తున్నారా? ధైర్యం ఉంటే ఆ మాటే అని ఉండాల్సింది. ఎందుకంటే ఏపీలో బీజేపీ వారు తప్ప అంతా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. కార్మికులకు సంఘీభావంగా ఆందోళనలలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై ప్రధానికి లేఖలు రాశారు. పలు సూచనలు చేశారు.

అసలు నిజంగానే పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలలోకి వచ్చాక ఆత్మ గౌరవంతో వ్యవహరిస్తున్నారా అన్న చర్చకు కూడా ఆయన మాటలు ఆస్కారం ఇచ్చాయి. ఎవరైనా రాజకీయ పార్టీ పెడితే ఎన్నికలలో పోటీచేయాలి. కానీ ఈయన మాత్రం 2014లో తెలుగుదేశం గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ప్రశ్నిస్తానని చెబుతూ వచ్చి, ఆ పనిమానేసి చాలాకాలం చంద్రబాబు ప్రభుత్వానికి తానా అంటే తందానా అన్నారు. అమరావతి రాజధాని భూముల సమీకరణలో జరిగిన అక్రమాల గురించి ప్రశ్నించడం మానుకున్నారు. కానీ ఉన్న ట్టుండి ఒక రోజు గుంటూరులో పెద్ద సభ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను అవినీతిపరులని విమర్శించి ఆశ్చర్యపరిచారు. ప్రత్యేక హోదాపై తాను పోరాడుతానని చెప్పి, బీజేపీ పాచిపోయిన లడ్లు ఇచ్చిందని విమర్శించారు. ఈ మాటకు కట్టుబడి ఉంటారేమోలే అనుకున్నవారిని నిరాశ పరిచారు. 2019 ఎన్నికలలో ఘోర పరాజయ పరాభవం తర్వాత ఢిల్లీ వెళ్లి, బీజేపీ పెద్దలతో కలవడానికి నానా తంటాలు పడి, వారితో స్నేహం ఏర్పరచుకున్నారు. అప్పుడు పాచి పోయిన లడ్డూలలో తీపిదనం కనిపిం చిందా? ఇదంతా ఆత్మగౌరవంతో చేసిన ట్లేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి సమా ధానం చెబుతారు?

2019 ఎన్నికలలో ఆయన మరిన్ని విన్యాసాలు చేశారు. బీజేపీ, టీడీపీ వేరు పడ్డాక ఈయన కూడా వారితో కాకుండా వామపక్షాలతో పొత్తు పెట్టుకుని, వారితో విజయవాడలో పాదయాత్రలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ వరకు వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావతికి పాదాభివం దనం చేసి మరీ ఆమె పార్టీతో స్నేహం చేశారు. పోనీ వీరి సిద్ధాం తాలకు కట్టుబడి ఉన్నారా అంటే అదీ లేదు. పొత్తు వారితో, స్నేహం టీడీపీతో అన్న చందంగా వ్యవహరించారు. పలు చోట్ల చంద్రబాబు సూచించిన అభ్యర్థులకే టికెట్లు ఇచ్చారట. లోకేశ్, చంద్రబాబు పోటీ చేసిన మంగళగిరి, కుప్పంలలో ఈయన ప్రచారం చేయకపోతే, పవన్‌ పోటీచేసిన గాజువాక, భీమవరంలలో చంద్రబాబు ప్రచారం చేయ లేదు. ఇదంతా ఆత్మగౌరవం అనే ప్రజలు అనుకోవాలా? ఎన్నికల తర్వాత బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా, టీడీపీ ఏమి చెబితే అది ఫాలో అయ్యారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అసలు బీజేపీతో స్నేహం చేస్తున్నదే తెలుగుదేశం పార్టీని ఎలాగోలా ఆ పార్టీ చెంతకు తీసుకు వెళ్లడానికే అని నమ్మేవారు ఉన్నారు. 

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రజలు భావిస్తున్నారు. పవన్‌ కొన్నాళ్లు హక్కు కాదనీ, ఇప్పుడు హక్కు అనీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. కాపుల రిజర్వేషన్‌ మొదలు పలు అంశాలలో డబుల్‌ టాక్‌ చేస్తున్నారు. దీనివల్లే ఆయన పార్టీకి ఎదుగుదల లేకుండా పోయింది. సినిమా యాక్టర్‌ కాబట్టి, అభిమానులు ఉన్నారు కాబట్టి వారితో చప్పట్లు కొట్టించుకునే విధంగా డైలాగులు చెబితే అది ఆత్మగౌరవం అనిపించుకోదు. ఇంతచేసినా, నిజంగానే భవిష్యత్తులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈయన గట్టిగా పోరాడుతారన్న నమ్మకం లేదు. చివరిగా ఒక మాట చెప్పాలి. ఈమధ్య తెలంగాణ పార్టీ కార్యకర్తల సభలో తాను తెలంగాణలోనే పుట్టానని అన్నట్లు వీడియోలు వచ్చాయి. ఆంధ్రలో పర్యటిస్తూ బాపట్లలో పుట్టానని చెప్పారన్న వీడియో  వచ్చింది. మరి వీటిలో ఏది నిజం అన్నది ముందుగా చెప్పాలి. ఆ తర్వాత ఆత్మగౌరవం గురించి మాట్లాడాలి. ప్రస్తుతం తెలంగాణలో నివసిస్తున్నా, నిజంగానే ఆయన  తెలం గాణలో పుట్టి ఉంటే ఆత్మగౌరవం లేని ఆంధ్రులు చనిపోవడమే మేలు అని అనే హక్కు లేదు. ఒకవేళ ఆంధ్రలో జన్మించి ఉంటే ఇలాంటి మాటలు అనడానికి ముందుగా తనకు ఆత్మగౌరవం ఉందా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి.

వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు     

మరిన్ని వార్తలు