Pawan Kalyan: ఉండాలంటాడా? పోవాలంటాడా?

13 Jul, 2022 00:02 IST|Sakshi

విశ్లేషణ

ఎవరైనా బాణాన్ని గురి చూసి కొడతారు. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన దాన్ని ఊరికే గాల్లోకి వేస్తారు. అది ఎవరికి తగులుతుందో ఆయనకే తెలీదు. ఒక్కోసారి అది తిరిగొచ్చి ఆయనకే గుచ్చుకోవచ్చు కూడా! ‘కులభావన’ అని ఆయన మాట్లాడిన వాగ్బాణాల విషయంలో జరిగింది ఇదే. పవన్‌ తెలిసి మాట్లాడారో, అమాయకంగా మాట్లాడారో గానీ, ఏపీలో అన్ని కులాలూ ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇస్తున్నాయన్న అర్థం వచ్చింది.

దాన్ని కవర్‌ చేయడానికి ఎల్లో మీడియా ఆ వార్తనే తిప్పిరాసింది. ఇంతకీ కులభావన చచ్చిపోతే సంతోషించవలసింది పోయి, అది ఉండాలని చెబుతున్నారంటే పవన్‌ దిగజారి మాట్లాడారని అనుకోవాలా? లేక, ఆయన ఒరిజినాలిటీ బయటపడిందని భావించాలా? ‘‘నేను అడుగుతున్నాను. ఏపీలో కుల భావన అన్నా పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుంది. కుల భావన కూడా సచ్చిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి... అన్ని కులాల వ్యక్తులను చూడండి... కాపులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు.. ఎస్సీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అందరూ కలిపి వారి కులాలకు చేసుకున్నా నేను ఆనందపడతా! కానీ అలా చేయడం లేదు.

ఆయన బాగుంటే చాలు, మా ముఖ్యమంత్రి నవ్వితే చాలు... అన్నట్లుగా ఉంటున్నారు. కడుపు నిండిపోతుందనుకుంటున్నారు. వారు చివరికి తమ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు.’ ఇదీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్య. సోషల్‌ మీడియాలో ఇది సహజంగానే వైరల్‌ అయింది. ఆ వీడియో చూస్తే, అందులో ఎడిటింగ్‌ జరిగినట్లు కనిపించదు. ఒకవేళ అందుకు భిన్నంగా అని ఉంటే దానిని కూడా తప్పుపట్టాలి.

దీనికి ఈనాడు పత్రిక రాసిన వార్త చూడండి: ‘వివిధ కులాలకు చెందిన మంత్రులు వారి వర్గాల ప్రజలను అభివృద్ధి చేసే పరిస్థితి ఇక్కడ లేదు. మంత్రులంతా కలిసి మా సీఎం నవ్వితే చాలు అన్నట్లు వ్యవహరిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు’ అని పేర్కొంది. నిజంగా పవన్‌ ఈ మాట అని ఉంటే అలా రాయడం తప్పు కాదు. అలాకాకుండా సోషల్‌ మీడియాలో వచ్చినది కరెక్టు అనుకుంటే, ఈనాడు పత్రిక ఎంత మోసపూరితంగా వార్తా కథనాన్ని ఇచ్చిందో ఇట్టే తెలిసిపోతుంది. అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు అని పవన్‌ అంటే, ఈనాడు మాత్రం దానిని మంత్రులను ఉద్దేశించి అన్నట్లుగా రాసింది.

ఒకవేళ పవన్‌ ఆ మాట అని ఉంటే అభ్యంతరం లేదు. కానీ ముందుగా అన్న విషయాన్ని కూడా రాసి, ఆ తర్వాత పవన్‌ సర్దుకున్నారని రాస్తే అది నిజమైన జర్నలిజం అవుతుంది. అలాకాకుండా పవన్‌ తనకు నష్టం కలిగేలా మాట్లాడారని గ్రహించిన ఈనాడు దానిని సరిచేసే యత్నం చేసిందా అన్న సందేహం సహజంగానే వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరు పెట్టిన దుష్టచతుష్టయంలో ఈనాడు మీడియా కూడా చేరిందన్న భావన ఏర్పడుతుంది. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు అని కూడా ఆయన అంటుంటారు. ఆ దత్తపుత్రుడిని కాపాడుకునే పనిలో ఈనాడు గట్టిగానే పనిచేస్తోందని అనుకోవచ్చు.

పవన్‌ టీడీపీ భాషలోనే మాట్లాడడమే కాదు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరి మాటలు మార్చడంలోనూ పోటీ పడుతున్నారు. ఒక్కోసారి అసలు కులం ఏమిటి? మతం ఏమిటి? కాపులకు రిజర్వేషన్‌ ఏమిటి? అంటూ ప్రసంగాలు చేసిన ఆయన ఇప్పుడు ఏపీలో ఆయా వ్యక్తులు తమ కులాలకు పని చేసుకోవాలని చెబుతున్నారు. కుల భావన సచ్చిపోయింది అంటే దానర్థం వివిధ కులాలు కలిసిమెలిసి ఉంటున్నాయనే కదా! 

కాపు కులానికి చెందినవారు కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వలేదన్న ఆక్రోశం ఆయనలో కనిపిస్తుంది. అక్కడికి పవన్‌ కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే గాజువాక, భీమవరం నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని పోటీచేసినా, రెండు చోట్లా ఓడిపోయారు. అది ఆయనకు జీర్ణించుకోలేని అంశమే. ఈ నేపథ్యంలోనే పవన్‌ నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయనిపిస్తుంది. ఆయా కులాల వారు ముఖ్యమంత్రి జగన్‌ నవ్వితే చాలు అన్నట్లు చూస్తున్నారని అంటే దానర్థం ఆయన వారందరినీ బాగా చూసుకుంటున్నట్లే కదా! ఒక రకంగా జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారన్నమాట. 

పవన్‌ కల్యాణ్‌ జనవాణి పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం, ఆ తర్వాత మీడియాతో సంభాషించినప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే... అచ్చంగా తెలుగుదేశం–2 అని ఎవరైనా అనుకుంటే అందులో తప్పు కనబడదు. చంద్రబాబు నాయుడు ఏ విమర్శలు చేస్తున్నారో, వాటినే పవన్‌ కూడా చేస్తున్నారు. టీడీపీ చెప్పే అసత్యాలనే ఈయన కూడా భుజాన వేసుకుంటున్నారు. ఈయనకు సొంతంగా భాష, భావం లేవా? అన్న ప్రశ్నకు ఆస్కారం ఇస్తున్నారు. జనవాణి నిర్వహించడం మంచిదే. కానీ ప్రజల సమస్యల పరిష్కారం కన్నా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పై ఎంత వీలైతే అంత బురద జల్లాలన్న తాపత్రయం కనబడుతుంది. 

ఉదాహరణకు రేణిగుంట వద్ద ఒక మహిళకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆరోపణ వచ్చింది. ఆ మహిళను బహుశా స్థానిక జనసేన నేతలు తెచ్చి ఉంటారు. వారికి వాస్తవం తెలిసి ఉండాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆమె స్థలం రద్దు అయింది. దానికి కారణం ఆమె అక్కడ నిబంధన ప్రకారం ఇల్లు నిర్మించుకోకపోవడమే. ఆ తర్వాత మరో వ్యక్తికి అధికారులు స్థలం కేటాయించారు. అయినా ఆమెకు మళ్లీ స్థలం ఇవ్వాలని కోరితే తప్పు పట్టనవసరం లేదు. అలా కాకుండా వైసీపీ నేతల దౌర్జన్యం అని పవన్‌  ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ వాస్తవాలు వెలుగులోకి తెచ్చింది. ఇలా అవకాశం ఇవ్వడం ద్వారా పవన్‌ తనకు కూడా విశ్వసనీయత లేదని చెప్పకనే చెప్పినట్లయింది. 

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు జతచేయడంపై చెలరేగిన వివాదంలో టీడీపీ, జనసేనల పాత్రపై; మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను దగ్ధం చేసిన తీరుపై అప్పుడే పవన్‌ ఖండించి ఉన్నట్లయితే ఆయనకు మంచి పేరు వచ్చేది. అప్పుడేమో టీడీపీ లాగానే కులచిచ్చు అన్నారు. ఇప్పుడు అంబేడ్కర్‌ జిల్లాను స్వాగతిస్తున్నామని చెబుతూనే, ఏదో పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసిందనీ, అలా చేస్తూ ఒక జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ పవన్‌ కల్యాణ్‌ మనస్ఫూర్తిగా అంబేడ్కర్‌ పేరును ఒక జిల్లాకు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లా, లేదా? ఒక స్టూడియో యజమానిని విశాఖలో వైసీపీ నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. దాన్ని స్పష్టమైన ఆధారాలతో బయటపెడితే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది కదా! ఆ పనిచేయరు. అది ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమేనన్నమాట.

వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక గొడుగు కిందకు వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తూ, ఇంటికి ఒకరు బయటకు వచ్చి ప్రభుత్వంపై తిరగబడాలని కోరారు. తదుపరి మూడు రోజులకు పవన్‌ నోట అవే పలుకులు వచ్చాయి. తన ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని కూడా పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అదెలా సాధ్యం? పవన్‌కు ఏపీలో ఏమైనా ఆస్తులుంటే వాటిని ప్రభుత్వం లాక్కుందా? ఆయనకు వచ్చే సంపాదన రాకుండా చేసిందా? తన సినిమాలు ఆపేస్తున్నారని ఆయన అన్నారు.

కొంతకాలం క్రితం ఆయన సినిమా విడుదలైంది కదా! ఎవరైనా ఆపగలరా? నిజంగా అలా జరిగితే ఈ పాటికి కోర్టుకు వెళ్లి గందరగోళం చేసేవారు కాదా? వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో తామే తెలియజేస్తామని ఆయన అన్నారు. మంచిదే. అంతకు ముందుగా తాను ఒక బాధ్యత కలిగిన రాజకీయ నేతగా వ్యవహరించాలి కదా! సినిమా షూటింగులా మధ్యలో వచ్చి డైలాగులు చెప్పి వెళ్లిపోవడానికి ఇది సినిమా కాదు కదా! ప్రజా జీవితంలో గానీ, వ్యక్తిగత జీవితంలో గానీ తాను ఎంత బాధ్యతగా ఉన్నానన్న విషయాన్ని ఆయనే ఆత్మ విమర్శ చేసుకోవాలి.

సింççహాసనం ఖాళీ చేయండి... ప్రజలు వస్తున్నారు... అని ఒక కవి మాటలను పవన్‌ ఉటంకించడం బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో అదే ప్రజలు వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారన్న సంగతిని గుర్తించడానికి ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. అదే అసలు సమస్య. తనను ఘోరంగా ఓడించి, జగన్‌ను ఇంత ఘనంగా గెలిపిస్తారా అన్న దుగ్ధ. సరిగ్గా చంద్రబాబు కూడా ఇదే సిండ్రోమ్‌తో బాధ పడుతున్నారు. జగన్‌ తనకంటూ ఒక సొంత అజెండాను పెట్టుకుని జనంలోకి వెళ్లి, వాళ్ల ఆదరణ పొందారు. కానీ పవన్‌ కల్యాణ్‌ వేరేవారి అజెండా కోసం తన జెండాను మోస్తున్నారు. 

 

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

>
మరిన్ని వార్తలు